ఏపీలో మరో బాదుడు.. ఆస్తి విలువలు 40–50% పెంపు | Chandrababu Coalition govt Shock To AP People with Land Registrations | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో బాదుడు.. ఆస్తి విలువలు 40–50% పెంపు

Published Tue, Jan 28 2025 5:05 AM | Last Updated on Tue, Jan 28 2025 7:48 AM

Chandrababu Coalition govt Shock To AP People with Land Registrations

1వ తేదీ నుంచి ఆస్తి విలువలు 40–50% పెంపు

ఆదాయార్జన లక్ష్యంగా సర్కారు అడుగులు

పట్టణ ప్రాంతాల్లో షాక్‌ కొట్టనున్న రిజిస్ట్రేషన్ల చార్జీలు

క్లాసిఫికేషన్లు మార్చి ప్రాంతాల వారీగా పెంపు

నిర్మాణ విలువలు సైతం పెరుగుదల.. రేకుల షెడ్లపైనా వడ్డన 

రాజధాని అమరావతికి మాత్రం మినహాయింపు  

సాక్షి, అమరావతి: హామీల అమలును అటకెక్కించిన కూటమి సర్కారు ప్రజలపై పెను భారాలను మోపుతోంది. ఇప్పటికే రూ.15 వేల కోట్లకుపైగా విద్యుత్‌ చార్జీల బాదుడుతో జనం నడ్డి విరవగా తాజాగా స్థిరాస్తి విలువలను అమాంతం పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని అమరావతి మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆస్తుల విలువలను సవరించింది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్‌) విలువను పెంచనుంది. రేకుల షెడ్లు, పూరిళ్లు, పెంకుటిళ్లతోపాటు గోడలు లేని ఇళ్ల విలువల్ని కూడా పెంచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరుగుదల అమల్లోకి రానుంది. ఈమేరకు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఆస్తుల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. 

జిల్లా జాయింట్‌ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు సవరించిన విలు­వలను ఇప్పటికే ఆమోదించాయి. అన్ని కార్యా­లయాల్లో పెరిగిన విలువల అప్‌లోడ్‌ పనులను వేగంగా చేపట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఆస్తి విలువలు 40 నుంచి 50 శాతం వరకు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ విలువ కంటే రిజిస్ట్రేషన్‌ విలువలు బాగా తక్కువగా ఉన్నాయనే నెపంతో అనేక ప్రాంతాల్లో ఇలా పెంచేశారు. విశాఖపట్నం, తిరుపతి, రేణిగుంట, కర్నూలు, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ పెరుగుదల అనూహ్యంగా ఉండనుంది. మిగిలిన చోట్ల కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు చేశారు.

రూ.13 వేల కోట్ల ఆదాయం లక్ష్యం.. 
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా తగ్గిపోవడంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి. దీంతో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి భారీగా గండి పడింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ఏడాదికి దాదాపు రూ.10 వేల కోట్లుగా ఉన్న ఆదాయం కూటమి కొలువుదీరాక రూ.6 వేల కోట్లకు పడిపోయింది. దీంతో ఎలాగైనా సరే ఈ ఆదాయాన్ని భారీగా పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ.13 వేల కోట్లు ఆర్జించాలని రిజిస్ట్రేషన్ల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

అందులో భాగంగానే మార్కెట్‌ విలువలను అడ్డగోలుగా సవరిస్తోంది. ఈ రెట్టింపు భారమంతా ప్రజలపై మోపి వారికి ఊపిరాడకుండా చేయనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను కేటగిరీల వారీగా పెంచుతున్నారు. ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాల్లో పెరుగుదల అపరిమితంగా ఉండనుంది. అపార్ట్‌మెంట్లు, భవనాల విలువలు విపరీతంగా పెరగనున్నాయి.

క్లాసిఫికేషన్లు మార్చడం ద్వారా..
భూముల మార్కెట్‌ విలువలను పెంచేందుకు కూటమి ప్రభుత్వం దొడ్డిదారిని ఎంచుకుంది. భూముల క్లాసిఫికేషన్లనే మార్చేసింది. ప్రతి ఏరియాలో భూమికి ప్రస్తుతం ఒకే విలువ అమలులో ఉంది.  ఇప్పుడు దానికి రెండో విలువను జోడిస్తున్నారు. ఇందుకోసం లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని తెచ్చారు. గతంలో వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్‌ చేసిన భూమిగానూ.. ఇళ్ల స్థలాలు, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్న భూమిగా క్లాసిఫైడ్‌ చేశారు. 

ఇప్పుడు ఒక ప్రాంతంలోని మెట్ట, మాగాణి భూముల్లోనే రకరకాల క్లాసిఫికేషన్లు పెడుతున్నారు. జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్‌లో చేరుస్తున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలో రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి అనుకున్న భూమికి ఒక ధర, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్‌ ప్రాంతాల్లో క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు. 

వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు నాలుగైదు రకాలుగా మార్చారు. దీంతో ఒకే ప్రాంతంలోని భూమి విలువ రెండు మూడు రకాలుగా పెరగనుంది. తద్వారా రాష్ట్రంలో వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్‌ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్‌ విలువలు భారీగా పెరిగిపోనున్నాయి.

అమరావతికి మినహాయింపు
రాష్ట్రమంతా భూముల విలువలను పెంచేసిన ప్రభుత్వం ఒక్క అమరావతిలో మాత్రం పెంచకుండా కుట్ర పూరితంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అమరావతిలో భూముల విలువలను టీడీపీ నేతలు కృత్రిమంగా పెంచి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. రాజధాని పేరుతో భూముల రేట్లు పెంచేసి హైప్‌ తేవాలని యత్నిస్తున్నారు. 

దీన్ని మరింత పెంచేందుకు అక్కడ మాత్రమే భూముల విలువలను పెంచకుండా మినహాయించారు. కేవలం రాజధాని ప్రాంతంలో మాత్రమే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రజల నడ్డి విరిచి అమరావతిలో మాత్రం వెన్నపూస రాయడం ఏమిటని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement