కుల ధ్రువీకరణ పత్రానికి ఓ రేటు.. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌కు మరోరేటు.. ఇంటి పట్టా పొందాలంటే ఇంకో రేటు.. ప్రభుత్వ భూమిని సాగుకు కేటాయించాలన్నా... ఫ్యామిలీ మెంబర్స్‌సర్టిఫికెట్ కావాలన్నా....ప్రతి పనికీ ఓ రేటు..ఇది రెవెన్యూ శాఖలో సర్వసాధారణమై పోయింది. కొందరు అధికారులు..ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని అందినకాడికి దండు కుంటున్నారు. ఏ స్థాయిలో అంటే కోట్ల రూపాయలు కూడబెట్టేంతగా! ఈ విషయం ఎవరో చెప్పింది కాదు..సాక్షాత్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులే ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాలో ఐదుగురు తహసీల్దార్లు రూ. 10 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ జాబితా స్పష్టం చేస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్):
రెవెన్యూ..ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వ శాఖల్లో కీలకమైనది. అవినీతి అక్రమాల్లోనూ ఈ శాఖ అగ్రస్థానాన్ని సంపాదించుకుంది. ఏసీబీ అధికారులు రూపొందించిన జాబితా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. గ్రామ స్థాయిలో పనిచేసే వీఆర్‌ఓల నుంచి మండల స్థాయిలో పనిచేసే తహసీల్దార్ల వరకు కొందరు.. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. గత ఐదేళ్లుగా లంచాలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన వారిలో రెవెన్యూ అధికారులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
మేము సైతం సర్వేయర్లూ
ఇటీవల ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన అధికారుల జాబితా తయారు చేశారు. ఈ జాబితాను ప్రభుత్వానికి కూడా పంపారు. 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 65 మంది ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఇందులో రెవెన్యూ సిబ్బందే సగానికి పైగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో రెవెన్యూ మంత్రే.. ఆ శాఖ అవినీతిపై బాహాటంగా విమర్శలు చేయడం కలకలం రేపింది. రెవెన్యూ అధికారులకు పోటీగా సర్వేయర్లు ఆస్తులు కూడబెట్టుతున్నట్లు సమాచారం.
జిల్లాలో ఐదుగురు తహసీల్దార్లు..
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు కూడ బెట్టిన తహసీల్దార్లు జిల్లాలో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. వీరిలో కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో ఇద్దరు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లో ఇద్దరు, నంద్యాల డివిజన్‌లో ఒక్కరు ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఆస్తులను కటుంబసభ్యుల పేర్లు, బినామీ పేర్లతో కూడబెట్టినట్లు సమాచారం. తహసీల్దార్లు, వీఆర్‌ఓలకు జిల్లాలోనే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం జిల్లాలోను, బెంగళూరులోనూ భూములు, బంగ్లాలు, ప్లాట్లు ఉన్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
⇔ ప్రస్తుతం ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పనిచేస్తున్న ఇద్దరు తహసీల్దార్లు అవినీతిలో సిద్ధహస్తులు. ఒకరు గతంలో వివిధ పోకల్ స్థానాల్లో పనిచేశారు. ఒకరు ప్రస్తుతం కీలకమైన మండలంలో ఉన్నారు. ఒకరు రెండు చేతులా సంపాదిస్తునే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కర్నూలు, అనంతపురం, బెంగళూరుల్లో ఆస్తులు కూడబెడుతున్నట్లు సమాచారం.
⇔ కర్నూలు డివిజన్‌లో పనిచేసే ఓ తహసీల్దారు బినామి పేర్లతో ప్రభుత్వ భూములను స్వాహా చేవారనే విమర్శలు ఉన్నాయి. ఒక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే మరో వైపు రియల్లర్లతో అంటకాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములను రియల్టర్లకు అప్పగిస్తూ కాసుల పంట పండించుకుంటున్నట్లు సమాచారం. ఈ తహసీల్దారు ఏకంగా రూ.10 కోట్లకు పైగా ఆస్తులు సాంపాదించారని రెవెన్యూలోనే చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మండలంలో పనిచేస్తున్న తహసీల్దారు అక్రమాస్తులను భారీగా కూడ బెట్టినట్లు తెలుస్తోంది. కనీసం రూ.5 కోట్ల విలువ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం.
⇔ నంద్యాల డివిజన్‌లో ఒక తహసీల్దారు అదే డివిజన్‌లోని ఒక పట్టణంలో రూ.2కోట్లకు పైగా విలువ చేసే భవనం నిర్మించారంటే ఆయన ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయనేదానిని అంచనా వేసుకోవచ్చు. మరో తహసీల్దారు కూడ అక్రమంగా ఆస్తులను భారీగానే కూడ బెట్టినట్లు తెలుస్తోంది.
⇔ రెండు కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు ఆస్తులు సంపాదించిన వారు 10 మందికి పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం రోజుకు రూ.2 వేలు జేబులో పడనిదే సీటు వదలని వారు అనేక మంది ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
⇔ ముడుపులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినా, ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో అరెస్ట్ అయిన వారిని తహసీల్దార్లుగా నియమించరాదనే నిబంధనలు ఉన్నాయి. కాని రెవెన్యూలో అటువంటి పట్టించుకున్న దాఖలాలు లేవు. రాజకీయ నేతల అండదండలతో మళ్లీ తహసీల్దార్లుగా వచ్చి.. రెండు చేతులా సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తప్పుడు కులాలకు కులధ్రువీకరణ పత్రాలు ఇస్తున్న ఘనత కూడా వీరికి ఉండటం విశేషం
వీఆర్‌ఓలూ.. అవినీతి ఘనలే....
ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారికి దాదాపు 20 ఏళ్ల క్రితం ఐదెకరాల భూమి ఉంది. ఆ వీఆర్‌ఓ నేడు రూ.10 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆయనకు ఒకే పట్టణంలో రెండు భవంతులు ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. వీఆర్‌ఓలో రూ.10 కోట్లకు పైగా స్థిరాస్తులు కలిగిన వారు 10 మందికిపైగానే ఉండటం గమానార్హం.