
సాక్షి, హైదరాబాద్: మద్యం తయారీ ధరల పెంపు కోసం డిస్టలరీలు ఎత్తులు వేస్తున్నాయి. పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని చీప్ లిక్కర్ కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే దెబ్బకు దెబ్బ అన్నట్టు ఎక్సైజ్ శాఖ ఏకంగా మద్యం దిగుమతులకు సిద్ధమవుతోంది. అయినా ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో చీప్ లిక్కర్‌కు స్వల్ప కొరత ఏర్పడింది. డిస్టలరీలు తయారీ నిలిపివేయడంతో పాపులర్ బ్రాండ్ చీప్ లిక్కర్ మార్కెట్‌లో దొరకడం లేదు. ధర ఎక్కువ ఉన్న బ్రాండ్లే మందు ప్రియులకు దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా పండుగ నాటికి అసలు మందు దొరికే పరిస్థితి ఉండదనే వదంతులు కూడా ఎక్సైజ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అసలేం జరిగింది?
కరోనా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత రాష్ట్రంలో మూడుసార్లు మద్యం ధరలు పెరిగాయి. కానీ మద్యం తయారు చేసినందుకు గాను డిస్టలరీలకు చెల్లించే ప్రాథమిక ధర (లిక్కర్ కేస్‌కు చెల్లించే బేసిక్ ప్రైస్)ను మాత్రం ప్రభుత్వం పెంచలేదు. దీంతో పెరిగిన ధరల మేరకు ఆదాయమంతా ప్రభుత్వ ఖజానాకు వెళుతోంది. ఈ నేపథ్యంలో బేసిక్ ప్రైస్ పెంపు కోసం డిస్టలరీలు ప్రయత్నించాయి.
ఈఎన్‌ఏ కొరత అంటూ..
రాష్ట్రంలో ప్రతిరోజూ లక్ష కేసుల వరకు మద్యం అమ్ముడవుతుంది. ఈ లక్ష కేసుల మద్యాన్ని తయారు చేసేందుకు గాను 4 లక్షల లీటర్ల ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ) అవసరమవుతుంది. ఈ ఈఎన్‌ఏ తయారీ కోసం రాష్ట్రంలో 8 ప్రైమరీ డిస్టలరీలున్నాయి. ఈ డిస్టలరీల్లో రెక్టిఫైడ్ స్పిరిట్, ఇథనాల్‌తో పాటు ఈఎన్‌ఏ కూడా తయారవుతుంది.
ఇందులో స్పిరిట్, ఇథనాల్‌ను ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌గా పరిగణిస్తారు. ఈఎన్‌ఏతో సెకండరీ డిస్టలరీలు మద్యం తయారు చేస్తాయి. అయితే ఈఎన్‌ఏ తయారు చేయడం కోసం ప్రైమరీ డిస్టలరీలకు ఆహార ధాన్యాలు (గోధుమలు, బియ్యం), మొలాసిస్ అవసరం. తెలంగాణలోని డిస్టలరీల్లో నూక బియ్యాన్ని మాత్రమే ఉపయోగించి ఈఎన్‌ఏ తయారు చేస్తారు.
కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎంఆర్) వ్యవహారంలో మిల్లులపై ఎఫ్‌సీఐ దాడులు చేయడంతో నూక బియ్యం సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం నాలుగు డిస్టలరీలే ఈఎన్‌ఏను పూర్తిస్థాయిలో తయారు చేస్తున్నాయి.
ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని డిస్టలరీలు ఎత్తు వేశాయి. మద్యం తయారుచేసే ఈఎన్‌ఏ (ముడిసరుకు) ధర పెరిగిందని, అసలు ముడిసరుకు దొరకడం లేదని, నాలుగు డిస్టలరీల్లో తయారవుతున్న ఈఎన్‌ఏ.. ప్రీమియం బ్రాండ్ల తయారీకి అవసరమవుతుందంటూ చీప్ లిక్కర్ తయారీని డిస్టలరీలు నిలిపివేశాయి. బేసిక్ ప్రైస్ పెంచాలని ప్రతిపాదించాయి.
ఎక్సైజ్ పరిశీలనలో గుట్టు రట్టు
డిస్టలరీల ప్రతిపాదనను ఎక్సైజ్ శాఖ నిశితంగా పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. అసలు ఈఎన్‌ఏ కొరతే లేదని, అవసరాల మేరకు ఈఎన్‌ఏ అందుబాటులో ఉందని తేలింది. రోజుకు 4 లక్షల లీటర్ల ఈఎన్‌ఏ అవసరం కాగా, డిస్టలరీల్లో 10 రోజులకు సరిపడా (అంటే 40 లక్షల లీటర్లు) స్టాక్ ఉందని గుర్తించింది. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న నాలుగు ప్రైమరీ డిస్టలరీల నుంచే రోజుకు 3.5 లక్షల లీటర్ల ఈఎన్‌ఏ ఉత్పత్తి అవుతోందని తేలింది.
అయినప్పటికీ ఒకవేళ సరిపోని పక్షంలో ముడిసరుకును మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాలని, ఇందుకు గాను ప్రతి లీటర్‌పై ఉన్న రూ.4 సుంకాన్ని ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అవసరమైతే చీప్ లిక్కర్‌ను కూడా దిగుమతి చేసుకోవాలని, ఇందుకోసం ప్రతి కేస్‌పై వసూలు చేసే ఆరు రూపాయల సుంకాన్ని కూడా ఎత్తివేస్తామని ప్రతిపాదించింది. అదే సమయంలో డిస్టలరీలు కోరుతున్న విధంగా బేసిక్ ప్రైస్ పెంచేందుకు శాఖాపరమైన కమిటీని నియమించి, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది.