- ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కనీస విద్యార్హత పదోతరగతి నుంచి ఇంటర్మీడియట్ కు పెంపు
- లబద్ధిపొందనున్న వేలమంది ఉద్యోగులు.. పెంచిన విద్యార్హత ఆధారంగా మరో నోటిఫికేషన్ కు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల విద్యార్హతలో కీలక సవరణలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఇప్పటివరకు పదోతరగతి ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ఉండేది. కొత్త ఉత్తర్వుల ప్రకారం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉంటేగానీ ఆ పోస్టులకు అర్హులు కారు. ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తోన్న సిబ్బందితోపాటు కొత్తగా చేపట్టే నియామకాలకు కూడా ఇంటర్ విద్యార్హత వర్తించనుంది.
వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే సివిల్ పోలీస్‌శాఖలోని కానిస్టేబుల్ పోస్టుల కనీస విద్యార్హత ఎస్‌ఎస్‌సీ నుంచి ఇంటర్మీడియట్ కు పెంచారు. కానీ, ఎక్సైజ్ శాఖలో మాత్రం ఆ మార్పు చోటుచేసుకోలేదు. దీని వల్ల జీతభత్యాలు, పీఆర్‌సీ తదితర విశయాల్లో ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో పనిచేస్తోన్న కానిస్టేబుళ్లలో చాలామంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం వారి విద్యార్హత పదోతరగతిగానే పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది.
కానిస్టేబుళ్ల నియామానికి త్వరలో నోటి ఫికేషన్?
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల విద్యార్హతను ఎస్‌ఎస్‌సీ నుంచి ఇంటర్మీడియట్‌కు మార్చిన నేపథ్యంలో కొత్త నియామకాలకు సర్కార్ పచ్చజెండా ఊపినట్టేనని ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి. కొత్తగా 1,000కి పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం.
'కానిస్టేబుళ్ల విద్యార్హత'లో కీలక సవరణలు
Published Mon, Feb 8 2016 7:50 PM | Last Updated on Thu, Jul 11 2019 8:43 PM
Advertisement
Advertisement