సాక్షి, హైదరాబాద్: మద్యం అమ్మకాలు జోరుగా జరగడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసుల పంట పండింది. 2021–22కిగాను ఏప్రిల్, మే, జూన్‌లలో కలిపి రూ. 6,741.44 కోట్ల విలువైన మద్యం అమ్మకాలపై రూ. 5 వేల కోట్ల మేర ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇక ఈ నెల 18 వరకు రూ. 1,436 కోట్ల విలువైన మద్యం విక్రయాలు గణాంకాలు జరిగాయని బ్రూవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం కింద రూ.16 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచ నా వేయగా తొలి 3 నెలల్లోనే సుమారు 5 వేల కోట్ల (దాదాపు 30%) ఆదాయం రావడం గమనార్హం.
ఆ ఐదు జిల్లాల్లోనే 50 శాతానికి పైగా...
రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో మద్యం విక్రయాలు జరుగుతుండగా రెండో స్థానంలో నల్లగొండ, ఆ తర్వాత హైదరాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ (అర్బన్) జిల్లాలున్నాయి. ఈ మూడు నెలల్లో కలిపి రంగారెడ్డి జిల్లాలోనే రూ. 1,500 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్‌లో రూ. 534.83 కోట్లు, మేలో రూ. 450.67 కోట్లు, జూన్‌లో రూ. 495.08 కోట్ల విలువైన మద్యం రంగారెడ్డి జిల్లాలో అమ్ముడుపోయింది.
నల్లగొండ జిల్లాలో ఏప్రిల్‌లో రూ. 251.32 కోట్లు, మేలో రూ. 243.32 కోట్లు, జూన్‌లో రూ. 267.5 కోట్ల అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్‌లో ఈ మూడు నెలల్లో కలిపి రూ. 650 కోట్లు, మహబూబ్‌నగర్‌లో రూ.570 కోట్లు, వరంగల్ అర్బన్‌లో రూ. 555 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
మేలో తగ్గిన బీర్ విక్రయాలు
ఈ మూడు నెలల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే ప్రతి నెలలో 27 లక్షలకుపైగా కేసుల లిక్కర్ అమ్ముడవుతోంది. జూన్‌లో మాత్రం అత్యధికంగా 28.73 లక్షల కేసుల మేర లిక్కర్ విక్రయాలు జరిగాయి. బీర్ల విషయానికి వస్తే ఏప్రిల్, జూన్‌లలో 26 లక్షలకుపైగా కేసులు అమ్ముడు కాగా, మేలో సుమారు 20 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి.
ఇందుకు బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడమే కారణమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో డిస్టిల్లరీలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయని, ఆ తర్వాత రూ.10 చొప్పున ప్రతి బాటిల్‌పై ప్రభుత్వం ఉపశమనం ఇవ్వడంతో జూన్‌లో బీర్ల ఉత్పత్తి, అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment