గంజాయి వాడకంపై ఎక్సైజ్‌ శాఖ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు | Excise Department Says Youth addiction To Cannabis And Drugs In TS | Sakshi
Sakshi News home page

గంజాయి వాడకంపై ఎక్సైజ్‌ శాఖ అధ్యయనంలో విస్తుగొలిపే అంశాలు

Published Mon, Oct 25 2021 2:51 AM | Last Updated on Wed, Oct 27 2021 1:59 PM

Excise Department Says Youth addiction To Cannabis And Drugs In TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌కు బానిసవడం లోనూ దశలుంటాయట. యువత మొబైల్‌ ఫోన్ల వాల్‌ పేపర్స్‌ను బట్టి వాళ్లు డ్రగ్స్‌కు బానిసలనే విషయాన్ని గుర్తించవచ్చట. వారు ఉపయోగించే కోడ్‌ భాషల ద్వారా వారు ఏ డ్రగ్‌ వాడుతున్నారో కూడా చెప్పొచ్చట. రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల పరిశీలనలో వెల్లడైన ఈ అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. గంజాయి దమ్ము కొడితే ఎలా ఉంటుందో చూడాలన్న సరదా యువత భవిష్యత్తును బలితీసుకుంటోంది. అప్పటికే ఆ అలవాటున్న స్నేహితుల ఒత్తిడీ ఇందుకు కారణం అవుతోంది.

సరదా కాస్తా అలవాటుగా ఆ తర్వాత సీరియస్‌గా మారుతోంది. డ్రగ్స్‌ తీసుకోనిదే ఉండలేని పరిస్థితిలోకి తీసుకువెళుతుంది. స్నేహితుల బర్త్‌డే పార్టీలు, వారాంతపు రోజుల్లో జరిగే సరదా పార్టీలు గంజాయి తాగుడుకు వేదికలుగా మారుతున్నాయ ని ఎక్సైజ్‌ శాఖ అధ్యయనం స్పష్టం చేసింది. ఆల్కహాల్‌ తాగితే వచ్చే వాసన తల్లిదండ్రులు సులభంగా గుర్తుపడతారని, అదే గంజాయి అయితే ఎలాంటి వాసన ఉండదన్న భావనతో అందుకు అలవాటుపడుతున్నారు. మిగతా డ్రగ్స్‌తో పోలిస్తే తక్కువ రేటుకు లభించడం, ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేయదనే ఒక అపోహతో చాలామంది గంజాయి తాగుతున్నారని ఎక్సైజ్‌ అధికారులు తమ పరిశీలనలో గుర్తించారు.  

నిర్బంధ విద్య బాధితులే ఎక్కువ 
ఇంజనీరింగ్‌ కాలేజీలు, బీబీఏ, ఎంబీఏ కాలేజీలు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు, టెక్నో స్కూళ్లు, ఐఐటీ ఫౌండేషన్స్, కార్పొరేట్‌ ఇంటర్‌ కాలేజీల్లో నిర్బంధ విద్యకు గురైన వాళ్లు గంజాయికి అలవాటు పడుతున్న వారిలో ముందు వరుసలో ఉన్నారు. అప్పటివరకు నాలుగు గోడల మధ్య బందీలు మాదిరి ఉన్న విద్యార్థులు పై చదువుల సమయంలో స్వేచ్ఛా భావనకు గురి కావడంతో పాటు కొత్త స్నేహాలతో దురలవాట్లను చేసుకుంటున్నట్టు ఎక్సైజ్‌ నివేదిక పేర్కొంటోంది.

బ్యాగ్‌లాగ్‌ పరీక్షలుండటం, ప్రేమ విఫలమవడం, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో పనిఒత్తిడి, కాల్‌ సెంటర్‌ ఉద్యోగుల్లో రాత్రి షిఫ్టులు, వారాంతపు పార్టీల కల్చర్‌కు బాగా అలవాటు పడిన వారు డ్రగ్స్‌ తీసుకుంటున్న జాబితాలో మెజారిటీగా ఉంటున్నారని తమ ప్రాథమిక అంచనాల్లో వెల్లడైనట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. కుటుంబాలతో కాకుండా స్నేహితులతో కలిసి గోవా, అరకు, మనాలి ట్రిప్స్‌కు వెళ్లిన వారిలోనూ ఇలాంటి పోకడలు బయటపడ్డాయని తెలిపింది. విదేశీ, ఉత్తర భారతదేశ విద్యార్థులతో స్నేహం, వారి ప్రభావంతోనూ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నట్టు గుర్తించింది.  

మ్యూజిక్‌ మూడ్‌లో ఎల్‌ఎస్‌డీ 
స్నేహితులతో తొలుత గంజాయితో మొదలై తదుపరి దశలో ఎల్‌ఎస్‌డీగా పిలిచే లిసర్జిక్‌ ఆసిడ్‌ డై ఇథలమైడ్‌ తాగే వరకు వెళ్తోందని ఎక్సైజ్‌ అనేక కేసుల దర్యాప్తులో గుర్తించింది. గంజాయి తర్వాత సంగీతాన్ని, సైకడెలిక్‌/ట్రాన్స్‌ మ్యూజిక్‌ (ఓ విధమైన మానసిక భ్రాంతికి గురిచేసే మ్యూజిక్‌) ఎంజాయ్‌ చేయడానికి ఎల్‌ఎస్‌డీ స్టాంప్స్‌ (నాలుక మీద పెట్టుకునే చిన్న పట్టీ లాంటిది), బ్లాట్స్‌ (పీల్చే ద్రవం)ను వాడుతున్నట్టు తేలింది.

దాదాపు 12 నుంచి 14 గంటల వరకు ఈ డ్రగ్స్‌ ప్రభావం ఉంటుందని, ప్రమాదరకరమైన ఈ డ్రగ్‌ గోవాలో జరిగే మ్యూజిక్‌ పార్టీల్లో యువత భారీగా తీసుకుంటున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. గంజాయి తీసుకునే స్నేహితుల కలిసిన సమయంలో నెక్ట్స్‌ లెవల్‌ డ్రగ్స్‌ (తదుపరి దశ మాదకద్రవ్యాలు) పేరిట జరిగే చర్చలో భాగంగా ఎల్‌ఎస్‌డీలు వాడుతున్నారని, డార్క్‌నెట్‌ ద్వారా ఇవి సులభంగా మార్కెట్‌లో దొరుకుతుండటంతో వాటి బారిన పడుతున్నారని చెబుతున్నారు.

కోడ్‌ పదాలుంటే అనుమానించాల్సిందే.. 
తల్లిదండ్రులు తమ పిల్లల వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌ తదితర యాప్స్‌ను చెక్‌ చేయాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం విజ్ఞప్తి చేస్తోంది. వాటిలో ఏవైనా కోడ్‌ పదాలు ఉన్నట్టయితే డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టుగా అనుమానించాలని చెబుతోంది. వీడ్, స్కోర్, స్టఫ్, స్టాంప్, ఆసిడ్, పేపర్, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్, స్టాష్, మాల్, ఖాష్, స్టోనర్, పెడ్లర్, డమ్, పాట్, క్రిస్టల్, బూమ్, డీపీ (దూల్‌పేట్‌) అనే కోడ్‌ పదాలుంటే వీళ్లు డ్రగ్స్‌ వాడుతున్నట్టేనని భావించాలని సూచించారు.  

స్క్రీన్‌సేవర్లు, వాల్‌ పేపర్లను బట్టీ చెప్పొచ్చు 
డ్రగ్స్‌కు బానిసలైన వారి మొబైల్‌ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్‌ట్యాపులు, వ్యక్తిగత డెస్క్‌టాప్‌లను గమనించాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. వారి మొబైల్‌ లేదా కంప్యూటర్లలోని స్క్రీన్‌ సేవర్, వాల్‌ పేపర్లలో సైకోడెలిక్‌ చిత్రాలు, పొగతో కూడిన బొమ్మలు, మల్టీకలర్‌ ఇమేజులుంటే వారిని నిశితంగా గమనించాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. అదే విధంగా విద్యార్థులు బ్యాగ్‌ల్లో గనుక ఐ డ్రాప్స్, లైటర్స్, ఓసీబీ పేపర్స్‌ గనుక గమనిస్తే వారు గంజాయి సేవిస్తున్నట్టుగా భావించాలని స్పష్టంచేశారు. 

మరింత మత్తు కోసం కొకైన్‌ 
మద్యం తీసుకున్న తర్వాత మరింత కిక్‌ రావాలని యువత కొకైన్‌కు బానిసవుతున్నట్టు ఎక్సైజ్‌ అధ్యయనంలో తేలింది. 24 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కు లు మరింత కిక్‌ కోసం కొకైన్‌ను స్వీకరిస్తున్నారని, ఒత్తిడిని ఎదుర్కోలేక దీని వైపు మళ్లి మత్తులో మునిగి తేలుతున్నారని అధికారులు తెలిపారు. గంట వరకు ప్రభావం చూపించే కొకైన్‌ను కుంగిపోయిన పరిస్థితుల నుంచి వెంటనే తేరుకోవడానికి ఉపయోగిస్తుంటారని, వ్యాపారంలో నష్టపోయినవారు, కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కుంటున్న వారు పార్కింగ్‌ ఏరియాల్లో కార్లలో దీనిని వినియోగిస్తున్నట్టు వెల్లడైంది.  

తల్లిదండ్రుల సహకారం కీలకం  
మాదకద్రవ్యాల నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే యువత తల్లిదండ్రుల సహకారం లభిస్తే మరింత సులభంగా, కఠినంగా డ్రగ్స్‌ సరఫరాను, వినియోగాన్ని అణిచివేయవచ్చు. అధ్యయనంలో వెల్లడైన అంశాలను ఒక్కసారి పరిశీలించండి. ఇందులోని అంశాలను బట్టి మీ పిల్లల్ని గమనించండి. మీ నియంత్రణే వారికి శ్రీరామరక్ష. మరీ విపరీత దశలో ఉంటే మాకు సమాచారం ఇవ్వండి. సంబంధిత డ్రగ్స్‌ సరఫరాదారులపై చర్యలు తీసుకునేందుకు, యువతను కాపాడుకునేందుకు ఇది దోహదపడుతుంది.  
– అంజిరెడ్డి, సూపరింటెండెంట్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement