ఆబ్కారీకి ఆయుధాలు
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ ప్రభుత్వం ఆబ్కారీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వనుంది. గుడుంబా, గంజాయి స్మగ్లర్ల నుంచి ప్రాణాపాయం లేకుండా వీరికి తుపాకులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆబ్కారీ శాఖ నుంచి వివరాలు కోరింది. ఈ మేరకు అధికారులు ఎంత మంది సిబ్బంది ఉన్నారు? ఎన్ని ఆయుధాలు అవసరం అనే నివేదికలు ప్రభుత్వానికి పంపించారు.
ఆయుధాలు ఎందుకు?
జిల్లాలో గుడుంబా తయారీ, గంజాయి సాగు అధికంగా ఉంది. వీటిని అరికట్టడానికి ఆబ్కారీ అధికారులు వెళ్లినప్పుడు స్మగ్లర్లు దాడులు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. చేతుల్లో ఆయుధాలు లేకపోవడంతో వారి దాడులను ఎదుర్కోవడం లేదు. ఆయుధాలు లేకపోవడంతో పోలీసుల సహాయం తీసుకోవాల్సి వస్తోంది. పోలీసులు విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పుడు స్మగ్లర్లు తప్పించుకు పోతున్నారు. పోలీసు శాఖపై ఆధారపడకుండా ఆబ్కారీ శాఖకు ఆయుధాలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు భావించినా అమలుకు నోచుకోలేదు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ మేరకు చొరవ చూపుతోంది. ఎక్సైజ్ శాఖకు ఆయుధాలు ఇవ్వనున్నట్లు నిర్ణయించినట్లు ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సమస్యాత్మక ప్రాంతాల్లోనే..
జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్, ఇద్దరు ఎక్సైజ్ సూపరిటెం డెంట్‌లు, 11 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు 50 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 160 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లాలోని గుడుంబా తయారయ్యే సమస్యాత్మక ప్రాంతాల్లోనే ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో చెన్నూరు, లక్సెట్టిపేట, ఉట్నూర్, ఇచ్చోడ, నిర్మల్, మంచిర్యాల స్టేషన్‌ల పరిధిలో గుడుంబా స్థావరాలు అధికంగా ఉంటాయి.
ఈ స్టేషన్ల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అయితే ఈ స్టేషన్‌లో పరిధిలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బందిపై గుడుంబా తయారీదారులు, గంజాయి సాగు చేసేవారు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంత ఎక్సైజ్ అధికారులతోపాటు సిబ్బందికి కూడా ఆయుధాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నివేదిక పంపాం..
- శివరాజు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
గుడుంబా తయారీ నియంత్రణలో ఎక్సైజ్ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి నివేదించాం. శాఖపరంగా అన్ని సమగ్ర వివరాలు అందజేశాం. ఆయుధాలు లేకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గుడుంబా స్థావరాలపై దాడులు చేసే సమయంలో పోలీసుల సహాయం తీసుకుంటున్నాం. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇంక ఎలాంటి ఆదేశాలు రాలేదు.