సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. గత రెండు నెలలుగా లక్షల సంఖ్యలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆ శాఖకు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. శూన్యమాసం అయినప్పటికీ డిసెంబర్, జనవరి నెలలమధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్‌లో అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.430 కోట్లకు పైగా ఆదాయం రావడం గమనార్హం.
రికార్డుస్థాయి ఆదాయం
డిసెంబర్‌నెల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఎప్పు డూ ఒక్క నెలలో రూ.400 కోట్లకు మించి ఆదాయం రాలేదు. లక్షకు లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. కానీ, డిసెంబర్ నెలలో మాత్రం ఒక లక్షా 8వేలకు పైగా లావాదేవీల ద్వారా రూ.430 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. ఇదే ఊపు జనవరిలోనూ కొనసాగుతోంది. ఈనెలలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు 42,286 లావాదేవీలు జరగ్గా, రూ.151.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారానే రాగా, ఆన్‌లైన్ ఈ–చలాన్ల ద్వారా మరో రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.4వేల కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటివరకు ఈ ఏడాది 8,50,148 లావాదేవీలు జరగ్గా, రూ. 3,440.58 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఈసారి లక్ష్యాన్ని మించుతుందని అంచనా వేస్తున్నారు.
మంచిరోజులు కాకపోయినా..
డిసెంబర్ 16 నుంచి శూన్యమాసం ప్రారంభమైంది. సంక్రాంతి దాటేంతవరకు ఉండే ఈ మాసంలో శుభ కార్యాలకు మెజార్టీ ప్రజలు ఇష్టపడరు. అయినా, రిజిస్ట్రేషన్ లావాదేవీలు పోటెత్తుతుండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుభ కార్యం కాదని, ఆషాఢమాసంలో బంగారం ఎక్కువగా కొన్నట్టు ఓ పనయిపోతుందిలే అనే భావనలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గతంలో మాదిరిగా శూన్యమాసం సెంటిమెంట్‌ను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పంట భూముల రిజిస్ట్రేషన్లు అంతగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని, ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.
సొంత సర్వర్‌తో వేగంగా లావాదేవీలు..
సాంకేతికంగా శాఖాపరమైన మార్పులు కూడా ఆదాయాభివృద్ధికి కారణమవుతున్నాయని అంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెట్‌వర్క్ నుంచి విడిపోయి ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ, హైదరాబాద్ గచ్చిబౌలిలో అతి పెద్ద సర్వర్‌ను కూడా ఏర్పాటు చేసుకుని దానిని రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసింది. దీంతో గతంలో మాదిరిగా సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో అంతరాయం కలగడం లేదని, చకచకా ప్రక్రియ ముగిసిపోతుండడంతో మరిన్ని లావాదేవీలు నమోదు చేస్తున్నామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment