హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.
కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి..
ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది.
గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్..
క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్‌ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది.
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
Published Sat, May 15 2021 4:23 AM | Last Updated on Sat, May 15 2021 11:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment