సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖతో రాష్ట్ర ఖజానా కు కాసుల పంట పండుతోంది. ఏటేటా ఈ శాఖ ఆదాయం పెరుగుతుండగా.. ఊహించని విధంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.5,357కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదితో పోలిస్తే ఇది వెయ్యికోట్లు అదనం. ఈ ఏడాది లక్ష్యానికీ అందనంత దూరంలో వచ్చిన ఆదాయం లెక్కలు ఆ శాఖ అధికారులనూ ఆశ్చర్య పరుస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే.. ప్రతి నెల ఆదాయంలో వృద్ధి కనిపించగా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత 5 నెలల పాటు మాత్రం ఈ వృద్ధిలో కొంత తరుగుదల కనిపించింది. మొత్తం మీద ఈ ఏడాది 27 శాతం పెరుగుదల నమోదైంది. ఇది రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దేశంలోనే అత్యధికమని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
శుభారంభం
గతేడాది లెక్కలను పరిశీలిస్తే ఈ ఏడాది జనవరిలోనే రిజిస్ట్రేషన్ల శాఖ శుభారంభం చేసింది. 2017–18 ఏప్రిల్ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.274.22 కోట్ల ఆదాయం రాగా, 2018–19 ఏప్రిల్‌లో ఏకంగా రూ.411.51 కోట్లు వచ్చింది. ఇది గతేడాదితో పోలిస్తే 50% కన్నా ఎక్కువ. ఇక, ఆ తర్వాత మే, జూన్, జూలై మాసాల్లో అంతకుముందు ఏడాది కన్నా 20–28% వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయంలో వృద్ధి కనిపించగా, ఆగస్టు నాటికి అది పతాకస్థాయికి చేరింది. సెప్టెంబర్‌లోనూ 59.19% వృద్ధి కనిపించి నా ఆ తర్వాత ఈ వేగం కాస్త తగ్గుముఖం పట్టింది. 2018 సెప్టెంబర్‌లో ప్రభుత్వ రద్దు, ముందస్తు ఎన్నికలకు సంబంధించిన వాతావరణం కనిపించడంతో కొంత మేర లావాదేవీలు తగ్గినా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మాత్రం కొంత ఎక్కువ ఆదాయమే వచ్చింది. అక్టోబర్‌లో 18.11, నవంబర్‌లో 11.66% వృద్ధి రేటు నమోదు కాగా, ఎన్నికలు జరిగిన డిసెంబర్‌లో మాత్రం గతేడాది కన్నా 4.85% మాత్రమే ఆదాయం ఎక్కువగా సమకూరింది. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరిల్లోనూ కొంత వృద్ధి మందగించినా, మార్చిలో మళ్లీ 38.38% వృద్ధిరేటుతో ఘనంగా ఆర్థిక సంవత్సరం ముగిసిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మొత్తం మీద క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈసారి 26.87% వృద్ధి రేటు నమోదయింది. ఇక, ఆదాయం విషయానికి వస్తే మొత్తం రూ.6,600 కోట్లు సమకూరాయి. అందులో స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన 1.5% రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తే నికరంగా రాష్ట్ర ఖజానాకు రూ.5357.37 కోట్లు సమకూరడం గమనార్హం.
లక్ష్యం ఒక నెల ముందే!
వాస్తవానికి 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ4,700 కోట్ల ఆదాయం వస్తుందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేసుకుని.. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అయితే, ఈ లక్ష్యం కేవలం 11 నెలల్లోనే పూర్తయి 2019 ఫిబ్రవరి నాటికే రూ.4,745 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక, డాక్యుమెంట్ల విషయంలోనూ 41% మేర వృద్ధి కనిపించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,16,928 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా, 2018–19 సంవత్సరంలో 1,65,464 లావాదేవీలు జరిగాయి. ఒక్క హైదరాబాద్ (దక్షిణ) జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మినహా మిగిలిన అన్ని చోట్లా లావాదేవీల్లో వృద్ధి రేటు కనిపించింది.
కారణాలు అనేకం
ఈ ఏడాది ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగేందుకు చాలా కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత లేకపోవడం రియల్ రంగానికి ఊపు తెచ్చిందని వారంటున్నారు. సానుకూల వాతావరణ పరిస్థితులు, రియల్ రంగానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల కారణంగా అటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇటు నిర్మాణ రంగంలోనూ పురోగతి కనిపించిందని అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా రియల్‌బూమ్ కనిపిస్తోందని, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల ఆదాయం వస్తున్నా దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్ పరిసరాల్లో ఆదాయం పెరిగిందని వారంటున్నారు. హైదరాబాద్ శివార్లలో, నగరాన్ని ఆనుకుని ఉన్న ఉమ్మడి జిల్లాల పరిధిలో భూమిపై పెట్టుబడి బంగారంగా మారిందని, ఈరోజు పెట్టిన పెట్టుబడి ఏడాది, రెండేళ్ల తర్వాత చూస్తే మూడు, నాలుగింతలు కావడంతో ఎక్కువ మంది భూమిపై పెట్టుబడి పెడుతున్నారని చెబుతున్నారు. దీనికి తోడు పెద్ద నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్లపై వచ్చిన నిరాసక్తత అలాగే కొనసాగడం కూడా కారణంగా కనిపిస్తోంది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఐటీ రంగంతో అనుసంధానం కావడం, ఆ శాఖ పరిధి లోని కార్యాలయాల్లో సర్వర్లను అప్‌గ్రేడ్ చేయడం, గతంలోలా కాకుండా అవాంతరాలు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేలా రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులు నేతృత్వంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది.
రీజనల్ రింగ్‌రోడ్డుతో రయ్..రయ్!
అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీజనల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపార దశను మార్చివేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన హైదరాబాద్ నగరాన్ని మరింత విస్తరింపజేసిందని, ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల పరిధిలో ట్రిపుల్ ఆర్ మాస్టర్‌ప్లాన్‌ను ఆనుకుని పెద్ద ఎత్తున క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదే అంశాన్ని రిజిస్ట్రేషన్ల ఆదాయ లెక్కలూ ధ్రువీకరిస్తున్నాయి. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లా పరిధిలో 31.52%, నల్లగొండలో 71.91%, మెదక్ పరిధిలో 49.39%, మహబూబ్‌నగర్‌లో 70.79% డాక్యు మెంట్ల నమోదు పెరిగింది. ఆదాయం విషయానికి వస్తే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలో రూ.1121.44 కోట్లు, నల్లగొండలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఏడాదితో పోలిస్తేæ 50% ఎక్కువగా రూ.265.53 కోట్లు, మెదక్‌లో రూ.436.11 కోట్లు (55.05% వృద్ధి), మహబూబ్‌నగర్‌లో 40.90% వృద్ధితో 141.82 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. వీటితో పాటు రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌తోపాటు ఖమ్మం, కరీంనగర్ రిజిస్ట్రార్ జిల్లాల పరిధిలో కూడా ఆదాయం పెరగడం గమనార్హం.
రిజిస్ట్రేషన్స్ భళా.. ఖజానా కళకళ!
Published Thu, Apr 25 2019 12:55 AM | Last Updated on Thu, Apr 25 2019 12:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment