హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా, రష్యా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రై మాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం స్వల్బంగా తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 312 కోట్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించింది.
మరోవైపు, 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 3,554 కోట్లు కాగా, ఈసారి రూ. 3,535 కోట్లుగా నమోదైంది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై షేర్‌హోల్డర్లకు పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 20 మేర (400 శాతం) డివిడెండ్ చెల్లించాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బోర్డు సిఫార్సు చేసింది. ప్రధానమైన అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, రష్యా మార్కెట్లో తాత్కాలికంగా అమ్మకాల తగ్గుదల తదితర అంశాలతో ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు.
వ్యయాల నియంత్రణపై కసరత్తు..
వ్యయాలు తగ్గించుకోవడం, మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాలతో పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. సంక్షోభంలో ఉన్న వెనెజులా నుంచి బకాయిలను రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు.
రూ. 900–1,000 కోట్ల స్థాయిలో పెట్టుబడి వ్యయాలు కొనసాగిస్తామన్నారు. పోటీ తక్కువ ఉండే కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, వ్యయాలను తగ్గించుకునే వ్యూహాలతో ఆదాయాలను మెరుగుపర్చుకోనున్నట్లు కొత్త సీఎఫ్‌వో ఎరెజ్ ఇజ్రాయెలీ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ఆరు శాతం లాభంతో రూ. 2,014 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment