బయో ఆసియా సదస్సులో కేటీఆర్‌తో సురేశ్ ప్రభు
సాక్షి, హైదరాబాద్ : ఫార్మా రంగంలో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూనే సామన్యుడి వైద్య ఖర్చులు పెరగకుండా చూడాల్సిన అవసరముందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఫార్మా రంగం 20 ఏళ్లలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, మారుతున్న ప్రపంచంలో ఈ రంగంలో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న బయో ఆసియా సదస్సులో శనివారం సురేశ్ ప్రభు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుఃప్రమాణాలు పెరుగుతున్న తీరు ఫార్మా రంగానికి డిమాండ్ కల్పిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఆరోగ్య పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు లక్ష వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఆరేడు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే ఈ కేంద్రాలు వైద్యాన్ని సామాన్యుడి చెంతకు తీసుకుపోవడంతోపాటు ఫార్మా కంపెనీలకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని చెప్పారు. ఫార్మా రంగంపై ప్రభుత్వ నియంత్రణ గురించి మాట్లాడుతూ.. మనిషి జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రంగంపై నియంత్రణలు తప్పనిసరి అని, భవిష్యత్తులో మరిన్ని నియంత్రణలూ రావచ్చని చెప్పారు. ఫార్మా కంపెనీలు అల్లోపతి మందులతోపాటు ఆయుర్వేదం, సిద్ధ వంటి ఇతర వైద్య విధానాలపైనా దృష్టి పెట్టి కొత్త మందులు తయారు చేయాలని.. తద్వారా తక్కువ ఖర్చుతో పరిపూర్ణ వైద్యం అందించడం వీలవుతుందన్నారు.
ప్రోత్సాహకాలు ఇవ్వండి: కేటీఆర్
ఫార్మా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు తీసుకెళ్లారు. మందుల ధరలను నిర్ణయించే విషయంలో తమతో సంప్రదింపులు జరపాలన్న పారిశ్రామిక వర్గాల విన్నపంపై ప్రభు స్పందిస్తూ.. ఈ విషయాన్ని నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ చూసుకుంటుందని సమాధానమిచ్చారు. రసాయనాలు, ఫార్మా మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఈ అంశాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
ఫార్మా పరిశ్రమలు కొత్త మందులను కనుగొనే లక్ష్యంతో పరిశోధనల కోసం భారీ ఖర్చు పెడుతుంటాయని, వీటిపై రాబడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని పరిశ్రమల తరఫున కేటీఆర్ కోరారు. దీనికి ప్రభు స్పందిస్తూ.. ఈ అంశాన్ని పరిశ్రమలకు ఇచ్చే ప్యాకేజీగా చూడకూడదని.. మందుల తయారీ వల్ల ఎన్నో సామాజిక ప్రయోజనాలు ఉన్న కారణంగా మొత్తం సమాజానికి ఇచ్చే ప్రోత్సాహకాలుగా చూడాలని చెప్పారు.
1999లో ప్రైవేట్ సంస్థలు పరిశోధనలపై పెట్టే ఖర్చులో రాయితీలు ఇచ్చేందుకు రూ.50 కోట్లు కేటాయించారని అలాంటి పథకాన్ని మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment