
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) విధానాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది.
మధ్యలో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహసనంగా ఉన్న మ్యుటేషన్ ప్రక్రియను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు.
రూపొందిన ప్రత్యేక అప్లికేషన్..
ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌కు, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది.
రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment