
ఒకవేళ సుంకాలు విధిస్తే ఆ దేశానికే అధిక నష్టం
కేన్సర్ మందుల తయారీలో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నాం
చైనా మార్కెట్, అక్కడి ప్రభుత్వం సృజనాత్మకతను ప్రోత్సహిస్తోంది
బయో ఆసియా సదస్సు సందర్భంగా మీడియాతో డాక్టర్ రెడ్డీస్ కో–ఫౌండర్, చైర్మన్, జి.వి.ప్రసాద్
సాక్షి హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తే వాటి ప్రభావం ఫార్మా రంగంపై ఎంత మేరకు ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ కో–ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ వ్యాఖ్యానించారు. సుంకాలు ఎంత మేరకు ఉంటాయన్నది తెలియకపోయినా.. వాటి వల్ల అమెరికాకే నష్టమని భావిస్తున్నా మన్నారు.
ఫార్మా రంగంలో భారత్ ఇతరులను అనుకరించడం కాకుండా.. సొంతంగా ఉత్పత్తులను ఆవిష్కరించాల్సిన సమయం ఇదేనన్నారు. మంగళవారం హైదరా బాద్‌లో ప్రారంభమైన బయో ఆసియా సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పలు అంశాలపై విలేకరుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ప్రశ్న: భారత్‌లో ఇన్నోవేషన్‌ను ప్రోత్స హించాలని మీరు బయో ఆసియా వేదికగా ప్రకటించారు. మరి ఈ అంశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఆశిస్తున్నారు?
జవాబు: ప్రభుత్వం నుంచి సహకారం ఆశించట్లేదు. మాకు బెంగళూరులో కేన్సర్‌పై పరిశోధనల కోసం ఆరిజిన్ పేరుతో ప్రత్యేక కేంద్రం ఉంది. అక్కడ కేన్సర్ చికిత్స కోసం సొంతంగా మందులను అభివృద్ధి చేస్తున్నాం. అలాగే కణ, జన్యుస్థాయిలో పరిశోధనలకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం.వాటిలో కేన్సర్ చికిత్సపై పరిశోధనలు జరుగుతున్నాయి.
ప్ర: ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌పై విస్తృత పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ వ్యాధికి పూర్తిస్థాయి చికిత్స లభిస్తుందనుకోవచ్చా?
జ: కేన్సర్‌కు పూర్తిస్థాయిలో చికిత్స లభించేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఇంకా చాలా సవాళ్లను అధిగమించాల్సి ఉంది. ప్రస్తుతం కణ, జన్యుస్థాయిలో కొంత ముందడుగు సా ధించాం. రకరకాల మోనోక్లోనల్ యాంటీబాడీస్ (రోగనిరోధక శక్తి కణాల మాదిరిగా పనిచేసే కణాలు.
కేన్సర్ కణాలపై దాడి చేసి నాశనం చేస్తాయి), సహజసిద్ధ యాంటీబాడీలకు మందులను జోడించి వాడటం (ఏడీసీలు అంటారు) వంటి అనేక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇమ్యూనోథెరపీలో భాగంగా వాటిని కేన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు. మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ను బెంగళూరులోని సెల్ అండ్ జీన్ థెరపీ సెంటర్‌లో తయారు చేస్తున్నాం. అయినప్పటికీ అన్ని రకాల కేన్సర్ల చికిత్సకు ఇంకా సమయం పడుతుంది.
ప్ర: భారత్‌పై 25% సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో దీని ప్రభావం ఫార్మా
రంగంపై ఎంత మేరకు ఉంటుంది?
జ: దీనిపై మాతోపాటు ఇతర ఫార్మా కంపెనీలకు స్పష్టత లేదు. సుంకాలు ఎంత మేరకు ఉంటాయన్నది కూడా తెలియదు. సుంకాలు విధిస్తే అమెరి కాలోని వినియోగదారులు, ఇంటర్మీడియరీస్లపైనే ఆ భారం పడుతుంది. సుంకాల నుంచి తప్పించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ కేంద్రాలను అమెరికాకు తరలించడం ఆచరణ సాధ్యం కాదు. అంత సామర్థ్యం అక్కడ లేదు.
పైగా అక్కడ తయారీ ఖర్చులు చాలా ఎక్కువ. సుంకాలు విధించినప్పటికీ భారత్, చైనా కంపెనీలు ఇతర దేశాలతో పోటీపడగలవు. మొత్తమ్మీద చూస్తే సుంకాల విషయమై ప్రస్తుతం మేము వేచి చూస్తున్నాం. ఒక స్పష్టత వచ్చే వరకు ఏం చేయాలన్నది నిర్ణయించలేం. ఈ విషయమై ప్రభుత్వంతోనూ ఇప్పటివరకూ సంప్రదింపులు జరపలేదు.
ప్ర: కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. మీరు ఎంత వరకు దీన్ని వాడుకుంటున్నారు?
జ: కొత్త మందుల ఆవిష్కరణకు మేము కృత్రిమ మేధను వాడుకుంటున్నాం. కానీ పరిమిత స్థాయిలోనే... బెంగళూరులోని ఆరిజిన్ కేంద్రంలో వాడుతున్నాం.
ప్ర: చైనా ఫార్మా రంగంలో సృజనకు ఎంతమేర ప్రాధాన్యత ఉంటోంది?
జ: చైనా ఒక పెద్ద మార్కెట్. సృజనాత్మక ఆవిష్కరణలకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. అధిక లాభాలు తీసుకోవడానికి కంపెనీలకు మోనోపలి హక్కులు కల్పిస్తోంది. స్థానికంగా మంచి మార్కెట్ కూడా ఉండటంతో అక్కడ ఇన్నోవేషన్ బాగా జరుగుతోంది. పైగా ఫార్మా ఉత్పత్తుల విషయంలో పరిశోధనలు కూడా బాగా చేస్తున్నారు. పలు భారతీయ కంపెనీలు కూడా చైనా కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment