1990లో జన్మించిన ఓ వ్యక్తి 2004లో రాయలసీమ పీజీ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. అంటే 14 ఏళ్లకే పది పాసై ఉద్యోగం సాధించాడని అక్కడి మినిమం టైం స్కేల్ కమిటీ రికార్డులు చెబుతున్న మాట. ఇతడే ఆర్‌యూ ఏర్పాటైన తరువాత 2011లో ఫుడ్ సప్లయర్‌గా ఉద్యోగంలో చేరినట్లు మరో రికార్డులో ఉంది. ఏది నిజమో వర్సిటీ అధికారులకే తెలియాలి. మొదటిది నిజమైతే బాల కార్మిక చట్టాన్ని ఉల్లఘించినట్టు.. రెండోది నిజమైతే మొదటి దాని సంగతేంటో.
1977లో పుట్టిన ఓ మహిళ 2002లో స్వీపర్‌గా చేరింది. ఆమె కుమారుడు 1985లో పుట్టి, 2006లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరినట్లు రికార్డుల్లో ఉంది. తల్లి 1977లో పుడితే 8 ఏళ్లకే ఆమెకు కొడుకు పుట్టాడట. ఈ రెండు ఘటనలే కాదు 2018లో టీడీపీ హయాంలో మినిమం టైం స్కేలు పొందిన 102 మంది ఉద్యోగుల్లో పలువురు అడ్డదారుల్లో ఉద్యోగాల్లో చేరినట్లు స్పష్టమవుతోంది.
ఉన్నత విలువలు నేర్పాల్సిన రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు విలువలకు తిలోదకాలిచ్చారు. నీతి బోధించాల్సిన చోటునే అవినీతికి అడ్డాగా మలుచుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారే అక్రమార్జనకు తెరతీశారు. ఆమ్యామ్యాలకు తలొగ్గి అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టి కాసులు వెనకేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదులతో విచారణ చేపట్టిన వర్సిటీ స్థాయి కమిటీ ఇప్పటికే 14 మంది అక్రమార్గంలో ఉద్యోగాలు పొందినట్లు తేల్చినట్లు సమాచారం. విచారణ తుది దశకు చేరుకోవడంతో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొంత మంది, వారికి సహకరించిన వర్సిటీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ 2008లో ఏర్పాటైంది. అనంతర కాలంలో నాన్ టీచింగ్ నియామకాల కోసం అప్పట్లో జీఓ ఎంఎస్ నంబరు 50 జారీ అయింది. ఈ జీఓ ప్రకారం నాలుగు పోస్టులు రెగ్యులర్, 23 పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏకంగా 150 నుంచి 200 పోస్టులను ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి వర్సిటీ అధికారులు పలు దఫాలుగా నియమించి నిబంధనలకు విరుద్ధంగా మినిమం టైం స్కేలు అమలు చేశారు. ఇందులో 60 ఏళ్ల వయస్సు పైబడిన వారి ఆధార్‌కార్డులలో పుట్టిన తేదీలు మార్పులు చేసి, విధుల్లో చేరిన తేదీలను సైతం మార్పులు చేసి రికార్డుల్లో నమోదు చేశారు. అందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు, ప్రస్తుత ఇద్దరు ప్రొఫెసర్లపై ఆరోపణలున్నాయి.
ఫిర్యాదుల వెల్లువ..
కనీస విద్యార్హతలు కూడా లేని వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాటించకుండా పోస్టుల్లో నియమించడంతో ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్పందించిన ఉన్నత విద్యా ప్రభుత్వ కార్యదర్శి గత ఏడాది డిసెంబరు 15న ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి బిశ్వాస్, ఉన్నత విద్యా మండలి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అదే ఏడాది డిసెంబరు 23లోపు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని వర్సిటీ అ«ధికారులకు లేఖ రాసింది. స్పందించకపోవడంతో ఈ ఏడాది జనవరి 4న విచారణకు రావాలని మరో సారి సూచించింది. అయితే వర్సిటీలోని కీలక అధికారులు రంగప్రవేశం చేసి ఆ కమిటీతో కాకుండా యూనివర్సిటీ స్థాయిలోనే ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని చెప్పి తప్పించుకున్నారు.
విద్యార్థి సంఘాల ఆందోళనతో..
మూడు నెలల క్రితం ప్రారంభమైన వర్సిటీ స్థాయి విచారణ నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేశాయి. దీంతో రాజ్‌భవన్, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో విచారణను వేగవంతం చేసి తుది దశకు చేర్చారు. ఈ విచారణలో ఇప్పటి వరకు 14 మంది అనర్హులకు టైం స్కేల్ అమలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మరో 11 మంది మినిమం టైంస్కేల్ ఉద్యోగుల సర్టిఫికెట్లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ 25 మందికి రెండు నెలలుగా జీతాలు నిలిపేసినట్లు సమాచారం. అలాగే అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు పొందిన వారు కూడా అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆర్‌యూలో జరిగిన నియామకాలకు సంబంధించిన జీఓలు, ప్రకటనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలను సేకరించాలని జిల్లా ట్రెజరీని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
విచారణ చివరి దశకు వచ్చింది
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న నాన్ చీటింగ్ స్టాఫ్ విద్యార్హతలు, తదితర అంశాలపై చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నాం. ఇలాంటివి రెగ్యులర్‌గా జరిగే విచారణలే.
– మధుసూదన్ వర్మ, రిజిస్ట్రార్, ఆర్‌యూ
Comments
Please login to add a commentAdd a comment