రియల్‌.. ధర వింటే దడేల్‌! | Real Estate Boom Increased In Kamareddy | Sakshi
Sakshi News home page

రియల్‌.. ధర వింటే దడేల్‌!

Published Mon, Jul 8 2019 2:02 PM | Last Updated on Mon, Jul 8 2019 2:02 PM

Real Estate Boom Increased In Kamareddy - Sakshi

జాతీయ రహదారి (44వ)పై ఉన్న పద్మాజీవాడి చౌరస్తా ఇది. ఇక్కడ ఎకరం ధర రూ. కోటికి పైనే నడుస్తోంది.

సాక్షి, కామారెడ్డి: జిల్లాలో ‘రియల్‌’ బూమ్‌ మళ్లీ జోరందుకుంది.. పల్లె, పట్టణం తేడా లేకుండా దూసుకెళ్తోంది. ఫలితంగా భూముల ధరలు రూ.కోట్లకు చేరాయి. ప్రధానంగా రహదారుల వెంట ఉన్న భూముల రేట్లు మూడు, నాలుగింతలు పెరిగాయి. కొన్నిచోట్ల గజం జాగా ధర రూ.లక్ష వరకు పలుకుతోంది. డబ్బు ఉన్నోళ్లంతా భూముల వెంట పడ్డారు. బ్యాంకుల్లో డబ్బులు దాచుకుందామంటే రకరకాల సమస్యలు తలెత్తుతుండడం, ఫైనాన్సుల్లో పెట్టుబడులు పెడితే నమ్మకం లేకుండా పోవడంతో చాలా మంది భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. అలాగే, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా రియల్‌ దందా మీదనే దృష్టి సారించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చా యి. ఒకరి చేతుల్లో నుంచి మరొకరి చేతుల్లోకి మారే క్రమంలో ధర రెండింతలవుతోంది.

గతంలో పట్టణ ప్రాంతాల్లోనే కనిపించిన రియల్‌ దందా ఇప్పుడు మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. దీంతో అంతటా ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఇక రాష్ట్రీయ, జాతీయ రహదారుల వెంట అయితే స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. జిల్లా మీదుగా వెళ్తున్న బెంగుళూరు–నాగ్‌పూర్‌ హైవేతో పాటు సంగారెడ్డి–నాందేడ్‌–అకోలా జాతీయ రహదారి, అలాగే కరీంనగర్‌–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, మెదక్‌–ఎల్లారెడ్డి–బాన్సువాడ–బోధన్‌ రహదారులపై భూముల ధరలు సామాన్యుడికి అందని స్థాయికి చేరాయి.

44వ జాతీయ రహదారిపై భిక్కనూరు మం డలం బస్వాపూర్, భిక్కనూరు, జంగంపల్లి, పొం దుర్తి, కామారెడ్డి మండలంలోని నర్సన్నపల్లి, క్యాసంపల్లి, రామేశ్వర్‌పల్లి, ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్, సదాశివనగర్‌ మండలంలోని కుప్రియాల్, అడ్లూర్‌ఎల్లారెడ్డి, పద్మాజీవాడి చౌరస్తా, పద్మాజివాడి, మర్కల్, కల్వరాల్, దగ్గి వరకు ఎకరా రూ.50 లక్షలకు పైనే ధర పలుకుతోంది. భిక్కనూరు, కామారెడ్డి మండలాల పరిధిలోనైతే రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు నడుస్తోంది. 161వ నంబరు జాతీయ రహదారి అయిన సంగారెడ్డి–నాందేడ్‌–అకోలా రహదారి వెంట కూడా భూముల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ఈ రహదారిపై నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్‌గల్, జుక్కల్,  బిచ్కుంద, మద్నూర్‌ మండలాలు ఉన్నా యి. పిట్లం మండల పరిధిలో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నడుస్తుండగా, పెద్ద కొడప్‌గల్‌లో మాత్రం రూ.కోటి నుంచి రూ.కోటి 20 లక్షలు అమ్ముడు పోతోంది. మద్నూర్‌లో రూ.60 లక్షలు నడుస్తోంది. 

జాతీయ రహదారికి లోపల ఉన్న బిచ్కుంద మండల కేంద్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. జాతీయ రహదారులుగా గుర్తించిన మెదక్‌–ఎల్లారెడ్డి– బాన్సువాడ రోడ్డుతో పాటు కరీంనగర్‌–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం రహదారుల పక్కన గల భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఎకరాకు రూ.80 లక్షల వరకు నడుస్తోంది. ఇటీవల బంజెరతండా వద్ద రూ.50 లక్షలకు ఎకరం కొనుగోలు చేశారు. మండల కేంద్రంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల రూ.అర కోటి నుంచి రూ.కోటి వరకు నడుస్తోంది. నిజాంసాగర్‌ మండలంలో మాత్రం రూ.30 లక్షలు పలుకుతోంది. బాన్సువాడ పట్టణ శివార్లలో ఎకరానికి రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు నడుస్తుండగా, దూరాన ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు.

నస్రుల్లాబాద్‌ మండల కేంద్రానికి ఇరువైపులా రూ.50 లక్షల వరకు ధర పలుకుతోంది. కరీంనగర్‌–కామారెడ్డి–ఎల్లారెడ్డి రహదారిపై జిల్లా ప్రవేశ ప్రాంతమైన మాచారెడ్డి మండలంలో ఎకరాకు రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఈ రహదారి వెంట మాచారెడ్డి మండలంలోని గన్‌పూర్‌(ఎం), మాచారెడ్డి, మాచారెడ్డి చౌరస్తా, చుక్కాపూర్, లక్ష్మిరావులపల్లి, పాల్వంచమర్రి, పాల్వంచ, భవానీపేట, కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి గ్రామాల పరిసరాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల భూములు రియల్టరులు కొనుగోలు చేసి ప్లాట్లుగా అమ్ముకున్నారు. ఇదే రహదారిపై ఉన్న తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లోనూ ధర అడ్డగోలుగా నడుస్తోంది. 

గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూముల ధరలు దడ పుట్టిస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇక్క డి స్థలాలు ధర పలుకుతున్నాయి. ఇక్కడ గజం జాగా ధర అక్షరాల రూ.లక్ష. దీంతో భూమిని గజాలతోపాటు ఇంచులలో కూడా లెక్కించే పరిస్థితి ఉంది. ఇక గాంధారి గ్రామం లో పలు ప్రాంతాలలో ఎకరాకు రూ.కోటి నుంచి రూ.కోటి 20 లక్షల వరకు ధర పలుకుతోంది.
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఎకరం భూమి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతోంది. జిల్లా ఏర్పాటైన తరువాత ఇక్కడ భూముల ధరలు మరింతగా పెరిగాయి. పట్టణంలో ప్లాట్ల ధరలు గజానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు, పట్టణ శివార్లలో రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు విక్రయిస్తున్నారు. 
► జిల్లాకు ముఖ ద్వారమై న భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామం వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఎకరాకు రూ.కోటి వరకు ధర పలుకుతోంది. భిక్కనూరు మండల కేంద్రానికి ఇరువైపులా రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ఎకరం అమ్ముతున్నారు. రియల్టర్లు కొనుగోలు చేసి, ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. 
► జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో, మారుమూలన ఉన్న పెద్దకొడప్‌గల్‌ మండల కేంద్రం వ్యాపార కేంద్రం కూడా కాదు. కానీ అక్కడ భూమి ధర అడ్డగోలుగా పెరిగిపోయింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూమి ఇటీవల ఎకరాకు రూ. 1.20 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ భూమిని రియల్టర్లు ప్లాట్లుగా చేసి విక్రయానికి పెట్టగా, చాలా వరకు అమ్ముడు పోయాయి.

భారీ ఎత్తున క్రయ, విక్రయాలు.. 
పారిశ్రామిక వేత్తలతో పాటు రాజకీయ నాయకులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు భూముల కొనుగోళ్లపై దృష్టిని పెట్టారు. దీంతో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో టోకున వంద, వంద యాభై ఎకరాల చొప్పున క్రయ విక్రయాలు సాగుతున్నాయి. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న కామారెడ్డి, తాడ్వాయి, భిక్కనూరు, దోమకొండ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, మాచారెడ్డి, బీబీపేట, లింగంపేట, గాంధారి తదితర మండలాల్లో వేలాది ఎకరాల భూములు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. భూములు కొనుగోలు చేయడం, చుట్టూ ఫెన్సింగ్‌ చుట్టడం, వాల్స్‌ కట్టడం ద్వారా భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసుకుంటున్నారు.

నాయకులు, ప్రజాప్రతినిధులే మధ్యవర్తులు.. 
భూముల క్రయ,విక్రయాల్లో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. మధ్యవర్తిత్వం ద్వారా అడ్డగోలు కమీషన్లు లభిస్తుండడంతో చాలా మంది రాజకీయ నేతలు రియల్‌ వ్యాపారంలోకి దిగి దూసుకు పోతున్నారు. గతంలో ద్విచక్ర వాహనాలపై తిరిగిన నేతలు ఇప్పుడు పెద్ద పెద్ద కార్లలో సంచరిస్తున్నారంటే భూముల దందాలో వచ్చిన అడ్డగోలు లాభాలేనన్న విషయం బహిరంగ రహస్యం. పలుకుబడి ఉన్న కొందరు నాయకులు వివాదాలున్న భూములను ఎంతకో కొంతకు కొనుగోలు చేయడం, ఆ తర్వాత వివాదాలను ఎలాగోలా సెటిల్‌ చేసుకుని రెట్టింపు ధరకు అమ్ముకోవడం ద్వారా విపరీతంగా ఆర్జిస్తున్నారు. మొత్తంగా రియల్‌ భూమ్‌ ఫలితంగా సామాన్యుడు భూమి కొనలేని పరిస్థితి ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement