సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడో నెలలోనూ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ. 1,000 కోట్లకుపైగా వెనుకబడి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. గత 3 నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటోంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ఆందోళన చెందుతోంది.
అన్ని జిల్లాల్లోనూ అదే వరుస..
అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య, రాబడి తగ్గింది. గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు 400 లావాదేవీలు తగ్గాయన్న మాట. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం గమనార్హం.
ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఈ జిల్లాలో సుమారు 1,600 లావాదేవీలు కూడా తగ్గాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ లాంటి జిల్లాల్లోనూ లావాదేవీల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్‌లో ‘హైడ్రా’అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు.
మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
Published Mon, Nov 4 2024 6:11 AM | Last Updated on Mon, Nov 4 2024 1:12 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment