
సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బయో ఆసియా–2025 ముగింపు సదస్సులో కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని.. ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20% జనరిక్ మందులు ఇక్కడి నుంచే సరఫరా అవుతున్నాయని తెలిపారు. బయో ఆసియా– 2025 సదస్సు ముగింపు కార్య క్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో భారత ఫార్మా ఎగుమతుల విలువ రెట్టింపు అయింది. 2014లో ఫార్మా ఎగుమతి విలువ 15 బిలియన్ డాలర్లుకాగా.. 2024 నాటికి అది 27.85 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ పరిశోధనలు, ఏఐ–హెల్త్ కేర్, తయారీ రంగంలో వేగంగా వృద్ధి చెందుతూ.. ‘వసుధైక కుటుంబం’అనే భావనకు ప్రతిబింబంగా నిలుస్తోంది..’’అని తెలిపారు.
ఫార్మాలో తెలంగాణ కీలకం..
ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35శాతం, బల్క్ డ్రగ్స్‌లో 40శాతం ఆదాయం భాగ్యనగరం నుంచే వస్తోందన్నారు. 800 ఫార్మా, బయోటెక్, మెడ్‌టెక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ, ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కు వంటివి భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని... 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకానమీ సృష్టి దిశగా హైదరాబాద్ అడుగులు వేస్తోందని చెప్పారు.
లైఫ్ సైన్సెస్ రంగానికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్లోబల్ హెల్త్‌కేర్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ఇన్నోవేటర్లు, శాస్త్రవేత్తలు భారత్‌తో కలసి పనిచేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కాగా.. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు చేసిన వారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర శ్రీధర్‌బాబు బహుమతులు అందజేశారు.
200కుపైగా దేశాలకు భారత మందులు: పీయూష్ గోయల్
ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా భారతదేశం గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. బయో ఆసియా–2025 సదస్సు ముగింపు సందర్భంగా ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలకు జనరిక్ మందులు సరఫరా చేస్తున్నాం. ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్‌మెంట్, హైవాల్యూ బయో ఫార్మాపై దృష్టి సారించాం..’’అని పీయూష్ గోయల్ తెలిపారు.
ఫార్మా రంగంలో సమాచార మార్పిడి, పెట్టుబడులు, ఆవిష్కర్తలకు సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్స్, జహీరాబాద్‌లో ఇండ్రస్టియల్ జోన్, భారత్ మాల కార్యక్రమంలో భాగంగా 2,605 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 4 గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, నిజామాబాద్ పసుపుబోర్డులను తెలంగాణకు కేటాయించామని వివరించారు.
హైదరాబాద్‌ను ఫార్మా కేంద్రంగా నిలుపుతాం: మంత్రి శ్రీధర్‌బాబు
22వ బయో ఆసియా సదస్సుకు 44 దేశాల నుంచి 3 వేల మంది డెలిగేట్స్, 100 మంది వక్తలు హాజరయ్యారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 200 బిజినెస్ టు బిజినెస్ మీటింగ్‌లు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అన్నిరకాలుగా అండగా ఉంటామని తెలిపారు. బయో ఆసియా సదస్సు ముగింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లైఫ్ సైన్స్ పాలసీని త్వరలో తీసుకొస్తామని.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో లైఫ్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు.
‘‘అమెరికా, ఆ్రస్టేలియా, తైవాన్ దేశాల సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని బయో ఆసియా సదస్సులో తెలిపాయి. పరిశోధనల ద్వారా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మందులు తక్కువ ఖర్చుతో బాధితులకు అందించాలన్నది లక్ష్యం. మాపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టండి, చెప్పింది చేస్తామని హామీ ఇస్తున్నాం. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలపడానికి మా ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంది..’’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment