
ఉగాది తర్వాత మంచిరోజున అమల్లోకి..
మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత మంచిరోజున భూ భారతి చట్టాన్ని అమల్లోకి తేవడంతో పాటు అదేరోజు భూముల విలువలను కూడా పెంచనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. భూముల విలువలు పెంచాలని గతంలోనే భావించినా.. రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడం, దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వాయిదా వేశామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు పెరుగుతుందని బడ్జెట్‌లో ఎలా చెబుతారన్న ప్రశ్నకు స్పందించారు. ‘రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడం, భూముల విలువల సవరణను అమల్లోకి తీసుకుని వస్తున్నందున ఆదాయం పెరుగుతుంది. భూముల విలువలను మార్కెట్ ధరలకు అనుగుణంగా శాస్త్రీయంగా అధ్యయనం చేసి పెంచాం. అదే సమయంలో మార్కెట్ ధర కంటే ఎక్కువ ఉన్నచోట తగ్గిస్తాం..’అని మంత్రి వివరించారు.
ఐదారు వేలమందికి సర్వేయర్ లైసెన్సులిస్తాం
‘భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సర్వే మ్యాపులను తప్పనిసరి చేయనున్నాం. భూమి విక్రయించే వారు తమ పాస్ పుస్తకంలో ఉన్న భూమి ఆధారంగా సర్వే చేయించి మ్యాపులు జోడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వ్యవసాయ భూములకు, ఆ తర్వాత ప్లాట్లకు అమలు చేస్తాం. సర్వేయర్ల కొరత తీర్చడానికి వెయ్యి మందిని రిక్రూట్ చేసుకుంటాం. ప్రతి మండలంలో సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ని నియమిస్తాం. అలాగే రాష్ట్రంలో ఐదారు వేల మందికి శిక్షణ ఇచ్చి వారికి సర్వేయర్ లైసెన్స్‌లు మంజూరు చేస్తాం.
ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియకుండా ఏర్పాట్లు
రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగే 15 ప్రధాన సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ, స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేస్తాం. క్షేత్రస్థాయిలో ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని పరిష్కరించిన తర్వాత దీనిని రాష్ట్ర వ్యాప్తం చేస్తాం. నాలుగైదు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఒకేచోట చేర్చి కౌంటర్లు పెడ్తాం. ఏ అధికారి రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియకుండా చూస్తాం. టోకెన్ నంబర్లు ఇచ్చి.. ఏ కౌంటర్‌లో నంబర్ వస్తే అక్కడ రిజిస్ట్రేషన్ జరిగేలా చేస్తాం. దీనివల్ల అవినీతి తగ్గుతుంది. ఇదివరకు ప్రకటించినట్లు ధరణిపై ఫోరెన్సిక్ అడిట్ నిర్వహిస్తాం. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న దాదాపు 12 లక్షల సాదా బైనామాలను మాత్రమే పరిష్కరిస్తాం..’అని పొంగులేటి చెప్పారు.
గ్రామ పరిపాలన అధికారులకు పరీక్ష
‘రాష్ట్రంలో 10,956 వీఆర్‌వో పోస్టులను మంజూరు చేశాం. ప్రస్తుతం వివిధ డిపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న వీఆర్‌వో, వీఆర్‌ఏలను ఈ పోస్టుల్లో నియమించడానికి ఇంటర్ అర్హతగా నిర్వహించే రాత పరీక్షకు 2,3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ అర్హత ఉన్నవారు 6 వేల మంది వరకు ఉంటారు. వారిలో ఉత్తీర్ణత సాధించిన వారిని సర్దుబాటు చేస్తాం. మిగిలిన వారిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తాం. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను మార్చి 31 తరువాత పొడిగించే యోచన ప్రస్తుతానికి లేదు’అని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment