సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో మాత్రమే స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 80 శాతం గ్రామాల్లో మార్కెట్ విలువలను సవరించడం లేదు. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించనున్నారు. అదికూడా ఆయా ప్రాంతాల్లో పెరిగిన భూముల విలువలను బట్టి స్వల్పంగానే సవరించాలని నిర్ణయించారు. ఈ సవరణ 10 నుంచి 30 శాతం లోపే ఉండనుంది.
రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో పెరిగిన మార్కెట్ విలువను అక్కడి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖాధికారుల కమిటీలు నిర్థారించాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్ ఏరియాల్లో రిజిస్టర్ విలువలకు, మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ జిల్లాల్లో భారీగా మార్కెట్ విలువ
పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్ విలువల, రిజిస్టర్ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి.
ఈ నేపథ్యంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్ ఏరియాల్లోనే మార్కెట్ విలువల్ని సవరించనున్నారు. ఈ ఏడాది సవరణలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ 1వ తేదీ నుంచి మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు.
కమిటీల ప్రతిపాదనలు ఇలా..
సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరిస్తుంది. మూడేళ్లుగా కరోనా ఇతర కారణాల రాష్ట్రంలో పూర్తిస్థాయి సవరణ చేపట్టలేదు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక సవరణ నిర్వహించింది. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ రివిజన్ చేపట్టింది.
అర్బన్ ఏరియాల్లో జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా.. మునిసిపల్ కమిషనర్/వుడా/సీఆర్‌డీఏ అధికారులు, సంబంధిత ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా ఉండే కమిటీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే దానిపై పరిశీలన జరిపాయి. గ్రామాల్లో ఆర్డీవోలు కన్వీనర్లుగా.. జిల్లా పరిషత్ సీఈవో, సంబంధిత ఎండీపీడీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్‌లతో ఏర్పడిన కమిటీలు ఆయా ప్రాంతాల్లోన్ని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే విషయాన్ని పరిశీలించాయి.
ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గడచిన ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగిన పట్టణ ప్రాంతాలు, గ్రామాలను ఈ కమిటీలు గుర్తించాయి. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి (ఏదైనా పరిశ్రమ, సంస్థ రావడం, హైవేలు, ప్రధాన రహదారులు ఏర్పాటు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వంటి అనేక కారణాలు) అనే వివరాలను కమిటీలు సేకరించాయి.
ఆయా కారణాలను విశ్లేషిస్తూ.. లావాదేవీలు ఎక్కువ జరుగుతున్న సర్వే నంబర్లను బట్టి మార్కెట్ విలువలను ప్రతిపాదించాయి. ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న 20 శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీవోల ఆధ్వర్యంలోని కమిటీలు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రతిపాదనలు పంపించగా.. వాటిని ఉన్నతాధికారులు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment