Beer Companies: హడావుడిగా అనుమతి.. వెంటనే నిలిపివేత | Criticism Of Excise Department In Case Of Beer Companies In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

Beer Companies: హడావుడిగా అనుమతి.. వెంటనే నిలిపివేత

Published Tue, Jun 11 2024 5:54 AM | Last Updated on Tue, Jun 11 2024 10:21 AM

Criticism of excise Department in case of beer companies in Telangana

బీర్ల కంపెనీల విషయంలో ఎక్సైజ్‌ తీరుతో విమర్శలు 

రూ.1,500 కోట్ల బకాయిలు చెల్లించకపోతే బీర్లు సరఫరా చేయలేమన్న పాత బ్రూవరీలు 

గుట్టు చప్పుడు కాకుండా ఐదు కొత్త కంపెనీలకు అధికారుల అనుమతులు 

అది కూడా రాష్ట్రంలో ఎవరూ తాగని బ్రాండ్లు తయారు చేసే కంపెనీలకు..!

సాక్షి, హైదరాబాద్‌: బీర్ల తయారీ కంపెనీలకు, సర్కారుకు మధ్య వారధిగా ఉండి ఎలాంటి సమస్య రాకుండా చూడాల్సిన ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టకు పోయి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. బీర్ల తయారీ కోసం రాష్ట్రంలో అనుమతి పొందిన పాత కంపెనీలతో సమన్వయం చేసుకోకుండా.. కొత్త కంపెనీలకు అనుమతులిచ్చి, ఆ తర్వాత సదరు అనుమతులను నిలిపివేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారుల తీరుతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అన్ని డిపోల్లో కలిపి కనీసం 15 రోజుల స్టాక్‌ ఉండాల్సి ఉండగా, కేవలం రెండున్నర రోజులకు సరిపడా మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం.  

పాత బకాయిలే తలనొప్పి 
బీర్లు, మద్యం తయారీ కంపెనీలు బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు మద్యం ఇచ్చిన తర్వాత వాటిని డిపోల ద్వారా రిటైలర్లకు అమ్మిన 45 రోజుల్లోగా సదరు తయారీ కంపెనీలకు బేసిక్‌ ప్రైస్, ఎక్సైజ్‌ డ్యూటీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు సరిగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.1,500 కోట్లకు చేరాయి. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లిస్తోంది. 

కానీ పాత బకాయిలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సదరు కంపెనీలు తమకు పాత బకాయిలు ఇప్పించాలని, లేదంటే బీర్లు సరఫరా చేయలేమని ఎక్సైజ్‌ శాఖపై ఒత్తిడి పెంచారు. వేసవిలో సీజన్‌ కావడంతో బీర్లు తయారు చేసే బ్రెవరీలతో సమన్వయంతో వ్యవహరించి బీర్లను అందుబాటులోకి తేవాల్సిన ఎక్సైజ్‌ ఉన్నతాధికారులు రూటు మార్చారు. పాత కంపెనీలను కాదని, గుట్టుచప్పుడు కాకుండా సోమ్‌ సహా ఐదు కొత్త బ్రెవరీలకు అనుమతినిచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కొత్త బ్రెవరీలకు బ్రేక్‌ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.  

బేర్‌ మంటున్న బీర్‌ స్టాక్‌ 
ఎక్సైజ్‌ అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడేలా ఉంది. రాష్ట్రంలో యూబీ (2 యూనిట్లు), అన్‌హైజర్‌ బుష్‌ (ఏబీ–2 యూనిట్లు), కారŠల్స్‌బర్గ్, లీలాసన్స్‌ కంపెనీలు అనుమతులు పొంది బీర్లు తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే బీర్లలో సింహభాగం యూబీ, ఏబీ కంపెనీలు తయారు చేసేవే. కాగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించడం లేదా సదరు కంపెనీలతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు బీర్లను తయారు చేయించడం ఎక్సైజ్‌ ఉన్నతాధికారుల విధి. కానీ అలా చేయకుండా కొత్త బ్రెవరీలకు అనుమతినివ్వడం, మళ్లీ నిలిపివేయడంతో బీర్ల కొరత ఏర్పడింది. 

ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రోజుకు 1.25 లక్షల కేసుల బీర్లు అవసరమవుతాయని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కలిపి 3 లక్షల కేసులు మాత్రమే స్టాక్‌ ఉందని తెలుస్తోంది. కాగా కొత్త బ్రెవరీల పేరుతో అనుమతులిచి్చన ఐదు కంపెనీల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన సోమ్‌ బ్రెవరీస్‌ వుడ్‌ పెక్కర్, హంటర్‌తో పాటు మరో బ్రాండ్‌ తయారు చేస్తుందని, మిగిలినవి కర్జూరా బీర్లతో పాటు బిర్యానీ అనే బ్రాండ్‌ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కాగా కొత్తగా అనుమతినిచి్చన కంపెనీల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగించే బీర్లు తయారు చేసేవి కాకపోవడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement