క్యూ4లో 36% అప్
డివిడెండ్ రూ. 40
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కీలకమైన అమెరికా మార్కెట్లో అమ్మకాల దన్నుతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ రూ. 1,307 కోట్ల లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 959 కోట్లతో పోలిస్తే 36 శాతం వృద్ధి సాధించింది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 6,297 కోట్ల నుంచి రూ. 7,083 కోట్లకు పెరిగింది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను లాభం రూ. 4,507 కోట్ల నుంచి రూ. 5,568 కోట్లకు, ఆదాయం రూ. 24,588 కోట్ల నుంచి రూ. 27,916 కోట్లకు పెరిగింది. 2023–24కి గాను రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై కంపెనీ రూ. 40 డివిడెండు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు పటిష్టంగా ఉండటం లాభాల వృద్ధికి తోడ్పడిందని విలేకరుల సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న సంస్థ సహ–చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కంపెనీ ఏర్పాటై 40 ఏళ్లయిందని, రాబోయే దశాబ్ద కాలంలో నవకల్పనలు, డిజిటల్ థెరప్యూటిక్స్ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా అధిక వృద్ధి సాధనకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని విశేషాలు..
∗ క్యూ4లో గ్లోబల్ జనరిక్స్ ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 6,119 కోట్లకు చేరింది.
∗యూరప్ మార్కెట్లో ఆదాయం 5 శాతం వృద్ధితో రూ. 521 కోట్లుగా నమోదైంది. మరోవైపు, భారత్ మార్కెట్లో ఆదాయం 12 శాతం క్షీణించి రూ. 1,126 కోట్లకు పరిమితమైంది.
∗ అటు వర్ధమాన మార్కెట్లలో ఆదాయం 9 % వృద్ధి చెంది రూ. 1,209 కోట్లుగా ఉంది.
∗ ఫార్మా సరీ్వసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 779 కోట్ల నుంచి రూ. 822 కోట్లకు చేరింది.
∗ మంగళవారం బీఎస్‌ఈలో ఈ షేరు ధర స్వల్పంగా క్షీణించి రూ. 6,259 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment