క్యూ2లో రూ. 3,450 కోట్లు
జేఎల్‌ఆర్ ప్రభావం
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,450 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు తగ్గడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,832 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,04,444 కోట్ల నుంచి రూ. 1,00,534 కోట్లకు వెనకడుగు వేసింది.
మొత్తం వ్యయాలు సైతం రూ. 1,00,649 కోట్ల నుంచి రూ. 97,330 కోట్లకు తగ్గాయి. ప్యాసింజర్ వాహన విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 11,700 కోట్ల ఆదాయం లభించగా.. అమ్మకాలు 6% నీరసించి 1,30,500 యూనిట్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. వాణిజ్య వాహన(సీవీ) అమ్మకాలు 20 శాతం క్షీణించి 79,800 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 11% తగ్గి 4,400 యూనిట్లకు చేరాయి. సీవీ బిజినెస్ ఆదాయం 14% తక్కువగా రూ. 17,300 కోట్లకు పరిమితమైంది.
జేఎల్‌ఆర్ డీలా
లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్ ఆదాయం 6 శాతం నీరసించి 6.5 బిలియన్ పౌండ్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అల్యూమినియం సరఫరాల తాత్కాలిక సమస్యలతో లాభాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. వీటికితోడు 6,029 వాహనాలను అదనపు నాణ్యతా సంబంధ పరిశీలనలకోసం నిలిపిఉంచినట్లు వెల్లడించింది. దీంతో డిమాండుకు అనుగుణంగా వాహన డెలివరీలను చేపట్టలేకపోయినట్లు తెలియజేసింది. ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి కోసం యూకే హేల్‌ఉడ్ ప్లాంట్‌పై 25 కోట్ల పౌండ్లను ఇన్వెస్ట్ చేసినట్లు జేఎల్‌ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం నష్టంతో రూ. 806 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment