GV Prasad
-
డాక్టర్ రెడ్డీస్ లాభం 1,342 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,342 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో నమోదైన రూ. 1,480 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ. గ్లోబల్ జనరిక్స్ దన్నుతో సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,880 కోట్ల నుంచి సుమారు 17 శాతం వృద్ధి చెంది రూ. 8,016 కోట్లకు పెరిగినట్లు మంగళవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ తెలిపింది. వివిధ వ్యాపార విభాగాలవ్యాప్తంగా మెరుగైన వృద్ధిని కొనసాగించినట్లు సంస్థ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. నికోటినెల్ తదితర బ్రాండ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేశామని, భవిష్యత్ వృద్ధి చోదకాల విషయంలో పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, ప్రధాన వ్యాపారాలను బలోపేతం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తామని ప్రసాద్ వివరించారు. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకోవడం తదితర అంశాలపై ఈ ఆర్థిక సంవత్సరం రూ. 2,500 కోట్ల మూలధన వ్యయాలను చేయనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. మరిన్ని విశేషాలు.. ⇒ క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 17 శాతం పెరిగి రూ. 6,108 కోట్ల నుంచి సుమారు రూ. 7,158 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ 17 శాతం పెరిగి రూ. 3,728 కోట్లకు చేరింది. అమెరికాలో నాలుగు కొత్త ఉత్పత్తులను కంపెనీ ప్రవేశపెట్టింది. క్యూ2లో దేశీయంగా మూడు కొత్త బ్రాండ్లను కంపెనీ ప్రవేశపెట్టింది. ⇒ రిటుగ్జిమాబ్ బయోసిమిలర్కి యూరోపియన్ కమిషన్ నుంచి మార్కెటింగ్ ఆథరైజేషన్ లభించింది. అలాగే, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఔషధం వొనొప్రాజాన్ను భారత్‌లో విక్రయించేందుకు టకెడా సంస్థతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ షేరు బీఎస్ఈలో స్వల్పంగా పెరిగి రూ. 1,273 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,307 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ రూ. 1,307 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 959 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,297 కోట్ల నుంచి రూ. 7,083 కోట్లకు పెరిగింది.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 4,507 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు, ఆదాయం రూ. 24,588 కోట్ల నుంచి రూ. 27,916 కోట్లకు పెరిగింది. 2023–24కి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 40 డివిడెండు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు పటిష్టంగా ఉండటం లాభాల వృద్ధికి తోడ్పడిందని విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కంపెనీ ఏర్పాటై 40 ఏళ్లయిందని, రాబోయే దశాబ్ద కాలంలో నవకల్పనలు, డిజిటల్ థెరప్యూటిక్స్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా అధిక వృద్ధి సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ∗ క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 6,119 కోట్లకు చేరింది. ∗యూరప్ మార్కెట్లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 521 కోట్లుగా నమోదైంది. మరోవైపు, భారత్ మార్కెట్లో ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,126 కోట్లకు పరిమితమైంది. ∗ అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 9 % వృద్ధి చెంది రూ. 1,209 కోట్లుగా ఉంది. ∗ ఫార్మా సరీ్వసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 779 కోట్ల నుంచి రూ. 822 కోట్లకు చేరింది. ∗ మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 6,259 వద్ద ముగిసింది. -
ఫోర్బ్స్ జాబితా ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని కోటీశ్వరులు (ఫొటోలు)
-
ప్రపంచంలో ప్రతీది ప్రకృతితో ముడిపడి ఉంటుంది: జి.వి. ప్రసాద్
ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం. పక్షులు, వన్య్రప్రాణల ఫొటోలు తీయాలంటే, గంటల కొద్దీ వేచి చూడాలి. వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా ఫొటోలు తీయడం కత్తిమీద సాములాంటిదే. పారిశ్రామికవేత్త, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్‌కి మాత్రం అది ఆటవిడుపు. ఆయన దేశ విదేశాల్లో పర్యటించి తీసిన ఫొటోలతో ఇటీవల ‘ది బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా... సాక్షితో సంభాషణ. ►ఔషధాల తయారీ రంగంలో తీరిక లేకుండా ఉండే మీకు, పక్షుల కోసం పర్యటనలు, ఫొటోగ్రఫీ హాబీ ఎప్పటి నుంచి? గత పది, పదిహేనేళ్లుగా ఫొటోగ్రఫీ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా తీసిన ఫొటోల సమాహారమే ఈ పుస్తకం. కొన్ని ఫొటోలతో పుస్తకాన్ని తీసుకురావాలని, మరికొన్నింటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలని నా ఆలోచన. గతంలో రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి అలాస్కా మీద, మరొకటి స్పితి వ్యాలీ. ఇది మూడో పుస్తకం. ► ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ లో మంచి కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి! నన్ను ప్రభావితం చేసే సూక్తులు కనిపించినప్పడు, విన్నప్పుడు పుస్తకంలో రాసుకోవడం నాకు పాతికేళ్లుగా అలవాటు. వాటిలో కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఈ పుస్తకం నా అభిరుచికి, జ్ఞాపకాలకు నిలువుటద్దం. ►ఇందులో ఏఏ ప్రదేశాల పక్షులున్నాయి? మనదేశంలో దక్షిణాదిలో హైదరాబాద్, ఉత్తరాది నుంచి భరత్పూర్, కాన్హా నేషనల్ పార్క్. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా, బొట్సువానా, నార్త్ ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల పక్షుల ఫొటోలున్నాయి. ఆంటార్కిటికాలో పెంగ్విన్స్ కూడా తీశాను. నార్త్ అమెరికాలో అలాస్కా కూడా కవర్ చేశాను. ఈ ప్రాంతాలలో కనిపించే పక్షులతో పాటు క్షీరదాలు, ప్రకృతి ఫొటోలూ తీశాను. కానీ, ఈ పుస్తకాన్ని మాత్రం పక్షుల కోసమే కేటాయించాను. ►వలస పక్షులు భారీగా వచ్చే ఆంధ్రప్రదేశ్, పులికాట్ సరస్సుకు వెళ్లారా? వెళ్లాను, ఫ్లెమింగో ఫొటోలు తీశాను. కానీ ఈ పుస్తకంలో ప్రచురించలేదు. ► బర్డ్ వాచింగ్ కోసం విభిన్నమైన అనేక ప్రాంతాలను సందర్శించారు. మీకు బాగా నచ్చిన ప్రదేశం, సందర్భం, ఫొటో ఏది? అలాస్కాలో ల్యాండ్ స్కేప్‌లు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి చెరువులు, పొరలు పొరలుగా పేరుకుపోయిన మంచు... మొత్తంగా చూస్తే ప్రకృతి అద్భుతంగా స్ఫూర్తిదాయంగా అనిపిస్తుంటుంది. పెద్ద ఎలుగుబంట్లు, బాల్డ్ ఈగల్స్, సాల్మన్ చేపలతో పాటు రకరకాల చేపలుంటాయి. సముద్రం నుంచి మంచి నీటి సరస్సుల వైపుకు గుంపులుగా వచ్చే చేపల్ని చూడడం వర్ణించలేనటువంటి అనుభూతి. అలాగే మరొకటి... ఆఫ్రికాలో ప్రాణులు వలస వెళ్లడం. వైల్డ్ బీస్ట్ పెద్ద సంఖ్యలో నదిని దాటుతున్న దృశ్యం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ► ఆర్నిథాలజిస్టు ఆశిష్, కెమెరా మెళకువలు నేర్పిన సురేశ్ చిత్తూరి గురించి మీ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు! ఆశిష్‌తో చాలా ఏళ్ల పరిచయం. వాళ్ల పిల్లలు, మా పిల్లలు క్లాస్మేట్స్. బర్డ్ వాచింగ్‌ను పరిచయం చేసింది ఆయనే. ఇక శ్రీనివాస హ్యాచరీస్ సురేశ్ చిత్తూరి కూడా నాకు మంచి మార్గదర్శి. ► ఎన్నిరకాల పక్షులను ఫొటో తీశారు? రెండువందలకు పైగా పక్షి జాతులను ఫొటో తీశాను. ► మీ పుస్తకంలో పాలపిట్ట, కాకి, కోకిల కనిపించాయి. కానీ రామచిలుక కనిపించలేదు! అలాగే కొల్లేటి కొంగలు, చిల్కా సరస్సులో విహరించే పక్షులను మేము తర్వాతి పుస్తకంలో చూడవచ్చా? రామచిలుకల ఫొటో తీశాను. కానీ, పుస్తకానికి ఫొటోల ఎంపికలో వదలిపెట్టాను. కొల్లేరు వెళ్లలేదు. చిల్కా సరస్సుకు వచ్చే ఏడాది వెళదామనుకుంటున్నాను. ► మీ నేపథ్యం మొత్తం హైదరాబాదేనా? లేదు, పాక్షిక హైదరాబాదీని. నాల్గవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. తర్వాత నెల్లూరులో 12వ తరగతి వరకు, రెండున్నరేళ్లు చెన్నై అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత చికాగోలో ఇలినాయీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పర్డ్యూ (Purdue University) యూనివర్సిటీలో పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను. ► పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వన్య్ర΄ాణుల సంరక్షణ కోసం విరాళమని ప్రకటించారు. వన్య్రప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపట్లేదని అనుకుంటున్నారా? ప్రభుత్వం వన్య్రప్రాణుల సంరక్షణకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. కానీ, ప్రభుత్వం ఒక్కటే అన్నింటినీ పరిష్కరించలేదు. వ్యక్తుల విరాళాలు చాలా ఉపయోగ పడతాయి. పర్యావరణం, వన్య్రప్రాణుల పరిరక్షణ ముఖ్యమైన అంశం అని నేను మద్దతు ఇస్తున్నాను. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నాం. పుస్తక విక్రయాలతో వచ్చే డబ్బు నాకవసరం లేదు. ఉచితంగా ఇస్తే పుస్తకం గౌరవం తగ్గిపోతుంది. అందుకే విక్రయాలను మంచి పనికి విరాళంగా ఇవ్వాలనుకున్నాను. ► అంజిరెడ్డి (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు)గారు చెప్పినట్లుగా మన కుండ నిండిన తర్వాత, అదనంగా వచ్చి పడుతున్న నీటిని మరొకరికి ఉపయోగపడేలా చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారా? ఆయన నుంచి అలాగే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి? మా నాన్నగారు (గ్రీన్ పార్క్ హోటల్ వ్యవస్థాపకులు) చాలా డీటెయిల్ ఓరియెంటెడ్. మనం చేస్తున్న పని గురించి సూక్ష్మ స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెబుతారు. వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవారు. మా మామగారు (అంజిరెడ్డి) విజన్ చాలా విస్తృతమైనది. వారిద్దరినీ ఒకే ’ఫ్రేమ్’లో చె΄్పాలంటే... ‘అడవి అందులో చెట్లు’ అని చెప్పవచ్చు. అంజిరెడ్డి గారి ద్వారా అడవిని చూస్తే, మా నాన్న గారి ద్వారా అందులో వృక్షాలను చూశాను. ► పాఠకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ‘ప్రపంచంలోని ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం అడవి ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మన శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి’ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ‘కొంతవరకైనా ప్రకృతితో మమేకమవుదాం’ అనుకుంటే... ప్రకృతి పరిరక్షణ కోసం చేయగలిగిన చిన్న చిన్న పనులు అందరమూ చేయగలుగుతాం. శాస్త్రీయతకు గౌరవం డాక్టర్ రెడ్డీస్ సంస్థలో 1990 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవీ ప్రసాద్ ఆ సంస్థ ఎదుగుదల, 66 దేశాలకు విస్తరణలో తనవంతుగా విశేషమైన కృషి చేశారు. సశాస్త్రీయమైన పరిశోధనల పరంపరలో ఆయనను వరించిన కొన్ని ప్రత్యేక గుర్తింపులు... పురస్కారాలివి. వైపీఓ గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు– 2020 వి. కృష్ణమూర్తి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ బై ద సెంటర్ ఫర్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, 2019 బౌండరీ బ్రేకర్ లీడర్ అవార్డ్, సీఈఓ అవార్డ్స్ 2018 ఇండియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2015 ఇండియాస్ బెస్ట్ సీఈవో బై బిజినెస్ టుడే, 2014 ఇండియా టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2014 ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
డాక్టర్ రెడ్డీస్ లాభం 959 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 959 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన లాభం రూ. 87.5 కోట్లతో పోలిస్తే ఇది 996 శాతం అధికం. లో బేస్ ప్రభావం ఇందుకు కారణం. ఇక సమీక్షాకాలంలో ఆదాయం 25 శాతం పెరిగి రూ. 5,437 కోట్ల నుంచి రూ. 6,297 కోట్లకు చేరింది. ఆదాయాలు, లాభాల వృద్ధిపరంగా ఇది తమకు రికార్డు సంవత్సరమని కంపెనీ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తర అమెరికా,యూరప్, భారత మార్కెట్లు పటిష్టంగా ఉండటం ఇందుకు దోహదపడిందని బుధవారం ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కంపెనీ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, అన్ని వ్యాపార విభాగాలు పుంజుకోవడం తదితర అంశాలు ఆదాయ వృద్ధికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ. 5,000 కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు చెప్పారు. తాజా ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త ఉత్పత్తులు, ఉత్పాదకతను పెంచుకోవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ బోర్డు షేరు ఒక్కింటికి రూ. 40 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు .. ► గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు క్యూ4లో 18 శాతం పెరిగి రూ. 5,426 కోట్లకు చేరాయి. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 2,532 కోట్లుగా నమోదైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో నాలుగో త్రైమాసికంలో ఆరు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టగా, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 25 ఔషధాలను ఆవిష్కరించింది. ► భారత్‌లో అమ్మకాలు 32 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరాయి. ప్రస్తుత ఉత్పత్తుల ధరల్లో పెరుగుదలతో పాటు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ద్వారా అదనపు ఆదాయం సమకూరింది. ► యూరప్ మార్కెట్ ఆదాయాలు 12% పెరిగి రూ. 496 కోట్లకు, వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 7% క్షీణించి రూ. 1,114 కోట్లుగా నమోదైంది. ► ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం మూడు శాతం పెరిగి రూ. 756 కోట్ల నుంచి రూ. 778 కోట్లకు చేరాయి. ► పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 21,439 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.24,588 కోట్లకు చేరింది. లాభం రూ. 2,357 కోట్ల నుంచి 91% ఎగిసి రూ.4,507 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో పరిశోధన, అభివృద్ధి కార్య కలాపాలపై రూ.1,940 కోట్లు వెచ్చించింది. ఈసారి మొత్తం అమ్మకాల్లో 8–9% వెచ్చించనుంది. -
ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్ రెడ్డీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ (డీఆర్ఎల్) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్ లీడర్షిప్ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి. (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!) -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 87 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే వ్యవధిలో లాభం రూ. 362 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 4,728 కోట్ల నుంచి రూ. 5,437 కోట్లకు పెరిగింది. కొన్ని ఉత్పత్తులు (పీపీసీ–06), అసెట్ల (ష్రెవిపోర్ట్ ప్లాంట్) విలువను దాదాపు రూ. 760 కోట్ల మేర తగ్గించాల్సి రావడం వల్ల ఆ మేరకు లాభాలపై ప్రతికూల ప్రభావం పడింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వార్షిక ప్రాతిపదికన దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసినట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఇతరత్రా పలు సవాళ్లు ఉన్నప్పటికీ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం వంటి అంశాల ఊతంతో తమ ప్రధాన వ్యాపార విభాగం మెరుగైన పనితీరు కనపర్చగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల ప్రభావమేమీ వ్యాపారంపై లేదని, ఇప్పటివరకూ చెల్లింపులపరమైన సమస్యలేమీ తలెత్తలేదని వివరించారు. సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఇచ్చేలా అనుమతుల కోసం జూన్ ఆఖరు లేదా జూలై తొలినాళ్లలో దరఖాస్తు చేసుకోనున్నట్లు డీఆర్ఎల్ సీఈవో (పీఎస్‌ఏఐ విభాగం) దీపక్ సప్రా తెలిపారు. ప్రస్తుతానికి 12–17 ఏళ్ల బాలల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్–ఎం టీకాను పక్కన ఉంచామని, స్పుత్నిక్ లైట్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. స్పుత్నిక్ టీకాల ధరల పునఃసమీక్షపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లు 36 శాతం అప్.. నాలుగో త్రైమాసికంలో రష్యా సహా వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ఆదాయం 36 శాతం పెరిగి రూ. 1,201 కోట్లకు ఎగిసింది. భారత్‌లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 969 కోట్లకు చేరింది. మరోవైపు, ధరలు పడిపోవడం, అమ్మకాల పరిమాణం తగ్గడం అంశాల కారణంగా ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం అయిదు శాతం క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల లాభం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 30 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. గురువారం ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు సుమారు ఒక్క శాతం పెరిగి రూ. 3,942కి చేరింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 720 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 720 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ. 1,092 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 30 శాతం తగ్గింది. కొన్ని ఉత్పత్తులను అవుట్–లైసెన్సింగ్ చేయడం, పన్నుపరమైన ప్రయోజనాలు వంటివి కూడా గతంలో కలిపి చూపించిన నేపథ్యంలో .. దానితో పోల్చితే తాజా క్యూ2లో లాభం తగ్గిందని సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) సౌమేన్ చక్రవర్తి తెలిపారు. ఉత్పాదకత మెరుగుపడటం, సానుకూల విదేశీ మారక రేట్ల ఊతంతో స్థూల లాభాల మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం కొంత తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉత్పత్తులతో పాటు కోవిడ్ చికిత్సలో ఉపయోగపడే అవకాశాలు ఉన్న పలు ఔషధాలపై తమ పరిశోధన బృందాలు కసరత్తు చేస్తున్నాయని డీఆర్ఎల్ సహ చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. మరిన్ని విశేషాలు.. n కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర అంశాల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 21 శాతం పెరిగి రూ. 3,980 కోట్లుగా నమోదైంది. n ఉత్తర అమెరికా మార్కెట్ 28% పెరిగి రూ. 1,830 కోట్లకు చేరింది. విదేశీ మారకం రేటు అనుకూలత, కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ఇందుకు దోహదపడింది. n యూరప్ ఆదాయాలు 36% పెరిగి రూ. 380 కోట్లకు చేరాయి. కొత్తగా ఆస్ట్రియా మార్కెట్లోకి కూడా కంపెనీ ప్రవేశించింది. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 4% వృద్ధితో రూ. 860 కోట్లకు చేరింది. రూబుల్ బలహీనపడటం రష్యాలో ఆదాయంపై ప్రభావం చూపింది. n భారత్ మార్కెట్లో ఆదాయం 21 శాతం వృద్ధి చెంది రూ. 910 కోట్లకు చేరింది. వొకార్డ్ వ్యాపారం కొనుగోలు, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు ఇందుకు తోడ్పడ్డాయి. n ఫార్మాసూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 20 శాతం పెరిగి రూ. 850 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు 3 శాతం క్షీణించి రూ. 4,950 వద్ద క్లోజయ్యింది. సైబర్ దాడి ప్రభావమేమీ లేదు అక్టోబర్ 22న కంపెనీ సర్వర్లపై సైబర్ దాడులు చోటుచేసుకోవడంపై చక్రవర్తి స్పందించారు. దీనిపై సత్వరం బైటి సైబర్ సెక్యూరిటీ నిపుణుల సహాయం తీసుకున్నామని, కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడకుండా జాగ్రత్తపడ్డామని ఆయన తెలిపారు. ఇప్పటిదాకానైతే తమ విచారణలో డేటా చౌర్యం వంటివేమీ జరిగిన దాఖలాలేమీ బైటపడలేదని చక్రవర్తి వివరించారు. కోవిడ్–19 టీకా స్పుత్నిక్ వి రెండో దశ ట్రయల్స్ డిసెంబర్ నాటికి పూర్తి కాగలవని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. పరిస్థితులను బట్టి మూడో దశ పరీక్షలు మార్చి ఆఖరు నాటికి పూర్తి కావొచ్చన్నారు. మరోవైపు, సౌమేన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సీఎఫ్‌వోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారని కంపెనీ తెలిపింది. డిసెంబర్ 1న అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. -
కొత్త ఉత్పత్తులపై ఆశలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా, రష్యా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రై మాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం స్వల్బంగా తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 312 కోట్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించింది. మరోవైపు, 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 3,554 కోట్లు కాగా, ఈసారి రూ. 3,535 కోట్లుగా నమోదైంది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై షేర్హోల్డర్లకు పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 20 మేర (400 శాతం) డివిడెండ్ చెల్లించాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బోర్డు సిఫార్సు చేసింది. ప్రధానమైన అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, రష్యా మార్కెట్లో తాత్కాలికంగా అమ్మకాల తగ్గుదల తదితర అంశాలతో ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. వ్యయాల నియంత్రణపై కసరత్తు.. వ్యయాలు తగ్గించుకోవడం, మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాలతో పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. సంక్షోభంలో ఉన్న వెనెజులా నుంచి బకాయిలను రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. రూ. 900–1,000 కోట్ల స్థాయిలో పెట్టుబడి వ్యయాలు కొనసాగిస్తామన్నారు. పోటీ తక్కువ ఉండే కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, వ్యయాలను తగ్గించుకునే వ్యూహాలతో ఆదాయాలను మెరుగుపర్చుకోనున్నట్లు కొత్త సీఎఫ్‌వో ఎరెజ్ ఇజ్రాయెలీ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ఆరు శాతం లాభంతో రూ. 2,014 వద్ద క్లోజయ్యింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 337 కోట్లు
► క్యూ4లో 175% వృద్ధి ► రూ. 3,632 కోట్ల ఆదాయం ► రూ. 20 డివిడెండ్ ► అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నికర లాభం సుమారు 175 శాతం వృద్ధితో రూ.337.6 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.122.6 కోట్లే. అయితే, తాజా క్యూ4లో మొత్తం ఆదాయం మాత్రం సుమారు 6 శాతం క్షీణించి రూ.3,880 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పరిమితమైంది. కీలకమైన అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు, పెద్ద స్థాయిలో కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకపోవడం ఇందుకు కారణమని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు చెప్పారు. విశాఖ జిల్లాలోని దువ్వాడ ఇంజెక్టబుల్స్ ప్లాంట్‌లో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీల్లో లేవనెత్తిన అంశాల పరిష్కారం చర్యలపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన తెలియజేశారు. అటు బాచుపల్లి ప్లాంటులో అబ్జర్వేషన్ల పరిష్కారం సమస్యాత్మకమేమీ కాదని, దీనిపై ఎఫ్‌డీఏతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇటీవల ఎఫ్‌డీఏల తనిఖీలు పెరిగిన అంశంపై స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని, అమెరికా నియంత్రణ సంస్థలు ప్రమాణాల్ని అమలు చేయటంపై మరింత కఠినంగా దృష్టి పెడుతున్నాయని ప్రసాద్ చెప్పారు. రూ.5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 20 మేర (ఫేస్ వ్యాల్యూపై 400 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దేశీ మార్కెట్లో అనిశ్చితి..: ధరలపరమైన నియంత్రణలతో దేశీ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ప్రసాద్ తెలియజేశారు. త్వరలో అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్నుల విధానం కూడా పంపిణీ వ్యవస్థపై కొంత ప్రభావం చూపవచ్చని చెప్పారు. అయితే ఇది తాత్కాలికమే కావచ్చని, తాము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అటు కీలకమైన అమెరికా మార్కెట్లో అనుమతులు క్రమంగా రావడం మొదలైందని, తదుపరి క్వార్టర్స్ నుంచి ఇది మరింత వేగవంతం కావొచ్చని చెప్పారాయన. చైనా, దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ గణనీయంగా జరుగుతోందని, ఈ ఏడాది చిలీ మార్కెట్లోనూ ప్రవేశించనున్నామని సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. చైనాలో ఆంకాలజీ ఉత్పత్తులకు ఫైలింగ్ చేస్తున్నామని, మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మరింతగా మార్కెట్ సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రొప్రైటరీ ఉత్పత్తులకు సంబంధించి డెర్మటాలజీ, న్యూరాలజీ ఔషధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, ఇక బయోసిమిలర్స్ విషయానికొస్తే రెడిటక్స్ ఔషధాన్ని త్వరలో పలు మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నామని ప్రసాద్ చెప్పారు. ఈ ఏడాది అమెరికాలో 10 సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద సుమారు 80 ఉత్పత్తులదాకా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా పెట్టుబడి వ్యయాలు రూ.1,000–1,200 కోట్ల స్థాయిలోనే ఉంటాయని సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి చెప్పారు. తగ్గిన జనరిక్స్ వృద్ధి .. నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా జనరిక్స్ వృద్ధి అయిదు శాతం క్షీణించింది. ప్రధానమైన ఉత్తర అమెరికా మార్కెట్లో 19 శాతం తగ్గింది. అయితే, యూరప్, భారత్, వర్ధమాన మార్కెట్లలో సానుకూల వృద్ధి నమోదైంది. ఇక పీఎస్‌ఏఐ విభాగంలోనూ మొత్తం మీద వృద్ధి ఆరు శాతం క్షీణించగా, ఉత్తర అమెరికాలో 28 శాతం తగ్గింది. వెనెజులాలో కార్యకలాపాల సమస్యల వల్ల వర్ధమాన మార్కెట్ల ఆదాయాలు 11 శాతం క్షీణించినట్లు సౌమేన్ చక్రవర్తి చెప్పారు. క్యూ4లో అమెరికాలో 13 ఔషధాల జనరిక్స్ తయారీ అనుమతులకు దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) చేసినట్లు చెప్పారాయన. పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాల మార్జిన్ 400 బేసిస్ పాయింట్లు తగ్గి 55.6 శాతానికి పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో జనరిక్స్ వ్యాపార విభాగంలో ఔషధాల ధరల్లో తగ్గుదల, అధిక తయారీ వ్యయాలు తదితర అంశాలు ఇందుకు కారణం. శుక్రవారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు సుమారు 0.30 శాతం క్షీణించి రూ. 2,584.70 వద్ద ముగిసింది. -
16% తగ్గిన డాక్టర్ రెడ్డీస్ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ మార్చితో ముగిసిన త్రైమాసిక నికరలాభం 16% క్షీణించింది. 2012-13 చివరి త్రైమాసికంలో రూ. 571 కోట్లుగా ఉన్న నికరలాభం ఇప్పుడు రూ. 482 కోట్లకు పడిపోయింది. అభివృద్ధి, పరిశోధన రంగానికి కేటాయింపులు పెంచడమే లాభాలు తగ్గడానికి కారణంగా డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ కె.సతీష్ రెడ్డి తెలిపారు. ఆర్థిక ఫలితాలు వెల్లడించడానికి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆర్ అండ్ డీ కేటాయింపులు రూ. 233 కోట్ల నుంచి రూ. 398 కోట్లకు పెంచడంతో ఆ మేరకు లాభాలు తగ్గాయన్నారు. సమీక్షా కాలంలో ఆదాయం 4% పెరిగి రూ. 3,340 కోట్ల నుంచి రూ. 3,481 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద చూస్తే డాక్టర్ రెడ్డీస్ నికరలాభం రూ. 1,678 కోట్ల నుంచి రూ. 2,151 కోట్లకు పెరగ్గా, ఆదాయం రూ. 11,626 కోట్ల నుంచి రూ.13,217 కోట్లకు వృద్ధి చెందింది. గడచిన ఏడాది ఆర్అండ్డీ కేటాయింపులను ఆదాయంలో 6.6 శాతం (రూ.757 కోట్లు) నుంచి 9.4 శాతానికి (రూ.1,240 కోట్లు) పెంచామని, ఈ మొత్తాన్ని ఈ ఏడాది 11 శాతం వరకు పెంచనున్నట్లు సతీష్ తెలిపారు. అంతర్జాతీయంగా ముఖ్యంగా ఉక్రెయిన్, సీఎస్ఐ దేశాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని, కానీ ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి సంకేతాలు ఉండటంతో వ్యాపారంలో వృద్ధి బాగుంటుందన్న ఆశాభావాన్ని సతీష్ వ్యక్తం చేశారు. ఈ త్రైమాసికంలో కొత్తగా మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రూ. 5 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.18 డివిడెండ్‌ను ప్రకటించింది. రాయితీల తర్వాతే పెట్టుబడులు ఈ ఏడాది విస్తరణ కోసం రూ. 1,500 కోట్లు వ్యయం చేయనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. రాష్ట్ర విభజన పూర్తయ్యి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రాయితీలు ప్రకటించిన తర్వాత ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేది నిర్ణయిస్తామని సతీష్ తెలిపారు. గతేడాది వ్యాపార విస్తరణ కోసం రూ.1,020 కోట్లు వ్యయం చేసింది. చైర్మన్‌గా సతీష్ రెడ్డి డాక్టర్ రెడ్డీస్ యాజమాన్యంలో కీలక మార్పులు జరిగాయి. డాక్టర్ రెడ్డీస్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సతీష్ రెడ్డి కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించేవారు. అలాగే ఇప్పటి వరకు చైర్మన్‌గా ఉన్న అంజిరెడ్డి అల్లుడు జి.వి.ప్రసాద్ ఇక నుంచి సీఈవో, వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ మార్పులపై సతీష్ స్పందిస్తూ ఇవి కేవలం కంపెనీ నిర్వహణ సౌలభ్యం కోసమేనన్నారు. కంపెనీ నిర్వహించే సామాజిక సేవలు, ఫార్మా రంగ అసోసియేషన్లతో తాను కలిసి పనిచేయాల్సి ఉండటంతో రోజువారీ కార్యకలాపాలను ప్రసాద్‌కు అప్పచెప్పినట్లు సతీష్ తెలిపారు.