kurnool distirifct
-
పాత ఇల్లు కూలుస్తుండగా బయటపడ్డ భోషాణం.. అందులో ఏముంది?
సాక్షి, కర్నూలు జిల్లా: దేవనకొండలో ఓ ఇనుప భోషాణం కలకలం రేపుతోంది. ఓ పురాతన ఇంటిని కూల్చుతున్నప్పుడు భోషాణం బయటపడింది. భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన పాత ఇంటిని నరసింహుడు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు నిర్మించేందుకు నరసింహుడు జేసీబీ సాయంతో పాత ఇంటిని కూల్చివేసి మట్టిని తరలించారు. ఈ క్రమంలోనే ఇనుప భోషాణం బయటపడింది. తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు. అయితే, భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉంటాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురైంది. భోషాణంలో పాత కాగితాలు, మట్టి, చెత్తా చెదారం, పాత డాక్యుమెంట్స్ తప్ప ఇంకేమీ లేవు. చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే.. -
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టుకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శనివారం ఉదయం 11.30 ప్రాంతంలో మూడు గేట్లు ఎత్తివేయడం ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు.శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయికి చేరడంతో మూడు గేట్లను ఎత్తివేసి వరద నీటిన దిగువకు విడుదల చేశారు. ఏపీ జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టులో గరిష్ట నీటి నిల్వ 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 202.04 టీఎంసీలు ఉంది.ఇన్‌ఫ్లో 1,27, 980 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 74,365 క్యూసెక్కులు ఉంది.కుడి, ఎడమ గట్ల విద్యుత్ కేంద్రాల్లో కరెంట్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో 882 అడుగుల్లో స్థిరంగా నీటిని నిల్వ చేస్తూ.. మిగులుగా ఉన్న నీటిని స్పిల్ వే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
అడ్డదారిలో ఉద్యోగాలు?
1990లో జన్మించిన ఓ వ్యక్తి 2004లో రాయలసీమ పీజీ సెంటర్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. అంటే 14 ఏళ్లకే పది పాసై ఉద్యోగం సాధించాడని అక్కడి మినిమం టైం స్కేల్ కమిటీ రికార్డులు చెబుతున్న మాట. ఇతడే ఆర్యూ ఏర్పాటైన తరువాత 2011లో ఫుడ్ సప్లయర్‌గా ఉద్యోగంలో చేరినట్లు మరో రికార్డులో ఉంది. ఏది నిజమో వర్సిటీ అధికారులకే తెలియాలి. మొదటిది నిజమైతే బాల కార్మిక చట్టాన్ని ఉల్లఘించినట్టు.. రెండోది నిజమైతే మొదటి దాని సంగతేంటో. 1977లో పుట్టిన ఓ మహిళ 2002లో స్వీపర్‌గా చేరింది. ఆమె కుమారుడు 1985లో పుట్టి, 2006లో అటెండర్‌గా ఉద్యోగంలో చేరినట్లు రికార్డుల్లో ఉంది. తల్లి 1977లో పుడితే 8 ఏళ్లకే ఆమెకు కొడుకు పుట్టాడట. ఈ రెండు ఘటనలే కాదు 2018లో టీడీపీ హయాంలో మినిమం టైం స్కేలు పొందిన 102 మంది ఉద్యోగుల్లో పలువురు అడ్డదారుల్లో ఉద్యోగాల్లో చేరినట్లు స్పష్టమవుతోంది. ఉన్నత విలువలు నేర్పాల్సిన రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు విలువలకు తిలోదకాలిచ్చారు. నీతి బోధించాల్సిన చోటునే అవినీతికి అడ్డాగా మలుచుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన వారే అక్రమార్జనకు తెరతీశారు. ఆమ్యామ్యాలకు తలొగ్గి అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టి కాసులు వెనకేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఫిర్యాదులతో విచారణ చేపట్టిన వర్సిటీ స్థాయి కమిటీ ఇప్పటికే 14 మంది అక్రమార్గంలో ఉద్యోగాలు పొందినట్లు తేల్చినట్లు సమాచారం. విచారణ తుది దశకు చేరుకోవడంతో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన మరికొంత మంది, వారికి సహకరించిన వర్సిటీ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కర్నూలు సిటీ: రాయలసీమ యూనివర్సిటీ 2008లో ఏర్పాటైంది. అనంతర కాలంలో నాన్ టీచింగ్ నియామకాల కోసం అప్పట్లో జీఓ ఎంఎస్ నంబరు 50 జారీ అయింది. ఈ జీఓ ప్రకారం నాలుగు పోస్టులు రెగ్యులర్, 23 పోస్టులు అవుట్ సోర్సింగ్ ద్వారా మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏకంగా 150 నుంచి 200 పోస్టులను ఎలాంటి అనుమతులు లేకుండానే అప్పటి వర్సిటీ అధికారులు పలు దఫాలుగా నియమించి నిబంధనలకు విరుద్ధంగా మినిమం టైం స్కేలు అమలు చేశారు. ఇందులో 60 ఏళ్ల వయస్సు పైబడిన వారి ఆధార్‌కార్డులలో పుట్టిన తేదీలు మార్పులు చేసి, విధుల్లో చేరిన తేదీలను సైతం మార్పులు చేసి రికార్డుల్లో నమోదు చేశారు. అందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు, ప్రస్తుత ఇద్దరు ప్రొఫెసర్లపై ఆరోపణలున్నాయి. ఫిర్యాదుల వెల్లువ.. కనీస విద్యార్హతలు కూడా లేని వారిని రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ పాటించకుండా పోస్టుల్లో నియమించడంతో ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. స్పందించిన ఉన్నత విద్యా ప్రభుత్వ కార్యదర్శి గత ఏడాది డిసెంబరు 15న ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి బిశ్వాస్, ఉన్నత విద్యా మండలి జాయింట్ డైరెక్టర్ కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అదే ఏడాది డిసెంబరు 23లోపు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని వర్సిటీ అ«ధికారులకు లేఖ రాసింది. స్పందించకపోవడంతో ఈ ఏడాది జనవరి 4న విచారణకు రావాలని మరో సారి సూచించింది. అయితే వర్సిటీలోని కీలక అధికారులు రంగప్రవేశం చేసి ఆ కమిటీతో కాకుండా యూనివర్సిటీ స్థాయిలోనే ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తామని చెప్పి తప్పించుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో.. మూడు నెలల క్రితం ప్రారంభమైన వర్సిటీ స్థాయి విచారణ నత్తనడకన సాగుతుండటంతో విద్యార్థి సంఘాలు పలుమార్లు ఆందోళనలు చేశాయి. దీంతో రాజ్‌భవన్, సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాలతో విచారణను వేగవంతం చేసి తుది దశకు చేర్చారు. ఈ విచారణలో ఇప్పటి వరకు 14 మంది అనర్హులకు టైం స్కేల్ అమలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా మరో 11 మంది మినిమం టైంస్కేల్ ఉద్యోగుల సర్టిఫికెట్లపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ 25 మందికి రెండు నెలలుగా జీతాలు నిలిపేసినట్లు సమాచారం. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు పొందిన వారు కూడా అనర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో ఆర్‌యూలో జరిగిన నియామకాలకు సంబంధించిన జీఓలు, ప్రకటనలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల వివరాలను సేకరించాలని జిల్లా ట్రెజరీని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. విచారణ చివరి దశకు వచ్చింది రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న నాన్ చీటింగ్ స్టాఫ్ విద్యార్హతలు, తదితర అంశాలపై చేపట్టిన విచారణ చివరి దశకు చేరుకుంది. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నాం. ఇలాంటివి రెగ్యులర్‌గా జరిగే విచారణలే. – మధుసూదన్ వర్మ, రిజిస్ట్రార్, ఆర్యూ -
రూ.903 కోట్లతో రోడ్ల అభివృద్ధి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో రూ.903.21 కోట్లతో వివిధ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్ని రోడ్ల పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా కొన్ని పత్రికలు రహదారులపై తప్పుడు కథనాలు ప్రచురితం చేయడంతో వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. రోడ్లకు సంబంధించి ఎంతో పురోగతి ఉన్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నామని, ఇక నుంచి ప్రతి సోమవారం రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తామని, ‘స్పందన’ కార్యక్రమంలో పూర్తయిన రహదారుల వివరాలను నాడు–నేడు కింద ప్రదర్శించనున్నట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపిన వివరాలు.. జిల్లాలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో మొత్తం 1,887 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో 243 కిలోమీటర్లకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదు. మిగిలిన 791 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు, విస్తరణ పనులు చేయాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 517 కోట్లను మంజూరు చేసింది. మొత్తం 134 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 55 పనులు పూర్తయ్యాయి. ఇందులో 42 పనులు జరుగుతున్నాయి. మరో 37 పనులను జూలై మొదటి వారంలోపు ప్రారంభిస్తారు. సెప్టెంబర్ నాటికి అన్నీ పనులు పూర్తి చేస్తారు. పంచాయతీరాజ్ విభాగంలో జూలై 1 నుంచి రూ.25.49 కోట్లతో 216.03 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఈ పనులకు సంబంధించి ఈనెల 20న టెండర్లు ఫైనల్ అవుతాయి. మూడు నెలల వ్యవధిలో పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే పీఆర్ విభాగంలో రెండో విడత కింద రూ.133.69 కోట్లతో 577.18 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు. ఈనెల 22వ తేదీ తరువాత ఆ పనులు చేపట్టేందుకు పాలన పరమైన అనుమతులు వస్తాయి. 85 గ్రామాలకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ 250 మంది జనాభా కలిగి ఇప్పటి వరకు మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ లేని 85 గ్రామాలకు రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ కింద రూ.189.11 కోట్లతో 190 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 30.82 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తి కాగా, అక్టోబర్ 22 నాటికి మిగిలిన 160 కిలోమీటర్ల పనులు పూర్తి చేస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 8 పనులకు సంబంధించి రూ.27.03 కోట్లతో 91.07 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 7 పనులు పూర్తి కాగా, మంత్రాలయం నియోజకవర్గంలో శాతనూరు నుంచి దొడ్డి వరకు జరుగుతున్న రహదారి పనిని జూలై 15వ తేదీలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఇన్సెంటివ్స్ కింద జిల్లాకు 24 రహదారుల మంజూరయ్యాయి. ఇందులో రూ.10 కోట్లతో 77 కిలోమీటర్ల మేర పనులను చేపట్టగా 18 రహదారుల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 6 రోడ్లు జూలై ఆఖరులోపు పూర్తి అవుతాయి. రహదారులు వేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు: కాటసాని జిల్లాలో దాదాపు రూ.900 కోట్ల విలువైన రహదారుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నా.. లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మహబూబ్‌బాషా అసలు కాంట్రాక్టరే కాదని, అతను ఆత్మహత్య చేసుకుంటే కొన్ని పత్రికలు పనిగట్టుకొని రూ.80 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడం అన్యాయమన్నారు. ఆయన లేబర్ కాంట్రాక్టరని, కాంట్రాక్టర్‌కు లేబర్ కాంట్రాక్టర్‌కు తేడా లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణాల్లో క్వాలిటీ లేకపోతే కాంట్రాక్టర్లకు పైసా కూడా బిల్లులు చెల్లించమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బస్తిపాడు–నాగలాపురం, మార్కాపురం– పెద్దపాడు, నన్నూరు బ్రిడ్జి, కృష్ణానగర్ ఫ్లై ఓవర్లను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. రహదారులకు సంబంధించి ఈ ఏడాది ఎన్నో పనులు చేపట్టామని, అయినా, ఇంకా కావాలని ముఖ్యమంత్రి వెఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. తాను తప్పు చేసినా..తన ప్రభుత్వం తప్పు చేసినా మీడియా ఎత్తి చూపవచ్చని, అయితే కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు. -
నంద్యాలలో 10 రోజులు లాక్డౌన్..
సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాలలో 10 రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా నేపథ్యంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. రేపటి నుండి 25 వరకు అత్యవసర సర్వీసులు మాత్రమే సడలింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు, రిటైల్ కూరగాయల అమ్మకాలకు ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్డౌన్ అమలులో ఉంటుంది. ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ, డీఎస్పీ చిదా నందరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?
-
ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?
సాక్షి, నంద్యాల: రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహించరని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలకు అన్యాయం జరిగితే మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్ఆర్సీని రాష్ట్రంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని సీఎం వైఎస్ జగన్ సృష్టం గా చెప్పారని తెలిపారు. నంద్యాలలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారని.. తాను నెల్లూరు రాజకీయాల్లో పోటీ చేసిన ప్రతీసారి ముస్లిం లు వలనే గెలవగలిగానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు..? సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం మంచిది కాదని మంత్రి అనిల్ తెలిపారు. పార్లమెంటులో తమ ఎంపీ మిథున్ రెడ్డి ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ మాట్లాడారని.. టీడీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి అంటూ.. చంద్రబాబుకు జోలె పట్టుకుని బిక్షాటన చేయడం మాత్రమే తెలుసునని.. ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏపై మాట్లాడే దమ్ము లేదని దుయ్యబట్టారు. కేవలం 29 గ్రామాల కోసం ఆయన బినామీ, బంధువుల ఆస్తులు పోతాయని జోలె పట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. 151 అసెంబ్లీ సీట్లు సాధించి.. దేశంలోనే చరిత్ర సృష్టించిన వైఎస్సార్సీపీ లాంటి పార్టీని గాలిలో కలుపుతామంటారా అంటూ టీడీపీపై నిప్పులు చెరిగారు. సీఎం వైఎస్ జగన్ 10 సంవత్సరాల తన రెక్కల కష్టంతో.. 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలు పొంది సంచలన విజయం సాధించారని పేర్కొన్నారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి.. దమ్ముంటే సొంతగా పార్టీ పెట్టి గెలవాలని చంద్రబాబుకు మంత్రి అనిల్‌కుమార్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీపై మమకారంతో చంద్రబాబుకు ఓట్లు వస్తున్నాయి తప్ప.. ఆయన ముఖం చూసి కాదన్నారు. లేకుంటే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడో నేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడని.. కానీ ఆయనలో క్షమా,దయా గుణం ఉండటంతో టీడీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా సహిస్తున్నారని మంత్రి అనిల్ పేర్కొన్నారు. -
వసూళ్ల మధ్య.. ప్రయోగం మిథ్య!
కర్నూలు బిర్లా గేటు దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సం చదువుతున్న విద్యార్థులకు ఇంతవరకు ప్రాక్టికల్ క్లాస్‌లు చెప్పలేదు. ఈ కాలేజీకి చెందిన మరో బ్రాంచ్ కర్నూలు కొత్త బస్టాండ్‌కు వెళ్లే దారిలో ఉంది. అక్కడ వారం రోజుల నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తున్నారని కొందరు విద్యార్థులు చెబుతున్నారు. కర్నూలులోని ఓ కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రాక్టికల్ పరీక్షలు పాస్ చేయించేందుకు బైపీసీ విద్యార్థుల నుంచి రూ. 2 వేలు, ఎంపీసీ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. కర్నూలు సిటీ: ఇంటర్లో సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఎంతో కీలకం. అందులో మార్కులు తగ్గితే ఎంసెట్, నీట్, ఐఐటీ–జేఈఈలో వెయిటేజీ తగ్గిపోతుంది. అయితే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు కాగితాలపైనే కనిపిస్తున్నాయి. ప్రాక్టికల్స్ గడువు ముంచుకొస్తుండగా అభ్యసనంపై నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. కొన్ని జూనియర్ కళాశాలల్లో వసతులు లేవు. మరికొన్ని చోట్ల వసతులు ఉన్నా అవసరమైన పరికరాలు, రసాయనాలు లేవు. ప్రయోగ పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మేనేజ్ చేస్తూ అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతల్లో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను జబ్లింగ్ పద్ధతిలో జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ప్రయోగశాలలేవీ? జిల్లాలో మొత్తం 299 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 265 కాలేజీలు మాత్రమే పని చేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 44, ఏపీ మోడల్ స్కూళ్ల కాలేజీలు 35, ఎయిడెడ్ కాలేజీలు10, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలు 14, రెసిడెన్షియల్ కాలేజీలు 2, ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీలు 3, కో–ఆపరేటివ్ కాలేజీలు 1, ఇన్సెంటివ్ కాలేజీలు 4, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు 113, ఒకేషనల్ కాలేజీలు 14, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో కొత్తగా ఇంటర్ విద్య అమలు చేస్తున్న కళాశాలలు 23 ఉన్నాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సర బైపీసీ 13,177, ఎంపీసీ 9,449 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. అయితే అధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రయోగ శాలలు లేవు. కొన్నిచోట్ల మొక్కుబడిగా దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల అసలు గదులు కేటాయింపే జరగలేదు. ఫలితంగా అధికశాతం విద్యార్ధులు ప్రాజెక్ట్ రికార్డులు కూ డా తయారు చేయలేని దుస్థితిలో ఉన్నారు. సాధారణంగా సైన్సు విద్యార్థులకు ప్రతి ఏడాది బొటానికల్ టూర్‌కు తీసుకుపోవాలి. క్షేత్ర స్థాయిలో వివిధ మొక్కలను సేకరించి, వాటిని భద్రపరిచి హెర్బిరియంను విద్యార్థులతో తయారు చేయించాలి. అయితే ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీ విద్యార్థులను బొటానికల్ టూర్‌కు తీసుకపోవడం లేదు. అధ్యాపకులే రెడీమేడ్ హెర్బేరియంను విద్యార్థులతో కొనుగోలు చేయిస్తున్నారు. రికార్డులను సైతం ఇతరులతో రాయించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు జంబ్లింగ్ విధానం అమల్లోకి తెచ్చినా..కొందరు అధికారులతో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు లోపాయికారీ ఒప్పందాలు చేసుకొని గట్టెక్కుతున్నాయి. చర్యలు తీసుకుంటాం.. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్ పరీక్షల కోసం అదనంగా ఫీజులను వసూళ్లు చేసినట్లు మా దృష్టికి రాలేదు. తనిఖీలకు వెళ్లిన సమయంలో ల్యాబ్‌లు పని చేస్తున్నాయని చెబుతున్నారు. మరోసారి కాలేజీలను తనిఖీలు చేస్తాం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం. – సాలాబాయి, ఇంటరీ్మడియట్ ప్రాంతీయ కార్యాలయ అధికారి -
ఇంటర్ ఫెయిలా? పర్లేదులే.. ‘బాబ్బాబూ.. అడ్మిషన్ తీసుకో’
సాక్షి, కర్నూలు : ‘బాబ్బాబూ.. డిగ్రీ అడ్మిషన్ తీసుకో.. కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా మేము చూసుకుంటాం.. ఆరు సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లిస్తాం. బస్సు పాస్‌కు అయ్యే ఖర్చు భరిస్తాం. ఇదే కాకా అదనంగా రూ.5000 ఇస్తాం. ఐటీఐ చదివినా.. ఇంటర్ ఫెయిల్ అయినా పర్వాలేదు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, రాయలసీమ విశ్వవిద్యాలయంలో మేనేజ్ చేసుకుంటాం’ ఇదీ ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో జరుగుతున్న తంతు. ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ.. బయోమెట్రిక్ హాజరు సిస్టమ్ లేకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్నాయి. ఐటీఐ చదివినా డిగ్రీలో అడ్మిషన్ బనగానపల్లె, కోవెకుంట్ల, పాములపాడు, ఆత్మకూరు ప్రాంతాల్లో ఐటీఐ చదివిన విద్యార్థులకు కూడా అడ్మిషన్లు ఇస్తున్నారు. పత్తికొండలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళా«శాలలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు సైతం ఆడ్మిషన్లు ఇచ్చారు. సదరు విద్యార్థులు డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇలా జరగదు. అక్కడ డిగ్రీ విద్యార్థుల విద్యార్హత ధ్రువ పత్రాలను పక్కాగా పరిశీలిస్తారు. ఆర్‌యూలో మాత్రం ఇవేమీ చేయరు. దీంతో ఇంటర్ ఫెయిల్ అయినా, ఐటీఐ చదివినా డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 12 ప్రభుత్వ, 7 ఎయిడెడ్, 85 ప్రైవేట్ మొత్తం 104 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 65వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలోని చాలా కళాశాలలు ముఖ్యంగా పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో డిగ్రీలో చేరితే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కళాశాలల యాజమాన్యాలే ఒక్కో విద్యార్థికి డిమాండ్, పరిస్థితులను బట్టి రూ.3000 నుంచి రూ.6000 వరకు చెల్లిస్తున్నాయి. ఆరు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్ష ఫీజు రూ.3000, బస్‌పాస్‌కు అయ్యే ఖర్చు రూ.5000 ఇలా ఒక విద్యార్థికి సుమారు రూ.14000 వరకు ఖర్చుచేసి సీట్లు భర్తీ చేసుకుంటున్నారు. వీరు కళాశాలకు వచ్చినా రాకున్నా పర్వాలేదు. అంతా యాజమాన్యాలే చూసుకుంటాయి. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారేంటే ఒక్కొక్క విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.18000, మూడేళ్లకు రూ.54000 ప్రభుత్వం నుంచి వస్తుంది. ఒక విద్యార్థిపై తాయిలాల రూపంలో రూ.14000 ఖర్చు చేస్తే తమకు రూ.40,000 వరకు మిగులుతుందని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకుల ప్లాన్. ఆన్లైన్లో లేకపోవడంతో.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో డిగ్రీలో చేరాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఆధారంగా మార్కులు, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇది విద్యార్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ వారి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండా పోయింది. వర్సిటీ కేటాయించిన సీట్లకంటే కూడా 20 శాతం అదనంగా చేర్చుకుంటున్నారు. వాటికి సంబంధించి అఫ్లియేషన్ ఫీజు సైతం వర్సిటీకి చెల్లించకుండా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ విషయంలో వర్సిటీ అధికారులు కూడా కఠినంగా వ్యవహరించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమలు కాని బయోమెట్రిక్ హాజరు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు 75 శాతం ఉంటేనే ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్‌నకు అర్హులు. ప్రైవేట్ కళాశాలల్లో ఈ నిబంధనలేవీ లేకపోవడంతో ప్రవేశాలు భారీగా జరుగుతున్నాయి. -
కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా
ఒకటే లక్ష్యం.. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ఏర్పాటే ధ్యేయం.. పరిగణనలోకి ఎన్నో సమీకరణలు.. ఎందరో ఆశావహులు.. సామాజిక లెక్కలు.. చివరకు గెలుపు గుర్రాలకే టికెట్లు అన్నట్లుగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ఖరారు కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠకు తెరపడింది. ఆదివారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ఆ పార్టీ అధినేత అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. సమరోత్సాహంతో ప్రచారపోరుకు సమాయత్తమవుతున్న తరుణంలో అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల వివరాలు.. డోన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తల్లిదండ్రులు : రామనాథ రెడ్డి, పార్వతమ్మ స్వగ్రామం : బేతంచర్ల పుట్టిన తేదీ : 27–09–1970 చదువు : బీటెక్ కుటుంబ సభ్యులు : భార్య రూప, కుమారుడు అర్జున్, కుమార్తె ఐశ్వర్య వృత్తి : మైనింగ్ వ్యాపారం రాజకీయ స్ఫూర్తి : బుగ్గన శేషారెడ్డి (జేజి నాయన) ఇష్టమైన నాయకులు : కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ నేపథ్యం : 1955లో తన జేజినాయన బుగ్గన శేషారెడ్డి డోన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత కాలంలో తండ్రి రామనాథ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డోన్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్‌పై విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన పీఏసీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. కోడుమూరు జరదొడ్డి సుధాకర్ తల్లిదండ్రులు : బాలనాగమ్మ, ఆనందం స్వగ్రామం : ఎస్‌హెచ్ ఎర్రగుడి పుట్టిన తేదీ : 06–05–1974 చదువు : బీడీఎస్ (యుహెచ్‌ఎస్) ఎండీఎస్ (ఉస్మానియా) కుటుంబం : భార్య విజయలలిత, సంతానం శుక్రుత, సాకేత్ ఆనంద్ రాజకీయ స్ఫూర్తి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇష్టమైన నాయకుడు : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత లక్ష్యం : నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడం నందికొట్కూరు తొగురు ఆర్థర్ తల్లిదండ్రులు : మార్తమ్మ, శ్యామూల్ స్వగ్రామం : మద్దూరు, పాములపాడు మండలం, నందికొట్కూరు నియోజకవర్గం పుట్టిన తేది : 10–07–1955 చదువు : బీఏ కుటుంబ సభ్యులు : భార్య వంట్ల పాపమ్మ (ప్రేమ వివాహం), కుమారుడు వివేక్ జయ సందీప్, కుమార్తె విజయ సిరి సింధూర వృత్తి : రిటైర్డ్ కమాండెంట్ (ఎస్పీ) నేపథ్యం : 1982లో సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు విధుల్లో చేరి ఎస్పీ స్థాయికి ఎదిగారు. పాములపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఈయనకు నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. పోలీసు శాఖలో ఉన్నత స్థాయి అధికారిగా విధులు నిర్వహిస్తూ సౌమ్యుడిగా పేరు సంపాదించారు. కష్టాల్లో ఉన్న వారు ఆయన వద్దకు వెళితే తనవంతు సాయం చేసే వ్యక్తిత్వం. పాణ్యం కాటసాని రాంభూపాల్‌రెడ్డి తండ్రి పేరు : కాటసాని నరసింహారెడ్డి స్వగ్రామం : గుండ్ల శింగవరం, అవుకు మండలం పుట్టిన తేది : 27–12–1959. చదువు : బీఏ కుటుంబ సభ్యులు : భార్య ఉమామహేశ్వరమ్మ, కుమారుడు శివ నరసింహా రెడ్డి, కుమార్తెలు ఉషారాణి, దేదీప్యా రాణి, మాధవీలత. రాజకీయ అరంగేట్రం : మొదటి సారిగా 1980లో గుండ్ల శింగవరం గ్రామ సర్పంచ్‌గా ఎన్నిక. అనంతరం 1985, 1989, 1994, 2004, 2009లో పాణ్యం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాణ్యం నుంచి మొత్తం ఐదుసార్లు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆళ్లగడ్డ : గంగుల బిజేంద్రారెడ్డి తల్లిదండ్రులు : ఇందిర, గంగుల ప్రభాకర్‌రెడ్డి ( వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ) పుట్టిన తేదీ : 14–07– 1987 చదువు : ఎంబీఏ స్వగ్రామం : ఎర్రగుడిదిన్నె, రుద్రవరం మండలం, ఆళ్లగడ్డ నియోజకవర్గం రాజకీయ నేపథ్యం : ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గంగుల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. మొట్ట మొదటి సారిగా 1967లో గంగుల తిమ్మారెడ్డి ఇండిపెండెంట్‌గా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత 1980లో ఆయన పెద్ద కుమారుడు గంగుల ప్రతాప్‌రెడ్డి ఎస్వీ సుబ్బారెడ్డిపై గెలుపొంది రాజకీయ అరంగ్రేటం చేశారు. తరువాత ఆయన రెండో కుమారుడు గంగుల ప్రభాకరరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్, ఒక్కసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం గంగుల ప్రభాకరరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయన కుమారుడైన గంగుల బిజేంద్రారెడ్డి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో ఆయన సేవలను గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చింది. ఆదోని : ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్‌రెడ్డి తల్లిదండ్రులు : లలితమ్మ, భీమిరెడ్డి స్వగ్రామం : రాంపురం, మంత్రాలయం మండలం పుట్టిన తేది : 23– 03– 1963 చదువు : ఇంటర్మీడియట్ కుటుంబసభ్యులు : భార్య శైలజ, కుమారుడు జయమనోజ్ కుమార్‌రెడ్డి, కుమార్తె గౌతమి రాజకీయ చరిత్ర : తండ్రి భీమిరెడ్డి ఉరవకొండ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన నుంచే రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే పలు స్టూడెంట్స్ యూనియన్లకు నాయకత్వం వహించారు. 1989లో టీడీపీలో చేరి కౌతాళం మండల టీడీపీ అధ్యక్షుడిగా పని చేశారు. 2002లో కాంగ్రెస్‌లో చేరారు. 2004లో ఆదోని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయ స్ఫూర్తి : ఎన్టీఆర్ ఇష్టమైన నాయకులు : వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత లక్ష్యం : చివరి వరకు ప్రజా జీవితంలో ఉండడం ఆలూరు : పెంచికలపాడు జయరాం తల్లిదండ్రులు : శారదమ్మ, బసప్ప స్వగ్రామం : గుమ్మనూరు, చిప్పగిరి మండలం, ఆలూరు నియోజకవర్గం పట్టినతేది : 16–10–1967 చదువు : పదవ తరగతి కుటుంబీకులు : భార్య పి. రేణుక, కుమారుడు ఈశ్వర్, కుమార్తె రాజకీయ నేపథ్యం : 1997లో తల్లి పి.శారదమ్మ గుమ్మనూరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2001లో జయరాం ఏరూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. 2006లో చిప్పగిరి మండలం జెడ్పీటీసీ సభ్యుడిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1998 ఓట్లతో విజయం సాధించారు. వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఈయనకు మరో సారి అవకాశం వచ్చింది. పత్తికొండ : కంగాటి శ్రీదేవి తల్లిదండ్రులు : కమ్మగిరిరెడ్డి, వెంకటలక్ష్మి స్వగ్రామం : బురుగుల, ప్యాపిలి మండలం, డోన్ నియోజకవర్గం పుట్టిన తేదీ : 12–06–1972 చదువు : బీఏ కుటుంబ సభ్యులు : భర్త చెరుకులపాడు నారాయణరెడ్డి, కుమారుడు రామ్మోహన్‌రెడ్డి, కుమార్తె స్నేహారెడ్డి రాజకీయ చరిత్ర : 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2013లో కేడీసీసీ బ్యాంక్ జిల్లా చైర్మన్‌గా పని చేశారు. 2015లో భర్త నారాయణరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తుండగా 2017 మే 21వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. 2017 నవంబర్‌లో జరిగిన ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి... కంగాటి శ్రీదేవిని వైఎస్ఆర్సీపీ పత్తికొండ అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆమె కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. ఇష్టమైన నాయకుడు : వైఎస్. జగన్మోహన్రెడ్డి. జీవిత లక్ష్యం : జగన్మోహన్రెడ్డిని సీఎంగా చూడటం. శ్రీశైలం : సింగారెడ్డి గారి శిల్పా చక్రపాణిరెడ్డి తల్లిదండ్రులు : వెంకట లక్ష్మమ్మ, చెన్నారెడ్డి స్వగ్రామం : కొండ సుంకేసుల, వైఎస్ఆర్ జిల్లా పుట్టిన తేది : 1–07–1954 చదువు : డిగ్రీ కుటుంబ సభ్యులు : భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు కార్తీక్‌రెడ్డి, కుమార్తె శ్వేత అభిరుచులు : స్నేహితులతో కలవడం, కొత్త ప్రదేశాలను చూడడం గతంలో వృత్తి : వ్యవసాయం రాజకీయ గురువు : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ ప్రవేశం : 2004, 2009లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో శిల్పా సహకార్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆత్మకూరు నియోజకవర్గంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం, మహిళలకు అర్థిక సాయం చేయడం వంటి పనులు నిర్వర్తించారు. 2011 నుంచి వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించారు. అనివార్య కారణాలతో 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేస్తున్నారు. బనగానపల్లె : కాటసాని రామిరెడ్డి తల్లిదండ్రులు : కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి స్వగ్రామం : గుండ్ల శింగవరం, అవుకు మండలం చదువు : డిగ్రీ కుటుంబ సభ్యులు : భార్య జయమ్మ, కుమారులు ఓబుల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి (లేటు), కుమార్తెలు ప్రతిభ, ప్రణతి ఇష్టమైన నాయకులు : వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ నేపథ్యం : 21 ఏళ్ల వయస్సులో 1987లో అవుకు మండలం మెట్టుపల్లె సింగిల్ విండో అధ్యక్షుడిగా, 1988–93 సంవత్సరాల మధ్య గుండ్ల శింగవరం సర్పంచ్‌గా, అవుకు మండల ఉపాధ్యక్షుడిగా, 1994–98 మధ్య బనగానపల్లె మండల జెడ్పీటీసీ సభ్యుడిగా కొనసాగారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 16 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు : మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ తండ్రి : మొహమ్మద్ అబ్దుల్ మోయీజ్ ఖాన్ స్వగ్రామం : కర్నూలు పుట్టిన తేది : 31– 01–1977 కుటుంబ సభ్యులు : భార్య, కుమారుడు, కుమార్తె చదువు : డెట్రాయిట్ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ ఉద్యోగం : అమెరికాలోని డెట్రాయిట్లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (2003 నుంచి 2011 వరకు) రాజకీయ నేపథ్యం : తాత బి.షంషీర్‌ఖాన్ 1967లో కేఈ మాదన్న (కాంగ్రెస్)పై ఇండిపెండెంట్ అభ్యర్థిగా, 1978లో ఇబ్రహీంఖాన్ ( కాంగ్రెస్)పై జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. తండ్రి మోయీజ్‌ఖాన్ 1985 నుంచి 2011 వరకు కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. ఏఐసీసీ మెంబరుగా కూడా ఎంపికయ్యారు. హఫీజ్‌ఖాన్ 2011లో వైఎస్ఆర్సీపీలో చేరి పదవులు పొందారు. నంద్యాల : సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి తల్లిదండ్రులు : శిల్పా మోహన్‌రెడ్డి, రమాదేవి పుట్టిన తేదీ : 18–09–1983 చదువు : అగ్రికల్చర్(బీఎస్సీ) కుటుంబ వివరాలు : భార్య నాగిని రెడ్డి, సంతానం సశ్యరెడ్డి, ఈషిర్రెడ్డి రాజకీయ నేపథ్యం : తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి స్ఫూర్తితో రాజకీయ ప్రవేశం. నంద్యాల నియోజకవర్గంలో ఎవరికీ ఏ కష్టం వచ్చిన నేనున్నాంటూ భరోసా కల్పిస్తున్నారు. శిల్పా సహకార్ ద్వారా నంద్యాల ప్రజలకు మరింత దగ్గర కావాలని భార్య శిల్పా నాగిని ద్వారా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళలకు పావలా వడ్డీ రుణం,చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్లు సొంత నిధులతో నిర్మించి ప్రజలకు ఉచితంగా అందించడం, పేదలకు వివాహ కార్యక్రమాలు, పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక సాయం అందజేయడం తదితర కార్యక్రమాలు చేస్తుంటారు. మంత్రాలయం : ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తల్లిదండ్రులు : ఎల్లారెడ్డి గారి భీమిరెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ), లలితమ్మ (మంత్రాలయం మండలం రాంపురం గ్రామ సర్పంచ్) స్వగ్రామం : రాంపురం, మంత్రాలయం మండలం చదువు : డిగ్రీ కుటుంబ సభ్యులు : భార్య వై.విజయమ్మ, కుమారుడు ధరణీరెడ్డి, కుమార్తె ప్రియాంక రాజకీయ నేపథ్యం : 1989లో రాజకీయ ప్రవేశం చేశారు. రాంపురం సర్పంచ్‌గా, మంత్రాలయం సింగిల్ విండో అధ్యక్షులుగా పదేళ్లు ఉన్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ మంత్రాలయం అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థి దళవాయి రామయ్యపై 10,697 ఓట్ల మోజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి పై 7462 ఓట్లతో గెలిచారు. చివరి వరకు ప్రజా జీవితంలో ఉండాలన్నది ఆయన లక్ష్యం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం, ఎవరైనా సాయం కోరి వస్తే కాదనే స్వభావం కాదు ఆయనది. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. రాజకీయ గురువు : బీవీ మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి అభిమాన నాయకుడు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మిగనూరు : కడిమెట్ల చెన్నకేశవరెడ్డి తల్లిదండ్రులు : విరుపాక్షమ్మ, చెన్నారెడ్డి పుట్టిన తేదీ : 01–07–1940 స్వగ్రామం : కడిమెట్ల కుటుంబసభ్యులు : భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, ఐదుగురు కుమార్తెలు చదువు : పీయూసీ రాజకీయ నేపథ్యం : 1994,1999లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009, 2012లో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. -
మనవరాలిపై అత్యాచారం ..!
సాక్షి, కోవెలకుంట్ల: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి వరుసకు మనవరాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మండలంలోని రేవనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఎం.ఉప్పలూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ రమేష్‌కుమార్ అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎం.ఉప్పలూరు గ్రామానికి చెందిన జింకల పుల్లయ్య (60).. మానసిక స్థితి సరిగా లేని మనవరాలి వరుసయ్యే బాలిక (16)తో కలిసి ఆరు నెలల క్రితం గొర్రెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లాడు. ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి మతిస్థిమితం లేకపోవడంతో అప్పట్లో ఈ విషయం బయటకు పొక్కలేదు. రెండు రోజుల క్రితం ఆ యువతిని ఆసుపత్రికి తీసుకెళ్లగా..ఆరు నెలల గర్భవతిగా డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో యువతి బంధువులు పుల్లయ్యను నిలదీయడంతో అత్యాచారానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు పుల్లయ్యను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తలిలించారు. -
అది కిడ్నాప్ కాదు.. డ్రామా
సాక్షి, పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండలో ఆరుగురు విద్యార్థుల కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసులు డ్రామాగా తేల్చారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశ, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సాయంత్రం సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తర్వాత తనకు కడుపునొప్పి ఉందని ఫర్జానా అనే విద్యార్థిని చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలిసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో వచ్చిన దుండగులు వీరిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దీనిపై పోలీసులు విచారించగా కిడ్నాప్ డ్రామాగా తేలింది. పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని సరోజిని, క్లర్క్ శశికళ మధ్య విభేదాలతోనే ఈ డ్రామా నడిచినట్లు తెలుస్తోంది. హెచ్ఎం సరోజనియే విద్యార్థినులతో కిడ్నాప్ డ్రామా ఆడించినట్లు, కేసును శశికళపై నెట్టేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. కాగా, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
పైసా వసూల్..!
కుల ధ్రువీకరణ పత్రానికి ఓ రేటు.. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌కు మరోరేటు.. ఇంటి పట్టా పొందాలంటే ఇంకో రేటు.. ప్రభుత్వ భూమిని సాగుకు కేటాయించాలన్నా... ఫ్యామిలీ మెంబర్స్సర్టిఫికెట్ కావాలన్నా....ప్రతి పనికీ ఓ రేటు..ఇది రెవెన్యూ శాఖలో సర్వసాధారణమై పోయింది. కొందరు అధికారులు..ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని అందినకాడికి దండు కుంటున్నారు. ఏ స్థాయిలో అంటే కోట్ల రూపాయలు కూడబెట్టేంతగా! ఈ విషయం ఎవరో చెప్పింది కాదు..సాక్షాత్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులే ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో ఐదుగురు తహసీల్దార్లు రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ జాబితా స్పష్టం చేస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ..ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ శాఖల్లో కీలకమైనది. అవినీతి అక్రమాల్లోనూ ఈ శాఖ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఏసీబీ అధికారులు రూపొందించిన జాబితా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్ఓల నుంచి మండల స్థాయిలో పనిచేసే తహసీల్దార్ల వరకు కొందరు.. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. గత ఐదేళ్లుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన వారిలో రెవెన్యూ అధికారులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మేము సైతం సర్వేయర్లూ ఇటీవల ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన అధికారుల జాబితా తయారు చేశారు. ఈ జాబితాను ప్రభుత్వానికి కూడా పంపారు. 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 65 మంది ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఇందులో రెవెన్యూ సిబ్బందే సగానికి పైగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో రెవెన్యూ మంత్రే.. ఆ శాఖ అవినీతిపై బాహాటంగా విమర్శలు చేయడం కలకలం రేపింది. రెవెన్యూ అధికారులకు పోటీగా సర్వేయర్లు ఆస్తులు కూడబెట్టుతున్నట్లు సమాచారం. జిల్లాలో ఐదుగురు తహసీల్దార్లు.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు కూడ బెట్టిన తహసీల్దార్లు జిల్లాలో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. వీరిలో కర్నూలు రెవెన్యూ డివిజన్లో ఇద్దరు, ఆదోని రెవెన్యూ డివిజన్లో ఇద్దరు, నంద్యాల డివిజన్లో ఒక్కరు ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఆస్తులను కటుంబసభ్యుల పేర్లు, బినామీ పేర్లతో కూడబెట్టినట్లు సమాచారం. తహసీల్దార్లు, వీఆర్ఓలకు జిల్లాలోనే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలోను, బెంగళూరులోనూ భూములు, బంగ్లాలు, ప్లాట్లు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ⇔ ప్రస్తుతం ఆదోని రెవెన్యూ డివిజన్లో పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లు అవినీతిలో సిద్ధహస్తులు. ఒకరు గతంలో వివిధ పోకల్ స్థానాల్లో పనిచేశారు. ఒకరు ప్రస్తుతం కీలకమైన మండలంలో ఉన్నారు. ఒకరు రెండు చేతులా సంపాదిస్తునే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కర్నూలు, అనంతపురం, బెంగళూరుల్లో ఆస్తులు కూడబెడుతున్నట్లు సమాచారం. ⇔ కర్నూలు డివిజన్లో పనిచేసే ఓ తహసీల్దారు బినామి పేర్లతో ప్రభుత్వ భూములను స్వాహా చేవారనే విమర్శలు ఉన్నాయి. ఒక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే మరో వైపు రియల్లర్లతో అంటకాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను రియల్టర్లకు అప్పగిస్తూ కాసుల పంట పండించుకుంటున్నట్లు సమాచారం. ఈ తహసీల్దారు ఏకంగా రూ.10 కోట్లకు పైగా ఆస్తులు సాంపాదించారని రెవెన్యూలోనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలంలో పనిచేస్తున్న తహసీల్దారు అక్రమాస్తులను భారీగా కూడ బెట్టినట్లు తెలుస్తోంది. కనీసం రూ.5 కోట్ల విలువ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. ⇔ నంద్యాల డివిజన్లో ఒక తహసీల్దారు అదే డివిజన్లోని ఒక పట్టణంలో రూ.2కోట్లకు పైగా విలువ చేసే భవనం నిర్మించారంటే ఆయన ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయనేదానిని అంచనా వేసుకోవచ్చు. మరో తహసీల్దారు కూడ అక్రమంగా ఆస్తులను భారీగానే కూడ బెట్టినట్లు తెలుస్తోంది. ⇔ రెండు కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఆస్తులు సంపాదించిన వారు 10 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం రోజుకు రూ.2 వేలు జేబులో పడనిదే సీటు వదలని వారు అనేక మంది ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. ⇔ ముడుపులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినా, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని తహసీల్దార్లుగా నియమించరాదనే నిబంధనలు ఉన్నాయి. కాని రెవెన్యూలో అటువంటి పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజకీయ నేతల అండదండలతో మళ్లీ తహసీల్దార్లుగా వచ్చి.. రెండు చేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తప్పుడు కులాలకు కులధ్రువీకరణ పత్రాలు ఇస్తున్న ఘనత కూడా వీరికి ఉండటం విశేషం వీఆర్ఓలూ.. అవినీతి ఘనలే.... ఆదోని రెవెన్యూ డివిజన్లో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారికి దాదాపు 20 ఏళ్ల క్రితం ఐదెకరాల భూమి ఉంది. ఆ వీఆర్ఓ నేడు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒకే పట్టణంలో రెండు భవంతులు ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. వీఆర్ఓలో రూ.10 కోట్లకు పైగా స్థిరాస్తులు కలిగిన వారు 10 మందికిపైగానే ఉండటం గమానార్హం. -
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమంతుగుండు గ్రామంలో విద్యుతాఘాతంతో ఒక విద్యార్థి మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు.. హనుమంతుగుండు గ్రామానికి చెందిన అమర్ (18) అనే యువకుడు మేకల కోసం ఇంటి ముందు ఉన్న వేపచెట్టు ఎక్కి కొమ్మలు తుంచుతుండగా విద్యుత్ షాక్ తగిలి చెట్టు పైనే మృతి చెందాడు. చెట్టుపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్ తగలడంతో షాక్ కొట్టిందని స్థానికులు తెలిపారు. అధికారులకు సమాచారం అందించి కరెంట్ సరఫరాను నిలిపివేసి విద్యార్థి మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.