Land Value
-
చంద్రబాబు సర్కారు మరో భారీ బాదుడు
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రజలకు మరో పిడుగులాంటి వార్త. ఇప్పటికే కరెంట్ ఛార్జీలతో ఎడాపెడా బాదేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఇప్పుడు మరో భారీ బాదుడుకు కొరడా ఝుళిపిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధంచేసింది. తద్వారా ప్రజల నెత్తిన మోయలేని భారాన్ని మోపేందుకు చకచకా ఏర్పాట్లుచేస్తోంది. సాధారణ రివిజన్లో భాగంగా 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని పైకి చెబుతున్నా దానికన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేలా భూముల విలువలను సవరించేందుకు చాపకింద నీరులా కసరత్తు జరుగుతోంది.భూముల క్లాసిఫికేషన్ల ప్రకారం కాకుండా వాటిని మార్చి అందులో రెండో విలువను జోడించడం ద్వారా దొడ్డిదారిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎత్తుగడ వేశారు. ఇందుకోసం కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో భూములను పలు రకాలుగా వర్గీకరించారు. వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమి.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారుల ఆనుకుని ఉన్న భూమి.. ఇలా పలు రకాలుగా విభజించారు. ఉదా.. ఒక ఏరియాలో మెట్ట భూముల విలువ రూ.5 లక్షలుగా, మాగాణి భూముల విలువ రూ.10 లక్షలుగా నిర్థారిస్తారు. ఎప్పుడైనా మార్కెట్ విలువలను వాటి ప్రకారమే పెంచడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్లను మారుస్తున్నారు.రూ.5 లక్షలున్న మెట్ట భూమిలో ఒకచోట రూ.5 లక్షలు, దీని పక్కనే ఉన్న దానికి రూ.7 లక్షలు నిర్ణయిస్తున్నారు. అంటే.. ప్రతీ క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటును ప్రవేశపెడుతున్నారు. అలాగే, జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపలున్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో పెడుతున్నారు. దీనికి కొత్తగా ‘లేయర్’ విధానమని పేరు పెట్టారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకుని ఉన్న భూమికి మరో రేటు, వాటి వెనకున్న వాటికి మరో రేటు నిర్ణయిస్తున్నారు.అలాగే, అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒక రేటు, సందుల్లో వాటి వెనుకున్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. ఇక వాణిజ్య స్థలాలకు సంబంధించిన క్లాసిఫికేషన్లను రకరకాలుగా మార్చి గ్రిడ్లు, లేయర్లు పెడుతున్నారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతీదాని రేటును మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచుతున్నారు.50–60 శాతం పెరిగే అవకాశం..ఇలా చేయడంవల్ల ప్రజల నెత్తిన మోయలేని భారం పడనుంది. దాదాపు ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి. ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలకు రెక్కలు రానున్నాయి. దీంతో.. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు 50–60 శాతం పెరగనుండడంతో క్రయవిక్రయాలు జరిగినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీల వడ్డన భారీగా ఉండనుంది. పైకి మాత్రం ఇది కేవలం 20 శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని చెబుతున్నా క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా ఈ బాదుడు భారీగా ఉండనుంది.అన్ని జిల్లాల్లో దాదాపు కసరత్తు పూర్తి..ఇక ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే అన్ని జిల్లాల్లో చాలావరకు పూర్తయింది. రెండు నెలలుగా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లతో వారం, వారం సమీక్షలు జరిపి ఎలా చేయాలి, ఎంత పెంచాలో దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామ, ఏరియా మ్యాప్ తీసుకుని దాని ఆధారంగా రేట్లు పెంచేశారు. గ్రిడ్లు, లేయర్ల విధానంవల్ల కొన్నిచోట్ల ఇబ్బంది వస్తుందని కిందిస్థాయిలో అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయలేదు. ప్రతీ భూమి విలువను పెంచాలి్సందేనని ఆదేశాలు అందడంతో అందుకనుగుణంగా సబ్ రిజిస్ట్రార్లు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఈ భారం ప్రజలపై వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక ఒక పక్క వర్షాలు, వరదలతో జనం అల్లాడుతుంటే మార్కెట్ విలువలు పెంచడం ద్వారా ప్రజల నెత్తిపై ఇంకా భారాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. -
భూముల విలువల సవరణ ఎప్పుడో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు సంబంధించి ప్రభుత్వ విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న విషయంలో స్పష్టత రావడం లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచే సవరించిన విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ పారదర్శకత పేరుతో థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించడంతో జాప్యం జరుగుతోంది. ఈ ఏజెన్సీ నివేదిక ఇంకా ప్రభుత్వం చేతికి రాలేదని తెలుస్తోంది.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం నవంబర్ నెలలోనే సవరించిన విలువలను అమల్లోకి తేవాలనే యోచనలో ఉన్నా.. థర్డ్ పార్టీ నివేదిక ఎప్పుడు వస్తుందన్న దానిపైనే సాధ్యాసాధ్యాలు ఆధారపడి ఉన్నాయని చెపుతున్నారు. మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉన్నందున భూముల ధరలు పెంచడం వల్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశముందన్న అంచనాల నేపథ్యంలో ఆ ఎన్నికలు పూర్తయ్యేవరకు భూముల విలువల సవరణ అమల్లోకి రాదనే వాదన కూడా వినిపిస్తోంది. నాలుగు నెలల క్రితం.. వాస్తవానికి, భూముల విలువల సవరణ కార్యక్రమాన్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏడాది జూన్ 14వ తేదీన ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి సవరించిన విలువలు అందుబాటులోకి రావాల్సి ఉంది. షెడ్యూల్ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు తమ కసరత్తు పూర్తి చేశాయి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను బట్టి భూముల విలువలను సవరిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి.అయితే, ఈ ప్రతిపాదనల మేరకు విలువలు సవరించకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీకి ఈ కసరత్తు బాధ్యతలను అప్పగించింది. ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కసరత్తు ఎంత వరకు వచి్చందన్నది అంతుపట్టడం లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలే చెబుతున్నాయి. అసలు ఎప్పుడు నివేదిక ఇస్తుందన్న దానిపై స్పష్టత రావడం లేదని, నివేదిక వచ్చిన తర్వాత కూడా మరోమారు అధికారికంగా ప్రతిపాదనలు చేసి కమిటీల ఆమోదానికి సమయం తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో విలువల సవరణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై తామేమీ చెప్పలేమని ఆ వర్గాలు అంటున్నాయి. -
సిటీ ‘రియల్’ మార్కెట్ ఢమాల్
వరుస ఎన్నికలు, ప్రభుత్వ మార్పు, భూమి విలువల సవరణ, కరువు ఛాయలు, ఆర్థిక మందగమనం, బ్యాంకు రుణవడ్డీ రేట్ల భారం.. వెరసి రియల్ ఎస్టేట్ రంగంపై ముప్పేట దాడి జరుగుతోంది. దీంతో గ్రేటర్హైదరాబాద్ పరిధిలో స్థిరాస్తి క్రయవిక్రయాలు పడిపోయాయి. గత ఏడాది చివర్లో శాసనసభ ఎన్నికలతో మొదలైన ప్రతికూల పరిస్థితి క్రమంగా తారస్థాయికి చేరింది. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా.. స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే పాలసీలు, నిర్ణయాలపై ఎలాంటి స్పష్టత లేకపోయే సరికి పరిశ్రమ నిరాశలోకి జారిపోయింది.- సాక్షి,హైదరాబాద్రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టతసాధారణంగా ఎన్నికలకు ఆరేడు నెలల ముందు నుంచే స్థిరాస్తి మార్కెట్ క్రమంగా తగ్గుతూ ఉంటుంది. నగదు లభ్యత,లావాదేవీలపై పరిమితులు, వడ్డీ రేట్ల ప్రభావం, డిమాండ్–సరఫరా మధ్య వ్యత్యాసం వంటివి స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపిస్తాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా.. ఇప్పటికీ విధానాలు, పాలసీల అమలుపై స్పష్టత కొరవడింది. ఔటర్ వరకూ జీహెచ్ఎంసీ విస్తరణ, మెగా మాస్టర్ ప్లాన్, మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, 111 జీవో రద్దు వంటి పలు కీలక ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటన్నది తేలడం లేదు. దీంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి.రిజిస్ట్రేషన్లపై లెక్కలు చూస్తే..2022 జనవరి–జూన్ మధ్యలో గ్రేటర్లో మొత్తం 2,48,817 స్థిరాస్తి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.4,108 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది ఇదే సమయంలో 2,32,628 డాక్యుమెంట్లే రిజిస్ట్రేషన్ అయి.. ఆదాయం రూ.3,920 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు 2,18,749కు పడిపోయాయి. అంటే 2022తో పోలిస్తే 30 వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.మేడ్చల్, రంగారెడ్డి పరిధిలో తగ్గుదలసాధారణంగా గ్రేటర్ పరిధిలో మేడ్చల్–మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కానీ గత రెండేళ్లుగా ఈ జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం తగ్గుతూ వస్తున్నాయి.హైదరాబాద్జిల్లా పరిధిలో గత ఏడాది తొలి ఆరు నెలల్లో 30,814 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. రూ.758.13 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది అదే సమయంలో రిజిస్ట్రేషన్లు 30,111 డాక్యుమెంట్లకు, ఆదాయం రూ.731.15 కోట్లకు తగ్గాయి. అలాగే మేడ్చల్‌లో డాక్యుమెంట్లు 83,742 నుంచి 75,068కు, రంగారెడ్డిలో 1,18,072 నుంచి 1,13,570కు తగ్గాయి.లే–ఆఫ్‌లు, ధరల పెరుగుదలా కారణమే..గ్రేటర్లో గృహాలు, ఆఫీసు స్పేస్ వ్యాపారం ఎక్కువ శాతం ఐటీ కంపెనీలు, ఉద్యోగుల మీద ఆధారపడి ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనంతోపాటు ఐటీ రంగంలో లే–ఆఫ్‌లు జరుగుతున్నాయి. కంపెనీలు కూడా విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తున్నాయి. ఇది ఐటీ కంపెనీలు, ఉద్యోగులపై ప్రభావం చూపడంతో.. గ్రేటర్లో స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా మారింది. మరోవైపు కరోనా తర్వాత సిమెంట్, స్టీలు వంటి నిర్మాణ సామగ్రి ధరలు రెట్టింపయ్యాయి. దీంతో డెవలపర్లు అపార్ట్మెంట్ల ధరలను పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనలేని స్థితిలో ఉన్నారు.కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారుసాధారణంగా హైదరాబాద్‌లో మధ్యతరగతి గృహాల మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరడంతో మార్కెట్ ఎలా ఉంటుందోఅన్న సందేహాలు ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి స్థిరాస్తి రంగం బాగుంటుంది. – ఇంద్రసేనారెడ్డి,గిరిధారి హోమ్స్ ఎండీ -
రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గిద్దామా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న 7.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును ఒక శాతంమేర తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై నివేదిక సమ ర్పించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారు లను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికా రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫీజు తగ్గింపు అంశం చర్చకు వచ్చింది. ఎలాగూ భూముల «విలువలను సవరిస్తున్నందున సామాన్య ప్రజలపై భారం పడకుండా ఒక శాతం ఫీజు తగ్గిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని చర్చించినట్లు సమాచారం.రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతిబుద్ధ ప్రకాశ్‌లతో పాటు పలువురు డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు, భూముల విలువల సవరణ, కొత్త సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణం, బదిలీలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లా డుతూ సామాన్యుడిపై భారం పడకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించాలని, బహిరంగ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా ఈ సవరణ చేపట్టాలని సూచించారు.వచ్చే వారంలోపు సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా సబ్రిజిస్ట్రార్లు పనిచేయాలని మంత్రి సూచించారు. త్వరలోనే శాఖ పరిధిలో బదిలీలు జరగనున్నా యని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తా మని, బది లీల కోసం ఎవరూ తన వద్దకు రావ ద్దని, పైరవీలు చేసే వారిపై చర్యలు తీసుకుంటా నని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. ఇక, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి చెట్ల కింద వేచి ఉండే పరిస్థితులు ఉండకూడదని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని హంగులతో శాశ్వతంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు భవనాలు నిర్మించే ప్ర క్రియను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు. సచివాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
నిర్ణయమే మిగిలింది.. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణ కసరత్తు క్షేత్ర స్థాయిలో పూర్తయింది. గత నెల 18వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీసుకునే తుది నిర్ణయం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురుచూస్తోంది. క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను కొత్త కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో కలిసి సమీక్షించారని, అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రతిపాదించిన కనిష్ట, గరిష్ట విలువలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీలున్నంత త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ విలువల ప్రతిపాదనలను వివరిస్తామని, ఆ తర్వాత రెవెన్యూ మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కావాల్సి ఉందని, ఆ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం పూర్తి కాగానే మిగిలిన షెడ్యూల్ మేరకు ముందుకెళతామని, క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, శాఖా పరమైన సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే సవరించిన విలువలను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువలను ఒకేసారి సవరించారు. అప్పుడు క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేయకుండా, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం విలువలు నిర్ణయించారు. కాగా ప్రభుత్వం మరోసారి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణకు నిర్ణయం తీసుకోవడంతో..గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారమే క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభమైంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు (ఖాళీ నివాస స్థలాలు), ఆస్తుల (అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు) విలువలను క్షేత్రస్థాయిలో ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ విలువల కసరత్తు జరిగింది. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉందో చూసి అందులో సగం మేరకు విలువలను సవరించే ప్రయత్నం జరిగింది. మూడు కేటగిరీల్లో నిర్ధారణ వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరిల్లో నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ఒక విలువ, వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూములకు ఇంకో విలువ, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు మరో విలువను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలు మినహాయించి వ్యవసాయ భూమి కనిష్ట విలువ రూ.5 లక్షలుగా ప్రతిపాదించారు. ఆపై రూ.50 లక్షల వరకు వ్యవసాయ భూముల విలువలను ప్రతిపాదించగా, వెంచర్లకు సిద్ధంగా ఉన్న భూములు, హైవేల పక్కన ఉండే భూములను అక్కడి విలువల ప్రాతిపదికన రూ.40 లక్షల నుంచి 2.90 కోట్ల వరకు ప్రతిపాదించారు. ఈ విలువల మేరకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇక నివాస స్థలాల చదరపు గజం కనీసం రూ.500, అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీసం రూ.1000గా ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయం లేకుండానే..? క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ఈనెల ఒకటో తేదీ నుంచే సవరించిన విలువల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన విలువలపై ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై సమీక్ష చేసిన అనంతరం తుది విలువలను నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను ఆన్లైన్లో పెట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నా సమయం సరిపోయేలా లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే గడువును కుదిస్తారని లేదంటే ఈసారి కూడా ప్రజాభిప్రాయం లేకుండానే తుది విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. -
టార్గెట్ రూ.5,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ వర్గాలతో రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ప్రాథమిక స్థాయి సమావేశాలను పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో భూములు, ఆస్తుల విలువలను పెంచడం ద్వారా 20 నుంచి 35 శాతం వరకు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరే అవకాశముందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ద్వారా రూ.3,500 కోట్ల నుంచి రూ.5వేల కోట్ల వరకు ఆదాయం పెరగొచ్చని రిజి్రస్టేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. గజం రూ.1,000... ఎకరం రూ. 4లక్షలు పెంపు! రాష్ట్రంలో ప్రస్తుతం చేస్తున్న సవరణ ప్రక్రియ అనంతరం గజం నివాస స్థలం విలువ కనీసం రూ.1,000 పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు కనీస విలువతో పట్టణ ప్రాంతాల్లో నివాస స్థలాల విలువల పెంపు ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రభుత్వ వర్గాల ద్వారా రిజి్రస్టేషన్ల శాఖకు మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. ఇక, ఎకరం వ్యవసాయ భూమి కనీస విలువ ఏ మేరకు సవరించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లోని వ్యవసాయ భూముల బహిరంగ మార్కెట్ విలువ ఎంతుందన్న దానిపై రెవెన్యూ వర్గాలతో చర్చించిన అనంతరం దీనిపై ఓ అంచనాకు రానున్నారు. అయితే, రిజి్రస్టేషన్ల శాఖ అంచనా ప్రకారం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త విలువల ప్రకారం రాష్ట్రంలో ఎకరం వ్యవసాయ భూమి విలువ రూ.4 లక్షల వరకు పెరగనుందని తెలుస్తోంది. ఇక, విలువల సవరణ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, నివాస, వాణిజ్య సముదాయాలను కేటగిరీలుగా తీసుకోనున్నారు. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న నివాస, వాణిజ్య సముదాయాల ప్రభుత్వ విలువలను 100 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29 కల్లా కమిటీల సంతకాలు విలువల సవరణ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నాటికి అన్ని రకాల భూములు, ఆస్తుల విలువల పెంపుపై సవరణ కమిటీలు సంతకాలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జేసీ, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజిస్ట్రార్లతో; పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో; హెచ్ఎండీఏ పరిధిలో కమిషనర్, ఆర్డీవో, ఎమ్మార్వో, సబ్రిజి్రస్టార్లతో విలువల సవరణ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సంతకాలు చేసిన అనంతరం ప్రతిపాదిత విలువలను ఆన్లైన్లో ఉంచి 15 రోజులపాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకుని జూలై 24 కల్లా విలువల సవరణకు తుదిరూపు ఇవ్వనున్నారు. ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరించి ఆగస్టు 1 నుంచి కొత్త విలువలను అమలు చేయనున్నారు. -
TG: ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా... ⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి. ⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి. ⇒ సబ్రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి. ⇒ బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి. ⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్‌కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు. ⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇలా... ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి. ⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్ నంబర్ల వివరాలను ఫామ్–2లో పొందుపరచాలి. ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్‌లుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి. ⇒ గ్రౌండ్ ఫ్లోర్, ఇతర ఫ్లోర్లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి. సాధారణ మార్గదర్శకాలు: ⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.) –గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి. ⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్ అభివృద్ధి మ్యాప్‌లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్ప్లాన్లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది. -
20% గ్రామాల్లోనే స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో మాత్రమే స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 80 శాతం గ్రామాల్లో మార్కెట్ విలువలను సవరించడం లేదు. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించనున్నారు. అదికూడా ఆయా ప్రాంతాల్లో పెరిగిన భూముల విలువలను బట్టి స్వల్పంగానే సవరించాలని నిర్ణయించారు. ఈ సవరణ 10 నుంచి 30 శాతం లోపే ఉండనుంది. రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో పెరిగిన మార్కెట్ విలువను అక్కడి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖాధికారుల కమిటీలు నిర్థారించాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్ ఏరియాల్లో రిజిస్టర్ విలువలకు, మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ జిల్లాల్లో భారీగా మార్కెట్ విలువ పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్ విలువల, రిజిస్టర్ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్ ఏరియాల్లోనే మార్కెట్ విలువల్ని సవరించనున్నారు. ఈ ఏడాది సవరణలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ 1వ తేదీ నుంచి మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. కమిటీల ప్రతిపాదనలు ఇలా.. సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరిస్తుంది. మూడేళ్లుగా కరోనా ఇతర కారణాల రాష్ట్రంలో పూర్తిస్థాయి సవరణ చేపట్టలేదు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక సవరణ నిర్వహించింది. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ రివిజన్ చేపట్టింది. అర్బన్ ఏరియాల్లో జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా.. మునిసిపల్ కమిషనర్/వుడా/సీఆర్డీఏ అధికారులు, సంబంధిత ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా ఉండే కమిటీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే దానిపై పరిశీలన జరిపాయి. గ్రామాల్లో ఆర్డీవోలు కన్వీనర్లుగా.. జిల్లా పరిషత్ సీఈవో, సంబంధిత ఎండీపీడీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లతో ఏర్పడిన కమిటీలు ఆయా ప్రాంతాల్లోన్ని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే విషయాన్ని పరిశీలించాయి. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గడచిన ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగిన పట్టణ ప్రాంతాలు, గ్రామాలను ఈ కమిటీలు గుర్తించాయి. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి (ఏదైనా పరిశ్రమ, సంస్థ రావడం, హైవేలు, ప్రధాన రహదారులు ఏర్పాటు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వంటి అనేక కారణాలు) అనే వివరాలను కమిటీలు సేకరించాయి. ఆయా కారణాలను విశ్లేషిస్తూ.. లావాదేవీలు ఎక్కువ జరుగుతున్న సర్వే నంబర్లను బట్టి మార్కెట్ విలువలను ప్రతిపాదించాయి. ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న 20 శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీవోల ఆధ్వర్యంలోని కమిటీలు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రతిపాదనలు పంపించగా.. వాటిని ఉన్నతాధికారులు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించారు. -
సర్కారు ‘పాట’ పాడే.. ఖాళీ స్థలాల వేలంతో ‘ప్రైవేటు’లో కొండెక్కిన ధరలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలో ప్లాట్ల ధరలు కొండెక్కాయి. జిల్లాల పునరి్వభజన తర్వాత కొత్త జిల్లా కేంద్రాలలో స్థలాల ధర బాగా పెరిగిపోగా.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు, రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంతో మరింతగా మండిపోతున్నాయి. వేలం కారణంగా ప్రభుత్వ స్థలాలకు ధరలు ఎక్కువగా వస్తుండటంతో.. చుట్టుపక్కల ప్రైవేటు వెంచర్ల యజమానులు, రియల్టర్లు ధరలను అడ్డగోలుగా పెంచేశారు. కొద్దినెలల కిందటి వరకు కొత్త జిల్లా కేంద్రాల సమీపంలోని గ్రామాల్లో రియల్టర్లు వెంచర్లు చేసి.. డిమాండ్‌ను బట్టి చదరపు గజానికి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించారు. ఇప్పుడు అదేచోట గజానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచేశారు. దీనితో స్థలం కొనుగోలు చేయాలనుకున్న పేద, మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు. సర్కారీ వేలంతో..: ఉమ్మడి ఏపీలో 15ఏళ్ల క్రితం ‘రాజీవ్ స్వగృహ’పేరిట వెంచర్లు చేసిన భూములను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్లాట్లుగా చేసి వేలానికి పెట్టింది. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల లేఅవుట్లతో కూడిన ప్లాట్లు కావడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. మారుమూల పట్టణాల శివార్లలో సైతం గజం రూ.8వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేశారు. ఈ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద పడింది. ప్రైవేటు వెంచర్ల యజమానులు సైతం ప్లాట్ల ధరలను పెంచేశారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో ఉన్న భూముల ధరలు ఏడాదిలోనే రెట్టింపుకావడం గమనార్హం. 9 జిల్లాల్లో భారీ స్పందన ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన 1,408 ప్లాట్లను వేలానికి పెట్టారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేలానికి భారీ స్పందన కనిపించింది. రూ.5 వేలు కనీస అప్సెట్ ధరగా నిర్ణయించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్లలో సైతం గజానికి కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.26 వేలతో కొనుగోళ్లు జరిగాయి. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ ఈ–వేలంలో కీలకంగా వ్యవహరించి భూములకు అధిక ధర రాబట్టాయి. – ఇదే ఉత్సాహంతో తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో దాదాపు పదెకరాల స్థలంలో 600 గజాల నుంచి 1,060 గజాల వరకు విస్తీర్ణమున్న 34 ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న ఆన్లైన్లో ఈ–వేలం ద్వారా విక్రయించే ఈ ప్లాట్లకు కనీస ధరను గజానికి రూ.40 వేలుగా నిర్ణయించారు. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం ఉద్దేశించిన ఈ ప్లాట్లకు భారీగా స్పందన లభిస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ‘స్వగృహ’వేలం తొలుత 1,408 రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వచి్చన స్పందనతో.. రెండో విడతగా మరిన్ని స్థలాల విక్రయానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరీంనగర్‌లోని 237 ప్లాట్లను, భూత్పూర్లో 348 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని చందానగర్‌లో 51 ప్లాట్లు, కవాడిపల్లిలో 117 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. తుర్కయాంజల్‌తో పాటు చందానగర్‌కు కనీస అప్సెట్ ధర రూ.40 వేలుగా నిర్ణయించగా.. కవాడిపల్లిలో రూ.10 వేలకు గజం చొప్పున నిర్ణయించారు. గతంలో తొర్రూర్, బహుదూర్‌పల్లిలలో ప్లాట్ల విక్రయించిన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న డిమాండ్ మేరకు ఈ వేలం ద్వారా అన్ని స్థలాలను అమ్మేయాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. పోచారం, బండ్లగూడల్లో నిర్మించిన రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లలోని 2,971 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీచేయగా.. ఇప్పటికే 30 వేల దరఖాస్తులు వచ్చాయి. 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. వీటి తర్వాత ఖమ్మంలోని 8 టవర్లను కూడా అమ్మకానికి పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ధరలు పెంచిన రియల్టర్లు ధరణి, రిజి్రస్టేషన్ సమస్యలతో 2020–21 మధ్య స్థలాల విక్రయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రియల్టర్లు.. నష్టానికైనా ప్లాట్లను విక్రయించుకోవాలని భావించారు. కానీ కరోనా రెండోవేవ్ తర్వాత ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు సర్కార్ ఈ–వేలం విక్రయాలతో ఉత్సాహంలో ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో ఏడాది క్రితం గజానికి రూ.7 వేల నుంచి రూ.10వేల వరకు రేటుతో భూములను విక్రయించగా.. ఇప్పుడు డీటీసీపీ, హెచ్ఎండీఏ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదం పొందిన వెంచర్లలో ధరలు రెట్టింపు చేశారు. ఇదంతా ‘సర్కారు వారి పాట’పుణ్యమేనని చెప్తున్నారు. రియల్టర్లు పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లలోని ప్లాట్లను చదరపు గజానికి రూ.4–5 వేల మధ్య విక్రయించేవారు. ఇటీవల ఇక్కడ ప్రభుత్వం నిర్వహించిన రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలంలో చదరపు గజానికి రూ.8 వేలు ధర పలికింది. దీనితో రియల్టర్లు ప్రైవేటు వెంచర్లలో ధరలను రూ.12 వేల వరకు పెంచేశారు. స్థలాల ధరలు ఉన్నట్టుండి రెండింతలయ్యాయి... ఇది ఈ ఒక్కచోటే కాదు.. ‘స్వగృహ’ప్లాట్లను వేలం వేసిన మహబూబ్‌నగర్, నల్లగొండ, గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆయా జిల్లాల్లో ధరలు పెరిగిన తీరును చూసి.. మిగతా జిల్లాల్లోనూ రియల్టర్లు ప్లాట్లు/స్థలాల ధరలను పెంచేశారు. అప్పోసొప్పో చేసి ఓ ప్లాటు కొనుక్కుందామనుకున్న పేద, మధ్య తరగతి వారు ఈ ధరలను చూసి కళ్లుతేలేస్తున్నారు. -
111 జీవో ఎత్తివేస్తే.. భూముల ధరలకు రెక్కలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవో 111 ఎత్తివేత ప్రభావం భూముల విలువలపై దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి జీవో 111 ప్రాంతాలపై పడనుండడం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాల భూలావాదేవీలపై ప్రభావం చూపనుంది. ఈ జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. జీవో పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో అప్పుడే భూముల ధరలకు రెక్కలు రాగా అవి చుక్కలనంటుతాయనే చర్చ జరుగుతోంది. శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్ మండలాల్లో ప్రస్తుతం గరిష్టంగా ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతుండగా సమీప భవిష్యత్తులోనే అది రూ.15–20 కోట్ల వరకు పెరగనుందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్న కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగి (ఐటీ కారిడార్) వంటి ప్రాంతాలతో పాటు రాజధాని నలుదిక్కులా ఉండే ఇతర శివార్లలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని అంటున్నారు. అడ్డగోలు ధరలకు తాత్కాలికంగా కళ్లెం జీవో పరిధిలో 84 గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేయడం, సవ రించడం వల్ల ఆ భూములన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూములను చేజిక్కిం చుకుని తమ సంస్థలను నెలకొల్పాలని జాతీయ, అంతర్జాతీయ ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 111 జీవో పరిధిలోని భూ విస్తీర్ణం 538 చ.కి.మీ.గా ఉంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే.. జీవో ఎత్తివేత, సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూవిస్తీర్ణమే అధికం అన్నమాట. న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఓ ప్రణాళిక బద్ధంగా, పర్యావరణహితంగా సరికొత్త మాస్టర్‌ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకెళ్తే..హైదరాబాద్ లాంటి మరో అద్భుత, అహ్లాదకరమైన నగరం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పెద్దయెత్తున భూమి అందుబాటులోకి రానుండటంతో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు తాత్కాలికంగా కళ్లెం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూముల అమ్మకంపై రైతుల్లో పునరాలోచన జీవో కారణంగా ఈ జోన్ పరిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ..గతకొంత కాలంగా ఫాం హౌస్‌ల పేరుతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగానే సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో శిఖం భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 426 లే అవుట్లలో 10,907 ఇళ్లు, గ్రామాల్లో 4,527 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు వెలిశాయి. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అప్పుడప్పుడు స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. ఆగకపోగా మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానికుల డిమాండ్ నేపథ్యంలో ఈ జీఓను ఎత్తి వేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భూములకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడం కంటే..మరికొంత కాలం ఎదురు చూడటమే ఉత్తమని రైతులు భావిస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్న కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ రోజుకు సగటున 10–15 రాస్తే..ప్రస్తుతం ఒకటి, రెండు డాక్యుమెంట్లకే పరిమితమవుతుండటం ఇందుకు నిదర్శనం. -
Hyderabad: పలు ఏరియాల్లో స్థలాల మార్కెట్ విలువ ఎంత పెరిగిందంటే..!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 1 నుంచి రామానాయుడు స్టూడియో వరకు, మహారాజా అగ్రసేన్ చౌరస్తా వరకు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 10, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్: 36, రోడ్ నంబర్: 45, రోడ్ నంబర్: 71, రోడ్ నంబర్: 78, రోడ్ నంబర్: 82, రోడ్ నంబర్: 92లలో కమర్షియల్ స్థలం గజానికి రూ. 93 వేలుగా నిర్ధారించారు. అంతకుముందు ఈ ధర గజానికి రూ. 84,500 ఉండేది. తాజాగా రూ. 7600 ఈ ఫీజు పెరిగింది. జూబ్లీహిల్స్‌లో నివాసిత స్థలాల మార్కెట్ విలువ కూడా పెంచారు. గతంలో ఇక్కడ గజానికి రూ. 58,500 ఉండగా.. తాజాగా పెరిగిన ఫీజు రూ. 64,400కు చేరింది. ఇక ప్రశాసన్‌నగర్‌లో మొన్నటి వరకు గజం స్థలం మార్కెట్ విలువ రూ. 58,500 ఉండగా.. ఇది రూ. 64,400కు పెరిగింది. పంజగుట్ట, శ్రీనగర్ కాలనీ సత్యసాయి రోడ్డులో మార్కెట్ విలువ గజానికి రూ. 78 వేల నుంచి రూ. 85,800లకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 12లోని ఎమ్మెల్యే కాలనీలో గజం రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని నందిహిల్స్, నందగిరిహిల్స్‌లో మార్కెట్ విలువ గజానికి రూ. 58,500 నుంచి రూ. 64,400కు పెరిగింది. జర్నలిస్ట్ కాలనీ సర్కిల్ నుంచి ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు మార్కెట్ విలువ గజానికి రూ. 93 వేలకు పెరిగింది. హుడాహైట్స్‌లో గజం రూ. 64,400కు పెంచారు. శ్రీనగర్‌కాలనీలో గజం మార్కెట్ విలువ రూ. 85,800కు పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో ఆపరేటివ్ సొసైటీలో మార్కెట్ విలువ గజానికి రూ. 64,600కు పెంచారు. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో మార్కెట్ విలువ గజానికి రూ. 64,400కు పెరిగింది. ఓయూకాలనీలో మార్కెట్ విలువ గజానికి రూ. 27,600కు పెరిగింది. గతంలో రూ. 24 వేలు ఉండేది. ఫిలింనగర్లో గజం రూ. 64,400కు పెరిగింది. గతంలో ఇక్కడ రూ. 58,500 ఉండేది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 12లోని ఎన్బీటీనగర్లో గతంలో మార్కెట్ విలువ గజానికి రూ. 54,750 ఉండగా.. తాజాగా పెరిగిన రేటుతో రూ. 60,300కు చేరింది. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్: 14లోని నందినగర్‌లో గజం రూ. 54,750 నుంచి రూ. 60,300లకు పెంచారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 1 పంజగుట్ట చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వరకు గజం మార్కెట్ విలువ రూ. 93 వేలకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 10లో మార్కెట్ విలువ రూ. 93 వేలకు పెంచారు. రోడ్ నంబర్ 11లో రూ. 60,300, రోడ్ నంబర్: 12లో రూ. 93 వేలు, రోడ్ నంబర్: 13లో రూ. 63,300కు పెంచారు. రోడ్ నంబర్: 14 అగ్రసేన్ చౌరస్తాలో రూ. 93 వేలకు పెరిగింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్: 4, 5, 6, 7, 8, 9లలో గజం మార్కెట్ విలువ రూ. 60,300 పెంచారు. షౌకత్నగర్, జహీరానగర్, శ్రీరాంనగర్ సింగాడికుంటలో రూ. 60,300కు పెరిగింది. -
భారీగా పెరిగిన వ్యవసాయ భూముల విలువ.. 42 గ్రామాల్లో 150% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 150 శాతం అంటే రెండున్నర రెట్లు పెరగనున్నాయి. ఈ మేరకు సగటున వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచాలని, కొన్ని గ్రామాల్లో మాత్రం 75, 100, 125, 150 శాతం శ్లాబుల్లో సవరించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ విలువ, అమ్మకపు ధరకు మధ్య ఉన్న తేడా (టైమ్ డిఫరెన్స్ రేంజ్ (టీడీఆర్)ను పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి, రాష్ట్రంలో గతేడాది జూలైకి ముందు ఏడేళ్లపాటు భూముల విలువలు సవరించనందున ప్రభుత్వ విలువలకు, మార్కెట్లో అమ్మకపు ధరకు వ్యత్యాసం భారీగా పెరిగింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుని ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నచోట్ల వ్యవసాయ భూములతో పాటు ఖాళీస్థలాల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కసరత్తు పూర్తిచేసి తుది విలువలను ఖరారుచేసింది. అయితే ఫ్లాట్ల విలువల సవరణ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించిన అధికారులు చాలా తక్కువగా సవరణ ప్రతిపాదనలను ఖరారుచేశారు. తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలుచేసినా రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్ ధరను కూడా పెంచితే ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫ్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 35 శాతం పెంచగా, ఫ్లాట్ల విలువను 25 శాతం మాత్రమే సవరించారు. సమస్యలు రాకుండా నోడల్ అధికారులు సవరించిన విలువలు వచ్చేనెల 1 నుంచే అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయి కమిటీల ఆమోదం వచ్చి ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినందున శనివారం నుంచే విలువల అప్లోడ్పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి అవసరమైతే సోమవారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిలిపివేసి కొత్త విలువల అమలులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రయల్స్ పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. కొత్త విలువల అమల్లో సమస్యలూ రాకుండా చూసేందుకు 33 జిల్లాలకు 33 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇందులో జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. -
సొంతిల్లు భారమే.. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా?
ధరలు పైపైకి... హైదరాబాద్ శివార్లలోని నారాపల్లిలో గతేడాది జూలైలో చదరపు గజం ధర రూ.20 వేలు. 500 గజాల స్థలం కొంటే రూ.కోటి అయ్యేది. దానిపై 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు అంటే రూ.6 లక్షలు చెల్లిస్తే సరిపోయేది. జూలైలో చదరపు గజానికి ధర రూ.30 వేలకు, రిజిస్ట్రేషన్ చార్జీ 7.5 శాతానికి పెంచారు. దానితో 500 గజాల స్థలానికి ధర రూ.1.5 కోట్లకు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.11.25 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు మరోసారి భూముల ధరలను పెంచు తున్నారు. చదరపు గజానికి ధర రూ.45 వేలకు చేరుతుండటంతో.. అదే 500 గజాల స్థలానికి ధర రూ.2.25 కోట్లు, దీనిపై రిజిస్ట్రేషన్ చార్జీ రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► అంటే గతేడాది జూలైకి ముందు 500 గజాలకు రూ.కోటి ధర ఉంటే.. ఇప్పుడు రూ.2.25 కోట్లకు రూ.6 లక్షలున్న రిజిస్ట్రేషన్ చార్జీ ఇప్పుడు రూ.16.85 లక్షలకు పెరుగుతోంది. ► వరంగల్ చౌరస్తా ఏరియాలో గతంలో చదరపు గజానికి రూ.27,500 ధరతో.. 500 గజాలకు రూ.1,37,50,000కు చెల్లిస్తే సరిపోయేది. దానిపై రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8.25 లక్షలు అయ్యేవి. జూలైలో భూముల ధర, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో.. ధర రూ.1,62,50,000 (చదరపు అడుగుకు రూ.32,500 చొప్పున), రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.12,18,750కు (7.5శాతం లెక్కన) చేరాయి. తాజాగా మరోసారి ధరలు పెంచడంతో.. అదే స్థలానికి రూ.2,07,50,000 (చదరపు అడుగు రూ.41,500) ధర, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.15,56,250 చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఆ స్థలానికి ఏడు నెలల కింద మొత్తంగా రూ.1,45,75,000 చెల్లిస్తే.. ఇప్పుడు రూ. 2,23,06,250 అవుతోంది. ..రాష్ట్రవ్యాప్తంగా భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయిన పరిస్థితికి చిన్న ఉదాహరణలివి. ఎప్పటికైనా సొంతిల్లు ఉండాలనే సామాన్యుడికి ఇది అశనిపాతంగా మారుతోంది. ప్రభుత్వం భూముల విలువలను సవరించడంతో.. స్థలాల యజమానులు కూడా రేట్లు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్ల ధరల పరిస్థితిపై ప్రత్యేక కథనం. సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: ఏడు నెలల క్రితమే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింటినీ పెంచిన సర్కారు.. తాజాగా మరోసారి స్థలాల ధరలను సవరించనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ అమల్లోకి రానున్నాయి. ఇలా భూముల విలువలు పెరిగిపోవడం, నిర్మాణ సామగ్రి ధరల భారం కలిసి.. ఇళ్లు, అపార్ట్మెంట్ల ధరలపై ప్రభావం పడింది. భూముల ప్రభుత్వ ధరలకు, మార్కె ట్ విలువకు మధ్య వ్యత్యాసం తగ్గింది. దీనితో స్థలాల యజమానులు భూముల ధరలను పెంచేస్తున్నారు. మరోవైపు కొద్దినెలలుగా సిమెంట్, స్టీల్, ఇసుక వంటి నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావం వల్ల చాలా మంది కార్మికులు సొంత రాష్ట్రాలకు, ఊర్లకు వెళ్లిపోయారు. దానితో నైపుణ్యమున్న కూలీల రెట్లు రెం డింతలు అయ్యాయి. ఇలా పెరిగిన వ్యయంతో అ పార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు భారంగా మారుతున్నా యి. భూముల ధరలు పెరగడం వల్ల అపార్ట్మెంట్ల ధరలు ఒక్కో చదరపు అడుగుకు రూ.500 వరకు పెరుగుతాయని నరెడ్కో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్‌కుమార్ ముమ్మారెడ్డి తెలిపారు. సొంతంగా కట్టుకుందామన్నా.. కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి చాలా మంది సొంత ఇల్లు ఉండాలని భావిస్తున్నారు. కొందరు కట్టిన ఇళ్లు కొనుక్కునే పనిలో పడగా.. చాలా మంది ఇప్పటికే కొనిపెట్టుకున్న స్థలాల్లో ఇంటి నిర్మాణాలపై దృష్టిపెట్టారు. అయితే సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ వస్తువులు వంటి అన్నిరకాల నిర్మాణ సామగ్రి ధరలు 50 శాతానికిపైగానే పెరిగాయి. లేబర్ ఖర్చులైతే రెండింతలయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలూ పెరిగాయి. దీనితో మొత్తం నిర్మాణ వ్యయం మొతెక్కుతోంది. ఇంటీరియర్లు కాకుండా ప్రధాన నిర్మాణాల కోసం.. ఏడాదిన్నర కింద సగటున చదరపు అడుగుకు రూ.1,200 నుంచి రూ.1,400 వరకు వ్యయం అయ్యేది. కాంట్రాక్టర్లు అయితే రూ.1,500–1,600 వరకు చార్జీ చేసేవారు. పెరిగిన ధరలతో సాధారణంగానే ఒక్కో చదరపు అడుగుకు రూ.1,700 వరకు ఖర్చవుతోంది. అదే కాంట్రాక్టర్లు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ చార్జి చేస్తున్నారు. ‘అందుబాటు’ లేకుండా పోతే ఎలా? బ్రాండ్ హైదరాబాద్‌గా వేగంగా ఎదుగుతుండటానికి కారణం.. ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయమేనని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. ధరలు ఇలా పెంచుకుంటూ పోతే.. ఇతర నగరాలకు భాగ్యనగరానికి వ్యత్యాసం ఉండదని.. కంపెనీలు నగరానికి వచ్చే విషయంలో ఇబ్బంది అవుతుందని అంటున్నాయి. కాగా.. భూముల ధరలను పెంచిన ప్రభుత్వం.. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల భారాన్ని ఆరు శాతానికి తగ్గించాలని క్రెడాయ్, ట్రెడా ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను కలిసి కలిసి విజ్ఞప్తి చేశాయి. ఇతర రాష్ట్రాల తరహాలో చార్జీలు తగ్గించాలి రెండేళ్లుగా అనిశ్చిత పరిస్థితులతో నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయని, రియల్ ఎస్టేట్ కంపెనీలకు వ్యయభారం ఎక్కువైంద ని క్రెడాయ్ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖ ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్ర ప్రభుత్వాలు స్టాంపుడ్యూటీని తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ మన రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా భూముల ధరలను, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతున్నారని పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా పెంచలేదు కదా అని కరోనా వంటి అనిశ్చితి సమయంలో రెండుసార్లు సవరించడం సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. భూముల ధరలను పెంచినప్పుడు రిజిస్ట్రేషన్ చార్జీలను సగానికి తగ్గించాలని సూచించారు. అపార్ట్మెంట్లపై ప్రభావం ఇదీ.. ► హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో పాత రేటు ప్రకారం వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు రూ.24 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.1.8 లక్షలు వ్యయం అయ్యేది. ఇప్పుడు కొత్త రేట్లతో అదే అపార్ట్‌మెంట్‌కు ధర రూ.30 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.25 లక్షలకు పెరుగుతున్నాయి. ఇదే పరిమాణమున్న ఫ్లాట్ శంషాబాద్‌లో గతంలో రూ.35 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2.7 లక్షలు ఉంటే.. ఇప్పుడు ధర రూ.45 లక్షలు, చార్జీలు రూ.3,37,500 కట్టాల్సి వస్తోం ది. హైదరాబాద్ వ్యాప్తంగా అంతటా ఇదే పరిస్థితి. పైగా జీఎస్టీ కింద 5 శాతం పన్ను అదనంగా చెల్లించక తప్పదు. ► కరీంనగర్ ప్రకాశం గంజ్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 2 వేలు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 చేశారు. గతంలో 1,500 చదరపు అడుగుల అపార్ట్మెంట్ విలువ రూ. 30లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.1.80 లక్షలుగా ఉండేవి. ఇప్పుడు అదే ఫ్లాట్ విలువ రూ.37.5 లక్షలకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.2,81,250కు చేరాయి. ► ఖమ్మంలో వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు గతంలో మొత్తంగా రూ. 17 లక్షలు ఖర్చయితే.. ఇప్పుడు రూ. 21.5 లక్షలకు చేరుతోంది. జిల్లాల్లో పరిస్థితి ఇదీ.. ► జనగామలోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్ సమీపంలో.. గతేడాది జూలైకి ముందు 1000 గజాల స్థలం రూ.కోటి, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.6 లక్షలు ఉండేవి. జూలైలో, తాజాగా పెరిగిన ధరలు, చార్జీలతో.. ప్రస్తుతం ధర రూ.2 కోట్లకు, రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.15 లక్షలకు చేరుతున్నాయి. ► మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్‌వద్ద గతంలో 200 గజాల స్థలాని కి రూ.47 లక్షలు ధర, రిజిస్ట్రేషన్ చా ర్జీలు రూ.3,52,500అయ్యేవి. ఇప్పు డు పెరిగిన ధరలతో.. అదే స్థలానికి ధర రూ.63.60లక్షలు, చార్జీలు రూ. 4.77 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ► కరీంనగర్‌లోని కోర్టు ఏరియాలో స్థలం ధర గతంలో గజానికి రూ.19,500 ఉండేది. 120 గజాల (గుంట) భూమికి రూ.23,40,000 ధర, రూ.1,40,400 రిజిస్ట్రేషన్చార్జీ అయ్యేవి. ఇప్పుడు గజానికి రూ.26,400 లెక్కన అదే స్థలానికి.. రూ.31,68,000 ధర, రూ. 2,37,600 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి రానుంది. ► నిజామాబాద్ జిల్లాలో భూముల ధరలను 30 శాతం వరకు, అపార్ట్మెంట్ల ధరలను 25 శాతం వరకు పెంచారు. పెరిగిన ధరలపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడుతోంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఎకరానికి రూ.30 లక్షల కనీస ధర ఉండగా రూ.52 లక్షలకు పెంచారు. ► ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీ లో 100 గజాల స్థలానికి గతంలో రూ.8,50,000 ధర, రూ.63,500 రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లిస్తే సరిపోయేది. తాజాగా స్థలం విలువ రూ. 11,50,000కు, రిజిస్ట్రేషన్ చార్జీల భారం రూ.86,250కు చేరుతోంది. -
తెలంగాణలో ఆ 5,925 ప్రాంతాలు.. విలువల మధ్య భారీ వ్యత్యాసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువలకు, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ధరలకు పొంతనే లేదని తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరిపిన పరిశీలనలో ఐదు జిల్లాల్లోని 5,925 ప్రాంతాల్లో ఈ రెండు విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. ఆ శాఖ ఉన్నతాధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ రెండు విలువల మధ్య కనీసం మూడింతల నుంచి 13 రెట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువల సవరణను భారీగానే ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అమ్మకపు విలువకు చాలా తక్కువగానే ప్రభుత్వ విలువను సవరించినా ప్రస్తుతమున్న విలువకు రెట్టింపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల విలువల్లో కూడా రెండింతల వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ విలువలను ప్రతిపాదించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో ఎకరం రూ.24.22 కోట్లు.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలూ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచారు. ఆ తర్వాత హైదర్‌నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్‌ఘాట్‌లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్‌లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు. ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్‌లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి. -
హైదరాబాద్‌లో రూ. 1,14,000.. ములుగులో రూ. 1,700
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ స్థలాల విలువలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌కు, ములుగుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా నిర్ధారించిన గజం భూమి ప్రభుత్వ విలువ మధ్య ఉన్న తేడా..‘భూమికీ ఆకాశానికీ..’ అనే నానుడిని గుర్తుతెస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ నడిబొడ్డున గజం విలువ రూ.1.14 లక్ష లుగా నిర్ధారణ కాగా, ములుగు జిల్లాలో అత్యధి కంగా గజానికి రూ.1,700గా మాత్రమే నిర్ధారిం చారు. అంటే ఈ రెండు ప్రాంతాల నడుమ ఏకంగా 67రెట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రభుత్వ విలువలను జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసి ఆయా జిల్లాలకు పంపింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ములుగు తర్వాత భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.2,400 గజం విలువ కాగా, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, చార్మినార్, నయాపూల్‌లో రూ.1.05 లక్షలుగా ఖరారయిం ది. హైదరాబాద్ దూద్‌బౌలీలో రూ.87,800గా విలువ ఖరారయితే, రంగారెడ్డి జిల్లా మియా పూర్, చందానగర్, రాయ్‌దుర్గ్ లాంటి ప్రాం తాల్లో రూ. 52,700గా నిర్ధారించారు. మరిన్ని ఆసక్తికర విషయాలివే.. ► హైదరాబాద్ దూద్‌బౌలీలో ప్రస్తుతం రూ.65 వేలుగా ఉన్న గజం విలువను రూ.87,800కు పెంచారు. అదే ఇక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 6,200 ఉండగా దాన్ని రూ.7,800 మాత్రమే పెంచారు. ► బంజారాహిల్స్ రోడ్ నం:3, 1, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.84,500 ఉన్న చదరపు గజం విలువను రూ. 1,14,100కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లకు గాను చదరపు అడుగుకు రూ.7,600 ఉండగా దాన్ని రూ.9,500కు పెంచారు. ► మాసాబ్‌ట్యాంక్, క్రాస్‌రోడ్స్, ఎస్ఆర్నగర్, ఖైరతాబాద్ అయోధ్య హోటల్, సంత్ నిరంకారి టూ రవీంద్రభారతి (లక్డీకాపూల్), ఏజీ ఆఫీస్ సర్కిల్ (సైఫాబాద్), అమీర్‌పేట క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట రాజీవ్‌గాంధీ సర్కిల్, ఎర్రగడ్డ థెరెస్సా చర్చి, భరత్‌నగర్ ఫ్లైఓవర్, ఉమేశ్‌చంద్ర విగ్రహం తదితర ప్రాంతాల్లోనూ రూ.1.14 లక్షలుగా చదరపు గజం ఖాళీ స్థలం విలువలను నిర్ధారించారు. ► శ్రీనగర్ కాలనీలో రూ.78 వేలుగా ఉన్న విలువలను చదరపు గజానికి రూ. 1,05,300కు సవరించారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► చార్మినార్ సమీపంలోని నయాపూల్‌లో కూడా ప్రభుత్వ విలువను భారీగానే పెంచారు. ఇక్కడ చదరపు గజానికి ఖాళీ స్థలం ప్రస్తుతం రూ. రూ.78 వేలు ఉండగా, దాన్ని రూ.1.05,300కు పెంచారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, కేశంపేట, చౌదరిగూడ, ఫారూఖ్‌నగర్, కొందుర్గ్, మాడ్గుల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఓ మోస్తరుగానే ధరలు ఖరారు చేశారు. నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ ఎత్తున ధరలు నిర్ధారణ అయ్యాయి. ► సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గజం భూమి విలువను అత్యధికంగా రూ.26,400గా నిర్ధారించగా, హుజూర్నగర్, కోదాడల్లో రూ.17,600, నేరేడుచర్లలో రూ.5,800గా అత్యధిక ధరలను ఖరారు చేశారు. ► యాదాద్రి జిల్లాలో భువనగిరిలో ఎక్కువ ధర ఉండగా, యాదగిరిగుట్టతో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగానే ధరలను ఖరారు చేశారు. -
తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’
Telangana Government: రాష్ట్రంలో వ్యవసాయానికి కీలకమైన సాగునీటి సౌకర్యం, రియల్ ఎస్టేట్ బూమ్ పెరగడానికి అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం నేపథ్యంలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని రాష్ట్ర ఖజనాకు కచ్చితమైన ఆదాయం తెచి్చపెట్టే వనరుగా ప్రభుత్వం మార్చుకుంటోంది. ఏడేళ్ల పాటు భూముల విలువల పెంపుపై దృషి?ట్పట్టని ప్రభుత్వం ఏడెనిమిది నెలల క్రితం భూ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచింది. తాజాగా మరోసారి భూముల విలువలు పెంచేందుకు కసరత్తు దాదాపు పూర్తిచేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురవడంతో.. నల్లధనాన్ని కొద్దిగానైనా అరికట్టే అవకాశాలుంటాయని ఆర్థికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది జూలైలో సవరించిన విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో నెలకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుండగా, తాజాగా భూ విలువల పెంపుతో ప్రతినెలా మరో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1,200 కోట్లుంటుందని, సాలీనా ఇది రూ.15 వేల కోట్లకు చేరుతుందని చెబుతున్నారు. గతేడాది వరకు రిజి్రస్టేషన్ల శాఖ ద్వారా కేవలం రూ.5,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు రాబడులు వచ్చేవని గత నాలుగేళ్లలో జరిగిన లావాదేవీల గణాంకాలు స్పష్టం చే స్తుండగా, తాజా సవరణలు అమల్లోకి వస్తే అది ఏటా రూ.15 వేల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభు త్వ సొంత పన్నుల ఆదాయం ఒక్క స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారానే ఏడాదికి అదనంగా రూ.8,000 కోట్ల వరకు పెరగనుందన్నమాట. ఇప్పటికి రూ.9 వేల కోట్ల పైమాటే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజి్రస్టేషన్ల ఆదాయాన్ని పరిశీలిస్తే జూలైలో ప్రభుత్వ విలువల సవరణకు ముందు మూడు నెలలు కలిపి వచి్చంది కేవలం రూ.1,500 కోట్లపైమాటే. అంటే నెలకు సగటున రూ.500 కోట్లకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవీల ద్వారా ఆదాయం వచి్చంది. కానీ జూలైలో భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు అప్పటివరకు 6 శాతంగా ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెంచారు. అలాగే యూజర్ చార్జీలను కూడా భారీగా పెంచారు. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. జూలైలో ఏకంగా 2.2 లక్షల డాక్యుమెంట్ లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.1,201 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఒక్క ఆగస్టులో మినహా అన్ని నెలల్లోనూ ఆదాయం రూ.1,000 కోట్లకుపైనే వస్తోంది. ఇప్పుడు తాజాగా కేవలం భూముల విలువలను మాత్రమే సవరిస్తుండడంతో నెలకు అదనంగా రూ.200 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘వ్యవసాయ’ఆదాయంలోనూ పెరుగుదల 2021–22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే ఆదాయం క్రమంగా పెరుగుతోందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో రూ.81.93 కోట్లు వచి్చన ఆదాయం జూలైలో అత్యధికంగా రూ.156.43 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఆగస్టు, అక్టోబర్ నెలల్లో మినహా అన్ని నెలల్లో రూ.150 కోట్లు దాటింది. మొత్తమ్మీద ధరణి పోర్టల్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 6,00,443 లావాదేవీలు జరగ్గా రూ.1,220.54 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. -
తెలంగాణలో ఎకరం భూమి కనిష్ట ధర రూ.1.20 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ప్రభుత్వ విలు వల మదింపు ప్రక్రియ క్రమంగా కొలిక్కి వస్తోం ది. గత ఏడాది జూలైలో సవరించిన విలువలను మరోమారు సవరించాలని ప్రభుత్వం నిర్ణయిం చిన నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు గత వారం రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో వ్యవసాయ భూమి ఎకరానికి కనిష్టంగా రూ.75 వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.1.20 లక్షలుగా నిర్ధారించనున్నారు. అంటే సవరించిన విలువలు అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి ఎక్కడ ఉన్నా ఎకరం కనిష్టంగా రూ.1.20 లక్షలు ఉంటుందన్న మాట. ఈ మేరకే లెక్కకట్టి రిజి స్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తారు. గ్రామాల్లోని సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, వైటీడీఏ, కుడా, వీటీ డీఏ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూముల విలువలను పెంచ నున్నారు. మొదట్లో వ్యవసాయ భూముల విలు వలను 50% వరకు పెంచాలని నిర్ణయించగా, తాజా మదింపు అనంతరం ఆయా భూములకు బహిరంగ మార్కెట్లో ఉన్న విలువలను బట్టి 100 శాతం పెంచేందుకు కూడా ప్రతిపాదనలు సిద్ధ్ధమవుతున్నాయి. వాస్తవానికి జిల్లాల నుంచి వ్యవసాయ భూముల విలువలను 100, 200 శాతంతో పాటు కొన్నిచోట్ల మూడు రెట్లు సైతం పెంచుతూ ప్రతిపాదనలు వచ్చాయి. కానీ ఆ మేరకు విలువలు పెంచితే ప్రజలపై అధిక భారం పడుతుందనే ఉద్దేశంతో గరిష్టంగా 100 శాతం మేరకే విలువలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజానికి గతంలో కనిష్ట విలువ రూ.200 ఉండగా దాన్ని రూ.500గా నిర్ధారించనున్నారు. అదే విధంగా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబం ధించి చదరపు అడుగుకు గతంలో రూ. 1000 ఉండగా, ఇప్పుడు ఆ కనిష్ట విలువను రూ.1100 లేదా రూ.1200 చేయనున్నారు. అగ్రీ ‘భూమ్’ రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో ఎకరం వ్యవ సాయ భూమి బహిరంగ మార్కెట్లో కనీసం రూ.10–12 లక్షలు పలుకుతున్న నేపథ్యంలో.. ఈ బూమ్ ఆధారంగానే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్న భూమి బహిరంగ మార్కెట్లో ఎంత విలువ పలుకుతుందన్న దాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విలువలను కూడా ఖరారు చేయనున్నారు. దీంతో ఈసారి వ్యవసాయ భూముల విలువల సవరణ కనీసం 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరగవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలు, కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ శివార్లలోని భూముల విలువలు 90–100 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కనీసం 50 శాతం మేర విలువలు సవరించనున్నారు. నేడో, రేపో సబ్రిజిస్ట్రార్లకు తుది ప్రతిపాదనలు! ఉన్నత స్థాయిలో జరుగుతున్న భూముల విలువల మదింపు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ముగుస్తుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెపుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ల స్థాయిలో ముగిసిన పరిశీలన ప్రక్రియపై ఉన్నతాధికారులు మదింపు చేస్తుండగా, ఇందుకు సంబంధించిన తుది ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తీసుకుని నేడో, రేపో సబ్ రిజిస్ట్రార్లకు పంపుతారని, వాటిపై క్షేత్రస్థాయి కమిటీల ఆమోదం తీసుకుని, అవసరమైతే అక్కడక్కడా విలువలు సవరించి పూర్తిస్థాయి ప్రతిపాదనలు తయారు చేస్తామని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరి 1 నుంచే సవరించిన ప్రభుత్వ విలువలు అమల్లోకి వచ్చేలా ముందుకెళుతున్నామని, సీఎం ఆమోదం విషయంలో జాప్యం జరిగితే తప్ప అప్పటినుంచే విలువలు పెరుగుతాయని చెబుతున్నారు. సీఎం సలహాలు, సూచనల మేరకు ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులుండే అవకాశం కూడా ఉందని అంటున్నారు. -
మరోమారు భూముల విలువలు పెంపునకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల విలువల సవరణ విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ విలువలను రెండేళ్లకోసారి, వ్యవసాయేతర భూముల విలువల నుప్రతియేటా సవరించుకునే నిబంధనను మార్చింది. ఇక మీదట ఎప్పుడైనా భూముల ప్రభుత్వ విలువలను సవరించుకునే వెసులు బాటు కల్పిస్తూ పాత జీవోను సవరించింది. రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువలను సవరించేందుకు గాను స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి ప్రత్యేక అనుమతి ఇస్తూ ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో (నం.23) విడుదల చేశారు. ఈ సవరణ ఆధారంగా మరోమారు రాష్ట్రం లోని భూముల ప్రభుత్వ విలువలను పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై గత రెండు రోజులుగా అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి తెచ్చేం దుకు గాను ఈ కసరత్తు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. సవరించి ఆరు నెలలే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే భూముల విలువలను సవరించారు. గత ఏడాది జూలైలో ఈ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. సాగుభూమి ఎకరం కనిష్టంగా రూ.75 వేలుగా నిర్ధారించింది. ఇక, ఖాళీ స్థలాలను గజానికి కనిష్టంగా రూ.200గా, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల విలువ చదరపు అడుగుకు రూ.1,000గా ఖరారు చేసింది. దీంతో పాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను కూడా పెంచింది. ఈ పెంపు, సవరణల కారణంగా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.400 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తోంది. గతంలో ప్రతి యేటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మధ్య ఆదాయం వస్తుండగా, ఈ పెంపు కారణంగా జనవరి 20 నాటికే ఈ ఆదాయం రూ.6,800 కోట్లు దాటింది. ఆర్ఆర్ఆర్ కూడా పరిగణనలోకి.. అంతకుముందు ఏడేళ్లుగా ప్రభుత్వం ఈ విలువలను సవరించకపోవడంతో గత ఏడాది చేపట్టిన ప్రక్రియపై ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ భూము ల విలువలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడం, మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా రూ.12–15 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుండడం తో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజినల్ రింగు రోడ్డు లాంటి అభివృద్ధి కారణంగా భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో తాజాగా విలువల సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. వ్యవసాయ భూముల విలువలు 50 శాతం పెంపు! రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భూములు, ఆస్తు ల విలువలు బహిరంగ మార్కెట్లో ఎలా ఉ న్నాయన్న దానిపై గురు, శుక్రవారాల్లో జిల్లా రిజిస్ట్రార్లతో ఆ శాఖ ఐజీ శేషాద్రి సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూముల విలువలను ఏ ప్రాంతంలో ఎంత సవరించాలి? వాణిజ్య, నివాస కేటగిరీల్లో ఫ్లాట్లు, అపా ర్ట్మెంట్ల ధరలు ఎంత నిర్ణయించాలి? ఖాళీ స్థలాలను ఏ మేరకు సవరించాలనే దానిపై ఆ యన జిల్లా రిజిస్ట్రార్లతో చర్చిస్తున్నారు. అయి తే వ్యవసాయ భూముల విలువలను 50 శాతం, ఖాళీ స్థలాలను 35 శాతం, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లను 25 శాతం పెంచాల నే అంచనాతో కసరత్తు జరుగుతోంది. సీఎం ఆమోదంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అంటున్నాయి. -
పాత స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: ప్రాపర్టీలు, ప్రాంతం.. ఈ రెండింటికీ మధ్య దగ్గరి సంబంధం ఉంది. లొకేషన్ మీద ఆధారపడే రియల్ బూమ్ ఉంటుంది. ఇక, విద్యా, వైద్యం, వినోదం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే రియల్ ప్రాజెక్ట్లొస్తే? ప్రధాన నగరంలో స్థలం కొరత కారణంగా చాలా వరకు నిర్మాణ సంస్థలు రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు ప్రణాళికలు చేస్తున్నాయి. పాత ఇళ్ల స్థలాల్లో కొత్తగా నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నాయి. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు చేయాలంటే నివాస సముదాయాలకైతే వెయ్యి గజాల వరకు స్థలం అవసరం ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఉన్న ఇళ్ల స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రధాన నగరంలో స్థల విలువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు సగానికి పైగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కిందే ఉంటాయి. డెవలపర్‌కు, స్థల యజమానికి మధ్య 50:50 అగ్రిమెంట్ ఉంటుంది. పంజగుట్ట, సోమాజిగూడ, నల్లకుంట, హిమాయత్‌నగర్, బేగంపేట, అమీర్‌పేట్, బర్కత్‌పుర, తార్నాక, మారెడ్‌పల్లి, పద్మారావు నగర్ వంటి పాత రెసిడెన్షియల్ స్థలాల్లో కొత్త ప్రాజెక్ట్ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రధాన నగరంలో నిర్మిస్తున్న వాటిల్లో 70 శాతం రీ–డెవలప్మెంట్ ప్రాజెక్టులే. ఎవరికేం లాభమంటే? స్థల యజమాని: తన పాత స్థలంలో కొత్త భవనం రావటంతో పాటూ ముందస్తుగా కొంత సొమ్ము వస్తుంది. పైగా డెవలప్మెంట్ ఒప్పందం కింద తన వాటాగా కొన్ని ఫ్లాట్లూ వస్తాయి. నిర్మాణ సంస్థ: అభివృద్ధి చెందిన ప్రాంతం కావటంతో విక్రయాలు త్వరగా పూర్తవుతాయి. దీంతో తక్కువ సమయంలో పెట్టిన పెట్టుబడి, లాభం వస్తుంది. కొనుగోలుదారులు: మెరుగైన రవాణా సదుపాయాలతో పాటూ విద్యా, వైద్యం, వాణిజ్యం అన్ని రకాలుగానూ అభివృద్ధి చెందిన ప్రాంతంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కుల్లేని సొంతిల్లు ఉంటుంది. నిర్మాణ వ్యయం 15 శాతం ఎక్కువ.. రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌ల స్థలాల టైటిల్స్ క్లియర్‌గా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైంది డాక్యుమెంటేషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి నిర్మాణ అనుమతులూ త్వరగానే వచ్చేస్తాయి. శివారు ప్రాంతాలతో పోలిస్తే ప్రధాన నగరంలోని నిర్మాణంలో నాణ్యత కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిర్మాణ వ్యయం 10–15 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. పైగా చిన్న ప్రాజెక్ట్‌ల్లోనూ లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, మోటార్ వంటి ఏర్పాట్లూ ఉంటాయి. ఫ్లాట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కామన్ వసతుల వ్యయం తగ్గుతుంది. ఆయా ప్రాజెక్ట్లల్లో ఫ్లాట్ల అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది కాబట్టి నిర్మాణం కూడా త్వరగా పూర్తవుతుంది. బేసిక్ వసతులుంటాయ్.. స్థలం కొరత కారణంగా రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో బేసిక్ వసతులను మాత్రమే కల్పిస్తుంటారు. సోలార్ వాటర్, వీడియో డోర్ ఫ్లోర్, టెర్రస్ పైన గార్డెనింగ్, పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లిఫ్ట్, జనరేటర్ బ్యాకప్ వంటి వసతులుంటాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీ చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్లాట్ యజమానులతో పెద్దగా ఇబ్బందులుండవు. కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేందుకు వీలుగా 24 గంటల పాటు రవాణా సౌకర్యాలుంటాయి. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యా కేంద్రాలుంటాయి. పాత స్థలాల్లో కమర్షియల్ కూడా.. ప్రధాన నగరంలో నిర్మిస్తున్న రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్లల్లో వాణిజ్య సముదాయాలు కూడా ఉన్నాయి. మెయిన్ రోడ్డుకు ఉండే పాత ఇళ్లు, చిన్న చిన్న హోటళ్లు, పాత థియేటర్లున్న ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. గతంలో రోడ్డు మీదుండే హోటళ్లు, పాత ఇళ్లు మెట్రో పిల్లర్ల కారణంగా కొంత ఇరుకుగా మారాయని దీంతో ఆయా స్థలాల యజమానులు రీ–డెవలప్మెంట్కు ముందుకొస్తున్నారని తెలిపారు. స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు, మున్సిపల్ నిబంధన ప్రకారం రీ–డెవలప్మెంట్ కమర్షియల్ నిర్మాణాలుంటాయి. రీ–డెవలప్మెంట్ ఎందుకంటే? సాధారణంగా ప్రధాన నగరంలో ఖాళీ స్థలాల కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట రీ–డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇల్లు పాతపడిందనో లేక స్థల యజమాని ఆర్థిక పరిస్థితుల కారణంగానో రీ–డెవలప్మెంట్ కోసం ముందుకొస్తారని ఓ డెవలపర్ తెలిపారు. ఇవే కాకుండా.. ♦ తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకోవాలంటే స్థలం కొద్దిగా ఉంటుంది. అందుకే రీ–డెవలప్మెంట్కి ఇచ్చి అందులో వచ్చిన ఫ్లాట్లను స్థల యజమాని వారసులు తలా ఒకటి తీసుకుంటారు. ♦ పాత ఇళ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రస్తుత భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉంటాయి. పైగా ఇప్పటికి ట్రెండ్స్‌కు తగ్గట్టు భవన నిర్మాణం, ఎలివేషన్, వసతులుంటాయి. ♦ రీ–డెవలప్మెంట్కు ముందుకొచ్చే స్థల యజమానికి డెవలపర్ నుంచి మార్కెట్ విలువ 10–15 శాతం వరకు నాన్ రీఫండబుల్ కింద కొంత సొమ్ము వస్తుంది. కాబట్టి వ్యక్తిగత అవసరాలకు పనికొస్తాయి. ♦ స్థల యజమానికి వచ్చే ఫ్లాట్ల నుంచి ప్రతి నెలా అద్దె వస్తుంది. ఒకవేళ ఫ్లాట్‌ను విక్రయించుకుంటే మంచి ధర పలుకుతుంది. ♦ స్థలం, అసెట్స్ విలువ పెరుగుతుంది. ఆయా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. -
బ్రేకింగ్: తెలంగాణలో పెరిగిన భూమి విలువ
-
Land Value: తెలంగాణలో పెరిగిన భూమి విలువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్ల విలువలను ప్రభుత్వం సవరించింది. అలాగే రిజి స్ట్రేషన్ ఫీజు కూడా పెంచింది. సవరించిన ప్రభుత్వ భూముల విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు (జీవో నం.58) జారీ చేశా రు. దీంతో ఎనిమిదేళ్ల (2013 తర్వాత)కు భూముల ప్రభుత్వ విలువలను సవరించడంతో పాటు రిజి స్ట్రేషన్ల ఫీజును పెంచినట్టయింది. ఏ మూలనైనా రూ.75 వేలు భూముల విలువల సవరణలో భాగంగా రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలోనైనా వ్యవసాయ భూమి ఎకరానికి రూ.75 వేలు కనిష్ట విలువగా ప్రభుత్వం నిర్ధారించింది. ఆ తర్వాత ప్రాంతం, భూమి విలువ లను బట్టి 30–50% పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఖాళీ స్థలాలకు సంబంధించి చదరపు గజం కనీసం రూ.200గా ఖరారు చేసిన ప్రభుత్వం వాటి విలువలను కూడా 50, 40, 30 శాతం శ్లాబుల్లో సవరించింది. ఇక, ఫ్లాట్లు/అపార్ట్మెంట్ల విషయంలో చదరపు అడుగు కనీసం రూ.1,000గా నిర్ధారించింది. వీటి విలువలను ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా వర్గీకరించి 20, 30 శాతం శ్లాబుల్లో పెంచుతూ సవరించింది. 1.5 శాతం పెరిగిన స్టాంపు డ్యూటీ ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఇందులో స్టాంపు డ్యూటీ గతంలో 4% ఉండగా దాన్ని 5.5 శాతానికి పెంచింది. ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద 1.5 శాతం, రిజిస్ట్రేషన్ కింద 0.5 శాతం ఫీజును యథాతథంగా కొనసాగించింది. రాష్ట్రంలోని భూములు, ఆస్తుల విలువల సవరణ.. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుందన్న దానిపై ‘సాక్షి’ ఈనెల 18న ‘సాగుభూమి రూ.75 వేలు’ శీర్షికన సవివరంగా కథనాన్ని ప్రచురించడం గమనార్హం. అదనపు ఫీజు చెల్లించాలి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇప్పటికే రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్ చేసుకున్న వారు కూడా ఈ నెల 22 నుంచి పెరిగిన విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేక మాడ్యూల్‌ను ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనంగా చెల్లించాల్సిన ఫీజును రిజిస్ట్రేషన్ జరిగే రోజు చెల్లించవచ్చని తెలిపారు. భూముల విలువల సవరణ, రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు విషయంలో ఎలాంటి సందేహాలున్నా 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా లేదా ‘ఏఎస్సీఎంఆర్ఓఎట్దిరేట్తెలంగాణడాట్జీవోవీడాట్ఇన్’ కు ఈ మెయిల్ పంపడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చని వెల్లడించారు. నిలిచిన కార్యకలాపాలు సవరించిన మార్కెట్ విలువలు, పెరిగిన రిజిస్ట్రేషన్ ఫీజును అప్లోడ్ చేయడం కోసం అటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఇటు ధరణి పోర్టల్‌లో కార్యకలాపాలను మంగళవారం నుంచే నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ధరణి పోర్టల్ బంద్ కాగా, సాయంత్రం 5 గంటల నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లను సాంకేతిక బృందాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం కల్లా ఈ వివరాలన్నీ సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు సర్వర్ ద్వారా అప్లోడ్ కానున్నాయి. బుధవారం బక్రీద్ కారణంగా ఎలాగూ ప్రభుత్వ సెలవు ఉన్నందున గురువారం నుంచి కొత్త విలువలు, చార్జీలు అమల్లోకి వస్తాయని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. బుధవారం ప్రభుత్వ సెలవు అయినా సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు కార్యాలయాలకు వచ్చి తమ తమ మండలాలు, తమ పరిధిలోనికి వచ్చే ప్రాంతాలకు సంబంధించి అప్లోడ్ అయిన వివరాలను పరిశీలిస్తారని, గురువారం నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయని తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ రిజిస్ట్రేషన్ల ఫీజును మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు పెంచుతున్నట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. తెలంగాణతో పోలిస్తే పొరుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చార్జీలు ఎక్కువ ఉన్నాయని, తమిళనాడులో 11, కేరళలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతం చొప్పున ఫీజు వసూలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఇప్పటివరకు విలువలు సవరించలేదని తెలిపారు. మరోవైపు ఐటీ, ఫార్మా, పర్యాటక, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించడం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో సాగు ఆయకట్టు పెరగడంతో భూముల విలువలు పెరిగాయని వివరించారు. దీంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. 50 శాతం అదనపు ఆదాయం అంచనా ప్రభుత్వ విలువల సవరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ద్వారా దాదాపు 50 శాతం అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తుండగా, తాజా మార్పులతో అది రూ.9 వేల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. కానీ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా వస్తాయని భావిస్తోన్న రూ.9 వేల కోట్లకు తోడు మరో రూ.3 వేల కోట్లను కూడా ఎలా సమకూర్చుకోవాలన్న దానిపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఎలా పెరుగుతాయంటే... వ్యవసాయ భూములకు ఇలా.. ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చే భూముల విలువలు, రిజిస్ట్రేషన్ల ఫీజు ప్రకారం వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ల కింద చెల్లించాల్సిన ఫీజు పెరగనుంది. ఉదాహరణకు ఎకరం భూమి ప్రభుత్వ విలువ గతంలో రూ.20 వేలు ఉంటే ఆ భూమికి రూ.1,200 (6 శాతం) ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.75 వేలు అయింది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు 7.5 శాతానికి పెరిగింది. అంటే ఇప్పుడు అదే ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రూ.5,625 చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ ప్లాట్లకు ఇలా... ఖాళీ స్థలాల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తించనుంది. మండల కేంద్రాల స్థాయిలో గతంలో చదరపు గజం రూ.201–1,000గా ఉన్న విలువను 50 శాతానికి పెంచారు. అంటే రూ.1,000 చదరపు గజం విలువ ఇప్పుడు రూ.1,500 అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 6 నుంచి 7.5 శాతానికి పెరిగింది. కాబట్టి ఇప్పుడు 100 గజాల ఖాళీ స్థలాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు రూ.11,250 చెల్లించాల్సి ఉంటుంది. అదే గతంలో అయితే రూ.6,000 కడితే సరిపోయేది. ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ఇలా.. లక్షలోపు జనాభా ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఫ్లాట్లు/అపార్ట్మెంట్లకు చదరపు అడుగుకు కనీస ధర రూ.1,000గా నిర్ణయించారు. గతంలో రూ.800 ఉండేది. ఈ ధర ప్రకారం 700 చదరపు అడుగుల ఫ్లాటును రిజిస్టర్ చేసుకునేందుకు గాను 6 శాతం ఫీజు చొప్పున రూ.33,600 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సవరించిన ధరల ప్రకారం చదరపు అడుగుకు రూ.1,000 చొప్పున రూ. 52,500 (7.5 శాతం ) రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ఫ్లాట్లు/ అపార్ట్మెంట్లకు ప్రభుత్వం నిర్దేశించిన విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. -
రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి. మార్కెట్ విలువ సవరణలను స్వాగతిస్తూనే.. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపును మాత్రం డెవలపర్ల సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. విలువ, చార్జీలు రెండూ ఒకేసారి పెంచితే కొనుగోలుదారుల మీద తీవ్రమైన భారం పడుతుందని.. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోగా బ్లాక్‌మార్కెట్‌కు ఊతమిచ్చినట్లే అవుతుందని అభిప్రాయపడ్డాయి. 2013 ఆగస్టులో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా విలువల సవరణ జరిగింది. ప్రతీ రెండేళ్లకొకసారి రిజిస్ట్రేషన్ విలువలను సమీక్షించి.. కొత్త విలువలను నిర్ధారించాలని చట్టంలో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు. రాష్ట్రంలో జరిగిన పాలనాపరమైన సంస్కరణల కారణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయి. దీంతో పట్టణ ప్రాంతాలలో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతా లలో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగాయి. ప్రధానంగా ఏడేళ్లలో హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాలు, హెచ్ఎండీఏ పరిధిలోని భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంపునకు ప్రభుత్వం అధికారిక విలువల సవరణకు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపునకు నిర్ణయించింది. సర్వే నంబర్ల వారీగా విలువల సవరణ.. ప్రస్తుతం తెలంగాణలో రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంప్ డ్యూటీ 4 శాతం, ట్రాన్స్ఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వం సవరించనున్న భూముల మార్కెట్ విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించాల్సిన అవసరముందని ఓ రిటైర్డ్ సబ్‌రిజిస్ట్రార్ సూచించారు. ఏ ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచినా సరే గ్రామాన్ని యూనిట్ ప్రాతిపదికన తీసుకుని సవరిస్తుంటుంది. ప్రధాన రహదారి వెంబడి ఉన్న సర్వే నంబర్లు మినహా మిగిలిన గ్రామం అంతా ఒకటే విలువ ఉంటుంది. అందుకే అంతర్గత రోడ్లు, అభివృద్ధి కార్యకలాపాలు జరిగే సర్వే నంబర్ల వారీగా మార్కెట్ విలువలు పెంచాలి. దీంతో లావాదేవీలను బట్టి చార్జీలు వసూలవడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. మహారాష్ట్రను ఆదర్శంగా తీసుకోవాలి.. కరోనా సమయంలో గృహ కొనుగోలుదారులకు ఉత్సాహం నింపేందుకు, అదే సమయంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు మహారాష్ట్ర, పుణే, కర్ణాటక రాష్ట్రాలు స్టాంప్‌డ్యూటీని 3 శాతం తగ్గించాయి. మహారాష్ట్ర, పుణేలలో అన్ని రకాల గృహాలకు స్టాంప్‌డ్యూటీ మినహాయింపునిస్తే.. కర్ణాటకలో మాత్రం రూ.35 లక్షల లోపు ధర ఉన్న గృహాలకు వెసులుబాటు కల్పించింది. మహారాష్ట్రలో గతేడాది డిసెంబర్లో మినహాయింపు ప్రారంభం కాగా ప్రతి నెలా రిజిస్ట్రేషన్లు మూడెంకల వృద్ధిని సాధించాయి. డిసెంబర్లో 204 శాతం, ఈ ఏడాది మేలో 2,489 శాతం, జూన్‌లో 327 శాతం వృద్ధి చెందాయి. ఆదాయం పెంపు అన్వేషణలో తెలంగాణ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర విధానాన్ని అవలంభించాలని పలువురు డెవలపర్లు సూచించారు. మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలను 3 శాతానికి తగ్గిస్తే రెట్టింపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. చెంపదెబ్బ గోడదెబ్బ రెండూ తగుల్తయ్.. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో బ్లాక్, వైట్ మనీ అంతరాన్ని తగ్గించాలంటే మార్కెట్ విలువ సవరణతోనే సాధ్యమవుతుంది. అయితే ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా పెంచితే కొనుగోలుదారులకు చెంపదెబ్బ గోడ దెబ్బ రెండూ తగుల్తయ్. దీంతో మళ్లీ బ్లాక్ మార్కెట్ దారిలో లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగితే వ్యక్తిగత ఆస్తుల విలువ పెరగదు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల ప్రాపర్టీల అసెట్ వ్యాల్యూ పెరుగుతుంది. దీంతో ఆర్థిక సంస్థలు ఎక్కువ మొత్తంలో రుణాలను మంజూరు చేస్తాయి. మార్కెట్ విలువలు పెరగడం వల్ల 6–12 నెలల పాటు లావాదేవీలు తగ్గిపోతాయి. అప్పటివరకు రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచొ ద్దు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య తగ్గుతాయేమో కానీ ఆదాయం విలువ మాత్రం పెరుగుతుంది. – నరేంద్రకుమార్ కామరాజు, ఎండీ, ప్రణీత్ గ్రూప్ రిజిస్ట్రేషన్ చార్జీలకూ ఐటీసీ ఇవ్వాలి.. స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్లు ట్రేడ్ అయినట్లుగానే ప్రాపర్టీలు కూడా ట్రేడింగ్ అవుతున్నాయి. ఒకటే ప్రాపర్టీ మీద పలుమార్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ విలువను తాజా రిజిస్ట్రేషన్ నుంచి మినహాయించాలి. అంటే జీఎస్టీలో ఎలాగైతే ఐటీసీ ఇస్తున్నారో అలాగే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లకు ఇవ్వాలి. ఉదాహరణకు రూ.50 లక్షలకు కొన్న అపార్ట్మెంట్.. రెండు మూడేళ్ల తర్వాత రూ.70 లక్షలకు విక్రయిస్తే రూ.70 లక్షల మీద రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయకూడదు. తాజా రిజిస్ట్రేషన్ విలువ నుంచి ఇంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ విలువ రూ.50 లక్షలకు తీసేయాలి. పెరిగిన ధర ఏదయితే ఉందో రూ.20 లక్షల మీదనే రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయాలి. ‘ఒకే దేశం–ఒకే పన్ను’ విధానమైన జీఎస్టీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల విషయంలో మాత్రం అమలవ్వడం లేదు. 6 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, 5 శాతం జీఎస్టీ రెండూ చెల్లించాల్సి వస్తుంది. – సీ శేఖర్ రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షుడు, క్రెడాయ్