సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మద్యానికి డిమాండ్ ఫుల్లుగా పెరిగింది. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో వ్యాట్ పోగా రూ.15 వేల కోట్లకుపైగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చింది. ఇక లిక్కర్ బాటిళ్ల వారీగా చూస్తే.. ఈ 11 నెలల కాలంలో 2.4 కోట్ల కేసుల బీర్లు, మూడు కోట్ల కేసులకుపైగా లిక్కర్ విక్రయాలు నమోదుకావడం గమనార్హం.
లక్ష్యం రూ.16 వేల కోట్లు
కరోనా కారణంగా రాష్ట్ర ప్రజలతోపాటు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయ వనరులేవీ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. కానీ ఎక్సైజ్ ఆదాయ అంచనాలు మాత్రం లక్ష్యాన్ని చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ రాబడుల కింద రూ.16 వేల కోట్లు సమకూర్చుకోవాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకోగా.. మరో నెల గడువు ఉండగానే రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. మార్చిలో మిగతా వెయ్యి కోట్లకన్నా ఎక్కువే రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గతేడాది లాక్‌డౌన్ టైంలో మార్చి 22 నుంచి మే 6వ వరకు 46 రోజుల పాటు మద్యం విక్రయాలు జరగలేదు. ఆ టైంలో కూడా వైన్‌షాపులు, బార్లు తెరిచి ఉంటే మరో 2వేల కోట్ల మేర ఆదాయం ఎక్కువగా వచ్చేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తమ్మీద జీఎస్టీ, అమ్మకపు పన్ను, రిజిస్ట్రేషన్లు వంటి కీలక రంగాల నుంచి ఆదాయం తగ్గినా.. మద్యం రాబడి పెరగడంతో ఖజానాకు ఇబ్బంది తప్పిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు..
8.22 లక్షల లీటర్ల లిక్కర్
గత 11 నెలల మద్యం విక్రయాల లెక్కలను చూస్తే.. రాష్ట్రంలో రోజుకు 5.6 లక్షల లీటర్ల బీర్లు, 8.22 లక్షల లీటర్ల లిక్కర్ తాగేస్తున్నారని వెల్లడవుతోంది. ఈ 11 నెలల్లో 3 కోట్ల కేసులకుపైగా లిక్కర్, 2.4 కోట్ల కేసులకుపైగా బీర్లు అమ్ముడయ్యాయి. ఒక్కో లిక్కర్ కేసులో 9 లీటర్ల మద్యం, బీర్ కేసులో 7.8 లీటర్ల బీర్ ఉంటుంది. ఈ లెక్కన గత 334 రోజుల్లో మందుబాబులు.. లిక్కర్, బీర్లు కలిపి రోజుకు 14 లక్షల లీటర్ల వరకు తాగుతున్నారు. ఇక ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 28 లక్షల కేసుల లిక్కర్, 33 లక్షల కేసుల బీర్ అమ్ముడయ్యాయి. వీటి విలువ 2,727 కోట్లు. ఫిబ్రవరిలో 28 రోజులే ఉండడం, ఇతర కారణాలతో డిపోల నుంచి మద్యం కొంత తక్కువ వెళ్లింది. జనవరి కంటే 3 లక్షల కేసుల లిక్కర్, 5 లక్షల కేసుల బీర్లు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే మార్చిలో మద్యం విక్రయాలు మళ్లీ పెరుగుతాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.
11 నెలల్లో రూ.15 వేల కోట్లు
Published Thu, Mar 4 2021 1:34 AM | Last Updated on Thu, Mar 4 2021 5:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment