నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆరేళ్ల క్రితం ఏర్పడిన నూతన మండలం ‘పెంబి‘కి వెళ్లే మార్గం ఇది. చాలా గ్రామాలకు అసలు రోడ్లు లేని ఈ మండలానికి ఇప్పటికీ సింగిల్ రోడ్డే దిక్కు. మండలంగా ఏర్పడిన తర్వాత వాహనాల రాకపోకలు పెరగడంతో తరచూ.. ఈ మార్గంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రోడ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది. గతంలో ప్రారంభించిన.. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రెండు వరసల రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. చివరకు నిర్వహణ పనుల్లో భాగంగా క్రమం తప్పకుండా జరగాల్సిన పునరుద్ధరణ (రెన్యువల్స్) పనులు చేసే అవకాశం కూడా లేకుండా పోయింది.
తెలంగాణ వచ్చిన కొత్తలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఏకంగా రూ.15,470 కోట్లతో రోడ్ల పనులు చేపట్టారు. కానీ ప్రస్తుతం రోడ్లపై పడ్డ గుంతలను పూడ్చడం తప్ప రోడ్ల నిర్మాణం మచ్చుకైనా కనిపించటం లేదు. దీంతో రోడ్లు భవనాల శాఖలో రాష్ట్ర రహదారుల విభాగానికి చేసేందుకు పని లేని పరిస్థితి ఎదురైంది.
కేటాయింపు కష్టమై..
►తెలంగాణ ఏర్పడక పూర్వం రాష్ట్రవ్యాప్తంగా డబుల్ రోడ్లు నామమాత్రంగానే ఉండేవి. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు, కొన్ని ప్రధాన పట్టణాల మధ్య తప్ప అన్నీ సింగిల్ రోడ్లే. 2014 నాటికి రాష్ట్రప్రభుత్వ అధీనంలోని రోడ్ల నిడివి 24,245 కి.మీ. కాగా, అందులో కేవలం 27.9% మాత్రమే డబుల్ రోడ్లు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్లపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్, అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు డబుల్ రోడ్లు ఉండాలని నిర్ణయించి ఏకంగా రూ.15,470 కోట్లతో 9,578 కి.మీ. నిడివిగల రహదారులను డబుల్ రోడ్లుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ పనులు అధిక ప్రాధాన్యంతో సాగటంతో 2018 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. ప్రస్తుతం 7,540 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగతావి మాత్రం మూడేళ్లుగా నిలిచిపోయాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా చివరలో ఏర్పడ్డ కొత్త మండలాలకు డబుల్ రోడ్ల భాగ్యం దక్కలేదు. తొలుత 145 మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్లకు సంబంధించి 1,835 కి.మీ. పనులు ప్రతిపాదించగా 1,651 కి.మీ పనులు పూర్తయ్యాయి. మిగతావి పెండింగులోపడ్డాయి. కొత్త మండలాలకు సంబంధించి 450 కి.మీ. పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.1,000 కోట్లు కావాలని అంచనా వేశారు. వీటితోపాటు పాత పనులకు ఇంకా రూ.3 వేల కోట్లు కావాల్సి ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అన్ని నిధులు కేటాయించటం కష్టంగా మారటంతో పనులు దాదాపుగా నిలిపివేశారు.
బకాయిలు చెల్లిస్తేనే పనులు..
►ఇటీవల రోడ్ల రెన్యువల్స్ పనుల కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. రెండుసార్లు టెండర్లు పిలిచి స్పందన లేక అధికారులు మిన్నకుండిపోయారు. పనులు చేస్తే బిల్లులు వస్తాయన్న నమ్మకం లేకనే కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రస్తుతం వారికి రూ.700 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.
ఇవి గతంలో రూ.1,200 కోట్లుగా ఉండగా, అడపాదడపా కొన్ని చొప్పున చెల్లిస్తూ రావడంతో ఈ మాత్రానికి తగ్గాయి. ఇవి దాదాపు రెండేళ్లుగా పేరుకుపోయి ఉండటంతో, కాంట్రాక్టర్లు స్టేట్ రోడ్ల పనులంటేనే వెనకడుగు వేస్తున్నారు.
ఏడున్నరేళ్లలో ఇలా
►తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 7,180 కి.మీ రెండు వరసల రోడ్లను నిర్మించారు.
►321 కి.మీ. మేర నాలుగు వరసల రోడ్ల నిర్మాణం జరిగింది.
►39 కి.మీ. మేర ఆరు వరసల రోడ్లు రూపొందాయి.
►430 వంతెనలు కొత్తగాఏర్పడ్డాయి
ఆ రోడ్లతో బంతాట..
పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలో ఉన్న కొన్ని రోడ్లు అభివృద్ధి చేసే క్రమంలో గతంలో రోడ్లు, భవనాల శాఖకు బదిలీ అయ్యాయి. అలా విడతల వారీగా 6 వేల కి.మీ. రోడ్లను అప్పగించారు. ఈ రోడ్లను రాష్ట్ర రహదారుల స్థాయికి తేవాలంటే రూ.5 వేల కోట్లు కావాలని లెక్కలేశారు. చేపట్టిన పనులే పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో, ఈ రోడ్లను ఇక ముట్టుకునేందుకు కూడా జంకుతున్నారు. వీలైతే తిరిగి పంచాయతీరాజ్ శాఖకు అప్పగించేందుకు రోడ్లు భవనాల శాఖ సిద్ధంగా ఉంది.
పేరుకే స్టేట్ రోడ్లు..
జాతీయ రహదారుల తర్వాత రాష్ట్ర రహదారులు విశాలంగా, అనువుగా ఉంటాయి. అలా రాష్ట్ర రహదారుల జాబితాలో ఉండి కూడా కనీసం కంకర రాయి కూడా పడని కచ్చా మట్టి రోడ్లు ఏకంగా 719 కి.మీ. మేర ఉండటం పరిస్థితిని స్పష్టం చేస్తోంది. వీటిపై తొలుత కంకరపరిచి మెటల్ రోడ్లుగా మార్చాలి. ఆ తర్వాత తారు రోడ్ల స్థాయికి తేవాలి. ఇక కంకర పరిచి తారు కోసం ఎదురుచూస్తున్న రోడ్ల నిడివి 615 కి.మీ మేర ఉంది. వెరసి స్టేట్ రోడ్ల జాబితాలో ఉన్నప్పటికీ ఇంకా 1,330 కి.మీ మేర కచ్చా రోడ్లే ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment