cannabis
-
Hyderabad: నడిరోడ్డుపై హంగామా
చార్మినార్ : చార్మినార్ ఆర్టీసి బస్టాప్ రోడ్డులో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఆదివారం సాయంత్రం హంగామా చేశారు. గంజాయి మత్తులో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎవరు.. ఎవరిని.. ఎందుకు.. కొడుతున్నారో వారికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. రాకపోకలు సాగిస్తున్న వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొంత మంది వాహన దారులు సర్ది చెప్పే ప్రయత్నం చేయడంతో వారిని సైతం నెట్టివేస్తు దుర్భాషలాడారు. కనిపించని పోలీసులు... ఇంత జరుగుతున్నా...సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడం గమనార్హం. అసలే వీకెండ్ అయిన ఆదివారం కావడంతో సహజంగానే సాధారణ రోజుల కన్నా..ఆదివారం సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. గతంలో తొలగించిన చారి్మనార్ ఆర్టీసి బస్టాండ్ భవనం ఎదురుగా ఉన్న ప్యారిస్ కేఫ్ రోడ్డులో ఈ గలాటా జరిగింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు సైతం విధినిర్వాహణలో కనిపించ లేదు. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన చారి్మనార్, హుస్సేనీఆలం, మొఘల్‌పురా లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల సరిహద్దులో జరిగింది. అయితే సంఘటన జరిగిన ప్రదేశం మొఘల్‌పురా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు చెబుతున్నారు. -
గంజాయి గురించి పరిశోధనలో షాకింగ్ విషయాలు?!
మన దేశంలో గంజాయి తాగడం నిషిద్ధం. అంతేగాదు గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా చేస్తే జైలుకే పరిమితమవ్వుతారు. అలాంటి గంజాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరిచి, ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో సహయపడుతుందని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ గంజాయి ఎలా మెమరీ నష్టాన్ని, ఒత్తిడిని నివారిస్తుందో సవివరంగా చూద్దామా..మత్తు కోసం గంజాయి లేదా గంజాయి మొక్కలోని ఎండిన ఆకులు పొగబెట్టడం లేదా నమలడం వంటివి చేస్తుంటారు. అందువల్లే దీన్ని మత్తు పదార్థంగా నిర్ణయించి ప్రభుత్వాలు నిషేధించడం జరిగింది. అయితే ఈ గంజాయి మెక్కలోని సైకోయాక్టివ్ పదార్థాల్లో కన్నాబినాయిడ్స్ ఉన్నాయి. వీటి నుంచి సీబీజీ, కన్నాబిడియోల్(సీబీడీ) ఉత్పన్నం అవుతాయట. అందువల్లే కొన్ని దేశాల్లో దీన్ని కీమోథెరపీ కారణంగా వచ్చే దీర్ఘకాలిక నొప్పి లేదా వికారం చికిత్సలో ఈ గంజాయిని వినియోగించడం జరుగుతుందట. ఇప్పుడు ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది కూడా. అంతేగాదు అధికా ఆదాయ దేశాలతో సహా అనేక దేశాల్లో ఈ గంజాయి ఔషధ వియోగం చట్టబద్ధమైనదే. దీనిపై పరిశోధనలో చేసిన వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ గంజాయిలోని సీబీజీని నిరంభ్యంతరంగా వినియోగించవచ్చని తేల్చి చెప్పారు. అందుకోసం పరిశోధకులు రెండు వర్చువల్ సమావేశాల్లో సుమారు 34 మంది వ్యక్తులపై అధ్యయనం చేశారు. వారందరికి దాదాపు 20 మిల్లీగ్రాముల సీబీజీ లేదా ప్లేసీబోను ఇచ్చారు. ఈ మత్తు ప్రభావంతో వారిలోని ఆందోళన, ఒత్తిడి మానసిక స్థితి ప్రాథమిక స్థాయిలను గుర్తించగా..చాలా ప్రభావవంతంగా వారిలో ఆందోళ, ఒత్తడి స్థాయిలు తగ్గాయి కూడా. అలాగే జ్ఞాపకశక్తిలో గణనీయమైన మెరుగుదల కనిపించిదని అన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో తక్కువ మత్తు, పొడి నోరు, నిద్రపోవడం, పెరిగిన ఆకలి వంటి మార్పులు కనిపించాయని చెప్పారు. ఈ గంజాయిలోని సీబీజీ ఓ అద్భుత ఔషధం అని చెప్పారు పరిశోధకులు. ఇక్కడ దీన్ని ఉపయోగించే పరిమితిని అర్థం చేసుకుంటేనే సత్ఫలితాలు పొందగలమని అన్నారు. దీనిపై కొనసాగుతున్న అధ్యయనాలు భవిష్యత్తులో సీబీజీ ప్రయోజనాలు, భద్రతపై సమగ్ర అవగాహన అందిస్తాయని నమ్మకంగా చెప్పారు శాస్త్రవేత్తలు. టైమ్స్‌నౌ న్యూస్ ప్రకారం ఈ అధ్యయనం సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.(చదవండి: ఈ మందులు ఉదయం కాఫీతో తీసుకుంటున్నారా..?) -
గల్లీ గల్లీలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: సింబయోసిస్ కాలేజీలో 25 మంది.. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది.. ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆరుగురు.. జోగిపేట జేఎన్టీయూలోని విద్యార్థులు ముగ్గురు.. .. ఇదేదో మెడల్స్ గెల్చుకున్న వారి జాబితా కాదు.. గంజాయికి అలవాటు పడి గత నెలలో ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)’అధికారులకు పట్టుబడినవారి జాబితా. ఇంకా ఇలాంటి ఘటనలు మరెన్నో. ధర తక్కువ, లభ్యత ఎక్కువ అన్నట్టుగా గంజాయి విక్రయాలు సాగుతుండటంతో.. యువత, విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య డ్రగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో 938 కేసులు నమోదుకాగా.. 1,921 మంది అరెస్టయ్యారు. ఇందులో 816 కేసులు (86.99 శాతం), 1,649 మంది (85.84 శాతం) గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రం ఆ«దీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వివిధ రూపాల్లో వాడుతూ.. రాష్ట్రంలో గంజాయికి అలవాటుపడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా.. కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చరస్, హషీష్ ఆయిల్, బంగ్ తదితర రూపాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైసూ్కల్, జూనియర్ కాలేజీ స్థాయిలో తొలుత సిగరెట్‌కు అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో, స్నేహితుల ద్వారానో గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి విక్రయదారులు.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గంజాయి నియంత్రణపై మరింత ఫోకస్ చేయాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒడిశా నుంచి రాష్ట్రంలోకి.. గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది. అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, ఆరీ్టసీ/ప్రైవేట్ బస్సులతోపాటు రైళ్లల్లోనూ గంజాయి హైదరాబాద్‌కు చేరుతోంది. గాంజాతోపాటు పాట్, హష్, స్టఫ్, స్టాష్.. ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. కొకైన్, హెరాయిన్, ఎల్ఏస్డీ వంటి డ్రగ్స్ ఒక గ్రాముకు లేదా ఒక డోసుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు కావాలి. అదే గంజాయి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచి్చస్తే 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్ స్ట్రిప్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇక ధనికవర్గాలకు చెందినవారు హిమాచల్ ప్రదేశ్‌లోని కస్సోల్ ప్రాంతం నుంచి వచ్చే ఖరీదైన ప్రత్యేక గంజాయిని వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చే గంజాయిలోనూ శీలావతి, గ్రీన్ రకాలకు డిమాండ్, రేటు ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.ప్రాణాలు తీస్తున్న ‘గంజా’మత్తు!హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన పి.రాజు గంజాయికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే తన ఇంటి సమీపంలో నివసించే ఆరేళ్ల చిన్నారిని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. రాజు కోసం పోలీసుల గాలింపు చేపట్టడంతో.. వరంగల్ జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలోని రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన ఉదయ్‌కుమార్ తన అమ్మమ్మ రాంబా యమ్మ దగ్గర ఉంటున్నాడు. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉదయ్.. డిప్లొమా లో చేరాక గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి కోసం డబ్బులు కావాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఓ రోజు రాత్రి 11.30 గంటలకు హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన నవీన్ గంజాయి మత్తులో ఓ వ్యక్తిపై గొడలితో దాడి చేసి చంపేశాడు. బెయిల్ వచ్చాక గంజాయి మత్తులో గ్రామస్తులతో ఘర్షణకు దిగడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీవ్ గంజాయికి బానిసగా మారడంతో.. ఆ ప్రభావం కుటుంబానికి చెందినవారందరిపై పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. పక్కన మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్నా బీహార్ వలస కూలీ వినోద్ మాజ్హి గంజాయి మత్తులో.. ఆ దంపతుల ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని గోపాల్‌రావుపేటకు చెందిన సురేశ్ పద్దెనిమిదేళ్ల వయసులోనే గంజాయికి బానిసయ్యాడు. మితిమీరి గంజాయి తీసుకోవడంతో చనిపోయాడు.వెంటనే బానిసలవుతారు మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్లపాటు తాగుతూ ఉంటేనే.. దానికి బానిసలుగా మారుతారు. అదే గంజాయి విషయంలో కొన్నిరోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే.. సైకోసిస్ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. – ప్రతాప్ రాజన్, క్లినికల్ సైకాలజిస్ట్803 కిలోల గంజాయి పట్టివేతరూ.2.81 కోట్ల విలువ ఉంటుందన్న పోలీసులుశంషాబాద్ రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒక డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ విభాగం, శంషాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పెద్ద గోల్కొండ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై మాటువేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన కమిషన్ ఏజెంట్ సోమనాథ్ ఖార, డీసీఎం డ్రైవర్లు హెచ్ఎస్ విఠల్‌రెడ్డి, సంజీవ్కుమార్తోపాటు సునీల్ ఖోస్లా, జగ సునను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపు సూత్రధారులైన ఏపీలోని అరకు వాసి రాము, మహారాష్ట్ర వాసి సురేశ్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నట్టు వివరించారు. తరలింపు ప్లాన్ ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అరకువాసి రాము గంజాయి సరఫరాదారు.. అతడి వద్ద సోమనాథ ఖార పనిచేస్తున్నాడు. వారు ఇటీవల డీసీఎం యజమాని విఠల్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ పరిసరాల్లో గూడ్స్ డెలివరీ కోసం వస్తే తమకు చెప్పాలన్నారు. విఠల్‌రెడ్డికి గత నెల 30న పటాన్చెరు నుంచి వైజాగ్ సరకు తరలించే ఆర్డర్ వచ్చింది. ఆ సరుకును డెలివరీ చేశాక.. ఈ నెల 1న వైజాగ్‌లోని సెజ్‌లో ఉన్న ఓ కంపెనీ నుంచి కెమికల్ సాల్వెంట్స్ తీసుకుని బయలుదేరారు. మధ్యలో గంజాయి బస్తాలను నింపారు. సోమనాథ్ ఖార ముందు ఓ కారులో వెళ్తుండగా.. వెనకాల డీసీఎం వచ్చింది. గంజాయిని హైదరాబాద్‌లోని పటాన్చెరు వరకు తీసుకొచ్చి అక్కడ సురేశ్పాటిల్కు అప్పగిస్తే.. అతను వేరే వాహనంలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. -
డ్రగ్స్‌తో జీవితం అంధకారమే
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్‌కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్‌తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్‌ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్‌లో నమోదైన ఎన్డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఒత్తిడిని అధిగమించాలివిద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్‌కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు. ముగ్గురికి పాజిటివ్మాదాపూర్లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్‌తోత్ నవీన్ నాయక్, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌రాజ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్‌పేట్‌కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్‌తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్‌పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్‌బీ డీఎస్పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల విలువైన గంజాయి దహనం
సాక్షి,యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుక్కాపురంలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బుధవారం రూ.4 కోట్ల విలువైన 1,575 కిలోల గంజాయిని దహనం చేశారు. 2021 నుంచి 2023 వరకు సికింద్రాబాద్, వరంగల్, కాచిగూడ, కాజీపేట, నిజామాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వికారాబాద్ రైల్వేస్టేషన్ల పరిధిలో ఈ గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని దశల వారీగా తుక్కాపురంలోని రోమా ఇండస్ట్రీస్ మెడికల్ వేస్టేజ్ కంపెనీలోని బాయిలర్‌లో వేసి దహనం చేశారు. సికింద్రాబాద్ అర్బన్ పరిధిలో రూ.1,44,75,000 విలువ చేసే 579 కిలోల గంజాయి, సికింద్రాబాద్ రూరల్ పరిధిలో రూ.24,50,000 విలువ చేసే 98.68 కిలోల గంజాయి, ఖాజీపేట డివిజన్లో రూ.2.24 లక్షల విలువ చేసే 896.70 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ వివరించారు. ఆస్తులు జప్తు చేస్తాంఎవరైనా గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, విక్రయించినా వారి ఆస్తులు జప్తు చేస్తామని రైల్వే ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర, ఒడిశా నుంచి గంజాయి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోందన్నారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీసులతో రహస్య బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైళ్లలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులు పెడితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆమె వెంట రైల్వే డీఎస్పీలు ఎస్.ఎన్. జావేద్ అలీ, టి.కృపాకర్, ఇన్స్పెక్టర్లు, జీఆర్పీ పోలీసులు ఉన్నారు. -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సింహాచలం: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, విధానాల వల్ల 1,230 మంది గంజాయి కేసుల్లో ఇరుక్కున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం విశాఖ ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజధాని అని చెప్పి విశాఖను గంజాయి, డ్రగ్స్‌కి రాజధానిని చేశారన్నారు. టాస్క్‌ఫోర్స్ ద్వారా గంజాయి రవాణాపై దృష్టి సారిస్తామన్నారు.గంజాయి కారణంగా విశాఖలో క్రైమ్ రేటు పెరిగిందని చెప్పారు. డ్రోన్లను ఉపయోగించి గంజాయి తోటల గుర్తింపునకు చర్యలు చేపడతామని చెప్పారు. రాత్రి పూట విశాఖలో గుంపులుగా ఉండే వారిపై దృష్టి సారిస్తామని తెలిపారు. విశాఖ నగరంలో 1,700 సీసీ కెమెరాల్లో సగానికి పైగా పని చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. మూడు నెలల్లో ప్రక్షాళన చర్యలు చేపడతామన్నారు. డీఅడిక్షన్ కేంద్రాల సంఖ్య పెంచి.. యువతకు, గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తామన్నారు. లక్ష్మీనృసింహస్వామి భూముల్ని రక్షిస్తాం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూములను పరిరక్షిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంచగ్రామాల భూసమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. ఇటీవల చీమకుర్తిలో దివ్యాంగురాలి ఘటనపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఐదేళ్లలో ఎవరికీ భయం లేదని, తప్పుచేసిన వారి వెనుక రాజకీయ నాయకులు ఉండటమే దీనికి కారణమన్నారు. పోలీసులను కూడా బెదిరించే పరిస్థితి నెలకొందన్నారు.కొంతమంది పోలీసులూ వైఎస్సార్సీపీ తొత్తులుగా పనిచేశారని ఆరోపించారు. అలాంటి పోలీసులు ప్రజలకు సేవ చేయాలని, లేదంటే తప్పుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఘటనపై ఎంక్వైరీ వేస్తామన్నారు. మహిళలు, ఆడపిల్లలను చెడుగా చూడటానికి కూడా భయపడేలా యంత్రాంగం పనిచేస్తుందని చెప్పారు. కాగా, హోంమంత్రికి ఆలయ ధ్వజస్తంభం వద్ద దేవస్థానం అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని, శేషవ్రస్తాన్ని దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి అందజేశారు. -
రూ.8 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆనందపురం (విశాఖ జిల్లా): కంటెయినర్లో తరలిస్తున్న రూ.8 లక్షల విలువైన గంజాయిని ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ ఆదివారం ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. జేసీపీ స్పేర్ పార్టుల లోడుతో హరియాణ వెళ్లడానికి బయలుదేరిన కంటెయినర్లో గంజాయి రవాణా జరుగుతోందని శ్రీకాకుళం పోలీసులకు సమాచారం అందించింది. అక్కడ చెక్ పోస్టు వద్ద కంటెయినర్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా అక్కడ సిబ్బందిని, డివైడర్‌ను ఢీకొట్టి కంటైనర్‌ను ముందుకు దూసుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విజయనగరం, విశాఖ పరిధిలోని అన్ని చెక్ పోస్టులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ఆనందపురం పోలీసులు భీమిలి క్రాస్ రోడ్డు వద్ద కంటెయినర్‌ను ఆపేందుకు యత్ని0చగా.. కంటైనర్‌ను ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసు సిబ్బంది మోటార్ బైక్‌ల సాయంతో సినీ ఫక్కీలో వెంబడించి బోయిపాలెం సమీపంలో కంటెయినర్‌ను నిలువరించారు. ఈ లోగా కంటెయినర్లో ఉన్న వారు పరారయ్యారు. సీఐ టీవీ తిరుపతిరావు కంటెయినర్ తాళాలను పగలుగొట్టి లోపల పరిశీలించారు. అందులో స్పేర్ పార్టులతో పాటు 13 గంజాయి బ్యాగ్‌లు బయటపడ్డాయి. దీంతో కంటెయినర్‌ను ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డీసీపీ–1 విజయ్ మణికంఠ, ఏసీపీ(నార్త్) సునీల్‌లు కంటెయినర్‌ను పరిశీలించి 13 బ్యాగ్‌లలో ఉన్న 80 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 386 కిలోల గంజాయి విలువ రూ.8 లక్షలుగా తేల్చారు. గంజాయిని ఒడిశాలో లోడు చేసినట్టు సమాచారం ఉందని, నిందితులను త్వరలో పట్టుకుంటామని డీసీపీ విజయ్ మణికంఠ చెప్పారు. -
అవి గంజాయి చాక్లెట్లే
శంషాబాద్: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం, వింతవింతగా ప్రవర్తిస్తుండటం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారమిచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది. విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోలీసుల దాడులు మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్ ఎస్ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మి నార్ గోల్డ్ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీ వయా ఒడిశా? ఒడిశా రాష్ట్రం జస్పూర్ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా( 33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వ చ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దు రాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు. అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మి కులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా మగర్ వారా నెహ్రూబాగ్‌లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్ గోల్డ్ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. చాక్లెట్ ఫ్లేవర్‌తో గంజాయి కలిపి కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్ ఫ్లేవర్ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్ అదనపు డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్ ఎస్ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు. -
అరకులో రూ.80 వేలు..సిటీలో రూ.6 లక్షలు!
సాక్షి, సిటీబ్యూరో: గంజాయి సంబంధిత మాదకద్రవ్యమైన హష్ ఆయిల్‌ను విశాఖ ఏజెన్సీలో ఉన్న అరకు ప్రాంతం నుంచి లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసుకుని వచ్చి..హైదరాబాద్‌లోని వినియోగదారులకు రూ.6 లక్షలకు విక్రయిస్తోంది ఒక ముఠా. వ్యవస్థీకృతంగా సాగుతున్న ఈ డ్రగ్స్ దందాపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. తొమ్మిది మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరి నుంచి హష్ ఆయిల్‌తో పాటు చెరస్ స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ నితిక పంత్ ఆదివారం వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఓ యువతి కూడా ఉండగా..పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వినియోగం నుంచి విక్రేతలుగా మారి... గోల్కొండ పరిధిలోని సెవెన్ టూంబ్స్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ పదో తరగతి తప్పడంతో చదువుకు స్వస్తి చెప్పాడు. తన స్నేహితుడైన సబ్జా కాలనీ వాసి అబు బకర్ బిన్ అబ్దుల్ ఎజాజ్ ద్వారా ఇతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటు అయింది. వీరిద్దరూ కలిసి తరచుగా హష్ ఆయిల్ ఖరీదు చేసి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్ళి వినియోగిస్తుండే వారు. కాలక్రమంలో వీరికి నగరంలో డ్రగ్స్‌కు ఉన్న డిమాండ్ అర్ధమైంది. దీంతో తామే హష్ ఆయిల్ దందా మొదలు పెడితే వినియోగించడంతో పాటు విక్రయించడానికి అవకాశం ఉంటుందని భావించారు. దీంతో తమ స్నేహితుడు, బైక్ మెకానిక్ మహ్మద్ ఖాసిమ్ అరకు సమీపంలోని పాడేరు ప్రాంతానికి పంపారు. చేతులు మారే కొద్దీ రేటు పైకి... ఆ ప్రాంతంలో లభించే హష్ ఆయిల్‌ను లీటర్ రూ.80 వేలకు ఖరీదు చేసిన ఖాసిమ్ బస్సుల్లో నగరానికి తీసుకువచ్చాడు. సోమాజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముర్తుజా అలీ హుస్సేన్ ఇంటికి ఈ సరుకు తీసుకువచ్చేవారు. అక్కడే దాచి పెట్టడంతో పాటు అతడితో కలిసి ఈ హష్ ఆయిల్‌ను 5 మిల్లీ లీటర్ల పరిమాణం కలిగిన చిన్న సైజు ప్లాస్టిక్ టిన్నుల్లో నింపేవాళ్లు. ఈ టిన్నుల్ని తమ వద్ద సబ్–పెడ్లర్స్‌గా పని చేస్తున్న విద్యార్థి ముబషిర్ ఖాన్ (మణికొండ), నితిన్ గౌడ్ (అయ్యప్ప సొసైటీ), క్యాటరింగ్ పని చేసే టి.పూనం కుమారీ కౌర్‌లకు ఒక్కో టిన్ను రూ.2 వేలకు అమ్మే వాళ్ళు. టోలిచౌకి వాసి జీషాన్ నవీద్, సమత కాలనీకి చెందిన సయ్యద్ అన్వరుల్లా హుస్సేనీ ఖాద్రీ కూడా వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తుండేవారు. వినియోగదారులకు రూ.3 వేలకు... హష్ ఆయిల్ నగరానికి తీసుకువచ్చే ఖాసిమ్, విక్రయించే ముజఫర్, అబుబకర్ తెర వెనుకే ఉండేవారు. వీరి సబ్–పెడ్లర్స్ మాత్రమే ఈ మాదకద్రవ్యాన్ని వినియోగదారులకు విక్రయించారు. 5 మిల్లీ లీటర్ల టిన్ను రూ.3 వేలు (లీటర్ రూ.6 లక్షలు) చొప్పున విక్రయించారు. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారంపై పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషాకు సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సై షేక్ కవియుద్దీన్ బృందం రంగంలోకి దిగి వలపన్నింది. జీషాన్, అన్వరుల్లా మినహా మిగిలిన ఏడుగురిని పట్టుకున్నారు. వీరి నుంచి 310 మిల్లీ లీటర్ల హష్ అయిల్‌తో పాటు 70 గ్రాములు చెరస్ (గంజాయి సంబంధిత డ్రగ్) స్వా«దీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇరువురి కోసం గాలిస్తున్న టాస్‌్కఫోర్స్ వీరికి చెరస్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అనేవి ఆరా తీస్తున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ఫిల్మ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. -
జరిమానా చెల్లించేందుకు కోర్టులోనే చోరీ
సంగారెడ్డి అర్బన్: కోర్టు విధించిన జరిమానా చెల్లించేందుకు అదే కోర్టులో గంజాయిని దొంగతనం చేసిన నిందితుడి నిర్వాకమిది. సంగారెడ్డి డీఎస్పీ రమేష్ కుమార్ కథనం మేరకు.. ఈ నెల 19వ తేదీన కోర్టు హాలులోని న్యాయమూర్తి చాంబర్లో ఓ కేసుకు సంబంధించిన గంజాయి సంచిని సీజ్ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి గంజాయి సంచిని ఎత్తుకెళ్లారు. దీనిపై కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, షూ గుర్తుల ఆధారంగా నిందితుడు మగ్దూమ్‌నగర్‌కు చెందిన షేక్ మహబూబ్‌గా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు ఇదివరకు ఒక దొంగతనం, యాక్సిడెంట్ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 14 ఏళ్లుగా స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో ఎవరైనా నిందితులకు బెయిల్ జామీను కావాలంటే డబ్బులు తీసుకొని పూచీకత్తు ఇస్తుంటాడు. అందులో భాగంగా సంగారెడ్డి టౌన్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ ఏటీఎం దొంగతనం కేసులో నిందితులకు జామీను ఇచ్చాడు. అయితే వారు కోర్టుకు రానందున మహబూబ్ రూ.30వేలు కట్టాల్సి వచ్చింది. ఈ డబ్బు ఎలా కట్టాలో తెలియక కోర్టు హాలులో ఉన్న గంజాయి మూటను అమ్మి డబ్బు చేసుకోవాలని భావించి దొంగతనం చేశాడు. గంజాయి మూటను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
గంజాయి తాగితే వింతగా ఎందుకు ప్రవర్తిస్తారంటే..?
గంజాయిపై భారత్‌తో సహా చాలా దేశాల్లో నిషేధం విధించారు. అక్రమంగా వినియోగిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నారు. గంజాయిని తాగిన తర్వాత మనుషుల్లో అసాధారణ చేష్టలు కనిపిస్తాయి. కొందరు బిగ్గరగా నవ్వుతారు. మరికొందరు బిగ్గరగా ఏడుస్తుంటారు. అసలు ఎందుకని ఈ విపరీత ధోరణి? గంజాయిలో ఏముంది..? అది ఏ విధంగా హానికరం..? గంజాయిని తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది నేరుగా మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. గంజాయి తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంపై అది పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అసాధారణ స్వభావంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో అబద్ధాలను అలవోకగా చెబుతుంటారు. గంజాయి తాగిన తర్వాత ఎందుకు మితిమీరిన ఆనందాన్ని పొందుతుంటారు. దీనికి కారణం డొపమైన్ అనే హార్మోన్. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ హెచ్చుతగ్గులు అయ్యే కొద్ది మనంలో ప్రవర్తన తీరు మారుతుంది. గంజాయి సేవించినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందుకే మితిమీరిన సంతోషం లేదా దుఖాన్ని ప్రదర్శిస్తారు. నాడీ వ్యవస్థ మీద దీని ప్రభావం ఉండటం వల్ల మెదడు మన ఆధీనంలో ఉండదు. దీని వల్ల ఏం చేస్తున్నారో? ఎందుకు చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తిస్తారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతుంది. గంజాయి సేవిస్తే గుండెపోటుతో పాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మత్తుని ఇచ్చే అన్ని పదార్థాలతోనూ ఇలాంటి ప్రభావాలే కనిపిస్తాయని వెల్లడించారు. ఇదీ చదవండి: Dress Code: కట్టు..బొట్టు తీరు.. కాస్త డ్రస్ కోడ్‌గా మారింది!..ఆ విధంబెట్టిదనినా.. -
గంజాయి సాగులో మెడికోలు
కర్ణాటక: సమాజంలో ఆదర్శంగా ఉండవలసిన మెడికోలు పెడతోవ పట్టారు. ముగ్గురు వైద్య విద్యార్థులు గంజాయికి బానిసై తమ అద్దె ఇంట్లో ఆ మొక్కల పెంపకం చేపట్టారు. పైగా గంజాయిని విక్రయిస్తూ చివరికి కటకటాల పాలయ్యారు. ఈ సంఘటన శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలోని క్రిష్ణగిరి పట్టణానికి చెందిన విఘ్నరాజ్ (28), ధర్మపురి కడగత్తూరుకు చెందిన పాండిదొరై (27), కేరళలోని ఇడుక్కివాసి వినోద్ కుమార్ (27) నిందితులు. వీరు ముగ్గురూ శివమొగ్గ నగరంలోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. విఘ్నరాజ్ గంజాయి మొక్కలను తీసుకుని వచ్చినట్లు తెలిసింది. గంజాయి విక్రయాలు శివగంగా లేఔట్లో అద్దె ఇంటిలో కుండీలో మొక్కలను పెంచసాగాడు. మొక్కలను ఎండబెట్టి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి వినోద్, పాండి దొరైతో కలిసి విక్రయించడం ప్రారంభించారు. ఈ వ్యవహారం తెలియడంతో శివమొగ్గ గ్రామీణ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్టు చేశారు. వారి నుంచి 227 గ్రాముల ఎండు గంజాయిని, అలాగే ఇంట్లో 1.5 కేజీల బరువైన గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. 10గ్రాముల చరస్, గంజాయి గింజలను, గంజాయి నూనె కూడా దొరికినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురినీ అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
కాలేజీ కుర్రాళ్ల రహస్య ‘స్టార్టప్’.. బండారం బయటపడిందిలా..
కుర్రాళ్లు చదువుకునేందుకు కాలేజీలో చేరుతారు. అలా కాలేజీలో చేరిన కుర్రాళ్లు బాగా చదువుకోవాలని అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు పరితపిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుర్రాళ్లు దారితప్పుతుంటారు. అలా నేర సంబంధమైన కార్యకలాపాల్లోకి అడుగు పెడుతుంటారు. తాజాగా ఇటువంటి ఉదంతం కర్నాటకలోని శివమొగ్గలో చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు తీసుకుని.. కర్నాటకలోని శివమొగ్గకు చెందిన ఒక కుర్రాడు తాను ఉంటున్న అద్దె ఇంటిలోనే గంజాయి మొక్కలు పెంచడం ప్రారంభించాడు. తరువాత వాటిని అక్రమంగా విక్రయిస్తున్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు తమిళనాడు, కేరళకు చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా హైటెక్ పద్ధతిలో గంజాయి సాగు చేసిన గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు గంజాయి కొనుగోలుకు రాగా.. కర్నాటక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని తమిళనాడులోని కృష్ణాగిరి నివాసి విఘ్నరాజ్గా గుర్తించారు. ఇతను ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. అతను తాను ఉంటున్న ఇంటిలో గంజాయి సాగు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. శివమొగ్గ పోలీసు అధికారి జీకే మిథున్ కుమార్ మాట్లాడుతూ.. నిందితుడు గత మూడున్నర నెలలుగా గంజాయి క్రయవిక్రయాల్లో పాల్గొంటున్నాడన్నారు. ఇతనికి కేరళకు చెందిన వినోద్ కుమార్, తమిళనాడుకు చెంది పండీదోరాయ్కు సహకరిస్తున్నారని, ఈ ముగ్గురినీ అరెస్టు చేశామన్నారు. విఘ్నరాజ్ ఇంటికి గంజాయి కొనుగోలుకు ఈ ఇద్దరు కుర్రాళ్లు రాగా, వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పలు మత్తు పదార్థాలు స్వాధీనం పోలీసులు నిందితుని ఇంటిపై దాడి చేసి 277 గ్రాముల గంజాయి, 1.63 కిలోల పచ్చి గంజాయి, 10 గ్రాముల చెరస్, గంజాయి విత్తనాల బాటిల్, 19 వేల రూపాలయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి పసిపిల్లలు అడ్డొస్తున్నారని.. -
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్‌ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్‌ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్‌గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్‌ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
గంజాయి రవాణా ఒడిశా నుండి విశాఖ
-
మత్తుగా...మాయాలోకంలో!
►బెంగళూరుకు చెందిన ఇరవై రెండేళ్ల ఐఐటీయన్ శ్రీలత పాతికేళ్లలోపే ఐఏఎస్ అధికారి కావాలన్న కలను గంజాయి కారణంగా భగ్నం చేసుకుంది. ►చండీగఢ్‌కు చెందిన 43 ఏళ్ల ప్రభుత్వరంగ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సుస్మిత చౌధురి గంజాయికి అలవాటుపడ్డ తన 12 ఏళ్ల కొడుకును కాపాడుకోవడం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. ►గాంధీనగర్‌కు చెందిన 48 ఏళ్ల గృహిణి అనామిక పటేల్ తన 17 ఏళ్ల కుమారుడు గంజాయి సేవిస్తున్నాడన్న విషయం తెలుసుకుని పార్టీల్లో తప్ప ఎక్కడా గంజాయి సేవించకూడదని ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. కంచర్ల యాదగిరిరెడ్డి మత్తులో గమ్మత్తుగా దొరికే అనందాన్ని వెతుక్కుంటూ దేశవ్యాప్తంగా గంజాయికి అలవాటు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కళాశాల క్యాంపస్‌లు, నైట్ క్లబ్‌లు, పబ్‌లు, పేరు గాంచిన రెస్టారెంట్లు, విశ్వవిద్యాలయాలు, ప్రీమియర్ విద్యాసంస్థల హాస్టళ్లలో గంజాయి సేవించడం సర్వసాధారణంగా మారిపోయింది. అమ్‌స్టర్‌డ్యామ్ డ్రీమ్, మౌలానా క్రీమ్, బాంబే బ్లాక్ లాంటి గంజాయి రకాలు ఇప్పుడు యువత సంభాషణల్లో క్రేజీగా మారాయి. ‘గంజాయి అనేది మింట్, చాక్లెట్ లాగా సాధారణమైపోయింది, తక్షణ ఉల్లాసం కలిగించే మాదకద్రవ్యంగా 12 ఏళ్ల పిల్లలు సైతం దీనిని వాడుతున్నారు’అని అమృత్‌సర్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సవీందర్ సింగ్ చెప్పారు. ఢిల్లీని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో గంజాయి వినియోగం శరవేగంగా విస్తరిస్తోందన్నారు, హ్యాష్ అని ముద్దుపేరు గంజాయిని హ్యాష్, హ్యాషిన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఢిల్లీలోని పహర్‌గంజ్ ‘హ్యాషెర్ప్ స్ట్రీట్’గా గంజాయి సేవించే వారికి సుపరిచితమైన స్థలం. గొట్టాల సాయంతో గానీ, సిగరెట్ల మాదిరిగా కాగితంతో చుట్టి గానీ గంజాయిని పీలుస్తుంటారు. దేశవ్యాప్తంగా హ్యాషెర్ స్ట్రీట్ లాంటి కేంద్రాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వేలాదిమంది యువతీ యువకులు గంజాయి సేవించడానికి ఆ సెంటర్లకు వెళ్తుంటారు. ఐఏఎస్ హోదా సాధించాలని కలలు కన్న శ్రీలత వారాంతంలో స్నేహితులతో కలిసి ఢిల్లీలోని హ్యాషెర్స్ స్ట్రీట్‌కు వెళ్లడం ప్రారంభమైన తరువాత తన జీవన సరళి మారిపోయింది. ‘ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీ వచ్చి నా కూతురు హ్యాష్‌కు బానిసైంది. బంగారు భవిష్యత్‌ను పాడుచేసుకుంది’అని శ్రీలత తండ్రి గోపాలకృష్ణ హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి నిషేధాన్ని పాలనా యంత్రాంగం సరిగ్గా అమలు చేయడం లేదంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లో ఉంది. గంజాయికి విపరీతమైన డిమాండ్ ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా గంజాయికి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సీనియర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ‘గంజాయి అమ్మకాల గురించి తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, పోలీసులతో స్మగ్లర్లకు సంబంధాల వల్ల ఏమీ చేయలేకపోతున్నామని’ఆయన అన్నారు. పంజాబ్‌లోని అమృత్సర్, జలంధర్ ప్రాంతాల్లో వయసుతో నిమిత్తం లేకుండా అందరూ గంజాయిని నిత్యావసర వస్తువుగా వినియోగిస్తున్నారట. అక్కడ భయానక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో స్థానిక పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సాయంతో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆయన తెలిపారు. గడచిన పదేళ్లతో పోల్చి చూస్తే ఢిల్లీ మాత్రమే కాదు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలో దీని వాడకం పాతిక రెట్లు పెరిగిందని ఎన్సీబీ రికార్డులు చెపుతున్నాయి. ఇటీవల నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా కొన్ని వందల టన్నుల గంజాయిని వాడి ఉంటారని అంచనా. న్యూఇయర్ కోసం సిద్ధం చేసి ఉంచిన 2.5 క్వింటాళ్ల గంజాయిని ఒడిశాలో, 3.5 క్వింటాళ్ల గంజాయిని కేరళలో సీజ్ చేశారు. ఒక్క 2022లో ఎన్సీబీ దేశవ్యాప్తంగా 5.5 టన్నుల గంజాయిని ధ్వంసం చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాదక ద్రవ్యాలు, నియంత్రణ విభాగం 2022లో విడుదల చేసిన ఓ నివేదికలో 2010–2020మధ్య భారత్‌లో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ధర తక్కువ ఉండటమూ ఓ కారణమే సులువుగా దొరకడం, ధర తక్కువగా ఉండటమూ గంజాయి విస్తరించడానికి ప్రధాన కారణమని ఎన్సీబీ అధికారి ఒకరు విశ్లేషించారు. రూ.300 నుంచి రూ.1200 వరకు గంజాయి లభిస్తోందని చెప్పారు. ‘గతంలో 18–20 ఏళ్ల మధ్య యువత దీనికి బానిస అవుతున్నారని అనుకుంటే ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. ఇటీవల కొన్ని కేసులను పరిశీలించినప్పుడు ముంబైలో స్కూల్ పిల్లలు గంజాయిని వాడుతున్నట్లు మాకు తెలిసింది. గంజాయిని సేవిస్తున్న ఓ 13 ఏళ్ల కుర్రాడిని మా టీమ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. గంజాయి తాగితే తప్పేమిటని ఆ బాలుడు ప్రశ్నించాడ’ని ఆ అధికారివాపోయారు. ముంబై. ఢిల్లీ, కోల్‌కతాలో విద్యాసంస్థల సమీపంలోనే ఉన్న పాన్ దుకాణాలు గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్నాయి. ముంబైలో ఇటీవల కొన్ని పాన్ షాపుల మీద దాడి చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక పబ్‌లలో వెయిటర్లు దీనినే ప్రధాన వృత్తిగా ఎంచుకుంటున్నారు. ఢిల్లీలోని సాకేత్, వసంత్ కుంజ్, ముంబైలోని కొలాబా, బాంద్రా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, గచ్చిబౌలి, చెన్నైలోని తేనాంపేట, గోపాలపురం, బెంగళూరులోని చిక్‌పేట, జయానగర్ ప్రాంతాల్లో గంజాయి వాడకం విపరీతంగా ఉంది. హైదరాబాద్‌లో వందలాదిగా ఏజెంట్లు హైదరాబాద్‌లో గంజాయి సరఫరా వ్యవస్థ పకడ్బందీగా ఉంది. సరైన వ్యక్తిని సంప్రదిస్తే నిమిషాల్లోనే కావాల్సిన వారి చేతికి అందుతుంది. గంజాయి కొనుగోలు చేయడం ఎంత సులువో.. ఓ ఏజెంట్‌ను పరిచయం చేసుకున్న ఈ ప్రతినిధికి అర్థమైంది. ఇటీవల ఓ పోలీసు అధికారి సాయంతో సాక్షి ప్రతినిధికి ఓ గంజాయి సరఫరా ఏజెంట్‌తో పరిచయమైంది. బాగా నమ్మకం కుదిరిన తరువాత ‘సాక్షి’ప్రతినిధి తనకు గంజాయి కావాలని అడిగితే ఆ ఏజెంట్ చేసిన సూచన ఇలా ఉంది.... ‘ఒంటరిగా కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నడుస్తూ వెళ్లండి అయితే, మీరు అనుమానాస్పదంగా వ్యవహరించవద్దు. గంజాయి కోసం తహతహలాడుతున్నట్లు మీ ఫీలింగ్ ఉండాలి. అప్పుడు మా ఏజెంట్ మీ దగ్గరకు వస్తాడు. నేను ఇప్పుడు చెబుతున్న కోడ్ అతనికి వినిపించేలా చెప్పండి. తక్షణమే మీ చేతిలో ఒక పాకెట్ పెడతాడు’. ఈ ఉదంతం శాంపిల్ మాత్రమే. గంజాయి సరఫరా చేయడానికి నగరంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ‘గంజాయి వినియోగాన్ని అరికట్టాలంటే, పాఠశాలలు, కళాశాలలు, ఐటీ పని ప్రదేశాల్లో పరీక్షలను తప్పనిసరి చేయాలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లోని పాఠశాలల విద్యార్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈ దేశంలో ఇలాంటి పరీక్షలను నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది’అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మెదడు, కాలేయంపై ప్రభావం కొకైన్ వంటి మాదకద్రవ్యాల కంటే గంజాయి సురక్షితమని కొందరు వాదిస్తున్నారు. అయితే, అది ఎంత మాత్రం నిజం కాదని వైద్యులు తేల్చిచెబుతున్నారు. గంజాయిని వినియోగిస్తున్న వారి సంఖ్య ఎలా పెరుగుతుందో దాని మూలంగా మానసిక సమస్యల బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అంతే పెరుగుతుందని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ముంబైకి చెందిన కన్సల్టెంట్ డాక్టర్ ఫెబియన్ ఆల్మెదా అన్నారు. గంజాయి దినచర్యగా మారితే మెదడు, కాలేయం దెబ్బతింటాయని, మానసిక భ్రాంతులు ఏర్పడతాయని చెప్పారు. ఇటీవల కాలంలో మానసిక సమస్యలతో వస్తున్న పిల్లల్లో 50 శాతానికి పైగా మాదకద్రవ్యాల బారిన పడ్డవారేనని ఆయన వివరించారు. -
‘పరివర్తన’ ఫలించేలా
సాక్షి, అమరావతి: గంజాయి సాగు, అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టి కేసుల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్ఈబీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు నిర్మూలన చర్యలు చేపడుతూనే ఉపాధి మార్గాలు చూపాలని అధికార యంత్రాంగానికి సూచించారు. పన్ను చెల్లింపుదారులకు ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. ఎక్సైజ్, అటవీ, గనులు, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. అటు ఉక్కుపాదం.. ఇటు ఉపాధితో ఊతం పరివర్తన కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. చేయూత, ఆసరా లాంటి పథకాల ద్వారా వారికి ఊతమివ్వాలని, ఆదాయం సమకూరే దిశగా ఉపాధి చూపాలని నిర్దేశించారు. అప్పుడే అక్రమ మద్యం తయారీ లాంటి వాటికి దూరంగా ఉంటారన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనతోపాటు ఉపాధి మార్గాలు కల్పించాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా, ఎవరైనా అర్హులు మిగిలిపోతే తనిఖీ చేసి వారికి కూడా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు అందించాలని ఆదేశించారు. తద్వారా పట్టాలు అందుకున్న రైతులకు రైతు భరోసా సాయం లభిస్తుందన్నారు. వారికి విత్తనాలు, ఎరువులు అందించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు. అప్పుడే ఆశించిన స్ధాయిలో మార్పు వచ్చి అక్రమ మద్యం, గంజాయి సాగు నుంచి దూరం అవుతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మరింత సౌలభ్యంగా పన్ను చెల్లింపులు పన్ను చెల్లింపులకు సంబంధించి వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో స్నేహపూర్వక వాతావరణం ఉందన్న విషయాన్ని పన్ను చెల్లింపుదారులకు వివరించాలన్నారు. చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్నారు. అవగాహన పెంపొందించి అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. దీనివల్ల చెల్లింపులు సకాలంలో జరుగుతాయని, పన్ను కట్టేవారికి కూడా చక్కటి సేవలు అందుతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడే ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై.. రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షిస్తూ శాశ్వత భూహక్కు, భూసర్వే కార్యక్రమం చేపడుతున్న చోట్ల సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై విస్తృత అవగాహన కలిగించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎలాంటి డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్న అంశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. నిర్వహణలో లేని గనులపై దృష్టి గనుల శాఖ కార్యకలాపాలపై సమీక్ష సందర్భంగా నిర్వహణలో లేని గనులపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సూచించారు. సమీక్షలో విద్యుత్, అటవీ పర్యావరణ, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఎక్సైజ్ కమిషనర్ వివేక్ యాదవ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అమ్మకాలు తగ్గాయి గతంతో పోల్చి చూస్తే మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని సీఎం జగన్ వెల్లడించారు. బెల్టు షాపులను తొలగించడం, పర్మిట్ రూమ్‌ల రద్దు లాంటి పలు చర్యల వల్ల మద్యం విక్రయాలు తగ్గాయని చెప్పారు. దీంతో పాటు మద్యపానాన్ని నిరుత్సాహ పరిచేందుకు షాక్ కొట్టేలా రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గిందన్నారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. పరివర్తన కార్యక్రమం అమలు తీరుపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. -
గంజాయికి బానిసై వేధిస్తున్నాడని..
తిరుమలగిరి(తుంగతుర్తి): గంజాయికి బానిసై నిత్యం వేధిస్తున్న కుమారుడిని కన్న తల్లిదండ్రులే కడతేర్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలగిరి ఆదర్శనగర్‌కు చెందిన ఆమనగంటి యాదగిరి, వెంకటమ్మల కుమారుడు కిరణ్ (23) డీజే సౌండ్ బాక్సులు అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య సౌమ్య, కుమా రుడున్నారు. గంజాయికి బానిసైన కిరణ్ రోజూ ఇంట్లో గొడ వపడుతుండటంతో సౌమ్య కుమారుడితో ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మరింతగా గంజాయి సేవించి వస్తూ రోజూ తల్లిదండ్రులను కొడుతున్నాడు. తనకు డబ్బులివ్వా లని 2 నెలల క్రితం ఇంట్లోని వస్తువులు, దుస్తులను తగులబెట్టాడు. కుమారుడి వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రులు హైదరాబాద్ వెళ్లిపోయారు. 15 రోజుల క్రితం దగ్గరి బంధువు చనిపోతే పరామర్శకు తిరుమలగిరికి వచ్చారు. దీంతో కిరణ్ తల్లిదండ్రులను కొట్టి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంచుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం గంజాయి సేవించి ఇంటికి వచ్చి మత్తులో మళ్లీ తల్లిదండ్రులను కొట్టాడు. అలా కొడుతూనే కిందపడిపోయాడు. అప్పటికే కొడుకు తీరుతో విసిగిపోయి ఉన్న తల్లిదండ్రులు ఇదే అదనుగా కిరణ్ మెడకు తాడును కట్టి బిగించి చంపేశారు. అయితే కుమారుడి మరణం తట్టుకోలేక వారు ఏడుస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. అనంతరం కిరణ్ తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆత్మరక్షణ కోసమే చంపేశాం రెండేళ్లుగా రోజూ గంజాయి సేవించి వచ్చి వేధిస్తున్నాడు. రోజూ కొడుతుండటంతో భయం భయంగా బతుకుతున్నాం. కుమారుడు ఏం చేస్తున్నాడని అడిగితే ఏమీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నాం. సోమవారం మధ్యాహ్నం గంజాయి సేవించి వచ్చి మమ్మల్ని కొట్టాడు. విధిలేని పరిస్థితిలో ఆత్మరక్షణ కోసం చంపేశాం. – కిరణ్ తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ -
గంజాయి పట్టుకున్నా నిందలేనా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల ఫలితంగా పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గంజాయిని పట్టుకుంటే ఎల్లో మీడియా స్వాగతించకుండా ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత భారీగా గంజాయిని పట్టుకోవడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగా వైఎస్సార్సీపీ వ్యతిరేక శక్తులకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ► దేశవ్యాప్తంగా 2021లో పట్టుబడ్డ 7,49,761 కిలోల గంజాయిలో ఏపీలో దొరికింది 2,00,588 కిలోలు. రెండో స్థానంలో ఉన్న ఒడిశాలో 1,71,713 కిలో లు లభ్యమైంది. నిఘా సంస్థలు స్వాధీనం చేసుకున్న గంజాయిలో సగం వరకూ రెండు రాష్ట్రాల్లోనే పట్టుబడిందన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వార్షిక నివేదికలో ఇటీవల ఈమేరకు సమాచారం ఇచ్చింది. ► గంజాయి భారీ విస్తీర్ణంలో సాగయ్యే కేరళ, తమిళనాడులో ఏడెనిమిదేళ్ల క్రితం ప్రతికూల పరిస్థితులతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు విస్తరించింది. 2015–19 మధ్య టీడీపీ సర్కారు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల గంజాయి విచ్చలవిడిగా సాగైంది. విశాఖ ఏజెన్సీ, పక్కనే ఉన్న ఒడిశా అటవీ, పర్వత ప్రాంతాలు దశాబ్దాలుగా గంజాయి సాగుకు ఆలవాలంగా మారాయి. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా, 2021లో భారీ మొత్తాల్లో గంజాయి లభ్యమైంది. సరైన దారులు లేకపోవడం, అమాయకులైన గిరిజనులను స్మగ్లర్లు మోసగించడం లాంటి పరిస్థితులను అధిగమించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశాం. ఎన్సీబీ వార్షిక నివేదిక 2021లో రెండు పాయింట్లను పట్టుకుని టీడీపీ అనుకూల ప్రచారసాధనాలు రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు విశ్వసించరు. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణమే సర్కారు పనితీరుకు గీటురాయి. -
‘లిక్కర్ వద్దు.. గంజాయి ముద్దు’.. ఎమ్మెల్యే ఉచిత సలహా!
రాయ్‌పుర్: ఒక్కోసారి రాజకీయ నేతలు చేసే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే క్రిష్ణమూర్తి బంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరాలను అడ్డుకునేందుకు ఆల్కహాల్‌కు బదులుగా గంజాయి తాగాలని ఉచిత సలహా ఇచ్చారు. లిక్కర్ వల్లే దేశంలో అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గంజాయితో అలాంటి నేరాలు జరగవని జోస్యం చెప్పారు. గౌరేలా పెంద్రా మర్వాహి జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు క్రిష్ణమూర్తి. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. గతంలో అసెంబ్లీలో కూడా దీనిపై చర్చించాను. ఆల్కహాల్ కారణంగా అత్యాచారం, హత్య, గొడవలు జరుగుతున్నాయని చెప్పాను. కానీ, ఎవరైనా భంగ్, గంజాయి తాగిన వారు ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా? అని అసెంబ్లీలోనే అడిగాను. వ్యసనాల అవసరాలను తీర్చేందుకు, లిక్కర్ నిషేధించేందుకు ఓ కమిటీని వేశారు. ప్రజలను భంగ్, గంజాయి వైపు ఎలా మళ్లించాలని ఆ కమిటీ ఆలోచించాలి. మత్తు కావాలనుకున్న వారికి అలాంటివే అందించాలి.’ అని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్. మత్తు పదార్థాలను ఓ ప్రజాప్రతినిధి ఎలా ప్రమోట్ చేస్తారు? అని ప్రశ్నించింది. మరోవైపు.. ఈ విషయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌ను అడగగా.. మత్తు ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని తెలిపారు. దేశంలో గంజాయి విక్రయాలను చట్టబద్ధం చేయాలనుకుంటే ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. ఇదీ చదవండి: హారన్ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక -
స్కెచ్ వేశారు... పట్టుకున్నారు
పెందుర్తి: గంజాయి రవాణాపై వరుసగా ‘సెబ్’ దాడులు కొనసాగుతున్నాయి. పెందుర్తి సమీపంలోని సుజాతనగర్‌లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన గంజాయిని సినీ ఫక్కీలో అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 260 కిలోల గంజాయి, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి సెబ్ పోలీస్ స్టేషన్లో అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా, రాజస్థాన్‌కు చెందిన రామ్ హోతాంగి, అనిషా సాబర్, ఆయూబ్‌ఖాన్, మరోవ్యక్తి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి సుజాతనగర్‌లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. వీరిలో రామ్ హోతాంగి ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి సేకరించి రోడ్డు మార్గంలో సుజాతనగర్ తీసుకొస్తుంటారు. అక్కడి నుంచి వీరంతా వేర్వేరుగా ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్‌పై గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సీపీ శ్రీకాంత్, సెబ్ అడిషినల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ అధికారులు, ఇంటెలిజెన్స్ టీం సహకారంతో పెందుర్తి సెబ్ అధికారులు సుజాతనగర్ ఆర్చ్ వద్ద కాసు కాశారు. వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా అనిషా చిక్కింది. బైక్‌లో ఉన్న 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితురాలిని విచారించారు. ఆమె చెప్పిన వివరాల మేరకు సుజాతనగర్‌లోని ఓ ఇంటిపై దాడి చేయగా అక్కడ నిల్వ ఉన్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. అదే సమయంలో సుజాతనగర్ వీధి చివర నిలిపిన కారులో ఉన్న 50 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెబ్ సిబ్బంది వస్తున్నారన్న సమాచారంతో కారులోని వ్యక్తులు పరారయ్యారు. నిందితుల్లో అనిషా సాబర్‌ను అరెస్ట్ చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. దాడుల్లో పాల్గొన్న సెబ్ సూపరింటెండెంట్ శ్రీనాథుడు, పెందుర్తి సీఐ సరోజదేవి, టాస్క్‌ఫోర్స్ సీఐ అప్పలరాజు, ఇంటెలిజెన్స్ టీం సిబ్బందిని నగర సీపీ శ్రీకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. (చదవండి: వర్షం కోసం గంగాలమ్మ పండగ) -
యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్‌వర్క్‌లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్‌తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్‌లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్‌పేటలోని ఓ ల్యాండ్‌మార్క్‌ను పికప్‌గా.. వారుండే లొకేషన్‌ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
ఏసీ కోచ్‌లో గంజాయి సరఫరా
సాక్షి, హైదరాబాద్: ట్రావెల్ బ్యాగ్‌లలో గంజాయి ప్యాకెట్లు పెట్టుకొని, ఏసీ కోచ్‌లో హైదరాబాద్ మీదుగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు నుంచి ఢిల్లీకి వెళుతున్న నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 52 కిలోల గంజాయి, లీటర్ హష్ ఆయిల్, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్ ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ట్రావెల్ బ్యాగ్‌లలో సర్ది కిరాయి ఏజెంట్ల ద్వారా ఢిల్లీకి రైలులో అక్రమంగా రవాణా చేసేవాడు. ఈ దందాలో అతడికి ఢిల్లీకి చెంది న గంజాయి పెడ్లర్ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ నుంచి ఆర్డర్ అందుకున్న విజయ్.. 52 కిలోల గంజాయి, 25 బాటిళ్ల హష్ ఆయిల్ (ఒక్కోటి 40 మిల్లీ గ్రాములు) చొప్పున చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని ట్రావెల్ బ్యాగ్‌లలో సర్ది, ఇమ్రాన్‌కు సమాచారం అందించాడు. దీంతో సరుకు తీసుకొచ్చేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముహిద్దీన్‌పూర్‌కు చెందిన ఫయ్యూ మ్, జునైద్, సరిఖ్, మొహమ్మద్ నజీమ్ అనే కిరాయి ఏజెంట్లను ఇమ్రాన్ సంప్రదించాడు. ఈ నెల 3న ఢిల్లీలో రైలెక్కిన వీరు 5న వైజాగ్‌లో దిగి స్థానిక లాడ్జిలో బస చేశారు. విజయ్ నుంచి సరుకు తీసుకొని అదే రోజు రాత్రి దువ్వాడ రైల్వే స్టేషన్లో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు జరుగుతున్నట్లు తెలియడంతో మౌలాలీ రైల్వే స్టేషన్లో దిగారు. రాత్రి వరకూ స్టేషన్ ఆవరణలో గడిపారు. రాత్రి 11 గంటల తర్వాత సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకున్నారు. రైలు ఎక్కేందుకు మౌలాలీ నుంచి బస్‌లో సికింద్రాబాద్ వెళుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు జెడ్టీఎస్ క్రాస్‌రోడ్స్‌లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నిరంతర నిఘాతో అడ్డుకట్ట : సీపీ రాష్ట్రంలో డ్రగ్స్‌పై నిఘా పెరగడంతో సరఫరా తగ్గింది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు, అరెస్ట్‌లు చేస్తుండటంతో సరఫరాదారుల్లో వణుకు పుట్టింది. గంజాయి సరఫరా తగ్గడంతో రేట్లు పెరిగాయని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. (చదవండి: ఫంక్షన్.. ఉండదిక టెన్షన్) -
గంజాయి దందాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి మాఫియాను కూకూటి వేళ్లతో పెకలించి వేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రధానంగా ఇతర రాష్ట్రాల్లో ఉంటూ మన రాష్ట్రంలో గంజాయి దందాను శాసిస్తున్న స్మగ్లర్లకు చెక్ పెట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సిద్ధమైంది. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరిట ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీలో) 8 వేల ఎకరాలకుపైగా గంజాయి సాగును సెబ్ ధ్వంసం చేసింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల ఆట కట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల జాబితాను రూపొందించింది. ఆ రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కార్యాచరణకు ఉపక్రమించింది. అత్యంత కీలకమైన ఈ ఆపరేషన్ కోసం జాయింట్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఏవోబీలో గంజాయి దందాను శాసిస్తున్న 648 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెబ్ గుర్తించింది. వారు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో దశాబ్దాలుగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని గంజాయి అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేశారు. ఎంపిక చేసిన గిరిజనుల ద్వారా గంజాయి సాగు చేయించి, పంట వచ్చిన తరువాత ఎండబెట్టించి, వారే కొనుగోలు చేసి ఏడాది పొడుగునా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అడపాదడపా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాయి గానీ, ఇతర రాష్ట్రాల్లో తిష్టవేసిన స్మగ్లర్లపై గురి పెట్టలేదు. మొదటిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఆట కట్టిస్తోంది. అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఉన్న రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులతో సెబ్ ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. పరస్పర సహకారంతో ఇప్పటికే 50 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లని సెబ్ అరెస్టు చేసింది. రాష్ట్ర అధికారులు ఆ రాష్ట్రాలకు వెళ్లి 30 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. తెలంగాణ పోలీసులు 15 మందిని మన రాష్ట్రానికి అప్పగించారు. కేరళ ఇద్దరిని, కర్ణాటక ఇద్దరిని, తమిళనాడు ఒకరిని అప్పగించాయి. మిగిలిన స్మగ్లర్లను కూడా అరెస్టు చేసేందుకు సెబ్ రెండంచెల్లో ‘జాయింట్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేస్తోంది. డీజీపీ చైర్మన్‌గా ఉండే నోడల్ ఏజెన్సీలో సెబ్ కమిషనర్, డీఐజీలు సభ్యులుగా ఉంటారు. సెబ్ డైరెక్టర్ ఆధ్వర్యంలోని కార్యనిర్వాహక టాస్క్ ఫోర్స్‌లో ఎంపిక చేసిన జిల్లాల ఎస్పీలు, అదనపు ఎస్పీలు సభ్యులుగా ఉంటారు. ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసి న్యాయస్థానంలో శిక్షలు విధించేలా పర్యవేక్షిస్తుంది. రాష్ట్రం నుంచి అప్పగించింది 20 మందిని కాగా మన రాష్ట్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు ఇతర రాష్ట్రాల్లో అక్రమ మద్యం, ఇతర దందాలకు పాల్పడుతున్నారు. ఆ రాష్ట్రాలు ఇచ్చిన జాబితా మేరకు సెబ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రాల పోలీసులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికే 20 మందిని వివిధ రాష్ట్రాలకు అప్పగించారు. -
మీ ఇంట్లో పడుకుంటానంటూ మహిళలకు బెదిరింపు
తాడేపల్లి: మంగళగిరి– తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ వెనుక ప్రాంతంలో గంజాయి తాగే యువకులు ఆగడాలు చేస్తూ స్థానికంగా ఉండే మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎవరైనా వారిని ప్రశ్నిస్తే చేపల వేటకు వెళుతున్నాం మీకెందుకు అంటూ వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ యువకుడు ఫుల్‌గా గంజాయి తాగి బకింగ్‌హామ్ కెనాల్ వద్ద ఉన్న ఓ ఇంటి తలుపు కొట్టగా ఓ మహిళ తలుపు తీసింది. సదరు యువకుడు మీ ఇంట్లో పడుకుంటాను. నన్ను లోపలికి రానీయండి అంటూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మహిళ సదరు యువకుడ్ని బయటకు తోసి తలుపులు వేసి భర్తకు, పక్కింటి వారికి ఫోన్ చేసింది. వేరే చోట ఉన్న భర్త హడావుడిగా ఇంటికి వచ్చేసరికి గంజాయి మత్తులో ఉన్న యువకుడు ఇంటిముందు నానా రచ్చ చేస్తున్నాడు. పక్కనే నివసించేవారు వచ్చేటప్పటికి తలుపు తీయాలంటూ గట్టిగట్టిగా కొట్టడంతో వారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా వారిపై దాడి చేసి పడుకోనివ్వరా అంటూ నానా యాగీ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు వందలాది మంది యువకులు చేపలవేట పేరుతో బకింగ్‌హామ్ కెనాల్ ఒడ్డున కూర్చుని మద్యం, గంజాయి తాగి అక్కడకు వచ్చే మహిళలను, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వెళుతున్న వారిని స్థానికులు ఆపి ప్రశ్నించారు. మాది ప్రకాష్‌నగర్, మేము ఇటు వస్తాం ఏం చేస్తారో చేసుకోండి అంటూ బూతులు తిట్టడంతో ఆ ప్రాంత మహిళలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క మత్స్యకారుడిని తప్ప ఎవరినీ అనుమతించమంటూ మహిళలకు హామీ ఇచ్చారు.