సాక్షి, అమరావతి: ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సమర్పించే డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు స్వీకరించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. పౌరులు సమర్పించే డాక్యుమెంట్ల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉండి ఆ డాక్యుమెంట్లను తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేసి తీరాలని ఆదేశించింది. లిఖితపూర్వకంగా కారణాలు తెలియజేయకుండా డాక్యుమెంట్లను తిరస్కరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలా చేయడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని, ఇది విధి నిర్వహణలో దు్రష్పవర్తన కిందకు వస్తుందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాల అమలు నిమిత్తం ఈ ఉత్తర్వుల కాపీని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లందరికీ పంపేందుకు వీలుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు పంపించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఇటీవల తీర్పునిచ్చారు. డాక్యుమెంట్ల స్వీకరణ, తిరస్కరణ విషయంలో ఇకపై హైకోర్టులో ఇదే తరహా వ్యాజ్యాలు దాఖలైతే, అందుకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లను బాధ్యులుగా చేసి వారిని కోర్టు ముందుకు పిలిపించాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు.
కావలి రిజిస్ట్రేషన్ తీరుపై ఆక్షేపణ
నెల్లూరు జిల్లా కావలి మునిసిపాలిటీ పరిధిలో ఇల్లు రిజిస్ట్రేషన్ నిమిత్తం తాను సమర్పించిన డాక్యుమెంట్‌ను సబ్ రిజిస్ట్రేషన్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ నాగసూరి మహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టీసీ కృష్ణన్ వాదనలు వినిపిస్తూ.. డాక్యుమెంట్ సమర్పించినప్పుడు దాన్ని స్వీకరించి, పరిశీలన చేసి, ఒకవేళ అభ్యంతరాలుంటే సరైన స్టాంప్ ఫీజు వసూలు చేసి, తరువాత రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఒకవేళ సమర్పించిన డాక్యుమెంట్‌లోని ఆస్తి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్–22ఏ పరిధిలోకి వస్తే, ఆ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేస్తూ డాక్యుమెంట్‌ను తిరస్కరించాల్సి ఉంటుందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. సబ్ రిజిస్ట్రార్లు కారణాలు లేకుండా డాక్యుమెంట్లను తిరస్కరిస్తుండటంపై హైకోర్టులో పెద్దఎత్తున పిటిషన్లు దాఖలవుతున్నాయన్నారు. ఈ కేసులో కావలి సబ్ రిజిస్ట్రార్ చట్ట నిబంధనలను పాటించడంలో విఫలమయ్యారని ఆక్షేపించారు. పిటిషనర్ సమర్పించే డాక్యుమెంట్‌ను చట్ట ప్రకారం రిజిస్టర్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment