సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సొంత పన్నుల ఆదాయం వేగంగా పెరుగుతోంది. ఖజానాకు గణనీయంగా రాబడి సమకూరుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి తొలి ఏడు నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం దాదాపు రెండింతలు కావడం గమనార్హం. రెండేళ్ల క్రితం తొలి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) అన్నిపన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.22,846 కోట్ల ఆదాయంరాగా.. ఈ ఏడాది అదే సమయానికి రూ.40,788 కోట్లు సమకూరింది. నిజానికి గత ఏడాది (2021–22) నుంచే ఆదాయం పెరగడం మొదలైందని.. అదే ఒరవడి కొనసాగుతోందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెప్తున్నారు. గత ఏడాది కన్నా ఈసారి అన్ని పన్నుల ఆదాయం సగటున 10 శాతం పెరిగిందని వివరిస్తున్నారు.
వ్యాట్ నుంచి అధికంగా..
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రెండు రూపాల్లో సమకూరుతుంది. పెట్రో ఉత్పత్తులు, లిక్కర్‌లపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూపంలో, ఇతర అన్నిరకాల వ్యాపార లావాదేవీలపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) రూపంలో రాబడి వస్తుంది. ప్రస్తుతం వ్యాట్ కింద పెట్రోల్, లిక్కర్‌ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ద్వారా 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి రెండింతలకుపైగా ఖజానాకు సమకూరింది.
2020–21లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ ద్వారా రూ.3,970 కోట్లురాగా.. ఈసారి ఏకంగా రూ.8,770 కోట్లకు చేరింది. లిక్కర్‌పై వ్యాట్ రాబడి కూడా 40 శాతం వరకు పెరిగింది. 2020–21 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు రూ.6వేల కోట్లు సమకూరగా.. 2021–22లో రూ.7,529 కోట్లు, ఈసారి రూ.8,384 కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే 10 శాతం పెరిగింది. ఇక ఇతర వ్యాపార లావాదేవీలపై విధించే వ్యాట్ కలిపి ఈ ఏడాది మొత్తంగా రూ.17,560 కోట్లు ఖజానాకు చేరింది. ఇది 2020–21లో రూ.10,367 కోట్లు, 2021–22లో రూ.15,340 కోట్లు మాత్రమే కావడం గమనార్హం.
జీఎస్టీ పరిహారం రాకపోయినా..
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తికావడంతో ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పరిహారాన్ని కేంద్రం నిలిపివేసింది. ఆ పరిహారం రాకపోయినా జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూసుకెళుతోంది. అక్టోబర్ చివరినాటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జీఎస్టీ రూపంలో రూ.21,322 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరింది.
ఇందులో ఎస్‌జీఎస్టీ రూ.9,537.63 కోట్లుకాగా, ఐజీఎస్టీలో వాటా రూ.10,801 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పన్ను రాబడి 31 శాతం వృద్ధి చెందడం విశేషం. ఎస్‌జీఎస్టీ, ఐజీఎస్టీ కలిపి 2020–21లో రూ.10,917 కోట్లు, 2021–22లో రూ.16,222 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. అంటే రెండేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెండింతలు పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
మొత్తంగా వ్యాట్, జీఎస్టీ రెండూ కలిపి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వస్తుండటం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడునెలలతో పోలిస్తే.. ఈసారి జూలై, అక్టోబర్ నెలల్లో పన్ను వసూళ్లు కాస్త తగ్గాయని తెలిపారు. కానీ మిగతా ఐదు నెలల్లో అధిక వృద్ధితో మొత్తంగా పన్ను వసూళ్లు పెరిగాయని వివరించారు.
Telangana: పన్నుల ఆదాయం రెండేళ్లలో డబుల్!
Published Thu, Dec 1 2022 2:55 AM | Last Updated on Thu, Dec 1 2022 2:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment