రూ.903 కోట్లతో రోడ్ల అభివృద్ధి | Development Of Various Roads Worth Rs 903 Crores In Kurnool District | Sakshi
Sakshi News home page

రూ.903 కోట్లతో రోడ్ల అభివృద్ధి

Published Sun, Jun 12 2022 6:07 PM | Last Updated on Sun, Jun 12 2022 6:16 PM

Development Of Various Roads Worth Rs 903 Crores In Kurnool District - Sakshi

కర్నూలు(సెంట్రల్‌): జిల్లాలో రూ.903.21 కోట్లతో వివిధ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు తెలిపారు.  ఇందులో ఇప్పటికే కొన్ని రోడ్ల పనులు పూర్తి అయి ప్రజలకు అందుబాటులోకి కూడా వచ్చాయన్నారు.  ఈ విషయం తెలుసుకోకుండా కొన్ని పత్రికలు రహదారులపై తప్పుడు కథనాలు ప్రచురితం చేయడంతో వాస్తవాలు వెల్లడిస్తున్నట్లు చెప్పారు. రోడ్లకు సంబంధించి ఎంతో పురోగతి ఉన్నప్పటికీ చెప్పుకోలేకపోతున్నామని, ఇక నుంచి ప్రతి సోమవారం రహదారుల నిర్మాణాలపై సమీక్ష నిర్వహిస్తామని, ‘స్పందన’ కార్యక్రమంలో పూర్తయిన రహదారుల వివరాలను నాడు–నేడు కింద ప్రదర్శించనున్నట్లు చెప్పారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో కలెక్టర్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపిన వివరాలు.. 

జిల్లాలో ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో మొత్తం 1,887 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ఇందులో 243 కిలోమీటర్లకు సంబంధించి ఎలాంటి మరమ్మతులు అవసరం లేదు. మిగిలిన 791 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు, విస్తరణ పనులు చేయాల్సి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 517 కోట్లను మంజూరు చేసింది. మొత్తం 134 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 55 పనులు పూర్తయ్యాయి. ఇందులో 42 పనులు జరుగుతున్నాయి. మరో 37 పనులను జూలై మొదటి వారంలోపు ప్రారంభిస్తారు. సెప్టెంబర్‌ నాటికి అన్నీ పనులు పూర్తి చేస్తారు. 

పంచాయతీరాజ్‌ విభాగంలో జూలై 1 నుంచి రూ.25.49 కోట్లతో 216.03 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తారు.  ఈ పనులకు సంబంధించి ఈనెల  20న టెండర్లు ఫైనల్‌ అవుతాయి.  మూడు నెలల వ్యవధిలో   పనులు పూర్తి అయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

అలాగే పీఆర్‌ విభాగంలో రెండో విడత కింద రూ.133.69 కోట్లతో 577.18 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదించారు. ఈనెల 22వ తేదీ తరువాత ఆ పనులు చేపట్టేందుకు పాలన పరమైన అనుమతులు వస్తాయి. 

85 గ్రామాలకు మెయిన్‌ రోడ్డుకు కనెక్టివిటీ  
250 మంది జనాభా కలిగి ఇప్పటి వరకు మెయిన్‌ రోడ్డుకు కనెక్టివిటీ లేని 85 గ్రామాలకు రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌  పంచాయతీరాజ్‌ రూరల్‌ రోడ్స్‌ ప్రాజెక్ట్‌ కింద రూ.189.11 కోట్లతో 190 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 30.82 కిలోమీటర్ల పొడవున పనులు పూర్తి కాగా, అక్టోబర్‌ 22 నాటికి మిగిలిన 160 కిలోమీటర్ల పనులు పూర్తి చేస్తారు.  
 

ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద 8 పనులకు సంబంధించి రూ.27.03 కోట్లతో 91.07 కిలోమీటర్ల రహదారుల పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పటికే 7 పనులు పూర్తి కాగా, మంత్రాలయం నియోజకవర్గంలో  శాతనూరు నుంచి దొడ్డి వరకు జరుగుతున్న రహదారి పనిని జూలై 15వ తేదీలోపు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ఇన్సెంటివ్స్‌ కింద జిల్లాకు 24 రహదారుల మంజూరయ్యాయి. ఇందులో రూ.10 కోట్లతో 77 కిలోమీటర్ల మేర పనులను చేపట్టగా 18 రహదారుల నిర్మాణాలు పూర్తి అయ్యాయి.  మిగిలిన 6 రోడ్లు జూలై ఆఖరులోపు పూర్తి అవుతాయి. 

రహదారులు వేస్తున్నా దుష్ప్రచారం చేస్తున్నారు: కాటసాని 
జిల్లాలో దాదాపు రూ.900 కోట్ల విలువైన రహదారుల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నా.. లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా చేయడం సరికాదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన మహబూబ్‌బాషా అసలు కాంట్రాక్టరే కాదని, అతను ఆత్మహత్య చేసుకుంటే కొన్ని పత్రికలు పనిగట్టుకొని రూ.80 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నట్లు రాయడం అన్యాయమన్నారు.

ఆయన లేబర్‌ కాంట్రాక్టరని,    కాంట్రాక్టర్‌కు లేబర్‌ కాంట్రాక్టర్‌కు తేడా లేదా అని ప్రశ్నించారు. రహదారుల నిర్మాణాల్లో క్వాలిటీ లేకపోతే కాంట్రాక్టర్లకు పైసా కూడా బిల్లులు చెల్లించమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బస్తిపాడు–నాగలాపురం, మార్కాపురం–  పెద్దపాడు, నన్నూరు బ్రిడ్జి, కృష్ణానగర్‌ ఫ్లై ఓవర్లను ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినట్లు చెప్పారు. రహదారులకు సంబంధించి  ఈ ఏడాది ఎన్నో పనులు చేపట్టామని, అయినా, ఇంకా కావాలని ముఖ్యమంత్రి వెఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు.  తాను తప్పు చేసినా..తన ప్రభుత్వం తప్పు చేసినా మీడియా ఎత్తి చూపవచ్చని, అయితే కొన్ని మీడియా సంస్థలు అదే పనిగా ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement