సర్కారు ‘పాట’ పాడే.. ఖాళీ స్థలాల వేలంతో ‘ప్రైవేటు’లో కొండెక్కిన ధరలు | Land Rates In Hyderabad And Other Telangana Districts Reached All Time High | Sakshi
Sakshi News home page

సర్కారు ‘పాట’ పాడే.. స్వగృహ ప్లాట్లు, ఖాళీ స్థలాల వేలంతో ‘ప్రైవేటు’లో కొండెక్కిన ధరలు

Published Sun, Jun 12 2022 2:44 AM | Last Updated on Sun, Jun 12 2022 2:46 AM

Land Rates In Hyderabad And Other Telangana Districts Reached All Time High - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల శివార్లలో ప్లాట్ల ధరలు కొండెక్కాయి. జిల్లాల పునరి్వభజన తర్వాత కొత్త జిల్లా కేంద్రాలలో స్థలాల ధర బాగా పెరిగిపోగా.. ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు, రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలంతో మరింతగా మండిపోతున్నాయి. వేలం కారణంగా ప్రభుత్వ స్థలాలకు ధరలు ఎక్కువగా వస్తుండటంతో.. చుట్టుపక్కల ప్రైవేటు వెంచర్ల యజమానులు, రియల్టర్లు ధరలను అడ్డగోలుగా పెంచేశారు. కొద్దినెలల కిందటి వరకు కొత్త జిల్లా కేంద్రాల సమీపంలోని గ్రామాల్లో రియల్టర్లు వెంచర్లు చేసి.. డిమాండ్‌ను బట్టి చదరపు గజానికి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించారు. ఇప్పుడు అదేచోట గజానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పెంచేశారు. దీనితో స్థలం కొనుగోలు చేయాలనుకున్న పేద, మధ్యతరగతి వారు లబోదిబోమంటున్నారు. 

సర్కారీ వేలంతో..: ఉమ్మడి ఏపీలో 15ఏళ్ల క్రితం ‘రాజీవ్‌ స్వగృహ’పేరిట వెంచర్లు చేసిన భూములను ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్లాట్లుగా చేసి వేలానికి పెట్టింది. డీటీసీపీ, పట్టణాభివృద్ధి సంస్థల లేఅవుట్లతో కూడిన ప్లాట్లు కావడంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. మారుమూల పట్టణాల శివార్లలో సైతం గజం రూ.8వేలకు తక్కువ కాకుండా కొనుగోలు చేశారు. ఈ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద పడింది. ప్రైవేటు వెంచర్ల యజమానులు సైతం ప్లాట్ల ధరలను పెంచేశారు. హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేఅవుట్లలో ఉన్న భూముల ధరలు ఏడాదిలోనే రెట్టింపుకావడం గమనార్హం. 

9 జిల్లాల్లో భారీ స్పందన 
ఈ ఏడాది మార్చి 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు చెందిన 1,408 ప్లాట్లను వేలానికి పెట్టారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వేలానికి భారీ స్పందన కనిపించింది. రూ.5 వేలు కనీస అప్‌సెట్‌ ధరగా నిర్ణయించిన పెద్దపల్లి జిల్లా అంతర్గాం, మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లలో సైతం గజానికి కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర రూ.26 వేలతో కొనుగోళ్లు జరిగాయి. టీఎస్‌ఐఐసీ, హెచ్‌ఎండీఏ ఈ–వేలంలో కీలకంగా వ్యవహరించి భూములకు అధిక ధర రాబట్టాయి. 

– ఇదే ఉత్సాహంతో తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో దాదాపు పదెకరాల స్థలంలో 600 గజాల నుంచి 1,060 గజాల వరకు విస్తీర్ణమున్న 34 ప్లాట్లను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 30న ఆన్‌లైన్‌లో ఈ–వేలం ద్వారా విక్రయించే ఈ ప్లాట్లకు కనీస ధరను గజానికి రూ.40 వేలుగా నిర్ణయించారు. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ల కోసం ఉద్దేశించిన ఈ ప్లాట్లకు భారీగా స్పందన లభిస్తుందని హెచ్‌ఎండీఏ అంచనా వేస్తోంది. 

రాష్ట్రవ్యాప్తంగా ‘స్వగృహ’వేలం 
తొలుత 1,408 రాజీవ్‌ స్వగృహ ప్లాట్లకు వచి్చన స్పందనతో.. రెండో విడతగా మరిన్ని స్థలాల విక్రయానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కరీంనగర్‌లోని 237 ప్లాట్లను, భూత్పూర్‌లో 348 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలోని చందానగర్‌లో 51 ప్లాట్లు, కవాడిపల్లిలో 117 ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. తుర్కయాంజల్‌తో పాటు చందానగర్‌కు కనీస అప్‌సెట్‌ ధర రూ.40 వేలుగా నిర్ణయించగా.. కవాడిపల్లిలో రూ.10 వేలకు గజం చొప్పున నిర్ణయించారు.

గతంలో తొర్రూర్, బహుదూర్‌పల్లిలలో ప్లాట్ల విక్రయించిన నేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లాలో ఉన్న డిమాండ్‌ మేరకు ఈ వేలం ద్వారా అన్ని స్థలాలను అమ్మేయాలని సర్కార్‌ భావిస్తున్నట్టు సమాచారం. పోచారం, బండ్లగూడల్లో నిర్మించిన రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్లలోని 2,971 ఫ్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీచేయగా.. ఇప్పటికే 30 వేల దరఖాస్తులు వచ్చాయి. 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. వీటి తర్వాత ఖమ్మంలోని 8 టవర్లను కూడా అమ్మకానికి పెట్టాలని సర్కార్‌ నిర్ణయించింది. 

రాష్ట్రవ్యాప్తంగా ధరలు పెంచిన రియల్టర్లు 
ధరణి, రిజి్రస్టేషన్‌ సమస్యలతో 2020–21 మధ్య స్థలాల విక్రయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రియల్టర్లు.. నష్టానికైనా ప్లాట్లను విక్రయించుకోవాలని భావించారు. కానీ కరోనా రెండోవేవ్‌ తర్వాత ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాంటిది ఇప్పుడు సర్కార్‌ ఈ–వేలం విక్రయాలతో ఉత్సాహంలో ఉన్నారు. జిల్లా కేంద్రాల్లో ఏడాది క్రితం గజానికి రూ.7 వేల నుంచి రూ.10వేల వరకు రేటుతో భూములను విక్రయించగా.. ఇప్పుడు డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, ఇతర పట్టణాభివృద్ధి సంస్థల ఆమోదం పొందిన వెంచర్లలో ధరలు రెట్టింపు చేశారు. ఇదంతా ‘సర్కారు వారి పాట’పుణ్యమేనని చెప్తున్నారు.   

  • రియల్టర్లు పెద్దపల్లి జిల్లా కేంద్రం శివార్లలోని ప్లాట్లను చదరపు గజానికి రూ.4–5 వేల మధ్య విక్రయించేవారు. ఇటీవల ఇక్కడ ప్రభుత్వం నిర్వహించిన రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలంలో చదరపు గజానికి రూ.8 వేలు ధర పలికింది. దీనితో రియల్టర్లు ప్రైవేటు వెంచర్లలో ధరలను రూ.12 వేల వరకు పెంచేశారు. స్థలాల ధరలు ఉన్నట్టుండి రెండింతలయ్యాయి... 
  • ఇది ఈ ఒక్కచోటే కాదు.. ‘స్వగృహ’ప్లాట్లను వేలం వేసిన మహబూబ్‌నగర్, నల్లగొండ, గద్వాల, రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌ అన్నిచోట్లా ఇదే పరిస్థితి. ఆయా జిల్లాల్లో ధరలు పెరిగిన తీరును చూసి.. మిగతా జిల్లాల్లోనూ రియల్టర్లు ప్లాట్లు/స్థలాల ధరలను పెంచేశారు. అప్పోసొప్పో చేసి ఓ ప్లాటు కొనుక్కుందామనుకున్న పేద, మధ్య తరగతి వారు ఈ ధరలను చూసి కళ్లుతేలేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement