సాక్షి, హైదరాబాద్ : రాబడి పెరుగుదలపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వివిధ రకాల రిజిస్ట్రేషన్ల నిమిత్తం వసూలు చేసే స్టాంప్ డ్యూటీని హేతుబద్ధీకరిస్తేనే ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రధానంగా పార్టీషియన్ ఆఫ్ ప్రాపర్టీస్, మార్ట్‌గేజ్, హైపోథికేషన్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ షేర్స్, కంపెనీల ఇన్ కార్పొరేషన్ తదితర రిజిస్ట్రేషన్లకు స్టాంప్‌డ్యూటీ విలువపై 0.5 శాతం లేదా గరిష్టంగా రూ.50 వేలు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. దీని వల్ల రూ.కోటి ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌కు రూ.50 వేలు చెల్లిస్తుండగా, రూ.100 కోట్ల ఆస్తికి కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తున్నారు.
స్టాంప్‌డ్యూటీ గరిష్ట పరిమితి నిబంధన కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. ఈ నిబంధన వల్ల ఉన్నత వర్గాలకు మాత్రమే మేలు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు అంటున్నారు. దీనికి బదులు ఆయా రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని కొంతమేరకు తగ్గించి ఆస్తి విలువను బట్టి దాన్ని హేతుబద్ధీకరిస్తే సామాన్యులకు ఉపయోగకరంగా ఉంటుందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశముంద ని అభిప్రాయపడుతోంది. అలాగే, స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించి ప్రస్తుతం వసూలు చేస్తున్న స్టాంప్‌డ్యూటీ(6 శాతం)ని కూడా మరింత తగ్గించి, మార్కెట్ వ్యాల్యూని కొంత మేరకు పెంచినట్లయితే ఎక్కువమంది తమ ఆస్తులను అసలు విలువ ప్రకారమే రిజిస్ట్రేషన్లు చేయించుకుంటారని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. అసలు విలువకే రిజిస్ట్రేషన్లు జరిగిన పక్షంలో నల్లధనాన్ని నియంత్రించేందుకు వీలవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రెవెన్యూ లక్ష్యం రూ.4,291 కోట్లను చేరాలంటే స్టాంప్‌డ్యూటీ హేతుబద్ధీకరణ, మార్కెట్ విలువ పెంపు తప్పనిసరిగా చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
స్టాంప్‌డ్యూటీ హేతుబద్ధీకరణ!
Published Mon, Jul 11 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 4:33 AM
Advertisement