Dr. Reddys Laboratories
-
బయోసిమిలర్స్‌పై డాక్టర్ రెడ్డీస్ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్.. అమెరికా తదితర మార్కెట్లలో దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికల్లో భాగంగా బయోసిమిలర్స్, డిజిటల్ సొల్యూషన్స్ మొదలైనవాటిపై మరింతగా దృష్టి పెట్టనుంది. మధ్యకాలికంగా ఇంజెక్టబుల్స్, సంక్లిష్టమైన ఓరల్ డోసేజీలు, ఓటీసీ బ్రాండ్లపైనా ఫోకస్ చేయనుంది. 2023–24 వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాలు వెల్లడించింది. రాబోయే రోజుల్లో టాప్ 10 సంపన్న మార్కెట్లలో పలు బ్రాండ్లు ఎక్స్‌క్లూజివిటీని కోల్పోవడం వల్ల జనరిక్స్, బయోసిమిలర్ల వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉండగలవని తెలిపింది. నివేదిక ప్రకారం 2023 క్యాలండర్ సంవత్సరంలో 1.6 లక్షల కోట్ల (ట్రిలియన్) డాలర్లుగా ఉన్న అంతర్జాతీయ ఫార్మా మార్కెట్ 2028నాటికి 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరగలదనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, చికిత్సా ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా 2027 నుంచి ఏటా 3 వినూత్న సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. అప్పటికి 25 శాతం ఉత్పత్తులు మార్కెట్లో తొలిసారిగా ప్రవేశపెట్టేవే ఉంటాయని పేర్కొంది. 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు చేరు వ కావాలని నిర్దేశించుకున్నట్లు ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 70.4 కోట్లుగా ఉందని వివరించింది. -
ఇంజీనస్తో రెడ్డీస్ లైసెన్సింగ్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూఎస్ కంపెనీ ఇంజీనస్ ఫార్మాస్యూటికల్స్‌తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తెలిపింది. ఇందులో భాగంగా క్యాన్సర్ చికిత్సలో వాడే సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ ను యూఎస్ మార్కెట్లో రెడ్డీస్ విక్రయించనుంది. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లో 50% ఇంజీనస్కు చెల్లిస్తుంది. ఇక్వియా గణాంకాల ప్రకారం 2024 మార్చితో ముగిసిన 12 నెలల్లో ఇంజీనస్ తయారీ సైక్లోఫాస్ఫామైడ్ ఇంజెక్షన్ అమ్మకాల విలువ యూఎస్‌లో 51.8 మిలియన్ డాలర్లు నమోదైంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,307 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ రూ. 1,307 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 959 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,297 కోట్ల నుంచి రూ. 7,083 కోట్లకు పెరిగింది.పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 4,507 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు, ఆదాయం రూ. 24,588 కోట్ల నుంచి రూ. 27,916 కోట్లకు పెరిగింది. 2023–24కి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 40 డివిడెండు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు పటిష్టంగా ఉండటం లాభాల వృద్ధికి తోడ్పడిందని విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కంపెనీ ఏర్పాటై 40 ఏళ్లయిందని, రాబోయే దశాబ్ద కాలంలో నవకల్పనలు, డిజిటల్ థెరప్యూటిక్స్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా అధిక వృద్ధి సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని విశేషాలు.. ∗ క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 6,119 కోట్లకు చేరింది. ∗యూరప్ మార్కెట్లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 521 కోట్లుగా నమోదైంది. మరోవైపు, భారత్ మార్కెట్లో ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,126 కోట్లకు పరిమితమైంది. ∗ అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 9 % వృద్ధి చెంది రూ. 1,209 కోట్లుగా ఉంది. ∗ ఫార్మా సరీ్వసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 779 కోట్ల నుంచి రూ. 822 కోట్లకు చేరింది. ∗ మంగళవారం బీఎస్ఈలో ఈ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 6,259 వద్ద ముగిసింది. -
సెలెవిదా వెల్నెస్ పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ తాజాగా సెలెవిదా వెల్నెస్ డైరెక్ట్ టు కంజ్యూమర్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచి్చంది. ఈ పోర్టల్ ద్వారా మధుమేహ రోగుల కోసం పలు ఉత్పత్తుల అమ్మకంతోపాటు ఆహార సిఫార్సులు, సమాచారం అందిస్తారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 2019 నుంచి సెలెవిదా బ్రాండ్‌లో న్యూట్రాస్యూటికల్స్ తయారీ చేపడుతోంది. దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు పిన్‌కోడ్స్‌కు వీటిని సరఫరా చేస్తోంది. -
ఈరిస్కు.. రెడ్డీస్ డెర్మటాలజీ బ్రాండ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న ఈరిస్ లైఫ్‌సైన్సెస్ తాజాగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నుంచి తొమ్మిది రకాల డెర్మటాలజీ బ్రాండ్స్‌ను దక్కించుకుంది. డీల్ విలువ రూ.275 కోట్లు. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ రంగంలో డీల్ తదనంతరం ఈరిస్ 7 శాతం వాటాతో మార్కె ట్లో మూడవ స్థానానికి ఎగబాకనుంది. 2022 మే నెలలో రూ.650 కోట్లతో ఓక్నెట్ హెల్త్‌కేర్‌ను చేజిక్కించుకోవడం ద్వారా డెర్మటాలజీ విభాగంలోకి ఈరిస్ ప్రవేశించింది. 2023 జనవరిలో గ్లెన్‌మార్క్ నుంచి తొమ్మిది డెర్మటాలజీ బ్రాండ్స్‌ను రూ.340 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. చర్మ వ్యాధుల సంబంధ ఔషధ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లకు రూ.1,265 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. -
డాక్టర్ అంజిరెడ్డి తొలి స్మారకోపన్యాసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తమ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. అంజిరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తొలి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత .. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొఫెసర్ అడా ఇ. యోనత్, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్, ఇగ్నైట్ లైఫ్ సైన్స్ ఫౌండేషన్ సీఈవో స్వామి సుబ్రమణియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఎండీ గురు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలన్నది అంజి రెడ్డి విజన్ అని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. శాస్త్రీయ, సామాజిక అంశాలపై పెద్ద స్థాయిలో చర్చలు జరగడం అంజి రెడ్డికి నిజమైన నివాళి కాగలదని కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తదుపరి తరం యాంటీబయోటిక్స్ రూపకల్పనలో తన పరిశోధనలు ఏ విధంగా తోడ్పడగలవన్నది యోనత్ ఈ సందర్భంగా వివరించారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,247 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం రూ. 1,247 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో నమోదైన రూ. 706 కోట్లతో పోలిస్తే ఇది 77 శాతం అధికం. విదేశీ మారకంపరంగా సానుకూలతలు, కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని సంస్థ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ వెల్లడించారు. సమీక్షాకాలంలో ఆదాయం 27 శాతం పెరిగి రూ. 5,320 కోట్ల నుంచి రూ. 6,770 కోట్లకు పెరిగినట్లు వివరించారు. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టిన రెవ్లిమిడ్ ఔషధం .. కంపెనీ ఆదాయాలకు అర్ధవంతమైన రీతిలో తోడ్పడుతోందని ఆయన పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టామని, పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉత్తర అమెరికా మార్కెట్లో 25 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని వివరించారు. ధరలపరమైన తగ్గుదల ధోరణులు దాదాపుగా గత రెండు త్రైమాసికాల్లో చూసిన విధంగానే ఉన్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. అమెరికా, రష్యా మార్కెట్లలో వృద్ధి తోడ్పాటుతో పటిష్టమైన ఆర్థిక పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ కో–చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. ఫలితాల్లో ఇతర ముఖ్య విశేషాలు.. ► కొత్త ఔషధాల ఆవిష్కరణ, ఉత్పత్తుల రేట్ల పెంపుతో భారత్ మార్కెట్లో ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,130 కోట్లకు చేరింది. ► కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం 64 శాతం వృద్ధి చెంది రూ. 3,060 కోట్లుగా నమోదైంది. వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 14 శాతం, యూరప్‌లో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. ► క్యూ3లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రూ. 480 కోట్లు వెచ్చించారు. పెట్టుబడి వ్యయాలపై కంపెనీ రూ. 1,500 కోట్లు వెచ్చించనుంది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,113 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,113 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 992 కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. అటు ఆదాయం 9% పెరిగి రూ. 5,763 కోట్ల నుంచి రూ. 6,306 కోట్లకు చేరింది. శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ, సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా మార్కెట్లో ఎక్స్‌క్లూజివ్ హక్కులు లభించిన జనరిక్ ఔషధం రెవ్లిమిడ్ సహా కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తుల ఊతంతో ఆదాయాలు, లాభాలు గణనీయంగా పెరిగాయని పరాగ్ వివరించారు. అలాగే వ్యయాలను సమర్ధంగా నియంత్రించుకోవడం కూడా దోహదపడిందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 25 పైగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు, రెండో త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు సాధించడం సంతృప్తి కలిగించిందని సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయంగా చౌకగా మరిన్ని ఔషధాలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా కొనసాగిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై రెండో త్రైమాసికంలో కంపెనీ సుమారు రూ. 490 కోట్లు వెచ్చించింది. ఫలితాల్లో ఇతర విశేషాలు.. ► క్యూ2లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయాలు 18 శాతం పెరిగి రూ. 5,595 కోట్లకు చేరాయి. ఉత్తర అమెరికా మార్కెట్లో అమ్మకాలు 48 శాతం వృద్ధి చెంది రూ. 2,800 కోట్లకు పెరిగాయి. కొన్ని ఔషధాల రేట్లు తగ్గినప్పటికీ .. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేట్ల ప్రభావంతో కంపెనీ ఆ ప్రతికూలతలను అధిగమించింది. ► భారత మార్కెట్లో అమ్మకాలు స్వల్పంగా పెరిగి రూ. 1,150 కోట్లకు పరిమితమయ్యాయి. ► ఫార్మా సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం 23 శాతం క్షీణించి రూ. 643 కోట్లకు తగ్గింది. శుక్రవారం బీఎస్ఈలో కంపెనీ షేరు స్వల్పంగా తగ్గి రూ. 4,461 వద్ద క్లోజయ్యింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 87 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే వ్యవధిలో లాభం రూ. 362 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 4,728 కోట్ల నుంచి రూ. 5,437 కోట్లకు పెరిగింది. కొన్ని ఉత్పత్తులు (పీపీసీ–06), అసెట్ల (ష్రెవిపోర్ట్ ప్లాంట్) విలువను దాదాపు రూ. 760 కోట్ల మేర తగ్గించాల్సి రావడం వల్ల ఆ మేరకు లాభాలపై ప్రతికూల ప్రభావం పడింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వార్షిక ప్రాతిపదికన దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసినట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఇతరత్రా పలు సవాళ్లు ఉన్నప్పటికీ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం వంటి అంశాల ఊతంతో తమ ప్రధాన వ్యాపార విభాగం మెరుగైన పనితీరు కనపర్చగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల ప్రభావమేమీ వ్యాపారంపై లేదని, ఇప్పటివరకూ చెల్లింపులపరమైన సమస్యలేమీ తలెత్తలేదని వివరించారు. సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఇచ్చేలా అనుమతుల కోసం జూన్ ఆఖరు లేదా జూలై తొలినాళ్లలో దరఖాస్తు చేసుకోనున్నట్లు డీఆర్ఎల్ సీఈవో (పీఎస్‌ఏఐ విభాగం) దీపక్ సప్రా తెలిపారు. ప్రస్తుతానికి 12–17 ఏళ్ల బాలల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్–ఎం టీకాను పక్కన ఉంచామని, స్పుత్నిక్ లైట్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. స్పుత్నిక్ టీకాల ధరల పునఃసమీక్షపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లు 36 శాతం అప్.. నాలుగో త్రైమాసికంలో రష్యా సహా వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ఆదాయం 36 శాతం పెరిగి రూ. 1,201 కోట్లకు ఎగిసింది. భారత్‌లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 969 కోట్లకు చేరింది. మరోవైపు, ధరలు పడిపోవడం, అమ్మకాల పరిమాణం తగ్గడం అంశాల కారణంగా ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం అయిదు శాతం క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల లాభం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 30 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. గురువారం ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు సుమారు ఒక్క శాతం పెరిగి రూ. 3,942కి చేరింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 707 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 707 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నమోదైన సుమారు రూ. 20 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 3,468 శాతం అధికం. నిర్దిష్ట ఉత్పత్తులకు సంబంధించి దాదాపు రూ. 597 కోట్ల మేర కేటాయింపులు జరపడం వల్ల గత క్యూ3లో లాభం తక్కువగా నమోదైంది. తాజా సమీక్షాకాలంలో ఈ తరహా కేటాయింపులు రూ. 4.7 కోట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, సమీక్షాకాలంలో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఊతంతో ఆదాయం రూ. 4,930 కోట్ల నుంచి రూ. 5,320 కోట్లకు పెరిగింది. కోవిడ్–19 నివారణ, చికిత్సలకు సంబంధించి టీకాలతో పాటు పలు ఔషధాలను ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ శుక్రవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపారు. మోల్నుపిరావిర్ ఔషధానికి మరో ఆరు దేశాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా రెండు దేశాల్లో ఆమోదం లభించిందని కంపెనీ సీఈవో (ఏపీఐ, సర్వీసులు విభాగం) దీపక్ సప్రా పేర్కొన్నారు. 12–18 ఏళ్ల వయస్సు గల వారి కోసం ఉద్దేశించిన స్పుత్నిక్ ఎం టీకాను భారత్‌లో ప్రవేశపెట్టడంపై త్వరలో ఔషధ రంగ నియంత్రణ సంస్థను సంప్రదించనున్నామని ఆయన వివరించారు. అవసరమైతే దేశీయంగా దీనికి మరో విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఉందని సప్రా తెలిపారు. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో షేరు దాదాపు 1% క్షీణించి రూ. 4,218 వద్ద క్లోజయ్యింది. -
స్పుత్నిక్–వి పంపిణీ హక్కులు ఎవరికీ ఇవ్వలేదు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ బ్రాండ్ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పష్టం చేసింది. పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని శుక్రవారం వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని తెలిపింది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌తో (ఆర్డీఐఎఫ్) కలిసి డాక్టర్ రెడ్డీస్ సంయుక్త ప్రకటన వెలువరించింది. ‘జూన్ మధ్యలో స్పుత్నిక్–వి వ్యాక్సిన్ వాణిజ్యపరమైన విడుదల నేపథ్యంలో భాగస్వామ్యం కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో నేరుగా చర్చిస్తున్నాం. వ్యాక్సిన్ కోసం పలు కంపెనీలు, థర్డ్ పార్టీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టుగా ఆధారాలు లేని నివేదికలు, వాదనలు కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. నివాస సంఘాలకు వ్యాక్సిన్ సరఫరాకు ఏ కంపెనీతో మేము భాగస్వామ్యం కుదుర్చుకోలేదు. మా తరఫున వ్యాక్సిన్ సరఫరాకు ఎవరికీ బాధ్యతలు అప్పగించలేదు. అనధికార వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కంపెనీ ప్రతినిధులమంటూ ఎవరైనా సంప్రదిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. స్పుత్నిక్–వి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులపట్ల చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నాం. అనధికార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నకిలీ ఉత్పత్తులకు కంపెనీ బాధ్యత వహించదు’ అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 557 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 29% క్షీణించి రూ. 557 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.781 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 4,336 కోట్ల నుంచి రూ. 4,608 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ నికర లా భం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) రూ. 2,026 కోట్ల నుంచి రూ. 1,952 కోట్లకు తగ్గింది. అయితే, నికర అమ్మకాలు మాత్రం రూ. 16,357 కోట్ల నుంచి రూ. 18,420 కోట్లకు పెరిగాయి. 2020–21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 25 మేర తుది డివిడెండ్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ఉత్పత్తులపై మరింత దృష్టి.. ఉత్పాదకతను పెంచుకోవడం, కొంగొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ కో–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్–వి టీకాను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని, అలాగే కోవిడ్–19 చికిత్సలో తోడ్పడే పలు ఔషధాలను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమెరికా అవినీతి నిరోధక చట్టాలకు విరుద్ధంగా పలు దేశాల్లో తమ కంపెనీ తరఫున హెల్త్‌కేర్ నిపుణులకు చెల్లింపులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల మీద స్వయంగా విచారణ చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే విషయాన్ని అటు అమెరికాలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ కమిషన్‌కి, న్యాయ శాఖకు, ఇటు సెబీకి తెలిపింది. గ్లోబల్ జనరిక్స్ 6 శాతం అప్.. క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 3,639 కోట్ల నుంచి రూ. 3,873 కోట్లకు చేరింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఔషధాల ధరల తగ్గుదల కారణంగా ఆదాయం 3 శాతం క్షీణించి రూ. 1,750 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఉత్తర అమెరికా మార్కెట్లో డీఆర్ఎల్ 6 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టింది. మరోవైపు, యూరప్ మార్కెట్లో ఆదాయాలు 15 శాతం పెరగ్గా, భారత్‌లో 23 శాతం పెరిగాయి. అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 10 శాతం వృద్ధి చెందింది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు క్యూ4లో వార్షికంగా 10 శాతం వృద్ధితో రూ. 790 కోట్లుగా నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు 2% క్షీణించి రూ. 5,196 వద్ద ముగిసింది. -
'స్పుత్నిక్'కు కేంద్రం పచ్చజెండా
న్యూఢిల్లీ: రష్యా తయారీ స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరిం చుకుంది. దేశంలో అత్యవసర వినియోగానికి రష్యా నుంచి స్పుత్నిక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)నుంచి తమకు అనుమతి లభించిందని ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ మంగళవారం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుతం కొనసా గుతున్న దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లకు తోడు మూడో టీకా రానుంది. ‘భారత్‌లో స్పుత్నిక్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినందుకు సంతో షంగా ఉంది. భారత్‌లో కేసులు పెరుగుతున్న సమయంలో కోవిడ్–19పై పోరులో ఈ టీకా చాలా కీలకంగా మారనుంది. దీనిద్వారా దేశ జనాభాలో సాధ్యమైనంత ఎక్కువ మందికి కోవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడనుంది’ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో– చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో ఏడాదికి 850 మిలియ న్ డోసుల స్పుత్నిక్ టీకా ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) తెలిపింది. స్పుత్నిక్ వినియోగానికి అనుమ తులిచ్చిన 60వ దేశం భారత్ అని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ దేశాలు అనుమతిం చిన టీకాల్లో స్పుత్నిక్ రెండో స్థానంలో ఉంది. 91.6% ప్రభావవంతం స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్, ఉత్పత్తితోపాటు వినియోగానికి అనుమతులు లభించడం భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని ఆర్డీఐఎఫ్ సీఈవో కిరిల్ డిమిట్రియేవ్ అన్నారు. కరోనా వైరస్‌పై స్పుత్నిక్ వ్యాక్సిన్ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందనీ, కోవిడ్–19 సీరియస్ కేసుల్లోనూ ఇది రక్షణ కల్పించిందని లాన్సెట్ వంటి ప్రముఖ మెడికల్ జర్నల్స్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయని ఆయన అన్నారు. ఈ వేసవి పూర్తయ్యేలోగా నెలకు 50 మిలియన్ డోసులకు మించి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. స్పుత్నిక్ టీకా ఉత్పత్తి అంతా దాదాపు భారత్‌లోనే జరుగుతున్నందున దీనిని భారత్–రష్యా వ్యాక్సిన్‌గా చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. ఒక్కో డోసు టీకా ఖరీదు 10 డాలర్ల లోపే ఉండగా, రెండు డోసుల్లో పనిచేసే ఇతర వ్యాక్సిన్ల కంటే స్పుత్నిక్‌తో రోగనిరోధకత ఎక్కువ కాలం ఉంటుందని తెలిపారు. సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ దీనిని నిల్వ ఉంచవచ్చన్నారు. 850 మిలియన్ డోసుల లక్ష్యం భారత్‌లో స్పుత్నిక్ టీకా క్లినికల్ ట్రయల్స్‌తోపాటు ఉత్పత్తి చేపట్టేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన ఆర్డీఐఎఫ్తో గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు దేశంలో క్లినికల్ ట్రయల్స్ 2, 3వ దశలను నిర్వహించింది. అనుమతులు లభించాక..దేశంలో ఏడాదికి 850 మిలియన్ డోసుల టీకాను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా గ్లాండ్ ఫార్మా, హెటిరో, బయోఫార్మా, పనాసియా బయోటెక్, స్టెలిస్ బయోఫార్మా, విర్చో బయోటెక్ వంటి ప్రముఖ సంస్థలతో ఆర్డీఐఎఫ్ ఒప్పందాలు కుదుర్చుకుంది. -
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
-
డాక్టర్ రెడ్డీస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ రంగంలో ఉన్న హైదరాబాద్ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ సైబర్ దాడికి గురైంది. గురువారం ఉదయం ఈ సంఘటన జరిగిందని కంపెనీ వెల్లడించింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ బృందం రంగంలోకి దిగింది. అన్ని డేటా సెంటర్ సర్వీసులను వేరుచేసింది. అలాగే అంతర్జాతీయంగా కొన్ని తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సమాచారం. ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ఐటీ నెట్వర్క్ సిస్టమ్‌ను సంస్థ సమీక్షిస్తోంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, బ్రెజిల్, రష్యాతోపాటు భారత్‌లోని ప్లాంట్లపై ఈ సైబర్ దాడి ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో రష్యా తయారీ కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్–వి రెండు, మూడవ దశ మానవ ప్రయోగాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ ఇటీవలే అనుమతి పొందిన నేపథ్యంలో కంపెనీ సర్వర్లపై ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎటువంటి ప్రభావం లేదు.. సైబర్ అటాక్ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని డేటా సెంటర్ సర్వీసులను ఐసోలేట్ చేశామని బీఎస్ఈకి సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో అన్ని సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయని తాము భావిస్తున్నట్టు డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ముకేశ్ రాథి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై పెద్దగా ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఔషధ రంగంలో మార్కెట్ విలువ పరంగా భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యేబొరేటరీస్ రెండవ స్థానంలో ఉంది. సంస్థ దేశంలో 17 తయారీ ప్లాంట్లు, ఆరు పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోంది. విదేశాల్లో ఆరు తయారీ ప్లాంట్లు, మూడు ఆర్అండ్డీ సెంటర్లు ఉన్నాయి. కాగా, గురువారం డాక్టర్ రెడ్డీస్ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.46 శాతం (రూ.23.30) తగ్గి రూ.5,023.60 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో షేరు ధర రూ.4,832.40కి చేరి తిరిగి పుంజుకుంది. సైబర్ సెక్యూరిటీకి కంపెనీల ప్రాధాన్యం: సిస్కో బెంగళూరు: కరోనా వైరస్ పరిణామాలతో వర్క్ ఫ్రం హోమ్ విధానానికి మళ్లుతున్న నేపథ్యంలో కంపెనీలకు సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలపై కార్పొరేట్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. సిస్కో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం కరోనా వైరస్ మహమ్మారి సమస్యలు ప్రారంభమైనప్పట్నుంచీ సైబర్ దాడులు జరగడం లేదా హెచ్చరికలు వచ్చిన ఉదంతాలు 25 శాతం పైగా పెరిగాయని సుమారు 73 శాతం దేశీ సంస్థలు వెల్లడించాయి. సుమారు మూడింట రెండొంతుల సంస్థలు (65 శాతం) రిమోట్ వర్కింగ్‌కు వీలుగా పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకున్నాయి. ఐటీ రంగంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించే 3,000 పైచిలుకు సంస్థలపై సిస్కో ఈ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం రిమోట్ వర్కింగ్ విధానం మరింతగా పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పటిష్టమైన సైబర్‌సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయని, క్లౌడ్ సెక్యూరిటీపై ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని సిస్కో ఇండియా డైరెక్టర్ రామన్ తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 579 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఔషధ రంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం 13 శాతం క్షీణించి రూ. 579 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 663 కోట్లు. ఇక ఆదాయం 15 శాతం పెరిగి రూ. 3,843 కోట్ల నుంచి రూ. 4,417 కోట్లకు చేరింది. డీఆర్ఎల్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి బుధవారం ఈ విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ సంక్షోభ సమయంలోనూ కార్యకలాపాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఉత్పాదకతను పెంచుకునే చర్యలు కొనసాగించడం మొదలైన అంశాలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. క్యూ1లో అన్ని అంశాల్లోనూ ఆర్థికంగా పటిష్టమైన పనితీరు కనపర్చగలిగామని డీఆర్ఎల్ సహ–చైర్మన్ జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. వోక్హార్డ్ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారాన్ని డీఆర్ఎల్ వ్యవస్థకు అనుసంధానించే ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు. ఆగస్టులో రెండు కోవిడ్ ఔషధాలు.. కోవిడ్–19 వ్యాధి చికిత్సలో ఉపయోగించే రెండు యాంటీ వైరల్ ఔషధాలు.. రెమిడెసివిర్, ఫావిపిరావిర్‌ను ఆగస్టులో ప్రవేశపెట్టేందు కు సన్నాహాలు చేస్తున్నట్లు చక్రవర్తి తెలిపారు. రెమ్డిసివిర్ను వర్ధమా న, ఆసియా దేశాలకు కూడా ఎగుమతి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ పేర్కొన్నారు. భారత్ సహా 127 దేశాల్లో రెమ్డిసివిర్ విక్రయానికి సంబంధించి అమెరికన్ సంస్థ గిలీడ్ సైన్సెస్‌తో డీఆర్ఎల్కు ఒప్పందం ఉంది. అలాగే, అవిగాన్ ట్యాబ్లెట్స్ (ఫావిపిరావిర్) విక్రయానికి సంబంధించి జపాన్‌కు చెందిన ఫ్యూజి ఫిల్మ్ కార్పొరేషన్‌తో ఒప్పందం ఉంది. గ్లోబల్ జనరిక్స్‌కు యూరప్ ఊతం.. యూరప్, వర్ధమాన మార్కెట్ల ఊతంతో గ్లోబల్ జనరిక్స్ విభాగం ఆదాయాలు ఆరు శాతం పెరిగి రూ. 3,507 కోట్లకు చేరింది. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంతో పాటు అమ్మకాలు పెరగడంతో యూరప్‌లో ఆదాయం 48 శాతం ఎగిసింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ఆదాయం ఆరు శాతం పెరిగింది. కొత్త ఉత్పత్తులు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయని కంపెనీ తెలిపింది. క్యూ1లో ఉత్తర అమెరికా మార్కెట్లో ఆరు కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు వివరించింది. భారత మార్కెట్లో మాత్రం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10 శాతం, సీక్వెన్షియల్‌గా 8 శాతం క్షీణించింది. కరోనా వైరస్ పరిణామాలతో అమ్మకాలు క్షీణించడమే ఇందుకు కారణం. తొలి త్రైమాసికంలో దేశీ మార్కెట్లో డీఆర్ఎల్ నాలుగు కొత్త బ్రాండ్స్‌ను ప్రవేశపెట్టింది. పీఎస్ఏఐకి కొత్త ఉత్పత్తుల తోడ్పాటు ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు వార్షికంగా 88 శాతం, సీక్వెన్షియల్‌గా 19 శాతం పెరిగాయి. కొన్ని ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరగడం, కొత్త ఉత్పత్తుల అమ్మకాలు, సానుకూల ఫారెక్స్ రేటు ఇందుకు తోడ్పడ్డాయి. సమీక్షాకాలంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై కంపెనీ రూ. 400 కోట్లు వెచ్చించింది. ప్రధానంగా సంక్లిష్టమైన జనరిక్స్, బయో–సిమిలర్స్ తదితర ఉత్పత్తుల రూపకల్పనపై దృష్టి పెడుతోంది. కోవిడ్–19 చికిత్స సంబంధ ఔషధాల అభివృద్ధి ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త ఉత్పత్తులపై ఆశలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా, రష్యా మార్కెట్లలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రై మాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) నికర లాభం స్వల్బంగా తగ్గింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 302 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 312 కోట్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించింది. మరోవైపు, 2016–17 ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ. 3,554 కోట్లు కాగా, ఈసారి రూ. 3,535 కోట్లుగా నమోదైంది. రూ. 5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై షేర్హోల్డర్లకు పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 20 మేర (400 శాతం) డివిడెండ్ చెల్లించాలని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బోర్డు సిఫార్సు చేసింది. ప్రధానమైన అమెరికా మార్కెట్లో ధరలపరమైన ఒత్తిళ్లు, రష్యా మార్కెట్లో తాత్కాలికంగా అమ్మకాల తగ్గుదల తదితర అంశాలతో ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్ జీవీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. వ్యయాల నియంత్రణపై కసరత్తు.. వ్యయాలు తగ్గించుకోవడం, మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం వంటి వ్యూహాలతో పనితీరును మరింతగా మెరుగుపర్చుకోవడంపై దృష్టి సారిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. సంక్షోభంలో ఉన్న వెనెజులా నుంచి బకాయిలను రాబట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి తెలిపారు. రూ. 900–1,000 కోట్ల స్థాయిలో పెట్టుబడి వ్యయాలు కొనసాగిస్తామన్నారు. పోటీ తక్కువ ఉండే కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం, వ్యయాలను తగ్గించుకునే వ్యూహాలతో ఆదాయాలను మెరుగుపర్చుకోనున్నట్లు కొత్త సీఎఫ్‌వో ఎరెజ్ ఇజ్రాయెలీ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ఆరు శాతం లాభంతో రూ. 2,014 వద్ద క్లోజయ్యింది. -
డా.రెడ్డీస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్, విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్(ఈఐఆర్)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా.రెడ్డీస్ టాప్ లూజర్‌గా నిలిచింది. ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది. ఫార్మా సెక్టార్లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్టేనని ఎనలిస్టులు చెబుతున్నారు.. 2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్ఎఫ్డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది. దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్ఎఫ్డీఏ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై డా.రెడ్డీస్‌ను వివరణకోరామని మార్కెట్ రెగ్యులేటరీ తెలిపింది. తాజా రిపోర్ట్‌పై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే నవంబర్ 21, 2017న విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈఐఆర్ అందినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్ తెలిపింది. కానీ సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా లేదని చెప్పింది. కాగా అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. గత నెలగా రెడ్డీస్ కౌంటర్ 8శాతానికిపైగా లాభపడింది. -
నిరాశపరిచిన డాక్టర్ రెడ్డీస్
తొలి క్వార్టర్లో 53% తగ్గిన నికర లాభం ► రూ.59 కోట్లుగా నమోదు ► 3% పెరిగి రూ.3,316 కోట్లకు చేరిన ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికంలో నిరాశ పరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ (ఐఎఫ్ఆర్ఎస్) ప్రకారం కన్సాలిడేటెడ్ నికర లాభం ఏకంగా 53 శాతం తగ్గి రూ.126 కోట్ల నుంచి రూ.59 కోట్లకు పడిపోయింది. తొలి త్రైమాసికంలో అంచనాలను అందుకోలేకపోయినట్లు రెడ్డీస్ సహ ఛైర్మన్ జి.వి.ప్రసాద్ చెప్పారు. ‘యూఎస్‌లో కస్టమర్ల కన్సాలిడేషన్ వల్ల విక్రయ ధరల్లో కోత పడింది. అమెరికా మార్కెట్లో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు తగ్గడంతో పాటు భారత్‌లో జీఎస్టీ అమలు ఇందుకు కారణం’ అని వెల్లడించారు. ఇక టర్నోవరు 3 శాతం వృద్ధి చెంది రూ.3,316 కోట్లకు చేరింది. ఎబిటా రూ.340 కోట్లుగా నమోదైంది. త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధికి సంస్థ రూ.510 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10–15 కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్నట్టు డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమెన్ చక్రవర్తి గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. కలిసొచ్చిన ఎమర్జింగ్ మార్కెట్లు.. గ్లోబల్ జనరిక్స్ విభాగం 3 శాతం వార్షిక వృద్ధితో రూ.2,750 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఎమర్జింగ్ మార్కెట్లు, యూరప్ ఇందుకు దోహదం చేశాయి. అలాగే ప్రధాన మార్కెట్లలో కొత్త ఉత్పత్తుల విడుదల కూడా తోడైంది. ఎమర్జింగ్ మార్కెట్లలో ఆదాయం గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 34 శాతం పెరిగి రూ.570 కోట్లకు చేరింది. యూరప్ మార్కెట్ 28 శాతం వృద్ధితో రూ.210 కోట్లు సమకూర్చింది. ఉత్తర అమెరికాలో మాత్రం ఆదాయం 4 శాతం తగ్గి రూ.1,490 కోట్లకు పరిమితమయింది. భారత మార్కెట్ 10 శాతం తగ్గి రూ.470 కోట్లు నమోదైంది. జీఎస్టీ కారణంగా విక్రేతలు కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో భారత్ నుంచి ఆదాయం తగ్గింది. జూన్‌లో కొనుగోళ్లు భారీగా పడిపోయాయని, అధిక డిస్కౌంట్లు ఇవ్వాల్సి వచ్చిందని, ఇది లాభాలపై కూడా ప్రభావం చూపించిందని సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. కాగా, జూన్ నాటికి యూఎస్ఎఫ్డీఏ వద్ద 99 జనరిక్ ఫైలింగ్స్ పెండింగులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. సీహెచ్డీతో ఒప్పందం.. బయోఫార్మాస్యూటికల్ కంపెనీ సీహెచ్‌డీ బయోసైన్సెస్‌తో డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. సర్జరీతో ముడిపడి ఉన్న ఇన్ఫెక్షన్ల నివారణ కోసం రెడ్డీస్ అభివృద్ధి చేస్తున్న ఔషధం తదుపరి పరీక్షలు, మార్కెటింగ్ బాధ్యతలను సీహెచ్‌డీ చేపడుతుంది. ఒప్పందం ప్రకారం 18 నెలల్లో సీహెచ్‌డీ ద్వారా ఈక్విటీ లేదా నగదు రూపంలో సుమారు రూ.194 కోట్లు రెడ్డీస్‌కు లభిస్తాయి. అలాగే యూఎస్ఎఫ్డీఏ నుంచి ఔషధానికి అనుమతి రాగానే మైల్స్టోన్ మొత్తం కింద రూ.259 కోట్లతోపాటు అమ్మకాలపై రాయల్టీ సైతం వస్తాయి. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 337 కోట్లు
► క్యూ4లో 175% వృద్ధి ► రూ. 3,632 కోట్ల ఆదాయం ► రూ. 20 డివిడెండ్ ► అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నికర లాభం సుమారు 175 శాతం వృద్ధితో రూ.337.6 కోట్లకు ఎగసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ.122.6 కోట్లే. అయితే, తాజా క్యూ4లో మొత్తం ఆదాయం మాత్రం సుమారు 6 శాతం క్షీణించి రూ.3,880 కోట్ల నుంచి రూ.3,632 కోట్లకు పరిమితమైంది. కీలకమైన అమెరికా మార్కెట్లో ధరల పరమైన ఒత్తిళ్లు, పెద్ద స్థాయిలో కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకపోవడం ఇందుకు కారణమని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ శుక్రవారం విలేకరులకు చెప్పారు. విశాఖ జిల్లాలోని దువ్వాడ ఇంజెక్టబుల్స్ ప్లాంట్‌లో అమెరికా ఔషధ రంగ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీల్లో లేవనెత్తిన అంశాల పరిష్కారం చర్యలపై మరింతగా దృష్టి సారిస్తున్నామని ఆయన తెలియజేశారు. అటు బాచుపల్లి ప్లాంటులో అబ్జర్వేషన్ల పరిష్కారం సమస్యాత్మకమేమీ కాదని, దీనిపై ఎఫ్‌డీఏతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ఇటీవల ఎఫ్‌డీఏల తనిఖీలు పెరిగిన అంశంపై స్పందిస్తూ... ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ఉందని, అమెరికా నియంత్రణ సంస్థలు ప్రమాణాల్ని అమలు చేయటంపై మరింత కఠినంగా దృష్టి పెడుతున్నాయని ప్రసాద్ చెప్పారు. రూ.5 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ. 20 మేర (ఫేస్ వ్యాల్యూపై 400 శాతం) డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. దేశీ మార్కెట్లో అనిశ్చితి..: ధరలపరమైన నియంత్రణలతో దేశీ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని ప్రసాద్ తెలియజేశారు. త్వరలో అమల్లోకి రాబోయే వస్తు, సేవల పన్నుల విధానం కూడా పంపిణీ వ్యవస్థపై కొంత ప్రభావం చూపవచ్చని చెప్పారు. అయితే ఇది తాత్కాలికమే కావచ్చని, తాము అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అటు కీలకమైన అమెరికా మార్కెట్లో అనుమతులు క్రమంగా రావడం మొదలైందని, తదుపరి క్వార్టర్స్ నుంచి ఇది మరింత వేగవంతం కావొచ్చని చెప్పారాయన. చైనా, దక్షిణ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ గణనీయంగా జరుగుతోందని, ఈ ఏడాది చిలీ మార్కెట్లోనూ ప్రవేశించనున్నామని సీవోవో అభిజిత్ ముఖర్జీ తెలిపారు. చైనాలో ఆంకాలజీ ఉత్పత్తులకు ఫైలింగ్ చేస్తున్నామని, మూడు నుంచి అయిదేళ్ల వ్యవధిలో మరింతగా మార్కెట్ సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రొప్రైటరీ ఉత్పత్తులకు సంబంధించి డెర్మటాలజీ, న్యూరాలజీ ఔషధాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని, ఇక బయోసిమిలర్స్ విషయానికొస్తే రెడిటక్స్ ఔషధాన్ని త్వరలో పలు మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నామని ప్రసాద్ చెప్పారు. ఈ ఏడాది అమెరికాలో 10 సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద సుమారు 80 ఉత్పత్తులదాకా ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా పెట్టుబడి వ్యయాలు రూ.1,000–1,200 కోట్ల స్థాయిలోనే ఉంటాయని సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి చెప్పారు. తగ్గిన జనరిక్స్ వృద్ధి .. నాలుగో త్రైమాసికంలో ప్రపంచ వ్యాప్తంగా జనరిక్స్ వృద్ధి అయిదు శాతం క్షీణించింది. ప్రధానమైన ఉత్తర అమెరికా మార్కెట్లో 19 శాతం తగ్గింది. అయితే, యూరప్, భారత్, వర్ధమాన మార్కెట్లలో సానుకూల వృద్ధి నమోదైంది. ఇక పీఎస్‌ఏఐ విభాగంలోనూ మొత్తం మీద వృద్ధి ఆరు శాతం క్షీణించగా, ఉత్తర అమెరికాలో 28 శాతం తగ్గింది. వెనెజులాలో కార్యకలాపాల సమస్యల వల్ల వర్ధమాన మార్కెట్ల ఆదాయాలు 11 శాతం క్షీణించినట్లు సౌమేన్ చక్రవర్తి చెప్పారు. క్యూ4లో అమెరికాలో 13 ఔషధాల జనరిక్స్ తయారీ అనుమతులకు దరఖాస్తులు (ఏఎన్‌డీఏ) చేసినట్లు చెప్పారాయన. పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభాల మార్జిన్ 400 బేసిస్ పాయింట్లు తగ్గి 55.6 శాతానికి పరిమితమైంది. ఉత్తర అమెరికా మార్కెట్లో జనరిక్స్ వ్యాపార విభాగంలో ఔషధాల ధరల్లో తగ్గుదల, అధిక తయారీ వ్యయాలు తదితర అంశాలు ఇందుకు కారణం. శుక్రవారం ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ షేరు సుమారు 0.30 శాతం క్షీణించి రూ. 2,584.70 వద్ద ముగిసింది. -
ఆస్ట్రేలియా కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్ట్రేలియాకు చెందిన హాచ్టెక్కు చెందిన తలలో పేల నివారణకు వినియోగించే ‘ఎక్సిగ్లైజ్’ లోషన్పై ముందస్తు వాణిజ్య హక్కులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్ ముందుగా రూ. 66 కోట్లను ( 10 మిలియన్ డాలర్లు) చెల్లిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ వాణిజ్యపరంగా విజయవంతం అయితే దశల వారీగా రూ. 330 కోట్ల (50 మిలియన్ డాలర్లు) వరకు చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెనుజులా, సీఐఎస్ దేశాలతో పాటు ఇండియాలో ఈ లోషన్‌ను విక్రయించడానికి హక్కులను పొందింది. హాచ్టెక్ అభివృద్ధి చేస్తున్న ఎక్సిగ్లైజ్ లోషన్ ఫేజ్-3 పరీక్షలు విజయవంతం అయినట్లు కంపెనీ 2014లో ప్రకటించింది. ఈ ఔషధానికి యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించాల్సి ఉంది. -
డాక్టర్ రెడ్డీస్ క్యూ1 ఫలితాలు..లాభం 626 కోట్లు
రష్యా దెబ్బతీసినా ఆదుకున్న ఇండియా, అమెరికా 7% వృద్ధితో రూ. 3,757 కోట్లకు ఆదాయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తొలి త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ మూడు నెలల కాలంలో ఆదాయంలో 7 శాతం, నికర లాభంలో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి రూ.550 కోట్లుగా ఉన్న నికరలాభం ఈ ఏడాది రూ.626 కోట్లకు చేరింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 3,517 కోట్ల నుంచి రూ. 3,757 కోట్లకు చేరింది. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల రష్యా వంటి వర్థమాన దేశాల్లో వ్యాపారం బాగా క్షీణించినా... ఇతర దేశాల్లో వ్యాపారంలో వృద్ధి నమోదు కావటంపై కంపెనీ సంతోషం వ్యక్తం చేసింది. రష్యా కరెన్సీ రూబెల్ క్షీణించడం వల్ల అక్కడ వ్యాపారంలో 45 శాతం క్షీణత నమోదయిందని, కానీ ఇదే సమయంలో కీలకమైన ఉత్తర అమెరికాలో 14 శాతం, ఇండియాలో 19 శాతం వృద్ధి నమోదు కావడంతో మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగామని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తి తెలిపారు. సమీక్షా కాలంలో రష్యా వ్యాపారం రూ.420 కోట్ల నుంచి రూ. 230 కోట్లకు పడిపోగా, ఇదే సమయంలో ఇండియా వ్యాపారం రూ.400 కోట్ల నుంచి రూ.476 కోట్లకు, ఉత్తర అమెరికా ఆదాయం రూ.1,620 కోట్ల నుంచి రూ.1,851 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిడి అధికంగా ఉందని, కొత్త ఉత్పత్తులకు అనుమతి లభిస్తే రానున్న కాలంలో కూడా ఇదే విధమైన ఫలితాలను ప్రకటించగలమని సౌమెన్ ధీమా వ్యక్తం చేశారు. ఇండియా మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిపెడుతున్నామని, దేశీ మార్కెట్లో 16వ స్థానం నుంచి 14వ స్థానానికి చేరామని తెలిపారు. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ ఇండియాలో 6 ఉత్పత్తులను విడుదల చేసింది. వ్యాపార విస్తరణ కోసం టేకోవర్లపై కూడా దృష్టిసారిస్తున్నామని, మంచి కంపెనీ సరైన ధరకు లభిస్తే తప్పకుండా పరిశీలిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర గురువారం బీఎస్ఈలో 5.2 శాతం మేర ఎగబాకి.. రూ. 3,908 వద్ద స్థిరపడింది. -
డాక్టర్ రెడ్డీస్ లోగో మారింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ న్యూ బ్రాండింగ్‌పై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ‘గుడ్హెల్త్ కెన్ నాట్ వెయిట్’ అనే ఉప శీర్షికతో నూతన లోగోను ఆవిష్కరించింది. ఈ న్యూ బ్రాండింగ్ కార్యక్రమాన్ని రెండు దశల్లో చేపడుతున్నామని, తొలి దశ కింద కార్పొరేట్ బ్రాండింగ్‌ను మారుస్తున్నామని, 2వ దశలో ప్రోడక్టులపై లోగోలను మార్చనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. నూతన ఆవిష్కరణ, వివేకానికి ప్రతీకగా ఉదారంగును ఎంచుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కో చైర్మన్, సీఈవో జి.వి.ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. -
డాక్టర్ రెడ్డీస్ లాభం 8% అప్
క్యూ4లో రూ. 519 కోట్లు ⇒ కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావం ⇒ ఒక్కో షేరుకి రూ. 20 డివిడెండు.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ నికర లాభం 8 శాతం పెరిగి రూ. 519 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఇది రూ. 481 కోట్లు. మరోవైపు ఆదాయం 11 శాతం వృద్ధితో రూ. 3,481 కోట్ల నుంచి రూ. 3,870 కోట్లకు పెరిగింది. వర్ధమాన మార్కెట్లలో కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావడం.. లాభాలపై దాదాపు రూ. 84 కోట్ల మేర ప్రతికూల ప్రభావం చూపిందని మంగళవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ సీఈవో జీవీ ప్రసాద్ తెలిపారు. రష్యా కరెన్సీ డీవేల్యుయేషన్ తదితర అంశాలు ఇందుకు కారణమని వివరించారు. మరిన్ని కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టడం ద్వారా రెండంకెల స్థాయి వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓటీసీ ఉత్పత్తుల ఊతంతో తొలిసారిగా అమెరికా జనరిక్స్ మార్కెట్లో తొలిసారిగా బిలియన్ డాలర్ల అమ్మకాలను సాధించినట్లు డాక్టర్ రెడ్డీస్ సీఎఫ్‌వో సౌమేన్ చక్రవర్తి తెలిపారు. యూసీబీ కొనుగోలు ప్రక్రియ ఈ త్రైమాసికంలో పూర్తి కాగలదని, దీంతో ఆదాయాలు మరో రూ. 150 కోట్ల మేర పెరగగలవని పేర్కొన్నారు. రూ. 5 ముఖవిలువ గల షేరుపై రూ.20 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. మెరుగుపడుతున్న యూరప్ మార్కెట్లు..: యూరప్‌లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడి మార్కెట్లలో వ్యాపారం లాభాల్లోకి మళ్లిందని ప్రసాద్ తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో అమెరికాలో 12, రష్యా తదితర దేశాలోల 14, భారత్‌లో 18 కొత్త ఔషధాలు ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. కొత్తగా 13 ఉత్పత్తులకు ఫైలింగ్ చేశామని, దీంతో అమెరికా ఎఫ్‌డీఏ వద్ద మొత్తం 68 ఏఎన్‌డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రసాద్ చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయాలు 12% వృద్ధితో రూ. 14,818 కోట్లకు పెరగ్గా, లాభాలు 3% పెరుగుదలతో రూ. 2,218 కోట్లకు చేరాయి. అమెరికాలో జనరిక్స్ ఆదాయం 17శాతం పెరిగి రూ. 6,472 కోట్లు, యూరప్‌లో 3% వృద్ధితో రూ. 719 కోట్లు, భారత్‌లో 14 శాతం వృద్ధితో రూ. 179 కోట్లు వచ్చాయి. కీలకమైన అమెరికా మార్కెట్లో ఔషధాలకు ఆమోదం లభించడంలో జాప్యం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, వెనెజులా..రష్యా తదితర దేశాల్లో కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైన అంశాలు లాభాలపై ప్రతికూల ప్రభావం చూపాయని చక్రవర్తి తెలిపారు. చిన్న, మధ్య తరహా సంస్థల కొనుగోలుపై కసరత్తు జరుగుతూనే ఉందని ప్రసాద్ చెప్పారు. జపాన్ మార్కెట్లో భాగస్వామ్య సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు వివరించారు. కొత్త పెట్టుబడి ప్రణాళికలు..: గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ఈసారి మరో రూ. 1,000-1,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రసాద్ చెప్పారు. ప్రధానంగా నాణ్యతను మెరుగుపర్చుకోవడం, కొత్త టెక్నాలజీలను సమకూర్చుకోవడం వంటి వాటిపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై(ఆర్అండ్డీ) ఈసారి కూడా 12% పైనే వెచ్చించనున్నట్లు ప్రసాద్ తెలిపారు. బయోసిమిలర్ల విషయంలో మెర్క్ సంస్థతో కలసి పనిచేస్తున్నామని, 2018 నాటికి మొదటిదాన్ని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం ప్లాంటును యూఎస్ఎఫ్డీఏ పరిశీలించిన నేపథ్యంలో.. నిబంధనల పాటింపునకు సంబంధించి అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. దీనిపై ఎఫ్‌డీఏ నుంచి ఇంకా స్పందన రావాల్సి ఉందన్నారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని ఔషధాల తయారీని శ్రీకాకుళం ప్లాంటు నుంచి ఇతర ప్లాంట్లకు తరలించినట్లు ప్రసాద్ వివరించారు. ఫలితాల నేపథ్యంలో మంగళవారం బీఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ షేరు ధర 3 శాతం ఎగసి రూ.3,466 వద్ద స్థిరపడింది. -
హెటిరోతో...డాక్టర్ రెడ్డీస్ జట్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షన్ ‘రిసాఫ్’ పేరుతో దేశీయ మార్కెటో విక్రయించనుంది. ఈ మేరకు హెటిరో ల్యాబ్‌తో డాక్టర్ రెడ్డీస్‌కి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హెటిరో ల్యాబ్ తయారు చేసే సోఫాస్బువిర్ 400 ఎంజీ ట్యాబ్లెట్లను రిసాఫ్ బ్రాండ్‌తో డాక్టర్ రెడ్డీస్ దేశీయ మార్కెట్లో విక్రయించనుంది. రోగులకు అందుబాటు ధరలో ఔషధాలను అందించాలన్న కంపెనీ ఆలోచనలో భాగంగా ఈ ఒప్పం దాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఈ మధ్యనే వీటి జెనరిక్ వెర్షన్‌ను విక్రయించడానికి హెటిరో ల్యాబ్‌తోపాటు నాట్కో, జైడస్ క్యాడిలాలకు అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే.