హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే వ్యవధిలో లాభం రూ. 362 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 4,728 కోట్ల నుంచి రూ. 5,437 కోట్లకు పెరిగింది. కొన్ని ఉత్పత్తులు (పీపీసీ–06), అసెట్ల (ష్రెవిపోర్ట్ ప్లాంట్) విలువను దాదాపు రూ. 760 కోట్ల మేర తగ్గించాల్సి రావడం వల్ల ఆ మేరకు లాభాలపై ప్రతికూల ప్రభావం పడింది.
కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వార్షిక ప్రాతిపదికన దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసినట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఇతరత్రా పలు సవాళ్లు ఉన్నప్పటికీ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం వంటి అంశాల ఊతంతో తమ ప్రధాన వ్యాపార విభాగం మెరుగైన పనితీరు కనపర్చగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల ప్రభావమేమీ వ్యాపారంపై లేదని, ఇప్పటివరకూ చెల్లింపులపరమైన సమస్యలేమీ తలెత్తలేదని వివరించారు.
సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఇచ్చేలా అనుమతుల కోసం జూన్ ఆఖరు లేదా జూలై తొలినాళ్లలో దరఖాస్తు చేసుకోనున్నట్లు డీఆర్‌ఎల్ సీఈవో (పీఎస్‌ఏఐ విభాగం) దీపక్ సప్రా తెలిపారు. ప్రస్తుతానికి 12–17 ఏళ్ల బాలల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్–ఎం టీకాను పక్కన ఉంచామని, స్పుత్నిక్ లైట్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. స్పుత్నిక్ టీకాల ధరల పునఃసమీక్షపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వర్ధమాన మార్కెట్లు 36 శాతం అప్..
నాలుగో త్రైమాసికంలో రష్యా సహా వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ఆదాయం 36 శాతం పెరిగి రూ. 1,201 కోట్లకు ఎగిసింది. భారత్‌లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 969 కోట్లకు చేరింది. మరోవైపు, ధరలు పడిపోవడం, అమ్మకాల పరిమాణం తగ్గడం అంశాల కారణంగా ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం అయిదు శాతం క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల లాభం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 30 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.
గురువారం ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు సుమారు ఒక్క శాతం పెరిగి రూ. 3,942కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment