నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ పశ్చాత్తాపం
ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని వెల్లడి..తల్లిదండ్రులకు క్షమాపణ
మాదాపూర్‌లో నాయక్ సహా నలుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు
వెల్లడించిన టీజీఎన్‌ఏబీ ఎస్‌పీ
‘డ్రగ్స్’పై 8712671111 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
గచ్చిబౌలి (హైదరాబాద్): ‘చెడు స్నేహాల వల్ల నేను డ్రగ్స్‌కు బానిసనయ్యా. తల్లిదండ్రులు ఎంత చెప్పినా మారలేదు. చదువు మధ్యలోనే మానేశా. జీవితం అంధకారంగా మారిపోయింది. యువత డ్రగ్స్ బారిన పడొద్దు..’అంటూ నిట్ మాజీ విద్యార్థి నవీన్ నాయక్ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తున్నాయి. వివరాలివి. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన కురుమ్‌తోత్ రాథోడ్ నవీన్ నాయక్ (27) చదువులో చురుకుగా ఉండేవాడు. 2015లో ఆలిండియా 800వ ర్యాంక్ సాధింఛి ట్రిచి (తిరుచిరాపల్లి) ఎన్‌ఐటీలో చేరాడు. అయితే చెడు సహవాసాలతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు.
విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతో నచ్చ చెప్పారు. అయినా పెడచెవిన పెట్టాడు. 2018లో చదువు మానేసి బెంగళూరులో మార్కెటింగ్ రంగంలో పని చేసినా ఆదాయం లేకుండా పోయింది. దీంతో డ్రగ్స్ పెడ్లర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2022లో ఎండీఎంఏ డ్రగ్‌ను వెంకటేళ్వర్లు అనే వ్యక్తికి సప్లయ్ చేయడంతో దుండిగల్ పీఎస్‌లో కేసు నమోదైంది. 2023లో కేరళలోని పలక్కడ్ పీఎస్‌లో నమోదైన ఎన్‌డీసీఎస్ కేసులో శిక్ష పడింది. తాజాగా మాదాపూర్ పీఎస్ పరిధిలో గంజాయి సేవించేందుకు వెళ్లి పోలీసులకు చిక్కాడు.
ఒత్తిడిని అధిగమించాలి
విద్యార్థులు ఒత్తిడి పేరిట డ్రగ్స్‌కు బానిస కావద్దని, వ్యాయామం, యోగా లాంటివి చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించాలని నవీన్ నాయక్ చెప్పాడు. భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు. తల్లిదండ్రులు తనకెంతో చేశారని, వారు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి జీవితం నాశనం చేసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ తల్లిదండ్రులను క్షమాపణ కోరాడు.
ముగ్గురికి పాజిటివ్
మాదాపూర్‌లోని హైటెక్స్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు స్థానిక పోలీసులతో కలిసి 1.4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్‌పీ సాయి చైతన్య తెలిపారు. దూద్ బౌలికి చెందిన డ్రగ్ పెడ్లర్ మోటికర్ సిచి్చతానంద్ అలియాస్ సచిన్ (28)తో పాటు గంజాయి సేవించిన కురుమ్‌తోత్ నవీన్ నాయక్, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌రాజ్‌ను అరెస్టు చేశామని చెప్పారు. మరో డ్రగ్ పెడ్లర్ ధూల్‌పేట్‌కు చెందిన రాజా పరారీలో ఉన్నాడన్నారు. శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్‌తో కలిసి కేసు వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
ముగ్గురూ గంజాయి తాగినట్లు తేలిందని (పాజిటివ్) తెలిపారు. డ్రగ్స్ సేవించిన వారు తప్పించుకోలేరని, రక్తపు నమూనాల ఆధారంగా పట్టుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని సూచించారు. పీజీ హాస్టళ్లలోనూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు కానీ, సేవిస్తున్నట్లు కానీ తెలిస్తే 8712671111 ఫోన్ నంబర్‌లో సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు రివార్డులు అందిస్తామన్నారు. కాగా మాదాపూర్ జోన్ పరిధిలో డ్రగ్స్‌పై నిఘా పెట్టినట్లు డీసీపీ వినీత్ తెలిపారు. యాంటీ డ్రగ్ కమిటీలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయన్నారు. గచ్చిబౌలి పీఎస్ పరిధిలో గంజాయి డాన్ నీతూ బాయ్ ఆస్తులు అటాచ్ చేశామని, ఆమెపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో టీజీఏఎన్‌బీ డీఎస్‌పీ రమే‹Ù, మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment