bio asia conferance
-
లైఫ్ సైన్సెస్‌లో విజ్ఞాన కేంద్రంగా నిలపడమే లక్ష్యం: కేటీఆర్
జీవశాస్త్ర సేవల్లో వృద్ధి సాధించడం ద్వారా ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి గమ్యస్థానంగా హైదరాబాద్ ఇప్పటికే పేరు గడించినా.. ఇక్కడితోనే ఆగిపోవాలని తాము కోరుకోవడం లేదని పేర్కొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన దిగ్గజాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆ వివరాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. మేం విధించుకున్న సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. వాటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తాం. పరిశోధన, అభివృద్ధికి గమ్యస్థానంగా.. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం వాటా కలిగిన హైదరాబాద్‌లో ఉన్న వెయ్యికి పైగా లైఫ్‌సైన్సెస్ కంపెనీలు వినూత్న, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్, శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండటంతో.. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటయ్యే బయో ఫార్మాహబ్ (బీ హబ్), హైదరాబాద్ ఫార్మాసిటీలతో మా సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణ లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. అన్ని వసతులు, వనరులతో.. ఆసియాలో ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు హైదరాబాద్‌ను కేంద్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో.. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతులు జీనోమ్ వ్యాలీలో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఔషధ రసాయన శాస్త్రం, డిస్కవరీ బయాలజీ, ప్రీ–క్లినికల్, క్లినికల్, డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సహా వివిధ సేవలు అందించే భారతీయ, బహుళజాతి ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సర్వీస్ ఆర్గనైజేషన్లకు హైదరాబాద్ నిలయంగా ఉంది. అంచనాలకు మించి వృద్ధి సాధించాం.. లైఫ్ సైన్సెస్, ఫార్మా, సంపూర్ణ ఆరోగ్య రక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. 2030 నాటికి హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగం విలువ వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని గతంలో మేం వేసుకున్న అంచనాలు చాలా మందికి నమ్మశక్యంగా కనిపించలేదు. కానీ 2022 నాటికే 80 బిలియన్ డాలర్లకు చేరుకున్నాం. నిర్దేశిత షెడ్యూల్ కంటే ఐదేళ్లు ముందు 2025 నాటికే వంద బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటాం. లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి జాతీయ స్థాయిలో 14శాతంకాగా.. తెలంగాణలో 23 శాతంగా ఉంది. ఏడేళ్లలో కొత్తగా 3 బిలియన్ డాలర్లకుపైగా నికర పెట్టుబడులు ఆకర్షించడంతోపాటు 4.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాం. బయో ఆసియా 20వ వార్షిక సదస్సు కొత్త అవకాశాలకు బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఘనంగా ‘బయో ఆసియా’ సదస్సు ప్రారంభం ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్యరక్షణ సదస్సు ‘బయో ఆసియా–2023’ శుక్రవారం హెచ్ఐసీసీలో ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తొలిరోజు ప్రభుత్వ అధికారులు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన నిపుణులు పాల్గొన్నారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ ఒన్: షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’ నేపథ్యం (థీమ్)తో ఈ వార్షిక సదస్సును నిర్వహిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ప్రారంభ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, నోవారి్టస్ సీఈవో వాస్ నరసింహన్, రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, జయంత్ నాడిగర్, సమిత్ హెరావత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగాన్ని పునర్ నిర్మించాలనే ఉద్దేశంతో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని అంచనా వేస్తున్నాం. ఈ సాహసోపేత లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నాం. 1. సెల్, జీన్ థెరపీ వంటి కొత్త నివారణ చికిత్సల వాణిజ్యీకరణ, 2. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, 3.లైఫ్ సైన్సెస్ ఫోకస్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడం, 4.ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల కలబోత సాధించడం. ఈ నాలుగింటి సాయంతో లైఫ్ సైన్సెస్ రంగానికి కొత్త రూపు ఇస్తాం. -కేటీఆర్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి గుండె వ్యాధులకూ వ్యాక్సిన్ చికిత్సలు: నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ మానవ మేధస్సును సాంకేతికత భర్తీ చేయలేదని, కానీ మనుషులు మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు సాంకేతికత అవసరమని ప్రముఖ ఫార్మా సంస్థ నోవార్టీస్ సీఈవో డాక్టర్ వాస్ నరసింహన్ చెప్పారు. మానవ శరీర నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవడంతోపాటు ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారంపై లోతుగా ఆలోచించాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ‘బయో ఆసియా’ సదస్సులో వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. ‘‘డేటా సైన్సెస్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్యపరమైన అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు సరిపడినంత సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు. గత దశాబ్దకాలంగా అనేక వైద్య, చికిత్సాపరమైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కణ, జన్యు చికిత్స వంటి కొత్త విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి వృద్ధుల్లో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. 80వ దశకంలో పురుడు పోసుకున్న ఎస్ఐ ఆర్ఎన్ఏ సాంకేతికత ద్వారా గుండె సంబంధ వ్యాధులను ఎదుర్కోవచ్చు. ఎస్ఐ ఆర్ఎన్ఏ ఉపయోగించడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు కూడా వ్యాక్సిన్ ఆధారిత చికిత్స ఎంతో దూరంలో లేదు. గుండె వ్యాధుల తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది కేన్సర్ బారిన పడుతున్నారు. ఎన్నో రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ‘రేడియోలిగాండ్’ అనే కొత్త విధానంలో పెట్ స్కాన్ ద్వారా కేన్సర్ కణితులను గుర్తించి రేడియేషన్ చికిత్స అందించవచ్చు..’’ అని వాస్ నరసింహన్ చెప్పారు. ఈ రెండింటి తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది నరాల సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోవడం లేదా అంగవైకల్యానికి గురి కావడం జరుగుతోందని.. బహుళ సాంకేతికతల వినియోగం ద్వారా మెదడులోని వివిధ భాగాలకు చికిత్స అందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో సికిల్ సెల్ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య అధికంగా ఉందని.. అవసరమైనంత మేర ఔషధాలు అందుబాటులో లేవని చెప్పారు. హైదరాబాద్‌లో కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు 15 ఏళ్ల క్రితం నోవార్టిస్ సంస్థ హైదరాబాద్‌లో అడుగు పెట్టిందని.. శరవేగంగా వృద్ధి చెంది ప్రస్తుతం కార్పోరేట్ సెంటర్‌గా ఎదిగిందని వాస్ నరసింహన్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య రక్షణ రంగానికి హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. ఔషధ అభివృద్ధి, డేటా నిర్వహణ తదితర అంశాల్లో వేగంగా వృద్ధి చెందుతోందని వివరించారు. లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో హైదరాబాద్‌కు రావాలని పిలుపునిచ్చారు. -
ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. జీవశాస్త్రాలకు నెపుణ్యపు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: జీవశాస్త్ర, ఆరోగ్య రక్షణ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక.. ‘బయో ఆసియా’20వ వార్షిక సదస్సుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ‘బయో ఆసియా 2023’పేరిట, నాణ్యమైన వైద్యం..అందరికీ ఆరోగ్యం లక్ష్యంగా.. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ) ప్రాంగణంలో ఉదయం 10.30కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు దీనిని ప్రారంభిస్తారు. ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్.. షేపింగ్ ది నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్’అనే నినాదంతో నిర్వహిస్తున్న సదస్సులో ఆరోగ్య రంగాన్ని మరింత మానవీయంగా మార్చడం అనే అంశంపై సుదీర్ఘ చర్చలు, ఉపన్యాసాలు, ప్రదర్శనలు, ప్రజెంటేషన్లు చోటు చేసుకోనున్నాయి. ఆయా రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు 70 మందికి పైగా ప్రసంగించనున్నారు. 50కి పైగా దేశాల నుంచి సుమారు 2,500 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో సుమారు 800 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య వేయికి పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఇస్తున్న ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్స్’పురస్కారాన్ని ఈసారి ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై కృషి చేసిన ప్రొఫెసర్ రాబర్ట్ లాంగర్‌కు అందజేయనున్నారు. సదస్సు నిర్వహణలో బ్రిటన్ భాగస్వామ్యం వహిస్తుండగా, స్థానిక పార్ట్నర్గా ప్లాండర్స్ వ్యవహరిస్తోంది. ప్రముఖ సంస్థ ‘ఆపిల్’తొలిసారిగా బయో ఆసియా సదస్సులో పాల్గొంటోంది. నోవార్టిస్ సీఈఓ వాస్ నరసింహన్ కీలకోపన్యాసం చేస్తారు. ప్లీనరీ టాక్‌లో యూకేకి చెందిన డా.రిచర్డ్ హాచెట్ ప్రసంగిస్తారు. 5 ఆవిష్కరణలు వివరించనున్న సార్టప్‌లు జీవ శాస్త్ర (లైఫ్ సైన్సెస్) రంగం విలువ, ఉద్యోగాల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బయో ఆసియా సదస్సును నిర్వహిస్తోంది. 2021 నాటికి హైదరాబాద్ సహా తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగంలో పనిచేస్తున్న కంపెనీల నికర విలువ రూ.50 బిలియన్ డాలర్లు కాగా.. 2028 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రంగంలో ప్రస్తుతం 4 లక్షలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్యను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి 8 లక్షలకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ సదస్సులో బయోటెక్, లైఫ్‌సైన్సెస్ విభాగంలో స్టార్టప్‌లకు పోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 స్టార్టప్‌లు బయో ఆసియాలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు దరఖాస్తు చేసుకోగా ఇందులో 75 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. వీటి నుంచి ఐదింటిని ఎంపిక చేసి నగదు పురస్కారం ఇవ్వడంతో పాటు వాటి ఆవిష్కరణలను వివరించేందుకు అవకాశం ఇస్తారు. ఇప్పటివరకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 19 ఏళ్ల క్రితం ప్రారంభమైన బయో ఆసియా సదస్సు రాష్ట్ర విభజన తర్వాత కూడా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో సత్య నాదెళ్ల వంటి ప్రముఖ కంపెనీల సీఈఓలు, శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు ప్రసంగించగా, 20 వేలకు పైగా భాగస్వామ్య సమావేశాలు జరిగాయి. 250కి పైగా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరగా, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్, అనుబంధ రంగాల్లోకి వచ్చాయి. లైఫ్‌సైన్సెస్‌పై సర్కారు కీలక ప్రకటన! 20వ సదస్సులోనూ ప్రాధాన్యత కలిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశముందని భావిస్తున్నారు. ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు, లైఫ్ సైన్సెస్ రంగంలో యువతకు నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశముంది. -
ప్రపంచాన్ని ఆదుకొనేలా మన ఫార్మా: కేటీఆర్
భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు ప్రబలితే ప్రపంచాన్ని ఆదుకోగల స్థాయిలో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. జీవశాస్త్ర రంగంలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఫార్మాసిటీ ఏర్పాటుతో మరింత ఎత్తుకు ఎదుగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సు ఈ నెల 24వ తేదీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు. త్వరలో ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం ‘జీవశాస్త్ర రంగంలో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి కీలకమైన కేంద్రంగా మారింది. ఏటా 900 కోట్ల టీకాలు తయారు చేస్తోంది. త్వరలోనే ఈ సంఖ్య 1,400 కోట్లకు చేరుతుంది. టీకాలన్నింటిలో తెలంగాణ వాటా 50 శాతానికి చేరుతుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదిత ఫార్మా కంపెనీలు అత్యధికంగా (214) ఉండటం, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైజెస్ పార్కు, త్వరలో ప్రారంభం కానున్న ఫార్మాసిటీ వంటివి హైదరాబాద్‌ను జీవశాస్త్ర రంగంలో అగ్రగామిగా నిలుపుతున్నాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎంఆర్ఎన్ఏ టీకా కేంద్రం కూడా త్వరలో హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి..’అని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాబర్ట్ లాంగర్‌కు అవార్డు ‘బయో ఆసియా గత 19 ఏళ్లలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. వందకుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, నోబెల్ అవార్డు గ్రహీతలకు ఆతిథ్యం ఇవ్వగలిగాం. 20 వేలకు పైగా భాగస్వామ్య చర్చలకు వెసులుబాటు కల్పించాం. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీకి కీలకమైన ప్రయోగాలు నిర్వహించిన రాబర్ట్ లాంగర్‌కు ఈ ఏడాది జినోమ్ వ్యాలీ ఎక్స్‌లెన్సీ అవార్డును అందించనున్నాం. 400కు పైగా స్టార్టప్‌లతో నిర్వహిస్తున్న పోటీలో 75 వరకూ స్టార్టప్‌లను స్క్రీన్ చేయగా.. వీటిల్లో టాప్ 5 సంస్థలు బయో ఆసియా సదస్సు తుది రోజు తమ ఆలోచనలను పంచుకోనున్నాయి..’అని వెల్లడించారు. తొలిసారిగా సదస్సుకు ఆపిల్ కంపెనీ.. ‘బయో ఆసియా సదస్సు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతిఆయోగ్ ఇతర రాష్ట్రాలకు బయో ఆసియా నిర్వహణ, ఫలితాలపై మాస్టర్ క్లాస్ ఇస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై బయో ఆసియా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. (ఈ సందర్భంగా కేటీఆర్ కొన్ని ఉదాహరణలు చెప్పారు) 20వ బయో ఆసియా సదస్సులో తొలిసారి ఆపిల్ కంపెనీ కూడా పాల్గొంటోంది. ఆపిల్ ఆరోగ్య విభాగానికి చెందిన డాక్టర్ సంబుల్ దేశాయి, యునిసెఫ్ ప్రతినిధి సింథియా మెకాఫీ, దేశీ ఫార్మారంగ ప్రముఖులు అజయ్ పిరమల్, సతీశ్‌రెడ్డి, గ్లెన్ సల్దానా తదితరులు పాల్గొంటున్నారు..’అని కేటీఆర్ వివరించారు. రెట్టింపు పెట్టుబడులు, ఉద్యోగాలు ‘జీవశాస్త్ర రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బయో ఆసియాతో పాటు అనేక ఇతర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జీవశాస్త్ర రంగం విలువ, ఉద్యోగాలు కూడా 2028 నాటికి రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2021లో హైదరాబాద్, దాని పరిసరాల్లోని జీవశాస్త్ర రంగ కంపెనీల ఆదాయం 50 బిలియన్ డాలర్లుగా ఉంది. 2028 నాటికి దీన్ని వంద బిలియన్ డాలర్లకు చేరుస్తాం. ప్రస్తుతం ఈ రంగంలోని 4 లక్షల ఉద్యోగాలను 8 లక్షలు చేస్తాం. రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీని ఫార్మాసిటీకి అనుబంధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..’అని చెప్పారు. ‘టీం ఇండియా’స్ఫూర్తి నినాదాలకే పరిమితం తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బల్క్ డ్రగ్ పార్కు మొదలుకొని రక్షణ రంగం ప్రాజెక్టు వరకు పలు విషయాల్లో కేంద్రం తనదైన శైలిలో వ్యవహరించిందని, ‘టీం ఇండియా’అన్న స్ఫూర్తిని కేవలం నినాదాలకే పరిమితం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ జీవశాస్త్ర, ఫార్మా విభాగపు డైరెక్టర్ శక్తి నాగప్పన్‌లు పాల్గొన్నారు. -
భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రం హోం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా పరిచయమైన వర్క్ ఫ్రం హోం పద్ధతి ఇకపై కూడా కొనసాగుతుందని, ఐటీ వంటి నాలెడ్జ్ వర్కర్లతో పాటు ఆరోగ్య రంగంలో పని చేసే వారికీ అందుబాటులోకి వస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. అయితే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల ఉత్పాదకతతో పాటు వారి సంక్షేమానికి సంబంధించి మరిన్ని డిజిటల్ టెక్నాలజీలు, పరికరాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ తయారు చేసిన హాలోలెన్స్ వంటి పరికరాలతో వైద్యులు ఇంటి నుంచే రోగులను పరిశీలించి వైద్యం అందించే రోజులు రావాలని ఆకాంక్షించారు. 2రోజుల బయో ఆసియా సదస్సులో భాగంగా మంగళవారం జరిగిన ఫైర్‌సైడ్ చాట్ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సత్య నాదెళ్ల చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. కోవిడ్ –19 వల్ల భిన్న రంగాలు కలసి పనిచేసే అవకాశం వచ్చిందని కేటీఆర్ అడిగిన ఓ ప్రశ్నకు సత్య నాదెళ్ల సమాధానం ఇచ్చారు. వైద్య రంగంలో కృత్రిమ మేధతో పాటు పలు అత్యాధునిక టెక్నాలజీల వాడకానికి ఉన్న అవరోధాలను తొలగించాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని విశ్లేషించే పద్ధతులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. స్టార్టప్‌లు కీలకం.. ‘కంప్యూటింగ్, బయాలజీ సమన్వయంతో పనిచేయడం మొదలైతే జీవశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయి. భారత్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేసేందుకు ఓ కంపెనీ పనిచేస్తోంది. అపోలో ఆసుపత్రులు టెక్నాలజీ సాయంతో రోజంతా రోగులకు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేసింది. అతి తక్కువ ఖర్చుతో వైద్య సలహాలను అందించేందుకు మైక్రోసాఫ్ట్ పనిచేస్తోంది. పేషెంట్ కేర్, మందులు కనుగొనడంలో కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి’అని సత్య నాదెళ్ల వివరించారు. పన్ను రాయితీలు ఇవ్వాలి: కేటీఆర్ భారత్ సృజనాత్మక శక్తిగా ఎదిగేందుకు కేంద్రం తగిన విధానాలు రూపొందించాల్సిన అవసరముందని కేటీఆర్ పేర్కొన్నారు. బయో ఆసియా సదస్సులో భాగంగా నిర్వహించిన సీఈవో కాన్క్లేవ్లో ఆయన మాట్లాడుతూ.. ఉత్పాదకతకు, పరిశోధనలపై పెట్టిన ఖర్చులకు కేంద్రం లింకు పెట్టడం ద్వారా కొన్ని రకాల పన్ను రాయితీలను తొలగించిందని, దీని ప్రభావం ఆత్మనిర్భర భారత్‌పై పడుతుందని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో మందుల తయారీలో కీలకమైన మాలిక్యుల్స్ ఆవిష్కరణలో వెనుకబడిపోయామని పేర్కొన్నారు. దుర్వినియోగం అవుతున్నందుకే.. కేటీఆర్ అభిప్రాయాలపై నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ స్పందిస్తూ.. పన్ను సబ్సిడీలు దుర్వినియోగమైన కారణంగానే వాటిని ఉత్పాదకతతో ముడిపెట్టాల్సి వచ్చిందని, కేంద్రం ఇప్పటికే తన వంతు కృషి చేసిందని, ఇకపై పరిశోధనలపై పారిశ్రామిక రంగం మరిన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. ఫార్మా రంగం నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలని బయోకాన్ అధ్యక్షురాలు కిరణ్ మజుందార్ షా సూచించారు. అంతర్జాతీయ పేటెంట్లను పొందేందుకు కంపెనీలు పెడుతున్న ఖర్చును ఆర్ అండ్ డీ ఖర్చులుగా పరిగణించట్లేదని, సృజనాత్మకతను పెంచాలంటే పన్ను రాయితీలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
కష్టకాలంలోనూ జీవశాస్త్రంలో వృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీవశాస్త్ర, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిని వంద బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, ఈ స్వప్నం సాకారమయ్యే సూచనలు కన్పిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ గతేడాది ఈ రెండు రంగాల్లో దాదాపు రూ.3,700 కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లో బయో ఆసియా–2021 సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోవిడ్‌కు తొలి వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారు కావడం చాలా గర్వకారణమని చెప్పారు. కోవిడ్ కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు సంస్థలు, శాస్త్రవేత్తలు నిరుపమానమైన సేవలు అందించారని, ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. కోవాగ్జిన్ తయారీలో భారత్ బయోటెక్ విజయం సాధించగా బయోలాజికల్–ఈ, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ కూడా తమ వంతు పాత్ర పోషించాయని, హెటిరో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ సంస్థలు రష్యా టీకా స్పుత్నిక్–వీ తయారీ చేపట్టి కొరతను నివారించే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. అరబిందో ఫార్మా కూడా ఏడాదికి 45 కోట్ల టీకాలు తయారీ సామర్థ్యంతో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తోందని చెప్పారు. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన తొలి భారతీయ కేన్సర్ మందు ఉమ్రాలిసిబ్ కూడా హైదరాబాద్‌లోనే తయారైందని గుర్తుచేశారు. జీనోమ్ వ్యాలీలో ఏడాది కాలంలో పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏర్పాటు కాగా, కొన్ని తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయని వివరించారు. ఫార్మాసిటీ ప్రారంభం త్వరలో ఉంటుందని, మెడికల్ డివైజెస్ పార్క్‌లోనూ ఈ ఏడాదిలోపు పూర్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. భారత్ బయోటెక్‌కు అవార్డు బయో ఆసియా ఏటా అందించే ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డు ఈ ఏడాది భారత్ బయోటెక్‌కు దక్కింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌తో పాటు పలు ఇతర టీకాలను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును భారత్ బయోటెక్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్ అందించారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సిన్లలో 65 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతుండటం గర్వకారణమని కృష్ణ ఎల్లా అన్నారు. అరబిందోతో పాటు పలు ఇతర సంస్థలు కూడా వ్యాక్సిన్ తయారీ రంగంలోకి ప్రవేశించడం వల్ల ఇకపై పోటీ మరింత ఆసక్తికరంగా మారనుందని పేర్కొన్నారు. -
వైద్య పరికరాల దిగుమతులకు చెక్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఉపయోగించే వైద్య పరికరాల్లో 80 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఈ పరిస్థితి మారాలని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేయాలని, వైద్య పరికరాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తమ ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా) సంయుక్తంగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరికరాల తయారీ కేంద్రంలో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలకు భూ కేటాయింపు పత్రాలను అందజేశారు. ఐబీఎం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కృత్రిమ మేధ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. బయో ఆసియా వంటి సదస్సులు ప్రభుత్వాలకు, పరిశ్రమలకు ఎన్నో గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. 17వ బయో ఆసియా సదస్సుకు 35 దేశాల నుంచి 2,000 మంది హాజరయ్యారని, వచ్చే ఏడాది ఈ సదస్సు మరింత విస్తృత స్థాయిలో నిర్వహించాలన్నది తమ ఆకాంక్ష అని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు అవార్డులు... బయో ఆసియాలో భాగంగా స్టార్టప్ కంపెనీల పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదు కంపెనీలకు కేటీఆర్ నగదు బహుమతులు అందజేశారు. పోటీ కోసం వందల దరఖాస్తులు రాగా నిశిత పరిశీలన తరువాత 70 కంపెనీలకు బయో ఆసియాలో తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించామని, సీసీఎంబీ, టెక్ మహేంద్ర వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలు 5 కంపెనీల ను విజేతలుగా నిర్ణయించారని ఐఐఐటీ ప్రొఫెసర్ రమేశ్ లోకనాథన్ తెలిపారు. నవజాత శిశువులకు వచ్చే కామెర్ల రోగానికి చికిత్స అందించే పరికరాన్ని అభివృద్ధి చేసిన ‘హీమ్యాక్ హెల్త్ కేర్’, డాక్టర్ల అపాయింట్మెంట్లు మొదలు, వారి లభ్యత, ప్రత్యేకతల గురించి టెలిఫోన్లో వివరించేందుకు వాడే కృత్రిమ మేధ ఆధారిత సేవలను అందిస్తున్న ‘కాల్జీ’, ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఊతపు కర్రలు (క్రచెస్)ను తయారు చేసిన ‘ఫ్లెక్సీ మోటివ్స్’, శరీర అవయవాల త్రీడీ మోడళ్ల ద్వారా గాయాలు, శస్త్రచికిత్సల నుంచి కోలుకునే సమయాన్ని సగానికి తగ్గించే ‘లైకాన్ త్రీడీ’, ఈ–కోలీ బ్యాక్టీరియాలో మార్పుల ద్వారా మందుల తయారీకి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేయగల ‘ఆంకోసెమిస్’కు ఈ అవార్డులు లభించాయి. -
కణాధారిత చికిత్సలదే భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: మనిషికి వచ్చే అనేక రకాల వ్యాధులను మందులతో కాకుండా.. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ సాయంతోనే చికిత్స చేసే కాలం దగ్గర్లోనే ఉందంటున్నారు డాక్టర్ కార్ల్ జూన్. కేన్సర్ చికిత్స ఇమ్యూనోథెరపీకి ఆద్యుడు.. రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్ వ్యాధిపై పోరాటానికి సిద్ధం చేసిన వ్యక్తి కార్ల్ జూన్.. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును అందుకున్న ఆయ నను ‘సాక్షి’ మంగళవారం పలకరించింది. కార్–టి కణచికిత్స ఆలోచనకు దారితీన పరిస్థితులు, పురోగతి.. తదితర అంశాలపై ఆయనతో జరిగిన సంభాషణ ఇలా ఉంది.. ప్రశ్న: రోగ నిరోధక వ్యవస్థ కణాలనే కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడొచ్చన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? జవాబు: రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలను కేన్సర్‌కు వ్యతిరేకంగా వాడటమే తొలి కణాధారిత చికిత్స కాదు. ఎముక మజ్జను మార్పిడి చేయడం కూడా ఆ కోవకు చెందిన చికిత్సే. 1980లలో నేను ఈ రంగంలో పనిచేసే వాడిని. రోగికి సంబంధం లేని వ్యక్తి ఎముక మజ్జను వాడినప్పుడు మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు గుర్తించాం. దీనికి కారణమేంటన్నది అన్వేషించినప్పుడు టి–కణాల గురించి తెలి సింది. ఆ పరిశోధనల ఆధారంగా కార్–టి సెల్ థెరపీకి సంబంధించిన ఆలోచన వచ్చింది. టి– కణాల్లో మార్పుల ద్వారా మజ్జ మార్పిడి ప్రక్రియ లేకుండానే కేన్సర్‌కు చికిత్స అందించొచ్చన్న ఆలోచనతో దీన్ని మొదలుపెట్టాం. ప్ర: వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేయడమే ఇప్పటివరకు పలు వ్యాధుల చికిత్సకు వాడుతున్న పద్ధతి. ఇలా కాకుండా శరీర వ్యవస్థలను బలోపేతం చేయడం వ్యాధులను నియంత్రించడం సాధ్యమేనా? జ: రోగ నిరోధక వ్యవస్థలో రకరకాల కణాలు ఉన్నాయి. కొన్ని బ్యాక్టీరియాలను నాశనం చేసేందుకు ఉపయోగపడితే టి–కణాల్లాంటివి వైరస్‌లను మట్టుబెట్టేందుకే పరిణమించాయి. బీ–కణాలు తయారుచేసే యాంటీబాడీలు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములకు అతుక్కుపోవడం ద్వారా అవి నాశనమయ్యేందుకు తోడ్పడతాయి. ఈ ప్రాథమిక ధర్మాల ఆధారంగా భవిష్యత్తులో ఎయిడ్స్ లాంటి వ్యాధులకూ చికిత్స చేయొచ్చు. మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధుల చికిత్సకూ కణాధారిత చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. ప్ర: కరోనా వైరస్‌కు విరుగుడుగా టీ– కణాలను వాడొచ్చా? జ: వాడొచ్చు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కరోనా వైరస్ నియంత్రణకు ఒక వ్యాక్సిన్ పనిచేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్–టి వంటి కణాధారిత చికిత్సల అవసరం ఉండకపోవచ్చు. ఇప్పటికే కోవిడ్–19 బారిన పడి స్వస్థత చేకూరిన వారి రక్తంలో వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు మెండుగా ఉంటాయి. ఇలాంటి వారి నుంచి సేకరించిన సీరమ్‌ను ఎక్కించడం ద్వారా ఇతరులకు సోకకుండా చేయొచ్చు. ప్ర: ప్రస్తుతం మీరు ఏ అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు? జ: కార్–టి చికిత్స విధానానికి జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ క్రిస్పర్ను జోడించేందుకు ప్రయత్నం చేస్తున్నా. ఇది కేన్సర్ కణితులపై మంచి ఫలితం చూపిస్తుందని అంచనా. ప్ర: కార్–టి పద్ధతి అన్ని విధాలుగా మెరుగైన కేన్సర్ చికిత్సేనా? జ: అమెరికాలో ఈ పద్ధతి ఇప్పటికే చాలా మంది ల్యూకేమియా, లింఫోమా రోగులకు చికిత్స కల్పించింది. త్వరలోనే ఎముక మజ్జకు వచ్చే మైలోమా రకం కేన్సర్‌కు కూడా ఎఫ్‌డీఏ అనుమతులు రానున్నాయి. మైలోమా చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీని వల్ల రెండు మూడేళ్లు మాత్రమే బతుకుతారనే వారు పదేళ్ల వరకూ మనుగడ సాగించవచ్చు. కేన్సర్ చికిత్సకు మరికొన్ని మార్గాలున్నాయి. కణాల మధ్య సమాచార ప్రసారానికి ఉపయోగపడే ఎగ్జోజోమ్స్. వీటిని ఎలా తయారు చేస్తారన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. వేర్వేరు రకాల చికిత్స పద్ధతులను కార్–టి చికిత్స విధానంతో కలిపి వాడే అవకాశాలున్నాయి. ప్ర: కార్–టి కణాల చికిత్సను భారత్‌లో విస్తృతంగా ఉపయోగించాలంటే ఏం చేయాలి? జ: కార్–టి కణాల తయారీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇప్పటివరకు టి–కణాలను పరిశోధన సంస్థల్లోనే తయారు చేస్తున్నారు. నోవర్టిస్ లాంటి సంస్థ వాణిజ్య స్థాయి ఉత్పత్తి మొదలుపెట్టినా అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. ప్ర: భారత ప్రభుత్వంతో కలసి పనిచేసే అవకాశం ఉందా? జ: కచ్చితంగా.. కార్–టి చికిత్స విధానంపై ప్రభుత్వం తయారు చేసిన మార్గదర్శకాలను పరిశీలించి తగిన సలహా సూచనలు ఇవ్వాలన్నది ఆలోచన. బయోకాన్ కంపెనీతో పాటు, కేన్సర్ నిపుణులు సిద్ధార్థ ముఖర్జీ వంటి వారితో కలసి కంపెనీ పెట్టే ఆలోచన కూడా ఉంది. -
హైదరాబాద్‌లో బయో ఆసియా
సాక్షి, హైదరాబాద్: దశాబ్దకాలంగా భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న పెట్టుబడులు, ఇతర అవకాశాల కోసం ప్రపంచ స్థాయిలో పేరొందిన లైఫ్ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో ‘బయో ఆసియా’కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల పాటు జరిగే 17వ బయో ఆసియా సదస్సుకు రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్‌కు రావడంలో బయో ఆసియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక వసతులు, పెట్టుబడికి ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు బయో ఆసియా దోహదపడుతుందని వివరించారు. బయో ఆసియా సదస్సు తర్వాత హైదరాబాద్ లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. గతంలో జరిగిన బయో ఆసియా సదస్సుల్లో స్థానిక సంస్థలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను పరిచయం చేశామని చెప్పారు. ఈ సదస్సుకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీనియర్ ప్రతినిధులు, పరిశోధకులు హాజరవుతారని తెలిపారు. టుడే ఫర్ టుమారో.. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే బయో ఆసియా సదస్సును హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నారు. ‘టుడే ఫర్ టుమారో’అనే నినాదంతో జరిగే ఈ సదస్సులో ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, పెట్టుబడులకు అనువైన విధానాలు రూపొందించడంపై చర్చిస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి 37 దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వాములవుతారు. 17వ బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో పాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాధులను మరింత సమర్థంగా ఎదుర్కోవడంపై సదస్సులో చర్చించనున్నారు. నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లకు చవకైన పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారిస్తుంది. లైఫ్ సైన్సెస్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిపైనా చర్చించనున్నారు. ఇండియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి అనేక దేశాల నుంచి ఎంపిక చేసిన 75 స్టార్టప్ కంపెనీలు 175 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి. -
ఫిబ్రవరి 17–19 తేదీల్లో హైదరాబాద్‌లో బయో ఏసియా 2020
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా వచ్చే నెలలో జరిగే బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’వేదికగా లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా బయో ఏసియా వేదికపై 75 స్టార్టప్‌లకు తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు 300 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక ‘బయో ఏసియా 2020’సదస్సు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్ వేదికగా జరగనుంది. ఈ రెండు రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలతో స్టార్టప్‌లు భేటీ అయ్యే అవకాశాన్ని ‘స్టార్టప్ స్టేజ్’కల్పిస్తుంది. ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు స్టార్టప్ స్టేజ్ అవకాశం కల్పిస్తుంది. 75 స్టార్టప్‌లకు ఈ అవకాశం దక్కనుండగా, వీటి నుంచి ఎంపిక చేసిన ఐదు అత్యుత్తమ స్టార్టప్‌లకు పెట్టుబడుదారులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది. బయో ఏసియా సదస్సులో భాగంగా జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఎంపిక చేసిన స్టార్టప్‌లకు కల్పిస్తారు. టెక్ మహీంద్ర భాగస్వామ్యంతో.. బయో ఏసియా సదస్సులో భాగంగా ‘స్టార్టప్ స్టేజ్’ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టెక్ మహీంద్ర సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తుండగా.. టెక్ మహీంద్ర లీడ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడించారు. ఐదేళ్లుగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బయో ఏసియా సదస్సుల్లో స్టార్టప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు, అనేక నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే 17వ బయో ఏసియా సదస్సులో తమ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఇప్పటికే 300 దరఖాస్తులు రాగా, ఈ నెల 12 వరకు దరఖాస్తు గడువు ఉందని బయో ఏసియా సీఈవో శక్తి నాగప్పన్ వెల్లడించారు. -
ఫార్మా రాజధానిగా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ స్థానాన్ని మరింత సుస్థిరం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ‘17వ బయో ఏసియా సదస్సు’ వెబ్సైట్, థీమ్‌లను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో కేటీఆర్ ఆవిష్కరించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 17వ బయో ఏసియా సదస్సును ‘టుడే ఫర్ టుమారో’నినాదంతో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌ను ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు రాజధానిగా మారుస్తామని చెప్పారు. టీఎస్ఐఐసీ, రిచ్, స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వంటి పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పలు కేంద్ర సంస్థలు కూడా ఈ సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు తెలిపారు. బయో ఏషియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశంగా, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉంటుందన్నారు. అసోం, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ‘రాష్ట్ర భాగస్వాములు’ హోదాలో ఈ సమావేశానికి హాజరవుతాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
‘ఫార్మా’ వృద్ధికి ఊతమిస్తాం..
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఫార్మా రంగం 20 ఏళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మారుతున్న ప్రపంచంలో ఈ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో శనివారం సురేశ్ ప్రభు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరేడు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు వైద్యాన్ని సామాన్యుడి చెంతకు తీసుకుపోవడంతోపాటు ఫార్మా కంపెనీలకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని చెప్పారు. ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ గురించి మాట్లాడుతూ.. మనిషి జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రంగంపై నియంత్రణలు తప్పనిసరి అని, భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలూ రావచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలు అల్లోపతి మందులతోపాటు ఆయుర్వేదం, సిద్ధ వంటి ఇతర వైద్య విధానాలపైనా దృష్టి పెట్టి కొత్త మందులు తయారు చేయాలని.. తద్వారా తక్కువ ఖర్చుతో పరిపూర్ణ వైద్యం అందించడం వీలవుతుందన్నారు. ప్రోత్సాహకాలు ఇవ్వండి: కేటీఆర్ ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు తీసుకెళ్లారు. మందుల ధరలను నిర్ణయించే విషయంలో తమతో సంప్రదింపులు జరపాలన్న పారిశ్రామిక వర్గాల విన్నపంపై ప్రభు స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ చూసుకుంటుందని సమాధానమిచ్చారు. రసాయనాలు, ఫార్మా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఫార్మా పరిశ్రమలు కొత్త మందులను కనుగొనే లక్ష్యంతో పరిశోధనల కోసం భారీ ఖర్చు పెడుతుంటాయని, వీటిపై రాబడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని పరిశ్రమల తరఫున కేటీఆర్ కోరారు. దీనికి ప్రభు స్పందిస్తూ.. ఈ అంశాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్యాకేజీగా చూడకూడదని.. మందుల తయారీ వల్ల ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న కారణంగా మొత్తం సమాజానికి ఇచ్చే ప్రోత్సాహకాలుగా చూడాలని చెప్పారు. 1999లో ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై పెట్టే ఖర్చులో రాయితీలు ఇచ్చేందుకు రూ.50 కోట్లు కేటాయించారని అలాంటి పథకాన్ని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
టెక్నాలజీలతో ఆరోగ్య భాగ్యం
హైదరాబాద్: బయో టెక్నాలజీ, ఐటీ రంగాల కారణంగా ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల నిర్ధారణ సులువవుతోందని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) ఉపాధ్యక్షుడు ప్రొ.ప్రభాకరన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూడు రోజుల బయో ఆసియా సదస్సులో భాగంగా చివరిరోజైన బుధవారం 'డిజిటల్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ ఐటీ కాన్ఫరెన్స్' కార్యక్రమంలో ప్రభాకరన్ కీలకోపన్యాసం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించగలదని, అన్ని వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు చక్కటి వేదికని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు వ్యాధుల చికిత్సకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ముందస్తు నివారణకూ అంతే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అపోలో హాస్పిటల్స్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి మాట్లాడుతూ బయాలజీ, బైట్స్, బ్యాండ్‌విడ్త్‌లు ఆరోగ్యరంగాన్ని మార్చేస్తున్నాయని తెలిపారు.