♦ రాష్ట్రంలో పుంజుకున్న భూముల రిజిస్ట్రేషన్లు
♦ ఆర్నెల్లలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.1,636.17 కోట్లు
♦ గతేడాది కన్నా 31.33 శాతం అధికంగా రాబడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యాన్ని చేరలేక చతికిలపడిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఈ ఏడా ది తొలి ఆర్నెల్లలో దూకుడు బాగానే పెంచింది. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,636.17 కోట్ల రాబడి సాధించింది. గతేడాదితో పోల్చితే 31.83 శాతం (రూ.395.10 కోట్లు) ఆదాయం పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరగడం ఆ శాఖ ఉన్నతాధికారులకు ఊరట కలిగిస్తోంది. జిల్లాల వారీగా సెప్టెంబర్ నెల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆర్నెల్ల ఆదాయాన్ని పరిశీలి స్తే.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో గతేడాది (రూ.604.25 కోట్లు) కన్నా రూ.246.03 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది.
ఆ తర్వాత గతేడాది(రూ.234.05కోట్లు) కన్నా రూ.40 కోట్ల అదనపు ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. పెరుగుదల విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లాలో గతేడాది(రూ.58.78కోట్లు) కన్నా 56.14 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో గతేడాది (రూ.33.71కోట్లు) కన్నా 11.16 శాతం అధికంగా ఆదాయం నమోదైంది. రెండేళ్లకోమారు రిజిస్ట్రేషన్ ధరలను సమీక్షించడం సాధారణ విషయమే అయినప్పటికీ ఈ ఏడాది ప్రభుత్వం భూముల విలువను పెంచలేదు. గతంలో మాదిరిగానే ఈసారీ ప్రభుత్వం భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల ఆదాయం మరింత పెరిగుండేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఏపీకన్నా తెలంగాణే బెటర్!
రాష్ట్ర పునర్విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏపీలో రాష్ట్ర అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించకపోతుండడంతో.. భూములపై పెట్టుబడులు పెట్టేందుకు కొద్దినెలలు వేచి చూసిన జనం తమ పెట్టుబడులకు తెలంగాణనే అనువైనదిగా భావించారు. తెలంగాణలో ఉంటున్నవారి కొనుగోలు శక్తి పెరగ డంతో పాటు భూముల ధరలు అన్నివర్గాలకు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.
విభజన అనంతరం తెలంగాణలో భూముల ధరలు తగ్గకున్నా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నా తక్కువగా ఉండడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎలాగుంటుందోనన్న సందేహంతో కూడా కొన్నాళ్లు వేచిచూసిన ప్రజలు, ప్రభుత్వం స్థిరమైనదిగా అనిపించడంతో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రతినెలలోనూ బాగానే పెరుగుతుండగా, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రం పెరుగుదల ఓ మోస్తరుగా ఉంది. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గతేడాది సెప్టెంబరు కన్నా, ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.
పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
Published Sun, Oct 11 2015 3:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:44 AM
Advertisement