సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీర్లు సంప్రదాయ పద్ధతిలో కాకుండా చైతన్యవంతంగా, విభిన్నంగా ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని నిరంతరం సమీక్షించాలి. వానలు, వరదలకు పాడైన రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. రోడ్లు చెక్కు చెదరకుండా అద్దాల్లా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణ, నిర్వహణ చేపట్టాల్సిన బాధ్యత ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలదే..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి వారంలో కార్యాచరణ ప్రారంభించాలని.. వచ్చేనెల రెండో వారంలోగా టెండర్లు పూర్తి కావాలని ఆదేశించారు.
వానలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలపై కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ తరహాలోనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకుని రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు ఎక్కడెక్కడ, ఏమూలన పాడయ్యాయో సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్ల వద్ద పూర్తి వివరాలు ఉండాలని చెప్పారు.
ఆర్‌అండ్‌బీ శాఖ పునర్వ్యవస్థీకరణ
రాష్ట్రంలో గుణాత్మక ప్రగతికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో కావాల్సినంత సిబ్బందిని నియమించుకుని, బాధ్యతల వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇతర శాఖల తరహాలోనే ఆర్‌అండ్‌బీలో సైతం ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ)ల విధానాన్ని తీసుకురావాలన్నారు. ఐదారు ఆసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక ఈఎన్‌సీ ఉండాలని, టెరిటోరియల్ సీఈలను కూడా నియమించాలని సూచించారు. సమర్థవంతంగా పనిచేయడానికి ఎస్‌ఈలు, ఈఈలు ఎంత మంది ఉండాలో ఆలోచన చేయాలన్నారు. సమర్థవంతంగా పర్యవేక్షణ ఉండేలా పని విభజన జరగాలని.. ఆ దిశగా సమీక్ష జరిపి తుది నివేదిక ఇస్తే తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇక ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సమావేశంలో చర్చించారు. ‘బాధ్యతల పునర్విభజన; వానలు, వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, నిర్వహణ; మరమ్మతులు, ఇతర పనులపై సత్వర నిర్ణయం; వెంటనే పనులు చేపట్టేదిశగా కిందిస్థాయి ఇంజనీర్లకు నిధుల కేటాయింపు..’ వంటి వ్యూహాలను అవలంబించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇంజనీర్లు ఎక్కడికక్కడ రోడ్లను విభజించుకుని పని విభజన చేసుకోవాలన్నారు.
కేజ్ వీల్స్‌పై ఇక కఠినంగా..
గ్రామాల్లో ట్రాక్టర్లను కేజ్ వీల్స్‌తో నడుపుతుండడంతో రోడ్లు పాడవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఇలా చేయకుండా రైతులు, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లను చైతన్యవంతం చేయాలని, అవసరమైతే కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. అటవీ భూములు అడ్డం రావడంతో రోడ్ల నిర్మాణం ఆగిపోతే.. ఆ శాఖతో సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. రోడ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి చేసుకోవాలని, తద్వారా సమయం ఆదా చేయడంతోపాటు, నాణ్యతను కాపాడుకోవచ్చని చెప్పారు.
క్షేత్రస్థాయి ఇంజనీర్లకు స్వీయ విచక్షణ నిధులు
నీటి పారుదల శాఖ తరహాలోనే రోడ్ల మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బీ శాఖకు కూడా మెయింటెనెన్స్ నిధులు పెంచినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు ప్రతి చిన్నపనికి హైదరాబాద్‌కు వచ్చి సమయం వృథా చేసుకోవద్దని.. వారి స్థాయిని బట్టి స్వీయ విచక్షణతో ఖర్చు చేసేలా నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుందని చెప్పారు. స్వీయ విచక్షణతో ఖర్చు చేసేందుకు డీఈఈ, ఈఈ, ఎస్‌ఈ స్థాయి అధికారులకు ఎన్ని నిధులు కేటాయించాలో సిఫార్సు చేయాలని సీఎం సూచించారు. రోడ్ల నిర్వహణ సమర్థవంతంగా జరగాలంటే ఏ స్థాయి ఇంజనీర్లకు బాధ్యతలు అప్పగించాలో తేల్చాలని కోరారు.
పటిష్టంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణం
రాష్ట్రంలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను పటిష్టంగా నిర్మించాలని ఆర్‌అండ్‌బీ శాఖను సీఎం ఆదేశించారు. వరంగల్, హైదరాబాద్‌లలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈఎన్టీ, డెంటల్, ఆప్తాల్మాలజీ విభాగాలకు ఒక అంతస్తును కేటాయించాలని సూచించారు. ఈ మేరకు ఆయా ఆస్పత్రుల డిజైన్లను పరిశీలించి పలు మార్పులను సూచించారు. అన్ని విభాగాలకు ప్రత్యేక వసతులతో ఎత్తైన భవనాలను నిర్మించాలని కోరారు. వైద్య విద్యార్థులు, ప్రజలకు సౌకర్యవంతంగా ఆస్పత్రులు ఉండాలన్నారు. కార్పొరేట్‌కు ధీటుగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉండాలన్నారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష జరపడం గమనార్హం.
ఇదీ చదవండి: బుల్లెట్ ప్రూఫ్‌తో సీఎం ఛాంబర్.. అత్యాధునిక హంగులతో నూతన సచివాలయం
Comments
Please login to add a commentAdd a comment