Market Value
-
పెరుగుతున్న సంస్థల విలువ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్ చెల్లింపులు, బోనస్ ఇష్యూలు, బైబ్యాక్‌లకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు సమీక్షించనుంది. ప్రభుత్వరంగ సంస్థలు ఇటీవల కాలంలో భారీగా లాభాలు సంపాదిస్తున్నాయి. దాంతో కేంద్ర ఆర్థికశాఖ ఆయా సంస్థల వద్ద పోగవుతున్న లాభాల నిర్వహణకు నియమాల్లో మార్పులు తీసుకొస్తుంది.గతంలో కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను మెరుగ్గా నిర్వహించేందుకు 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థల బ్యాలన్స్ షీట్లు భారీగా పెరిగాయి. దాంతోపాటు కంపెనీల మార్కెట్ విలువ సైతం గణనీయంగా వృద్ధి చెందింది. దీంతో మూలధన పునర్వ్యవస్థీకరణ మార్గదర్శకాల సమీక్షపై ఆర్థిక శాఖ దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. సవరించిన మార్గదర్శకాలు ఈ నెలలోనే విడుదల అవుతాయని చెప్పారు. గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఏటా వాటి పన్ను చెల్లింపుల అనంతరం సమకూరే లాభాల్లో 30 శాతం లేదా తమ నెట్‌వర్త్ (నికర విలువ)లో 5 శాతాన్ని డివిడెండ్ కింద చెల్లించాలి. నికర విలువ కనీసం రూ.2,000 కోట్లు, నగదు/ బ్యాంక్ బ్యాలన్స్ రూ.1,000 కోట్లు ఉన్న కంపెనీలు బైబ్యాక్ చేపట్టాల్సి ఉంటుంది. సంస్థల మూలధనం కంటే మిగులు నిల్వలు 10 రెట్లు చేరితే బోనస్ షేర్లను జారీ చేయాలి. షేరు ముఖ విలువ కంటే మార్కెట్ ధర లేదా పుస్తక విలువ 50 రెట్లు చేరితే స్టాక్ విభజన చేపట్టాలని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: స్థిరాస్తి అమ్మి ఇల్లు కొంటున్నారా..?మార్కెట్ విలువలో గణనీయమైన వృద్ధికేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంక్‌లు, బీమా సంస్థల మార్కెట్ విలువ గత మూడేళ్లలో రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.58 లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం. భారీగా నగదు నిల్వలు కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు డివిడెండ్లు చెల్లించాల్సి ఉంటుందని.. దీంతో ఈ స్టాక్స్ పట్ల ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారని అధికారి పేర్కొన్నారు. -
ఈ వారం టాప్ 10 కంపెనీలు.. రూ. 1.03 లక్షల కోట్లు
ఈ వారం టాప్ 10 అత్యంత విలువైన కంపెనీలు కలిసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో రూ. 1.03 లక్షల కోట్లను పొందాయి. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ అత్యధిక లాభాన్ని పొందాయి.టీసీఎస్ మార్కెట్ విలువ ఈ వారం దాదాపు రూ.43,000 కోట్లు పుంజుకుని రూ.15.57 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఈ వారం 0.51% పెరిగింది. ఇన్ఫోసిస్ రూ.33,000 కోట్లు లాభపడింది. దాని మార్కెట్ విలువ రూ.7.44 లక్షల కోట్లకు చేరుకుంది.కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టాప్ 10 సంస్థలలో అత్యధికంగా రూ.57,000 కోట్లు క్షీణించింది. దీని మార్కెట్ క్యాప్ రూ.21.04 లక్షల కోట్లకు తగ్గిపోగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.12,000 కోట్లు తగ్గి 12.23 లక్షల కోట్లకు పడిపోయింది.అయితే క్షీణించినప్పటికీ ఆర్ఐఎల్ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్ లిమిటెడ్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐటీసీ, లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
20% గ్రామాల్లోనే స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 20 శాతం గ్రామాల్లో మాత్రమే స్థిరాస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 80 శాతం గ్రామాల్లో మార్కెట్ విలువలను సవరించడం లేదు. రాష్ట్రంలోని 298 రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 12,256 గ్రామాలు, అర్బన్ ఏరియాలు ఉండగా.. వాటిలో 2,318 గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో మాత్రమే మార్కెట్ విలువలను సవరించనున్నారు. అదికూడా ఆయా ప్రాంతాల్లో పెరిగిన భూముల విలువలను బట్టి స్వల్పంగానే సవరించాలని నిర్ణయించారు. ఈ సవరణ 10 నుంచి 30 శాతం లోపే ఉండనుంది. రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆయా ప్రాంతాల్లో పెరిగిన మార్కెట్ విలువను అక్కడి రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలిసి రిజిస్ట్రేషన్ శాఖాధికారుల కమిటీలు నిర్థారించాయి. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, కొత్తగా ఏర్పడిన రహదారులు, విస్తరిస్తున్న అర్బన్ ఏరియాల్లో రిజిస్టర్ విలువలకు, మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసాన్ని గుర్తించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పడిన తర్వాత ఆయా ప్రాంతాల్లో భూముల విలువలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ జిల్లాల్లో భారీగా మార్కెట్ విలువ పార్వతీపురం మన్యం, బాపట్ల, నంద్యాల, కర్నూలు, అనంతపురం, అంబేడ్కర్ కోనసీమ, నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల అయితే మార్కెట్ విలువల, రిజిస్టర్ విలువల మధ్య వ్యత్యాసం 75 శాతం కంటే ఎక్కువగా ఉందని గుర్తించారు. ఆ ప్రాంతాల్లో భూముల లావాదేవీలు పెరగడంతో రిజిస్ట్రేషన్లు కూడా గతం కంటే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగిన గ్రామాలు, అర్బన్ ఏరియాల్లోనే మార్కెట్ విలువల్ని సవరించనున్నారు. ఈ ఏడాది సవరణలకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే జూన్ 1వ తేదీ నుంచి మార్కెట్ విలువల సవరణ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. కమిటీల ప్రతిపాదనలు ఇలా.. సాధారణంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని గ్రామాలు లేదా పట్టణాల్లో వచ్చిన మార్పులను బట్టి అర్బన్ ఏరియాల్లో ఏడాదికి ఒకసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరిస్తుంది. మూడేళ్లుగా కరోనా ఇతర కారణాల రాష్ట్రంలో పూర్తిస్థాయి సవరణ చేపట్టలేదు. కొత్త జిల్లాలు ఏర్పడటంతో గత సంవత్సరం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక సవరణ నిర్వహించింది. ఈ పరిస్థితుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ స్పెషల్ రివిజన్ చేపట్టింది. అర్బన్ ఏరియాల్లో జాయింట్ కలెక్టర్ కన్వీనర్‌గా.. మునిసిపల్ కమిషనర్/వుడా/సీఆర్డీఏ అధికారులు, సంబంధిత ఎమ్మార్వోలు, సబ్ రిజిస్ట్రార్లు సభ్యులుగా ఉండే కమిటీలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే దానిపై పరిశీలన జరిపాయి. గ్రామాల్లో ఆర్డీవోలు కన్వీనర్లుగా.. జిల్లా పరిషత్ సీఈవో, సంబంధిత ఎండీపీడీవో, ఎమ్మార్వో, సబ్ రిజిస్ట్రార్లతో ఏర్పడిన కమిటీలు ఆయా ప్రాంతాల్లోన్ని భూముల విలువలు ఏమేరకు పెరిగాయనే విషయాన్ని పరిశీలించాయి. ఆయా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గడచిన ఏడాది కాలంలో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగిన పట్టణ ప్రాంతాలు, గ్రామాలను ఈ కమిటీలు గుర్తించాయి. ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి, అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి (ఏదైనా పరిశ్రమ, సంస్థ రావడం, హైవేలు, ప్రధాన రహదారులు ఏర్పాటు కావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడం వంటి అనేక కారణాలు) అనే వివరాలను కమిటీలు సేకరించాయి. ఆయా కారణాలను విశ్లేషిస్తూ.. లావాదేవీలు ఎక్కువ జరుగుతున్న సర్వే నంబర్లను బట్టి మార్కెట్ విలువలను ప్రతిపాదించాయి. ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్న 20 శాతం ప్రాంతాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నాయి. జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు లేదా ఆర్డీవోల ఆధ్వర్యంలోని కమిటీలు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులకు సంబంధిత ప్రతిపాదనలు పంపించగా.. వాటిని ఉన్నతాధికారులు క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదించారు. -
ఎల్ఐసీకి మంచి రోజులు.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులకు పెరిగిన విలువ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ).. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో చేపట్టిన పెట్టుబడుల విలువ పుంజుకుంది. డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్‌నకు చెందిన ఏడు స్టాక్స్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ తాజాగా రూ. 44,670 కోట్లను తాకింది. ఏప్రిల్ నుంచి చూస్తే రూ. 5,500 కోట్ల విలువ జత కలిసింది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నివేదిక తదుపరి పతన బాట పట్టిన అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు కొద్ది రోజులుగా జోరు చూపుతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు నియమిత నిపుణుల కమిటీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిన దాఖలాలు లేవంటూ స్పష్టం చేసింది. దీంతో ఇన్వెస్టర్లు అదానీ షేర్లలో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో గత మూడు రోజుల్లో 10 కంపెనీలతో కూడిన అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 1,77,927 కోట్లమేర ఎగసి రూ. 10,79,498 కోట్లకు చేరిన సంగతి తెలిసిందే. అదానీ పోర్ట్స్ జూమ్ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో ఎల్ఐసీకి అత్యధికంగా 9.12 శాతం వాటా ఉంది. బుధవారం షేరు ధర రూ. 718తో చూస్తే వీటి విలువ రూ. 14,145 కోట్లు. ఇక అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో గల 4.25 శాతం వాటా విలువ రూ. 12,017 కోట్లకు చేరింది. షేరు రూ. 2,477 వద్ద ముగిసింది. ఎల్ఐసీకి అదానీ టోటల్ గ్యాస్, అంబుజా సిమెంట్‌లో కలిపి రూ. 10,500 కోట్ల విలువైన పెట్టుబడులున్నాయి. ఈ బాటలో అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీలలోనూ ఎల్ఐసీ వాటాలను కలిగి ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రూ. 30,127 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఈ ఏడాది జనవరి 30న ఎల్ఐసీ వెల్లడించింది. జనవరి 27కల్లా ఈ పెట్టుబడుల విలువ రూ. 56,142 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. అయితే తదుపరి హిండెన్‌బర్గ్ నివేదిక తదుపరి అదానీ స్టాక్స్ పతన బాట పట్టడంతో ఫిబ్రవరి 23కల్లా ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 27,000 కోట్లకు పడిపోయింది. వాటాల వివరాలిలా 2023 మార్చి చివరికల్లా ఎల్ఐసీకి అదానీ పోర్ట్స్‌లో 9.12 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 4.26 శాతం, ఏసీసీలో 6.41 శాతం, అంబుజా సిమెంట్స్‌లో 6.3 శాతం, అదానీ టోటల్ గ్యాస్‌లో 6.02 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 3.68 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 1.36 శాతం చొప్పున వాటాలున్నాయి. -
స్టార్టప్‌ల తీరు ‘పొంజి స్కీమ్’ మాదిరే!: నారాయణమూర్తి
ముంబై: స్టార్టప్‌లు కేవలం ఆదాయం పెంపుపైనే దృష్టి సారిస్తూ, లాభాల గురించి ఆలోచించకుండా.. అదే సమయంలో వాటి మార్కెట్ విలువను పెంచుకోవడం అన్నది పొంజి స్కీమ్ మాదిరేనని, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. అటువంటి వ్యవస్థ అభివృద్ధి చెందడంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, బోర్డు డైరెక్టర్ల పాత్రను తప్పుబట్టాలే కానీ, యువ పారిశ్రామికవేత్తలను కాదన్నారు. నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నారాయణమూర్తి మాట్లాడారు. దీర్ఘకాల ప్రయోజాల కోసం ఇన్ఫోసిస్ సైతం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. విషయాల పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పారదర్శకంగా, నిజాయితీగా మాట్లాడాలని కోరారు. నిధులు సమీకరించినప్పుడల్లా వ్యాల్యూషన్లను పెంచుకుంటూ పోవడం ప్రమాదకరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా ఘటన వల్ల ఎదురుదెబ్బ లేదా ప్రతికూలతలు ఎదురైతే కంపెనీ ధర అదే మాదిరి పడిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఐటీ కంపెనీలపై ఏ మేరకు ఉంటుందనే దానిపై మాట్లాడుతూ.. కష్ట సమయాలు ఎదురైనప్పుడల్లా భారత ఐటీ కంపెనీలు లాభపడినట్టు చెప్పారు. చాట్ జీపీటీ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్‌లతో భారత ఐటీ ఉద్యోగాలపై ప్రభావం ఉండదన్నారు. గతంలో తానూ ఈ తరహా ప్లాట్‌ఫామ్‌ల కోసం ప్రయత్నించినట్టు చెప్పారు. -
Burgundy Private Hurun India 500: విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ 1
ముంబై: దేశంలో అత్యంత విలువైన (మార్కెట్ విలువ ఆధారితంగా) లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘2022 బర్గండి ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ కంపెనీల జాబితా గురువారం విడుదలైంది. 500 కంపెనీల ఉమ్మడి విలువ రూ.226 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.17.25 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.68 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.33 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ (రూ.6.46 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.6.33 లక్షల కోట్లు), ఎయిర్టెల్ (రూ.4.89 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3.81 లక్షల కోట్ల విలువతో టాప్–10లో ఉన్నాయి. అదానీ కంపెనీలు ఎనిమిది.. ‘‘గౌతమ్ అదానీకి సంబంధించి ఏడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో ఎనిమిదో కంపెనీ వచ్చి చేరింది. ఉపఖండంలో అత్యంత సంపన్నుడు కావడందో ఇదేమీ ఆశ్చర్యాన్నివ్వలేదు. టాటా సన్స్ నుంచి ఆరు కంపెనీలు, సంజీవ్ గోయెంకా నుంచి మూడు, కుమార మంగళం బిర్లా నుంచి మూడు చొప్పున కంపెనీలు జాబితాలో ఉన్నాయి’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ జునైద్ తెలిపారు. లిస్టులో తెలంగాణ సంస్థల సంఖ్య రెండు పెరిగి 31కి చేరింది. టాప్ 10 యంగెస్ట్ కంపెనీల జాబితాలో సువెన్ ఫార్మా, మెన్సా బ్రాండ్స్ చోటు దక్కించుకున్నాయి. -
బాబోయ్, సరికొత్త రికార్డ్ సృష్టించిన యాపిల్ సంస్థ.. షాక్‌లో ప్రత్యర్థి కంపెనీలు!
స్మార్ట్ఫోన్లలో యాపిల్ కంపెనీ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ యాపిల్ ఫోన్లకు సొంతం. అంతటి ప్రాముఖ్యత సంపాదించుకున్న యాపిల్ తాజాగా ఓ రికార్డ్ సృష్టించింది. మార్కెట్ విలువ పరంగా మరే కంపెనీ చేరలేని రేర్ ఫీట్‌ని సాధించి తన బ్రాండ్‌ని మరో సారి నిరూపించుకుంది. మార్కెట్ విలువలో యాపిల్ కంపెనీ గురువారం ఒక్క రోజే 190.9 బిలియన్ డాలర్ల పెరిగింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్డ్ డేటా వెల్లడించింది. దీంతో ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ 2.34 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అదే సమయంలో, ఇతర మూడు టెక్ దిగ్గజాల మార్కెట్ విలువు $2.306 ట్రిలియన్లకు చేరింది. గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ (1.126 ట్రిలియన్ డాలర్లు), అమెజాన్ (939.78 బిలియన్ డాలర్లు), ఫేస్బుక్ పేరెంట్ మెటా (240.07 బిలియన్ డాలర్లు) ఉన్నాయని యాహూ ఫైనాన్స్ డేటా వెల్లడించింది. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీ మార్కెట్ విలువలు ఆశించినంత స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో యాపిల్ ఈ స్థాయిలో మార్కెట్ విలువను చూసి మిగిలిన కంపెనీలు షాక్‌లో ఉన్నాయి. గత వారం, యాపిల్ మార్కెట్ విలువ ఆల్ఫాబెట్ ఇంక్, అమెజాన్, మెటా మార్కెట్ విలువ కంటే ఎక్కువగా పెరిగింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఆపిల్ ఆదాయ ఫలితాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ గత నెలలో తెలిపారు. యాపిల్ ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 37% వాటాను కలిగి ఉండగా, దేశంలో మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. చదవండి: హైదరాబాద్: జియో 5జీ సేవలు కావాలంటే.. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇలా చేయాల్సిందే! -
Forbes World Best Employers for 2022: దేశంలో అత్యుత్తమ సంస్థగా రిలయన్స్
న్యూఢిల్లీ: మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అగ్రగామిగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఉద్యోగులకు అత్యుత్తమ యాజమాన్య సంస్థగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ యాజమాన్య సంస్థలకు 2022 సంవత్సరానికి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఆల్ఫాబెట్ (గూగుల్), యాపిల్ వరుసగా ఉన్నాయి. అంతేకాదు 2 నుంచి 12వ స్థానం వరకు ర్యాంకులు అమెరికా కంపెనీలే సొంతం చేసుకున్నాయి. 13వ స్థానంలో జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూపు ఉంది. అమెజాన్ 14, డెకథ్లాన్ 15వ ర్యాంకు సొంతం చేసుకున్నాయి. టాప్–100లో రిలయన్స్ ఒక్కటే ఫోర్బ్స్ తాజా జాబితాలో టాప్–100 ర్యాంకుల్లో నిలిచిన ఏకైక భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ సంస్థల్లో 2,30,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలైన మెర్సెడెజ్ బెంజ్, కోకకోలా, హోండా, యమహా, సౌదీ అరామ్కో రిలయన్స్ వెనుకే ఉండడం గమనార్హం. ఈ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు 137, బజాజ్ (173), ఆదిత్య బిర్లా గ్రూపు (240), హీరో మోటోకార్ప్ (333), ఎల్అండ్టీ (354), ఐసీఐసీఐ బ్యాంకు (365), హెచ్‌సీఎల్ టెక్ (455), ఎస్బీఐ (499), అదానీ ఎంటర్ప్రైజెస్ (547), ఇన్ఫోసిస్ (668) ర్యాంకులతో నిలిచాయి. అధిక వేతనాలు, మెరుగైన ప్రయోజనాలు, ఉన్నత అవకాశాలు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యానికి తోడు, ప్రయోజనం ఆధారిత పనికే తమ ప్రాధాన్యమని ఉద్యోగులు స్పష్టం చేసినట్టు ఫోర్బ్స్ తెలిపింది. 57 దేశాల పరిధిలో 1,50,000 మంది పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులను సర్వే చేసి ఫోర్బ్స్ ఈ ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ సంస్థ స్టాటిస్టా సాయం తీసుకుంది. జాబితాలో మొత్తం 800 కంపెనీలకు ర్యాంకులు లభించాయి. -
మార్క్ జుకర్‌బర్గ్‌కు ఇన్వెస్టర్ల షాక్: మార్కెట్ వాల్యూ ఢమాల్!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా మరోసారి ఫలితాల్లో ఢమాల్ అంది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ఆదాయ క్షీణత నమోదు చేసింది. మెటావర్స్‌పై అనాసక్తతకు తోడు ప్రకటనల ఆదాయం క్షీణించడం, ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ నుంచి ఎదురవుతున్న పోటీ కారణంగా మెటా ఆదాయం పడిపోయింది. సెప్టెంబర్ 30తో ముగిసిన క్యార్టర్-2 ఫలితాల్లో ఆదాయం 4శాతం తగ్గి 27.71 బిలియన్ల డాలర్లకు చేరింది. అంతకుముందు ఇది 29.01 బిలియన్ల డాలర్లుగా ఉంది. మెటావర్స్ ప్రాజెక్ట్‌పై చేసిన అపారమైన, ప్రయోగాలకు మొత్తం ఖర్చుల్లో ఐదవ వంతు ఖర్చుపెట్టారు మెటా బాస్ మార్క్ జుకర్‌బర్గ్ . అయితే కంపెనీ ఒక్కోషేరు ఆదాయంలో అంచనాలకు అందుకోలేక చతికిలపడింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఆర్జించిన3.22 డాలర్లనుంచి 52 శాతం పడిపోయి 1.64 డాలర్లను మాత్రం సాధించింది. అలాగే మెటా రియాలిటీ ల్యాబ్స్ యూనిట్, దాని మెటావర్స్ మూడవ త్రైమాసికంలో 3.67 బిలియన్ డాలర్ల నిర్వహణ నష్టాన్నినమోదు చేసింది. అంతకు ముందు సంవత్సరంతో నష్టంతో పోలిస్తే ఇది అధికం. ఈ ఫలితాల నేపథ్యంలోవాల్ స్ట్రీట్‌లో మెటా షేరు ఏకంగా 20 శాతం కుప్పకూలింది. 2016 కనిష్ట స్థాయిని తాకింది. ఈ ఏడాదిలో మెటాషేరు 61శాతం క్షీణించడం గమనార్హం. తాజా నష్టంతో 67 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూ హరించుకు పోయింది. కాగా మెటా పెట్టుడులపై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో మెటావర్స్ పేరిట కంపెనీ అనవసర ఆలోచనలు చేస్తోందని మెటా వాటాదారు ఆల్టిమీటర్ క్యాపిటల్ సీఈఓ బ్రాడ్ గెర్స్ట్నర్ ఈ వారం ప్రారంభంలో మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్క్‌పై లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఫ్లాట్ అమ్ముతున్నారా? అయితే ఈ విషయాలు గమనించండి
ప్రశ్న: నేను హైదరాబాద్‌లో నా ఫ్లాట్‌ని అమ్ముతున్నాను. రూ. 18 లక్షలకు ఒప్పందం కుదిరింది. కానీ, సబ్–రిజిస్ట్రార్ కార్యాలయం వాళ్లు మార్కెట్ విలువ రూ. 23,00,000 అంటున్నారు. – ఎ. సత్యప్రసాద్, హైదరాబాద్ జ. స్థిరాస్తుల క్రయవిక్రయ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇటు అమ్మే వ్యక్తి, అటు కొనే వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే.. ♦ ఎటువంటి పరిస్థితుల్లోనూ కాస్త వైట్, కాస్త బ్లాక్ జోలికి పోకండి. ♦ ఏ పరిస్థితుల్లోనూ నగదు వ్యవహారం వద్దు. ♦ నగదు తప్పనిసరి అయితే రూ. 2,00,000 లోపలే ఉండేలా చూసుకోండి. ♦ 2001 ఆర్థిక సంవత్సరానికి ముందు కొన్న ఆస్తి విలువ 01-040-2001 నాటి మార్కెట్ విలువను ప్రామాణికంగా ఫెయిర్ మార్కెట్ విలువగా తీసుకుంటారు. జాగాకి గజం ఇంత అని, చదరపు అడుగుకు ఇంత అని సబ్–రిజిస్ట్రార్ సర్టిఫికెట్ ఇస్తారు. ♦ అలా నిర్ధారించిన విలువను ఇండెక్సింగ్ ద్వారా పెంచుతారు. 2001-02 నుండి 2002–03 వరకు ఒక టేబుల్ ఆన్లైన్లో దొరుకుతుంది. ♦ ఉదాహరణకు 2001–02లో మార్కెట్ విలువ 100 అనుకుంటే అది ఇప్పుడు 331కి సమానం అవుతుంది. మీరు గతంలో ఎంతకు కొన్నా 01–04–2001 నాటు మార్కెట్ విలువ రూ. 5,00,000 అనుకోండి 5,00,000/100 X331 = రూ. 16,55,000గా భావిస్తారు. ♦ పైన లెక్కించిన రూ. 16,55,000ని కొన్న ధరగా పరిగణిస్తారు. ♦ ఒప్పందంలో ఉన్న మొత్తం, మార్కెట్ విలువ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని అమ్మకపు విలువుగా పరిగణిస్తారు. మీరు చెప్పిన కేసులో ఒప్పందపు విలువ రూ. 18,00,000, సబ్–రిజిస్ట్రార్ కట్టిన విలువ రూ. 23,00,000. సబ్–రిజిస్ట్రార్ విలువనే పరిగణిస్తారు. కొనే వ్యక్తి దీని మీదే రిజిస్ట్రేషన్ రుసుం, వగైరాలు చెల్లించాలి. ♦ ఈ ప్రకారం రూ. 23 లక్షలను ప్రాతిపదికగా తీసుకుని, అందులో నుంచి రూ. 16,55,000ని తీసివేయగా మిగిలిన రూ. 6,45,000ని దీర్ఘకాలిక మూలధన లాభంగా లెక్కిస్తారు. ♦ మీరు నిజంగా రూ. 18,00,000లే తీసుకున్నా, ఆ మేరకు అన్ని సాక్షాలు ఉన్నప్పటికీ రూ. 23,00,000నే పరిగణనలోకి తీసుకుంటారు. ♦ సాధారణంగా ఒప్పందం విలువ ఎక్కువగా ఉండి, మార్కెట్ విలువ తక్కువగా ఉంటుంది. ఆ అదనపు మొత్తం నగదుగా తీసుకుంటూ ఉంటారు. అలా ససేమిరా చేయవద్దు. కొంత మంది అదనపు మొత్తాన్ని విడిగా నాలుగైదు చెక్కులుగా ఇస్తాం.. మీరు వేరే అకౌంటులో వేసుకోండి అంటూ ఉంటారు. అలాంటివి చేయొద్దు. ♦ మీరు ఎలా అయితే క్యాపిటల్ గెయిన్కి గురి అవుతారో అలాగే ప్రతిఫలం ఇచ్చిన వ్యక్తి సదరు మొత్తానికి ’సోర్స్’ చూపించాలి. అలా చూపించకపోతే ఆ మొత్తం మీద 30 శాతం పన్ను చెల్లించాలి. ♦ ‘ఇద్దరం లబ్ధి పొందాలి, ఉభయతారకంగా ఉండాలి‘ అని ఆలోచించకండి. నల్లధనంపై ఉంది ఆంక్ష .. కొంత మంది పెడతారు పరీక్ష .. కానీ మనకు పడేను శిక్ష .. మీ నిజాయితీయే మీకు శ్రీరామరక్ష! స్థిరాస్తి క్రయవిక్రయాల్లో .. జాగ్రత్త -
మహీంద్రా లైఫ్‌స్పేస్ @ బిలియన్ డాలర్ల మార్కెట్
న్యూఢిల్లీ: తమ గ్రూప్‌లో భాగమైన రియల్టీ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ మార్కెట్ విలువ 1 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటిందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. తద్వారా నల్లధనం లావాదేవీలు లేకుండా రియల్టీలో మనుగడ కష్టమన్న విమర్శకుల అంచనాలను తిప్పికొట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ రంగంలో తమ గ్రూప్ ఎంట్రీ సమర్ధనీయమేనని రుజువు చేసిందని పేర్కొన్నారు. శుక్రవారం బీఎస్ఈలో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేరు ఒక దశలో 2 శాతం పెరిగి రూ. 519.75 స్థాయికి చేరింది. దీంతో మార్కెట్ క్యాప్ రూ. 8,032.51 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే తమ గ్రూప్‌లో మరో యూనికార్న్ (1 బిలియన్ డాలర్ల విలువ చేసే సంస్థ) వచ్చి చేరిందని ఆనంద్ మహీంద్రా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ‘1980లలో మహీంద్రా యుజీన్తో రియల్టీ రంగంలోకి ప్రవేశించినప్పుడు.. బ్లాక్ మనీ లేకుండా రాణించడం కష్టమని విమర్శకులు అనడం నాకింకా గుర్తు. వారు చెప్పినది తప్పు అని నిరూపించాలని మేము నిర్ణయించుకున్నాం. దీన్ని సాధించిన అరుణ్ నందా, అరవింద్‌లకు కృతజ్ఞతలు‘ అని మహీంద్రా పేర్కొన్నారు. అరుణ్ నందా ఇటీవలే మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ చైర్‌పర్సన్‌గా రిటైరు కాగా, అరవింద్ సుబ్రమణియన్ ఎండీ, సీఈవోగా ఉన్నారు. 1994లో ఏర్పాటైన మహీంద్రా లైఫ్స్పేస్కు ఏడు నగరాల్లో 32.14 మిలియన్ చ.అ.ల ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని కొత్తవి ఉన్నాయి. -
క్రిప్టో దారుణ పతనం, దివాలా బాటలో ఎక్స్చేంజీలు, భవిష్యత్తేంటి?
క్రిప్టో కరెన్సీకున్న క్రేజ్ మామూలుది కాదు. అమాంతం ఈ కరెన్సీ విలువ దూసుకుపోవడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ప్రధాన క్రిప్టో కరెన్సీలు గరిష్టాల నుంచి మూడింట రెండొంతుల మేర విలువను కోల్పోయాయి. ఇక చిన్న క్రిప్టోలు, మీమ్ కాయిన్ల పరిస్థితి మరింత దారుణం. 2017లో క్రిప్టో కరెన్సీల మార్కెట్ విలువ 620 బిలియన్ డాలర్లు. అక్కడి నుంచి 2021 నవంబర్ నాటికి అమాంతం 3 లక్షల కోట్ల డాలర్లకు దూసుకెళ్లింది. కానీ అనూహ్యంగా ఈ స్థాయిలో పడిపోతాయని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీకి కారణమేంటి? క్రిప్టోల దారుణ పతనం పెట్టుడిదారుల నమ్మకాన్ని దెబ్బతీసిందా, దాని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనే విషయాలపై నిపుణుల అంచనాలను ఒకసారి పరిశీలిద్దాం. భవిష్యత్తు.. క్రిప్టోల పతనం కచ్చితంగా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసినట్టు నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రిత స్థాయికి తీసుకొచ్చేందుకు సమీప కాలంలోనూ వడ్డీ రేట్లు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో వ్యవస్థలో లిక్విడిటీ మరింత తగ్గుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లలో రక్షణాత్మక ధోరణి కనిపించొచ్చు. 2021లో క్రిప్టోలను కొనుగోలు చేసినట్టయితే ఇప్పటికే సగం మేర వారి పెట్టుబడి కరిగిపోయి ఉంటుంది. మరోవైపు నియంత్రణ సంస్థల కత్తి వేలాడుతూనే ఉంటుందని తెలుసుకోవాలి. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన నియంత్రణల మధ్య ప్రపంచవ్యాప్తంగా దశాబ్దాలూగా వేళ్లూనుకుని ఉన్నవి. క్రిప్టోలు అనియంత్రిత సాధనాలు. వీటిపై ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాల చర్యల ప్రభావం ఉంటుంది. ఆ మధ్య చైనా సైతం క్రిప్టో మైనింగ్‌పై కఠిన ఆంక్షలు పెట్టడం గుర్తుండే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పన్ను కూడా ఇన్వెస్టర్లలో నిరుత్సాహానికి దారితీసినట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. క్రిప్టో మార్కెట్లలో ఈ విధమైన ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి ప్రధాన సాధనాలవైపు మళ్లీ వెళ్లిపోతారని కొందరు అంచనా వేస్తుంటే.. క్రిప్టోల మార్కెట్ క్రమంగా వికసిస్తుందని కొందరి అంచనా. ‘‘మరింత మంది ఇన్వెస్టర్లు క్రిప్టోల్లో ట్రేడింగ్, స్పెక్యులేషన్‌కు బదులు, వాటి మూలాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్కెట్ క్రమంగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది’’అని క్రిప్టో మేనేజ్మెంట్ సంస్థ కాసియో సీటీవో అనుజ్ యాదవ్ చెప్పారు. బిట్‌కాయిన్, ఎథీరియం, సొలానా, కొన్ని మీమ్ కాయిన్లకు ఇనిస్టిట్యూషన్స్ మద్దతు అయితే ఉంది. మిగిలిన వాటిని ఎవరు నడిపిస్తున్నారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎవరికీ తెలియదు. భారీ ర్యాలీకి కారణం.. అంతర్జాతీయ ఫండ్స్ నిర్వహణ సంస్థలైన జేపీ మోర్గాన్ చేజ్, బ్లాక్‌రాక్ పెద్ద ఎత్తున బిట్కాయిన్లలో పెట్టుబడులు పెట్టాయి. స్వల్పకాలంలో ఎక్కువ రాబడులను ఇన్వెస్టర్లకు పంచిపెట్టాలన్న కాంక్ష, వైవిధ్య కోణం ఫండ్స్ మేనేజర్లతో అలా చేయించి ఉండొచ్చు. 2021 అక్టోబర్ 19న అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ట్రేడింగ్ మొదలైంది. లిక్విడిటీకితోడు, పెద్ద సంస్థలు సైతం క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెట్టడం భారీ ర్యాలీకి ఊతంగా నిలిచింది. ఇదే అదనుగా ఆల్ట్ కాయిన్లకు కూడా డిమాండ్ ఏర్పడింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ క్రిప్టోలకు సెలబ్రిటీగా మారిపోయారు. క్రిప్టోవేవ్ను అనుకూలంగా మలుచుకునేందుకు భారత్‌లో క్రిప్టో ఎక్సేంజ్‌లు దినపత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు, టీవీల్లో ప్రకటనలతో ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇవన్నీ కలసి ఈ మార్కెట్లో ’ఫోమో’ (అవకాశాన్ని కోల్పోతామేమోనన్న ఆందోళన)కు దారితీసింది. ఈక్విటీలు, క్రిప్టోలకు పోలిక? క్రిప్టోలను సమర్థిచే వారు ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో అస్థిరతలు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. 2017-2021 మధ్య ఈక్విటీలు-క్రిప్టోల మధ్య సామీప్యత పెరిగింది. ఈ కాలంలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్ వోలటిలిటీ, బిట్‌కాయిన్ ధర వోలటిలిటీ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ఈక్విటీ మార్కెట్ల మాదిరే క్రిప్టో మార్కెట్లు కూడా పడుతూ, లేచేవేనని ఇన్వెస్టర్లు భావించడం మొదలు పెట్టారు. 2020, 2021 ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో పాటు, క్రిప్టో కరెన్సీలు ర్యాలీ చేయడాన్ని పోలుస్తున్నారు. కానీ, స్టాక్స్‌లో నష్టాలు, క్రిప్టోల్లో నష్టాలకు మధ్య పోలికలేదు. మన ఈక్విటీ మార్కెట్లు గరిష్టాల నుంచి 20%లోపే దిద్దుబాటుకు గురయ్యాయి. కొన్ని స్టాక్స్ విడిగా 30-40 శాతం నష్టపోయాయి. కానీ, క్రిప్టోలు మరిన్ని నష్టాలను చూస్తున్నాయి. ఎక్స్చేంజ్లకు గడ్డుకాలం... క్రిప్టో లావాదేవీలకు వీలు కల్పిస్తున్న దేశీ ఎక్స్చేంజీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 80 శాతానికి పైగా పడిపోవడం వాటికి దిక్కుతోచనీయడం లేదు. దీంతో ఆరి్థకంగా బలంగా లేని ఎక్సే్ఛంజ్‌లు దినదిన గండం మాదిరి నెట్టుకొస్తున్నాయి. ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ వజీర్‌ఎక్స్‌లో జనవరిలో ట్రేడింగ్ పరిమాణం 39 మిలియన్ డాలర్లు కాగా, క్రమంగా తగ్గుతూ జూన్‌లో 9.67 మిలియన్ డాలర్లకు పడిపోయింది. అన్ని ప్రధాన ఎక్స్చేంజీల్లో ఇదే పరిస్థితి ఉన్నట్టు ఈ టేబుల్లోని గణాంకాలను చూస్తే తెలుస్తుంది. పన్ను పిడుగు క్రిప్టో ఇన్వెస్టర్లు ఇప్పుడు అయోమయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీలు భారీగా పడిపోవడం వల్ల లాభాల సంగతేమో కానీ, నష్టాలపాలైన వారే ఎక్కువగా ఉన్నారు. ఈక్విటీల మాదిరి మూలధన నష్టాలను, మూలధన లాభాలతో సర్దుబాటుకు క్రిప్టోల్లో అవకాశం లేదు. ఒక లావాదేవీలో లాభపడి, మరో లావాదేవీలో నష్టపోతే.. లాభం వచ్చిన మొత్తంపై 30 శాతం పన్ను కట్టాలని నూతన నిబంధనలు చెబుతున్నాయి. ఈక్విటీల్లో అయితే మూలధన నష్టాలను ఎనిమిది ఆరి్థక సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మంజిత్ చాహర్ (42) క్రిప్టోల్లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశాడు. తొలుత కొన్ని లావాదేవీల్లో అతడికి రూ. 25,000 లాభం వచ్చింది. కానీ, ఆ తర్వాత పెట్టుబడిపై రూ. 45,000 నష్టపోయాడు. అంటే అతడి రూ. లక్ష కాస్తా రూ. 80,000కు పడిపోయింది. అయినా కానీ, రూ. 25,000 లాభంపై అతడు 30 శాతం చొప్పున రూ. 7,500 పన్ను చెల్లించాల్సిందే. బిట్‌కాయిన్‌లో లాభం వచ్చి, బిట్ కాయిన్‌లోనే నష్టం వస్తే వాటి మధ్య సర్దుబాటుకు అవకాశం ఉంది. కానీ, బిట్‌కాయిన్‌లో లాభపడి, ఎథీరియంలో నష్టం వస్తే సర్దుబాటుకు అవకాశం లేదు. ‘‘క్రిప్టో లాభాలపై పన్ను 30 శాతం. కానీ, నష్టాలను లాభాల్లో సర్దుబాటు చేసుకునేందుకు అవకాశం లేదు కనుక, నికర పన్ను 50-60 శాతంగా ఉంటుంది’’అని చార్డర్డ్ క్లబ్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు కరణ్ బాత్రా తెలిపారు. క్రిప్టోల్లో లాభం వచ్చిన ప్రతి విడత ఒక శాతం టీడీఎస్ కట్ అవుతుంది. ఎక్కువ ట్రేడింగ్ చేసే వారికి టీడీఎస్ రూపంలో కొంత పెట్టుబడి బ్లాక్ అవుతుంది. పైగా స్టాక్ బ్రోకర్ల మాదిరి, మూలధన లాభాల స్టేట్ మెంట్లను అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లు జారీ చేయడం లేదు. విదేశాలకు మకాం క్రిప్టో పన్నుల విధానం పట్ల ఇన్వెస్టర్లు సంతోషంగా లేరని పరిశ్రమ చెబుతోంది. వజీర్ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ రాజగోపాల్ మీనన్ దీని గురించి వివరిస్తూ.. ‘‘తరచూ, అధిక పరిమాణంలో క్రిప్టోల్లో ట్రేడింగ్ చేసే వారు ఇప్పుడు వారి వ్యాపారాన్ని సింగపూర్, దుబాయ్ వంటి మార్కెట్లకు తరలించారు. అక్కడ క్రిప్టోలకు సంబంధించి మెరుగైన పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వారు ఇప్పుడు దేశీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్ నిలిపివేశారు’’అని వివరించారు. తాజా ప్రతికూల పరిస్థితుల వల్ల 30-40 చిన్న ఎక్స్చేంజ్లు తీవ్ర సంక్షోభంలో పడినట్టు చెప్పారు. ఇన్వెస్టర్లు పెట్టుబడులు వెనక్కి తీసేసుకోకుండా కొన్ని ఎక్సే్ఛంజ్‌లు నియంత్రిస్తున్న వార్తలను ప్రస్తావించారు. తమ ఇన్వెస్టర్లు కొందరు దుబాయి, ఐర్లాండ్‌కు కార్యకలాపాలను తరలించినట్టు ఓ చార్టర్డ్ అకౌంటెంట్ సైతం తెలిపారు. ‘‘సంస్థ లేదా వ్యక్తి రూ.50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం లేదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్ విదేశాల్లో రూ.15 కోట్లను క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. అతడికి లాభాల రూపంలో రూ.10-15 లక్షలు ఆదా అవుతుంది’’అని వివరించారు. -
కొత్త జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి విలువల సవరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి మార్కెట్ విలువల్ని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సవరించనుంది. జిల్లాల నోటిఫికేషన్ వెలువడి నూతన జిల్లా కేంద్రాలు ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ మార్కెట్ విలువలు మారేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాధారణంగా ఏటా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టులో మార్కెట్ విలువల్ని సవరిస్తారు. గతేడాది కోవిడ్ నేపథ్యంలో సవరణను వాయిదా వేశారు. 2022 ఏప్రిల్ వరకు సవరణ ఉండదని అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తుండడంతో సవరణ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి రెండు విడతలుగా మార్కెట్ విలువల సవరణపై కసరత్తు మొదలు పెట్టారు. మొదట కొత్తగా ఏర్పడుతున్న జిల్లా కేంద్రాల్లో మార్కెట్ విలువలపై కసరత్తు చేశారు. ఆ తర్వాత వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ విలువల సవరణపైనా కసరత్తు పూర్తి చేశారు. వృద్ధి ఆధారంగా మార్కెట్ విలువల సవరణ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏ ప్రాంతంలో ఎంత పెంచాలి? ఆ ప్రాంతాల్లో జరిగిన వృద్ధి, కొత్తగా వచ్చిన పరిశ్రమలు, పెరిగిన వ్యాపారం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువల్ని ప్రతిపాదించారు. వాటికి జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలు తాత్కాలిక అనుమతులు ఇచ్చాయి. వాటిని రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు చేసి మార్కెట్ విలువల్ని నిర్ధారించారు. ఆ విలువలకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం కూడా తీసుకున్నారు. ఏ క్షణమైనా మార్కెట్ విలువల్ని సవరించడానికి అనువుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డేటా ఎంట్రీ కూడా చేసుకుని అమలు చేయడానికి రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లా కేంద్రాల పరిధిలో స్థిరాస్తి మార్కెట్ విలువల సవరణ అమలవుతుందని ఆ శాఖాధికారులు చెబుతున్నారు. కొత్త జిల్లా కేంద్రాలు ప్రకటించాక ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్, స్థిరాస్తి లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
యాపిల్ పెను సంచలనం
Apple first company to cross $3 trillion market cap milestone: కార్పొరేట్ రంగంలో యాపిల్ కంపెనీ పెను సంచనలం సృష్టించింది. ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల(3 X రూ.75లక్షల కోట్లుపైనే) వాల్యూ మార్క్‌ను అందుకున్న తొలి కంపెనీగా అవతరించింది. సోమవారం (జనవరి 3, 2022)న మధ్యాహ్నాం మార్కెట్లో షేర్ల ధరల పెరుగుదలతో ఈ ఘనత సాధించింది ఈ అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం. స్టీవ్ జాబ్స్ 2007లో ఫస్ట్ యాపిల్ ఐఫోన్‌ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి విలువతో పోలిస్తే.. ఇప్పుడు యాపిల్ షేర్లు 5,800 శాతం రెట్లు పెరిగాయి ఇప్పుడు. కరోనా టైంలోనూ ఈ కార్పొరేట్ జెయింట్ హవాకు అడ్డుకట్ట పడకపోవడం విశేషం. 2020 మొదట్లో 200 శాతం పెరిగాయి షేర్ల ధరలు. మొత్తంగా ఇప్పుడు మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌ను దాటేసింది. స్టీవ్ జాబ్స్ 1976లో ఓ కంప్యూటర్ కంపెనీగా మొదలైన యాపిల్ కంపెనీ.. ఇన్కార్పోరేటెడ్గా(విలీన కంపెనీగా) హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, మీడియా సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. 2 ట్రిలియన్ మార్కెట్‌ను అందుకున్న కేవలం పదిహేడు నెలలకే.. అది చిప్ కొరత లాంటి అసాధారణ సమస్యను ఎదుర్కొంటూనే 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ మార్క్‌ను టచ్ చేయగలగడం మరో విశేషం. యాపిల్ తొలి ఆఫీస్ నా జీవితంలో ఈ మార్క్‌ను కంపెనీ సాధిస్తుందని ఊహించలేదు.. కానీ, రాబోయే ఐదు పదేళ్లలో యాపిల్ ఊపు ఎలా ఉండబోతుందో ఈ గణాంకాలే చెప్తున్నాయి అంటున్నారు కంపెనీలో 2.75 మిలియన్ షేర్లు ఉన్న ప్యాట్రిక్ బర్టోన్(ఈయన మెయిన్ స్టే విన్స్లో లార్జ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌కి కో-ఫోర్ట్‌ఫోలియో మేనేజర్). యాపిల్ కంపెనీ 2018లో 1 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఆగష్టు 2020లో 2 ట్రిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంది యాపిల్. మొత్తంగా 2 ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన తొలి కంపెనీ మాత్రం సౌదీ ఆరామ్కో(సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీ). ప్రస్తుతం యాపిల్ మొదటి స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్(గూగుల్), సౌదీ ఆరామ్కో, అమెజాన్‌లో తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. చదవండి: యాపిల్+మేక్ ఇన్ ఇండియా= 50 బిలియన్ డాలర్లు!! -
52 రోజుల్లో అక్షరాలా రూ.7,600 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: పాత పద్ధతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఓపెన్ ప్లాట్ల క్రయవిక్రయ లావాదేవీలు పెరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజి స్ట్రేషన్ల కార్యక్రమం ప్రారంభం కాగా, ఈ నెల 10 వరకు 52 రోజుల్లో జరిగిన 1.38 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.465 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఆ ప్లాట్ల మార్కెట్ విలువలో ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద వసూలు చేసినా.. వీటి మొత్తం విలువ ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం రూ.7,600 కోట్లు పైమాటే. అదే బహిరంగ మార్కెట్లో అయితే రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా. సంగారెడ్డి, మహేశ్వరం టాప్.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పరిశీలిస్తే సంగారెడ్డి, మహేశ్వరం కార్యాలయాల్లో దాదాపు రోజుకు 100 ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత యాదగిరిగుట్ట, నల్లగొండ, వరంగల్, ఫారూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 60 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాదగిరిగుట్టలో రోజుకు 80 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటితో పాటు రోజుకు 40 ఓపెన్ ప్లాట్ల చొప్పున జరుగుతున్న వాటిలో మొత్తం 141 ఎస్ఆర్వోలకుగాను, 19 ఎస్ఆర్వోలు ఉండటం గమనార్హం. హైదరాబాద్, దూద్‌బౌలీ, చార్మినార్, మారేడుపల్లి, ఇల్లెందు, భద్రాచలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. అత్యంత తక్కువగా గత 52 రోజుల్లో కొడంగల్, సికింద్రాబాద్ ఎస్ఆర్వోల పరిధిలో రెండు ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఎస్ఆర్ నగర్, గోల్కొండలో 3 చొప్పున, కొల్లాపూర్‌లో 7, ఆజంపురలో 22, నారాయణపేటలో 27, బంజారాహిల్స్‌లో 31, బాలానగర్, కూసుమంచిలో 32, వర్ధన్నపేటలో 96 ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘కరోనా కారణంగా క్రయవిక్రయ లావాదేవీలు నిలిచిపోయాయి. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మళ్లీ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించడంతో ఒక్కసారిగా జోరు మొదలైంది. దాదాపు 2 నెలలుగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఓపెన్ప్లాట్ల విషయంలో ఎల్ఆర్ఎస్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడం, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే తదుపరి లావాదేవీకి అనుమతి ఇవ్వడంతో ఇవి మరింత పెరిగాయి. మరో 2 నెలలు ఈ జోరు కొనసాగుతుంది’అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తం రూ.1,565 కోట్ల ఆదాయం ఓపెన్ ప్లాట్లు సహా అన్ని రకాల వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ద్వారా గత 52 రోజుల్లో ప్రభుత్వానికి రూ.1,565 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో మొత్తం 2.2 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో మొత్తం 2.46 లక్షల లావాదేవీలకు డాక్యుమెంట్ నంబర్లు ఇవ్వగా, 2.4 లక్షల డాక్యుమెంట్ల స్కానింగ్ పూర్తయింది. 702 లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
మీ షేర్లు, మార్కెట్ విలువను తెలపండి
న్యూఢిల్లీ: ఎన్డీటీవీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్ ఆయన భార్య రాధికా రాయ్‌ల షేర్లు, వాటి విలువను శుక్రవారం నాడు తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే... కంపెనీ పునర్ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు సంబంధించి తమ వద్ద ఉన్న అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ (యూపీఎస్‌ఐ)ను దుర్వినియోగపరచి న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)షేర్ల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రూ.16.97 కోట్లకుపైగా అక్రమ లబ్ది పొందారన్నది వీరిపై ఆరోపణ. అక్రమంగా పొందిన ఈ డబ్బును 6 శాతం వడ్డీతోసహా సెబీ వద్ద 45 రోజులలోపు డిపాజిట్ చేయాలని సెబీ గత ఏడాది నవంబర్ చివర్లో ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎన్డీటీవీ ప్రమోటర్లపై రెండేళ్లపాటు ఈక్విటీ మార్కెట్ లావాదేవీల నుంచి నిషేధించింది. 2006 సెప్టెంబర్– 2008 జూన్ మధ్య చోటుచేసుకున్న కార్యకలాపాలకు సంబంధించి సెబీ ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆ సమయంలో ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీకి చైర్మన్‌గా, హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. సెబీ ఆదేశాలపై ఎన్డీటీవీ ప్రమోటర్లు సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించారు. అయితే ఇన్సైడర్ లావాదేవీ ద్వారా అక్రమంగా పొందినట్లు సెబీ గుర్తించిన మొత్తంలో 50 శాతం డిపాజిట్ చేయాలని శాట్ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై రాయ్ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి అప్పీల్స్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారించింది. తమ వద్ద తగిన వేరే ఆదాయ వనరులు ఏవీ లేనందున, సెబీ జరిమానాకు ఎన్డీటీవీ షేర్లనే హామీగా పెడతామని రాయ్ దంపతుల తరఫు న్యాయవాది ముకుల్ రోతంగీ ఆఫర్ చేశారు.దీనిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ నేతృత్వంలోని ధర్మాసనం షేర్ల విలువ స్టేట్మెంట్ను శుక్రవారం అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజం.. ఆర్ఐఎల్
న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. మంగళవారం నాటి మార్కెట్ విలువ ఆధారంగా బీపీ పీఎల్సీని వెనక్కి నెట్టేసి ఈ రికార్డును నమోదు చేసింది. తద్వారా అగ్రగామి ఇంధన కంపెనీల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం బ్రిటిష్ కంపెనీ బీపీ మార్కెట్ విలువ 132 బిలియన్ డాలర్లు కాగా, రిలయన్స్ మార్కెట్ విలువ 133 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత నెలలోనూ ఓ సారి బీపీని మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ అధిగమించింది. అలాగే, ఆసియాలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ పెట్రోచైనా మార్కెట్ విలువకు చేరువగా ఆర్ఐఎల్ వచ్చేసింది. ఈ ఏడాది ఆర్ఐఎల్ షేరు 35% ర్యాలీ చేయగా, బీపీ షేరు 1.2% పెరిగింది. వచ్చే 18 నెలల కాలంలో కంపెనీని రుణరహితంగా మారుస్తామని ఈ ఏడాది ఆగస్ట్‌లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. -
ఫేస్బుక్ షేర్ల భారీ పతనం
శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్ షేర్లు తన చరిత్రలోనే అత్యంత భారీ పతనాన్ని గురువారం చవిచూశాయి. షేరు ధర 20 శాతం మేర పడిపోగా, కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులోనే 120 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరైపోయింది. న్యూయార్క్‌లో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9.41 గంటలకు షేరు 179.92 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. విక్రయాలు, యూజర్ల వృద్ధి జూన్ క్వార్టర్(రెండో త్రైమాసికం)లో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో షేర్లను విక్రయించడానికి పోటీ పడ్డారు. ఫలితం... షేరు ధర భారీగా పడిపోయింది. గురువారం ట్రేడింగ్ మొదలయ్యేటప్పటికి కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 619 బిలియన్ డాలర్లుండగా... కాసేపటికే 120 బిలియన్ డాలర్లను కోల్పోయింది. 120 బిలియన్ డాలర్లంటే మన కరెన్సీలో దాదాపు రూ.8 లక్షల కోట్లు. భారత్‌లో నంబర్–1 లిస్టెడ్ కంపెనీగా ఉన్న టీసీఎస్ మార్కెట్ విలువకన్నా ఇది ఎక్కువ. 2018 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు త్రైమాసికాల్లోనూ ఆదాయ వృద్ధి తగ్గొచ్చని ఫేస్బుక్ సీఎఫ్‌వో డేవిడ్ వెహ్నెర్ ప్రకటించడం కూడా ప్రభావం చూపించింది. గతంలోనూ 2015లో మొదటి త్రైమాసికం (జనవరి–మార్చి) ఫలితాలు అంచనాలను తప్పాయి. యూజర్ల డేటా లీకవ్వడం, ప్రకటనదారులకు అనుగుణంగా విధానాలను మార్చడం వంటి చర్యలతో ఫేస్బుక్ ఇటీవలి కాలంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. యాక్టివ్ యూజర్లు 147 కోట్లు ఫేస్‌బుక్‌కు జూన్ నెలలో 147 కోట్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లుగా ఉన్నారు. కానీ, బ్లూంబర్గ్ పోల్‌లో విశ్లేషకులు మాత్రం 148 కోట్ల మేర ఉండొచ్చనే అంచనాలు వ్యక్తం చేశారు. అతిపెద్ద మార్కెట్లయిన అమెరికా, కెనడాలో ఏ మాత్రం పెరుగుదల లేకుండా 185 మిలియన్ల యూజర్లు యథాతథంగా ఉండగా... యూరోప్‌లో ఒక శాతం తగ్గి 179 మిలియన్లకు చేరారు. అయితే, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఫేస్‌బుక్‌ను సగటున రోజువారీగా వినియోగించే వారి సంఖ్యలో 11 శాతం పెరుగుదల ఉంది. విశ్లేషకులు 13.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేయగా, వాస్తవంగా 13.2 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. జూన్ చివరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 30,275 మంది. ఫలితాలకు ముందు రోజు బుధవారం ఫేస్బుక్ షేరు జీవితకాల రికార్డు స్థాయి 217.50 డాలర్ల వద్ద ముగిసింది. ఈ ధర ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ 619 బిలియన్ డాలర్లు. ఈ ఏడాదిలో ఈ షేరు ఇప్పటి వరకు 23 శాతం పెరిగింది. -
డేటా లీక్: 130 బిలియన్ డాలర్లు మటాష్!
శాన్ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేంబ్రిడ్జ్ ఎనలిటికా ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారుల డేటా చోరీ నేపథ్యంలో ఫేస్బుక్ ఆదాయం భారీగా క్షీణించనుందన్న అంచనాలతో మార్కెట్లో ఫేస్బుక్ కౌంటర్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. వినియోగదారుల వృద్ధి, రెవెన్యూ భారీగా పడిపోవడంతో మార్కెట్ ఆరంభంలోనే సంస్థ షేర్ కుప్ప కూలింది. వాడుకదారుల వృద్ధిలో విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదు చేసింది. దీంతో తీవ్ర అమ్మకాలతో ఒత్తిడితో 24 శాతానికిపైగా నష్టపోయింది. కేవలం రెండే రెండు గంటల్లో మార్కెట్ విలువలో 130 బిలియన్ డాలర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. 2012తరువాత ఇదే అదిపెద్ద పతనమని ఎనలిస్టులు చెబుతున్నారు. అటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 16.8 బిలియన్ డాలర్ల మేర వ్యక్తిగత సంపదను కోల్పోయారు. కంపెనీ ఆదాయ అంచనాల ప్రకటన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఆర్థిక అధికారి డేవిడ్ వేహ్నెర్ రాబోయే త్రైమాసికంలో బలహీనమైన ఆదాయం అంచనాలను వెల్లడించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. రెవెన్యూ వృద్ధి రెండవ త్రైమాసికంలో "క్షీణించింది" ఇది మరింత తగ్గిపోనుందని డేవిడ్ ప్రకటించారు. ఈ క్షీణత రాబోయే సంవత్సరాల్లో కొనసాగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రెండవ త్రైమాసికంలో లాభాలు 31 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లగా నమోదు కాగా, ఆదాయాలు 42 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం ఫేస్బుక్ నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కేవలం 11శాతం పుంజుకుని 2.23 మిలియన్లుగా నమోదైంది. 2.25మిలియన్లుగా నమెదుకావచ్చని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే రోజువారీ యూజర్ల సంఖ్య ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసి 11శాతం వృద్ధితో 1.47మిలియన్లుగా నమోదైంది. భద్రత, గోప్యత అంశాలపై భారీ పెట్టుబడులు పెడుతున్నామని ఫేస్బుక్ అధిపతి జుకర్‌బర్గ్ ప్రకటించారు. సంస్థను తరువాతి త్రైమాసికం కోసం మాత్రమే కాకుండా దీర్ఘకాలికంగా నడపనున్నామంటూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించే వ్యాఖ్యలు చేశారు. -
కుదేలైన అమెజాన్.. కారణం?
వాషింగ్టన్: గ్లోబల్ ఆన్లైన్ రీటైల్ దిగ్గజం అమెజాన్‌కు ట్రంప్ షాక్ తగిలింది. అమెజాన్‌పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దానికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలో ఉన్నారన్న తాజా మీడియా నివేదికల నేపథ్యంలో అమెజాన్ షేరు భారీగా నష్టోయింది. ఒక్క బుధవారమే షేరు 5శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో 7 శాతం కుప్పకూలింది. కంపెనీ పన్ను చెల్లింపులు, విదేశాలలో విస్తరణ ప్రణాళికలు వంటి అంశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ దృష్టిసారించనున్నట్లు వెలువడ్డ వార్తలతో దాదాపు మూడేళ్ల కనిష్టాన్ని తాకింది. అమెజాన్ 30 బిలియన్ డాలర్ల మార్కెట్ వాల్యూని కోల్పోయింది. ముఖ్యంగా యాంటీ ట్రస్ట్ చట్టాన్ని ఉపయోగించేందుకు ముమ్మరంగా చర్చలు నిర్వహించారని యాక్సోస్ అనే వెబ్సైట్ నివేదించింది. అమెజాన్ కారణంగా చిన్న తరహా, ప్రధానంగా తన సొంత (మామ్ అండ్ పాప్) వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుండటంపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్టు నివేదించింది. దీంతో మార్కెట్లో అమెజాన్ షేర్‌కు అమ్మకాల సెగ తాకింది. సుమారు రూ. 20వేలకోట్ల సంపద తుడిచి పెట్టుకు పోయింది. అయితే వైట్ హౌస్ ప్రతినిధి సారా సాండర్స్ స్పందిస్తే ట్రంప్ ఎపుడూ డిఫరెంట్‌గా ఆలోచిస్తుంటారనీ, కానీ విధానానికి సంబంధించి నిర్దిష్ట విధానాలు లేవని చెప్పారు. అలాగే ఫేక్ న్యూస్ తన పరిపాలన ప్రధానఅడ్డంకిగాఉన్నాయంటూ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భాగస్వామ్యంలోని వాషింగ్టన్ పోస్ట్‌పై ఇటీవల విరుకుచుపడటం గమనార్హం. మరోవైపు ఈ వార్తలపై అమెజాన్ ఇంకా స్పందించలేదు. కాగా, ఆన్లైన్ రీటైలర్స్పై ఇంటర్నెట్ టాక్స్ విధించాలనే ఆలోచనను గతంలోనే ట్రంప్ బహిరంగా ప్రకటించారు. అమెజాన్‌ను టార్గెట్ చేస్తూ ట్విటర్లో తీవ్రంగా స్పందించారు. పన్ను చెల్లిస్తున్న చిరు వ్యాపారులకు అమెజాన్ బాగా నష్టం కలిగిస్తోంది. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు బాధపడుతున్నారు. అమెరికా ప్రజలు భారీగా ఉద్యోగాలు కోల్పొతున్నారంటూ నిప్పులు చెరిగిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కేవలం రెండు గంటల్లోనే 1.2 శాతం నష్టంతో 5.7 బిలియన్ డాలర్ల(36 వేల కోట్ల రూపాయలు) నష్టపోయింది. -
మార్కెట్ విలువను కోర్టులు నిర్ణయించవు
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పనులకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారికి ఎకరాకు రూ.6 లక్షలు ఇస్తున్న ప్రభుత్వం, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సేకరిస్తున్న భూముల విషయంలో మార్కెట్ ధరను ఎకరాకు రూ.85 వేలుగానే నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎంత మాత్రం కొనసాగరాదంటూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల వల్ల స్వచ్ఛందంగా భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారికి చెల్లిస్తున్న రూ.6 లక్షలను మార్కెట్ విలువగా నిర్ణయించినట్లవుతుందని, మార్కెట్ విలువను కోర్టులు నిర్ణయించజాలవని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్కెట్ విలువల నిర్ణయం పూర్తిగా అధికారుల పరిధిలోని వ్యవహారమని, ఇందులో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం సరికాదని పేర్కొంది. అయితే సిద్దిపేట జిల్లా కలెక్టర్ మార్కెట్ విలువల సవరణకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. ఆ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సింగిల్ జడ్జి వద్దే స్టే ఎత్తివేతకు పిటిషన్ దాఖలు చేసుకోవాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ విలువలను సవరిస్తూ సిద్దిపేట కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రైతులు నర్సింహారెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపేశారు. కాగా, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీలును విచారించిన ధర్మాసనం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. -
లక్షల కోట్లను సృష్టించిన టాప్-100 కంపెనీలు
దేశంలో టాప్-100 కంపెనీల మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఐదేళ్లలో ఈ కంపెనీలు రూ.38.9 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తాజా అధ్యయనంలో తేలింది. టాటా గ్రూప్ సంస్థ టీసీఎస్ వీటిలో టాప్‌లో నిలిచింది. వరుసగా ఐదేళ్ల నుంచి మార్కెట్ విలువలో టీసీఎస్ తొలి స్థానాన్ని దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. దిగ్గజ బ్రోకరేజ్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ 22వ వార్షిక సంపద సృష్టి అధ్యయనంలో ఈ ర్యాంకింగ్‌లను వెల్లడించింది. 2012 నుంచి 2017 వరకు టీసీఎస్ రూ.2.50 లక్షల కోట్ల సంపదను సృష్టించినట్టు తెలిపింది. దీంతో మళ్లీ తొలి ర్యాంకింగ్‌నే దక్కించుకున్నట్టు పేర్కొంది. ఈ ఐటీ దిగ్గజం అనతరం, ప్రైవట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ రెండో స్థానంలో నిలిచింది. రూ.1.89 లక్షల కోట్ల సంపద సృష్టితో రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో స్థానాన్ని పొందింది. ఐటీసీ, మారుతీ సుజుకీలు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచినట్టు మోతిలాల్ ఓస్వాల్ అధ్యయనం పేర్కొంది. 2012-17 కాలంలో అత్యంత వేగవంతంగా సంపదను పెంచుకున్న కంపెనీగా అజంత ఫార్మా ఉంది. వరుసగా మూడో సారి కూడా ఈ విషయంలో అజంత ఫార్మానే ముందజలో ఉంది. రంగాల పరంగా బ్యాంకింగ్, ఫైనాన్స్‌లు సంపదను సృష్టించడంలో తొలి స్థానాల్లో ఉన్నాయని, బ్యాంకింగ్ సెక్టార్ కన్జ్యూమర్, రిటైల్ ఇండస్ట్రీని రీప్లేస్ చేసినట్టు తెలిపింది. ఈ ఏడాది ఈ రెండు రంగాలు రెండో స్థానంలో నిలిచాయని తెలిసింది. -
క్రూడ్ షాక్, జియో దెబ్బ : రిలయన్స్‌కు భారీ నష్టం
ముంబై : అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగిపోవడం, ఇటీవల కాలంలో టెలికాం నెట్వర్క్ జియో జోరు తగ్గడం మార్కెట్ విలువలో దేశీయ అతిపెద్ద కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను భారీగా దెబ్బకొడుతున్నాయి. నవంబర్ మొదటి నుంచి బిలీనియర్ ముఖేష్ ఆంబానీ ప్రమోట్ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ బొంబై స్టాక్ ఎక్స్చేంజ్లో రూ.50వేల కోట్లను నష్టపోయింది. నవంబర్ నెల తొలి 13 రోజుల్లోనే కంపెనీ షేరు ధర 8 శాతానికి పైగా క్షీణించింది. ఆరు లక్షల కోట్లు దాటిని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ సోమవారం ముగింపు నాటికి రూ.5.53 లక్షల కోట్లకు పడిపోయింది. క్రూడ్ ధరలు అంతకంతకు పెరిగిపోవడం కంపెనీ విలువపై స్వల్పకాలికంగా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ దానికి సమానంగా దేశీయంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు. సెప్టెంబర్ నుంచి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 10 డాలర్ల మేర పెరిగి, 63 డాలర్లుగా నమోదైంది. క్రూడ్ ఆయిల్ ధరలకు సమానంగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలు పెరగాలంటే కనీసం రెండు వారాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్ పడిపోతుందనే భయాందోళనతో కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవని తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మరో దెబ్బ దాన్ని టెలికాం వెంచర్ జియో ఇన్ఫోకామ్. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీ ఎక్కువ మొత్తంలో ఆఫర్లతో దంచికొడుతుండటంతో, అంతేమొత్తంలో రుణం కూడా పెరుగుతోంది. మరోవైపు ఇటీవల కాలంలో జియో జోరు తగ్గింది. సబ్స్క్రైబర్లను తక్కువ మొత్తంలో ఆకట్టుకుంది. ఇటీవల ట్రాయ్ విడుదల చేసిన డేటాలోఆగస్టులో కేవలం 4.09 మిలియన్ కస్టమర్లను మాత్రమే జియో తన కస్టమర్లుగా యాడ్ చేసుకుంది. ఏడాది క్రితం కంపెనీ లాంచ్ అయినప్పటి నుంచి ఇదే రెండోసారి తక్కువ వృద్ధి నమోదుచేసిన నెల. 2017 జనవరి వరకు ప్రతి నెలా జియో 16 మిలియన్‌కు పైగా సబ్స్క్రైబర్లను ఆకట్టుకుంది. తర్వాత ఫిబ్రవరిలో 12 మిలియన్లకు, తర్వాత మార్చిలో 5.83 మిలియన్లకు, ఆ తర్వాత ఏప్రిల్‌లో మరింత కిందకి 3.87 మిలియన్లగా తన సబ్స్క్రైబర్లను చేర్చుకుంది. కంపెనీ కొత్త ఆఫర్లను లాంచ్ చేయడంతో మే నెలలో మళ్లీ తన సబ్స్క్రైబర్లను పెంచుకుంది. సబ్స్క్రైబర్లను ఆకట్టుకునే సంఖ్య పడిపోతుందనే సమయానికి జియో మరోసారి ట్రిపుల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. -
టాప్–5లోకి ఎస్బీఐ
ఎస్బీఐ... మార్కెట్ విలువ పరంగా ఒక్క రోజులోనే ఐదు మెట్లెక్కేసింది. బుధవారం ఈ స్టాక్ ఏకంగా 27 శాతానికి పైగా లాభపడడంతో మార్కెట్ విలువ రూ.60,597 కోట్ల మేర పెరిగి రూ.2,80,282 కోట్లకు చేరుకుంది. దీంతో దేశీయంగా అత్యధిక మార్కెట్ విలువ కలిగిన ఐదో కంపెనీగా అవతరించింది. ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐటీసీ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ విలువలో హెచ్డీఎఫ్సీ, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్ స్టాక్స్‌ను దాటుకుని ముందుకు వెళ్లింది. పీఎన్బీ మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.12,789.68 కోట్లు పెరిగి రూ.42,963.68 కోట్లకు చేరింది. బీఓబీ మార్కెట్ క్యాప్ రూ.10,380.28 కోట్లు వృద్ధితో రూ.43,364.28 కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల సంపద రూ.1.96 లక్షల కోట్లు అప్ భారీ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.1.96 లక్షల కోట్ల మేర ఎగబాకింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ బుధవారం రూ.1,96,629.16కోట్ల వృద్ధితో రూ.1,41,79,644 కోట్లకు చేరుకుంది.