Q4 Financial Results
-
సూచీల స్థిరీకరణ కొనసాగొచ్చు
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు. -
Sensex : జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది. సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్‌ఫిన్‌సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి. ఆల్‌టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పీఎస్బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది. -
ప్రపంచ పరిణామాలు, క్యూ4 ఆర్థిక ఫలితాలు కీలకం
ముంబై: ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. శ్రీరామనవమి(బుధవారం) సందర్భంగా బుధవారం ఎక్సే్చంజీలకు సెలవు కావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులు జరగుతుంది. అయితే ఈ సెలవు రోజులో ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు సాయంత్రం ట్రేడింగ్‌లో యథావిధిగా పనిచేస్తాయి. ‘‘అంతర్జాతీయ నెలకొన్న అస్థిర పరిస్థితులు, దేశీయంగా సార్వత్రిక ఎన్నికల ప్రారంభం(శుక్రవారం) నేపథ్యంలో వచ్చేవారం స్టాక్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ నష్టాల్లో చలించవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ 22,520 వద్ద కీలక మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకుంది. ఎగువస్థాయిలో 22,750–22,800 శ్రేణిలో పరిక్షీణించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రీటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. గత వారం ప్రథమార్థంలో రికార్డు స్థాయి ర్యాలీ చేసిన సూచీలు అమెరికా ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ ధరలు పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో లాభాలన్నీ ఆవిరయ్యాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ మూడు పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ ఆరు పాయింట్లు లాభపడ్డాయి. క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ మార్కెట్ ముందుగా గతవారం మార్కెట్ ముగింపు తర్వాత వెల్లడైన టీవీఎస్ పూర్తి ఆర్థిక సంవత్సరం, జనవరి క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 63 కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్, విప్రో, జియో ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఏంజెల్ వన్, ఐసీసీఐ లాంబార్డ్, క్రిసెల్, ఏంజెల్ వన్, టాటా కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాలు జపాన్ మెషిన్ టూల్ ఆర్డర్స్ డేటా, యూరోజోన్ ఫిబ్రవరి వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2024 జనవరి క్వార్టర్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలతో పాటు బ్రిటన్ ఫిబ్రవరి నిరుద్యోగ రేటు, యూరోజోన్ వాణిజ్య లోటు, అమెరికా నూతన గృహ విక్రయాల డేటా మంగళవారం వెల్లడి కానుంది. యూరోజోన్, బ్రిటన్ మార్చి ద్రవ్యోల్బణ గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఇక శుక్రవారం జపాన్ మార్చి ద్రవ్యోల్బణం, బ్రిటన్ డిసెంబర్ రిటైల్ సేల్స్ విడుదల అవుతాయి. ప్రపంచ పరిణామాలు తూర్పు దేశాల్లో మళీ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో ఇరాన్ దాడులకు పాల్పడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు రెండు శాతం మేర పెరిగాయి. చమురుని భారీ ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. యూఎస్ మార్చి ద్రవ్యోల్బణ అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు. -
ఫెడ్ నిర్ణయాలు, క్యూ4 ఫలితాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ4 ఆర్థిక ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అదానీ గ్రూప్ – హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తాజా పరిణామాలు, దేశీయ అతిపెద్ద ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు సమావేశ వివరాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ మార్కెట్ల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చంటున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎక్చ్సేంజీలకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులే జరుగుతుంది. వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. యూఎస్ ఫెడ్ రిజర్వ్, ఈసీబీ పాలసీ సమావేశ నిర్ణయాలు రానున్న రోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను నడిపిస్తాయి. ఇక దేశీయ మార్కెట్ మూమెంటమ్ స్వల్పకాలం పాటు సానుకూలంగా కొనసాగొచ్చు. అయితే కీలక స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడి కానున్న తరుణంలో పరిమిత శ్రేణిలో కదలాడొచ్చు. సాంకేతికంగా ఎగువ స్థాయిలో నిఫ్టీ 18,100–18,200 పరిమిత శ్రేణి నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది. లాభాల స్వీకరణ చోటు చేసుకుంటే 17,850 వద్ద కీలక మద్దతు లభిస్తుంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొనడంతో గతవారంలో సెన్సెక్స్ 1,457 పాయింట్లు, నిఫ్టీ 441 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ మినహా ఇతర రంగాల కార్పొరేట్ కంపెనీ ప్రోత్సాహకరమైన ఆర్థిక గణాంకాలను వెల్లడించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, క్రూడాయిల్ ధరల క్షీణత, వొలటాలిటీ ఇండెక్స్ చారిత్రాత్మక కనిష్టాలకు దిగిరావడం, అమెరికా ఐటీ దిగ్గజం మెటా మెరుగైన ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత ఐటీ షేర్ల ర్యాలీ తదితర అంశాలు దలాల్ స్ట్రీట్‌లో సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫెడ్ సమావేశ నిర్ణయాలపై దృష్టి ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(మే 2న) మొదలై.., బుధవారం ముగియను న్నాయి. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేట్లను పెంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ‘‘ఒక వేళ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించినట్లయితే.., ఆర్థిక వృద్ధి మందగన ఆందోళనల దృష్ట్యా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో వడ్డీరేట్లను తగ్గించే వీలుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వె స్టర్ల పెట్టుబడులు ఊపందుకోవచ్చు’’అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ సాంకేతిక నిపుణుడు ప్రవేష్ గౌర్ తెలిపారు. అదానీ హిండెన్‌బర్గ్ తాజా పరిణామాలు అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేయడానికి మరో ఆరు నెలల గడువు కావాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) శనివారం సుప్రీంకోర్టును కోరింది. ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు తాజా వివరాలను, ప్రాథమికంగా గుర్తించిన అంశాలను నిపుణుల కమిటీకి సమర్పించినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసి రెండు నెలల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఈ మార్చి 2న సెబీ ఆదేశాలు జారీ చేసిన తెలిసిందే. కార్పొరేట్ల క్యూ4 ఫలితాలు కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్ కీలక దశకు చేరింది. టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, హీరోమోటోకార్ప్, కోల్ ఇండియా, అంజుజా సిమెంట్స్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్‌తో సహా సుమారు 200కి పైగా కంపెనీలు తమ నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని రంగాల కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి దేశీయ ఆటో కంపెనీలు నేడు (సోమవారం) ఏప్రిల్ హోల్‌సేల్ అమ్మకాల వివరాలను వెల్లడిస్తాయి. ఇదే రోజున ఏప్రిల్ దేశీయ తయా రీ రంగ పీఎంఐ డేటా, మూడో తేదీ(బుధవారం)న సేవారంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం ఆర్బీఐ ఏప్రిల్ 28 తేదీన ముగిసిన వారం నాటి ఫారెక్స్ నిల్వలు.., ఏప్రిల్ 21వ తేదీతో ముగిసిన బ్యాంక్ రుణాలు–డిపాజిట్ వృద్ది గణాంకాలను విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా నేడు (సోమవారం) అమెరికా ఏప్రిల్ తయారీ రంగ, నిర్మాణ వ్యయ వివరాలు వెల్లడి కానున్నాయి. అమెరికా ఫెడ్ సమావేశ నిర్ణయాలు, యూరో జోన్ నిరుద్యోగ రేటు గణాంకాలు బుధవారం విడుదల అవుతాయి. ఈసీబీ వడ్డీరేట్ల ప్రకటన, అమెరికా మార్చి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గురువారం వెల్లడి కానున్నాయి. ఆయా దేశాలకు సంబంధించిన ఆర్థిక స్థితిగతులను తెలియజేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ ఏడాదిలో అత్యధిక కొనుగోళ్లు దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏప్రిల్‌లో బుల్లిష్ వైఖరి ప్రదర్శించారు. నెల మొత్తంగా ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.11,631 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్ మార్కెట్లో రూ.4,268 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ఈక్వి టీ, డెట్ విభాగాల్లో ఏప్రిల్ పెట్టుబడులు ఈ ఏడాదిలోనే అత్యధికం కావడం విశేషం. ‘‘భారత ఈక్విటీలు అధిక వ్యాల్యూయేషన్ల నుంచి సాధారణ స్థితికి దిగివచ్చాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ కరిగిపోయింది. దీంతో ఎఫ్ఐఐలు వరుసగా రెండోనెలా నికర కొనుగోలుదారులుగా నిలిచారు. డ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం రానున్న రోజుల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల తీరును నిర్ణయిస్తుంది’’ అని రైట్ రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫౌండర్ సోనమ్ శ్రీవాస్తవ తెలిపారు. -
అరబిందో ఫార్మా లాభం రూ. 576 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి. పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. -
లాభాల్లోకి గోద్రెజ్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: ప్రైయివేట్ రంగ దిగ్గజం గోద్రెజ్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 423 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 92 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,611 కోట్ల నుంచి రూ. 4,445 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 2,814 కోట్ల నుంచి రూ. 4,202 కోట్లకు పెరిగాయి. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి గోద్రెజ్ ఇండస్ట్రీస్ నికర లాభం రూ. 391 కోట్ల నుంచి రూ. 992 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం 51 శాతం జంప్‌చేసి రూ. 14,130 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 9,334 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. నాదిర్ గోద్రెజ్‌ను మరో మూడేళ్లపాటు అంటే 2026 మార్చి 31వరకూ చైర్మన్, ఎండీగా బోర్డు తిరిగి ఎంపిక చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ షేరు 9% జంప్‌చేసి రూ. 477 వద్ద ముగిసింది. -
క్యూ4లో జీ లాభం నేలచూపు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజ్(జీల్) నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 33 శాతం క్షీణించి రూ. 182 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 272 కోట్లకుపైగా ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,984 కోట్ల నుంచి రూ. 2,361 కోట్లకు బలపడింది. ప్రకటనల ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 1,120 కోట్లకు చేరింది. అయితే సబ్స్క్రిప్షన్ ఆదాయం రూ. 803 కోట్ల నుంచి రూ. 855 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జీ నికర లాభం 20 శాతం వృద్ధితో రూ. 956 కోట్లను తాకింది. 2020–21లో రూ. 793 కోట్లు మాత్రమే ఆర్జించింది. -
అదానీ పోర్ట్స్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతం క్షీణించి రూ. 1,033 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,321 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,072 కోట్ల నుంచి రూ. 4,418 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 2,527 కోట్ల నుంచి రూ. 3,309 కోట్లకు పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 5 చొప్పున డివిడెండు ప్రకటించింది. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 5 శాతం క్షీణించి రూ. 4,795 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 5,049 కోట్లు ఆర్జించింది. మొత్తం టర్నోవర్ 27 శాతం జంప్‌చేసి రూ. 15,934 కోట్లకు చేరింది. గంగవరం పోర్టును మినహాయించిన ఫలితాలివి. కాగా.. కార్గో పరిమాణం 312 ఎంఎంటీను తాకినట్లు కంపెనీ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. ఒక్క ముంద్రా పోర్ట్‌లోనే 150 ఎంఎంటీ కార్గోను చేపట్టినట్లు తెలియజేశారు. దేశీయంగా ఏ ఇతర పోర్టులోనూ ఈ స్థాయి కార్గో నమోదుకాలేదని వెల్లడించారు. లాజిస్టిక్స్ స్పీడ్ అనుబంధ సంస్థ అదానీ లాజిస్టిక్స్ 29 శాతం అధికంగా 4,03,737 టీఈయూ రైల్ కార్గోను సాధించినట్లు అదానీ పోర్ట్స్ పేర్కొంది. గతేడాది రూ. 11,400 కోట్ల పెట్టుబడులను చేపట్టినట్లు ప్రస్తావించింది. ముంబై, ఇండోర్, పలావ్ల్, రనోలీ, విరోచన్‌నగర్‌లలో నిర్మిస్తున్న వేర్‌హౌసింగ్‌ల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) జనవరి–మార్చికల్లా మొత్తం 4 మిలియన్ చదరపు అడుగులు అందుబాటులోకి రానున్నట్లు వివరించింది. ఫలితాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు 5.6 శాతం పతనమై రూ. 710 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్, క్యూ4లో రూ.916 కోట్లు!
ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ.916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ.1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ.7,245 కోట్ల నుంచి రూ.8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ.8,644 కోట్ల నుంచి రూ.7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
ఉత్తమ్ గాల్వాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్స్ కంపెనీ ఉత్తమ్ గాల్వా స్టీల్స్ గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర నష్టం భారీగా తగ్గి రూ. 26 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇ దే కాలంలో రూ. 68 కోట్ల నికర నష్టం నమోదైంది. క్యూ4లో కోల్డ్ రోల్డ్, గాల్వనైజ్డ్ స్టీల్ తయారీకి కంపెనీ ఆదాయం సైతం రూ. 197 కోట్ల నుంచి రూ. 252 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు రూ. 264 కోట్ల నుంచి రూ. 278 కోట్లకు పెరిగాయి. -
లాభాల్లోకి బీహెచ్ఈఎల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్) గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 916 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,036 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 0.40 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం సైతం రూ. 7,245 కోట్ల నుంచి రూ. 8,182 కోట్లకు బలపడింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 8,644 కోట్ల నుంచి రూ. 7,091 కోట్లకు వెనకడుగు వేశాయి. కోవిడ్–19 ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులను కల్పించినట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు తెలియజేసింది. -
అశోక్ లేలాండ్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 377 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,142 కోట్ల నుంచి రూ. 9,927 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,831 కోట్ల నుంచి రూ. 9,430 కోట్లకు పెరిగాయి. ముడివ్యయాలు రూ. 1,100 కోట్లమేర పెరిగి రూ. 6,581 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు రూ. 267 కోట్ల అనుకోని నష్టం నమోదైనట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండు ప్రకటించింది. -
డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 87 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) లాభం 76 శాతం క్షీణించి రూ. 87.5 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఇదే వ్యవధిలో లాభం రూ. 362 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 4,728 కోట్ల నుంచి రూ. 5,437 కోట్లకు పెరిగింది. కొన్ని ఉత్పత్తులు (పీపీసీ–06), అసెట్ల (ష్రెవిపోర్ట్ ప్లాంట్) విలువను దాదాపు రూ. 760 కోట్ల మేర తగ్గించాల్సి రావడం వల్ల ఆ మేరకు లాభాలపై ప్రతికూల ప్రభావం పడింది. కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి వార్షిక ప్రాతిపదికన దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసినట్లు గురువారమిక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. ఇతరత్రా పలు సవాళ్లు ఉన్నప్పటికీ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, ఉత్పాదకతను మెరుగుపర్చుకోవడం వంటి అంశాల ఊతంతో తమ ప్రధాన వ్యాపార విభాగం మెరుగైన పనితీరు కనపర్చగలిగిందని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల ప్రభావమేమీ వ్యాపారంపై లేదని, ఇప్పటివరకూ చెల్లింపులపరమైన సమస్యలేమీ తలెత్తలేదని వివరించారు. సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాను యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఇచ్చేలా అనుమతుల కోసం జూన్ ఆఖరు లేదా జూలై తొలినాళ్లలో దరఖాస్తు చేసుకోనున్నట్లు డీఆర్ఎల్ సీఈవో (పీఎస్‌ఏఐ విభాగం) దీపక్ సప్రా తెలిపారు. ప్రస్తుతానికి 12–17 ఏళ్ల బాలల కోసం ఉద్దేశించిన స్పుత్నిక్–ఎం టీకాను పక్కన ఉంచామని, స్పుత్నిక్ లైట్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. స్పుత్నిక్ టీకాల ధరల పునఃసమీక్షపై కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లు 36 శాతం అప్.. నాలుగో త్రైమాసికంలో రష్యా సహా వర్ధమాన దేశాల మార్కెట్ల నుంచి ఆదాయం 36 శాతం పెరిగి రూ. 1,201 కోట్లకు ఎగిసింది. భారత్‌లో ఆదాయం 15 శాతం పెరిగి రూ. 969 కోట్లకు చేరింది. మరోవైపు, ధరలు పడిపోవడం, అమ్మకాల పరిమాణం తగ్గడం అంశాల కారణంగా ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం అయిదు శాతం క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 21,439 కోట్ల ఆదాయంపై రూ. 2,357 కోట్ల లాభం నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ. 5 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 30 డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది. గురువారం ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు సుమారు ఒక్క శాతం పెరిగి రూ. 3,942కి చేరింది. -
వొడాఫోన్ ఐడియాకు తగ్గిన నష్టాలు
న్యూఢిల్లీ: గతేడాది (2021–22) చివరి క్వార్టర్లో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా నికర నష్టం తగ్గి రూ. 6,563 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 7,023 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం 7% పుంజుకుని రూ. 10,239 కోట్లను అధిగమించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి వొడాఫోన్ ఐడియా నష్టాలు భారీగా తగ్గి రూ. 28,245 కోట్లకు పరిమితమయ్యాయి. 2020–21లో రూ. 44,233 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. 2021 నవంబర్ 5నుంచి టారిఫ్‌ల పెంపును చేపట్టడంతో త్రైమాసికవారీగా ఆదాయం 5.4 శాతం బలపడినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) 7.5% వృద్ధితో రూ. 124ను తాకినట్లు వెల్లడించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 115 ఏఆర్పీయూ సాధించింది. అయితే ఇదే సమయంలో వినియోగదారుల సంఖ్య 24.72 కోట్ల నుంచి 24.38 కోట్లకు తగ్గింది. మార్చికల్లా వడ్డీతో కలిపి గ్రూప్ రుణ భారం రూ. 1,97,878 కోట్లను తాకింది. చదవండి: నోకియా పోరాటం.. అదరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్‌ఫోన్.. -
రిలయన్స్ రికార్డులు..తొలి కంపెనీగా..
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో నికర లాభం 22 శాతంపైగా ఎగసి రూ. 16,203 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 13,227 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 2.32 లక్ష కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 8 డివిడెండ్ ప్రకటించింది. వివిధ బిజినెస్‌లలో 2.1 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించింది. పూర్తి ఏడాదికి... మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ రూ. 67,705 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7.92 లక్షల కోట్ల(102 బిలియన్ డాలర్లు)కు చేరింది. వెరసి తొలిసారి 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందుకున్న దేశీ కంపెనీగా చరిత్ర సృష్టించింది. కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలను సైతం సాధించింది. విభాగాల వారీగా చూస్తే ఆయిల్ టు కెమికల్ బిజినెస్(ఓటూసీ) 44% వృద్ధితో రూ. 1.45 లక్షల కోట్లకు చేరింది. నిర్వహణ లాభం 28 శాతం బలపడి రూ. 33,968 కోట్లను తాకింది. ఇక రిటైల్ విభాగం టర్నోవర్ 27% పెరిగి రూ. 1,99,704 కోట్లయ్యింది. పన్నుకు ముందు లాభం 26% పుంజుకుని రూ. 12,381 కోట్లకు చేరింది. క్యూ4లో ఓటూసీ విభాగం 25 శాతం అధికంగా రూ. 14,241 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. రిలయన్స్ జియో లాభం జూమ్ రిలయన్స్ జియో స్టాండెలోన్ నికర లాభం గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 24 శాతం ఎగసి రూ. 4,313 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 3,360 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 20 శాతం వృద్ధితో రూ. 20,901 కోట్లకు చేరింది. 21 శాతం అధికంగా రూ. 167.6 ఏఆర్పీయూ సాధించింది. అయితే సిమ్ కన్సాలిడేషన్ కారణంగా కస్టమర్ బేస్ 10.9 మిలియన్లు తగ్గింది. నికరంగా 410.2 మిలియన్లకు చేరింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర లాభం 23 శాతం పెరిగి రూ. 14,854 కోట్లను తాకింది. సవాళ్లలోనూ జోరు కరోనా సవాళ్లు, భౌగోళిక రాజకీయ అస్థిరతల నేపథ్యంలోనూ గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పటిష్ట పనితీరును ప్రదర్శించింది. డిజిటల్ సర్వీసులు, రిటైల్ విభాగాల్లో ఆకర్షణీయ ఫలితాలు సాధించామని చెప్పడానికి ఆనందిస్తున్నాను. ఇంధన మార్కెట్లలో నమోదైన ఆటుపోట్లను తట్టుకోవడం ద్వారా ఓటూసీ బిజినెస్ నిలకడను చూపింది. అంతేకాకుండా ప్రస్తావించదగ్గ రికవరీని సాధించింది. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
క్యూ4 ఫలితాలు విడుదల, లాభాల్లో టాటా స్టీల్!
న్యూఢిల్లీ: టాటా స్టీల్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) మార్చితో అంతమైన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం వృద్ధి చెందిన రూ.9,835 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం వరకు పెరిగి రూ.69,616 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2020–21) చివరి త్రైమాసికంలో లాభం రూ.7,162 కోట్లు, ఆదాయం రూ.50,300 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు సైతం రూ.40,103 కోట్ల నుంచి రూ.57,636 కోట్లకు ఎగిశాయి. కరోనా, భౌగోళిక ఉద్రిక్తతల వాతావరణంలోనూ టాటా స్టీల్ బలమైన పనితీరు చూపించినట్టు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కస్టమర్లతో సంబంధాలు, పంపిణీ నెట్‌వర్క్‌పై దృష్టి సారించడంతో భారత్‌లో వ్యాపారం అన్ని రకాలుగా వృద్ధిని చూసినట్టు తెలిపారు. యూరోప్ వ్యాపారం కూడా బలమైన పనితీరునే ప్రదర్శించినట్టు చెప్పారు. భారత వ్యాపారం ఎబిట్డా రూ.28,863 కోట్లుగా ఉంటే, యూరోప్ వ్యాపారం ఎబిట్డా రూ.12,164 కోట్లుగా ఉందని టాటా స్టీల్ ఈడీ, సీఎఫ్‌వో కౌషిక్ ఛటర్జీ వెల్లడించారు. ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో రూ.51 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. అలాగే, రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా విభజించాలని నిర్ణయించింది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం జూమ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల రంగ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం హైజంప్ చేసి రూ. 3,593 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,102 కోట్లు ఆర్జించింది. ఇందుకు వివిధ విభాగాలు, సర్వీసులకు నెలకొన్న భారీ డిమాండ్ సహకరించినట్లు కంపెనీ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.4 శాతం అధికంకాగా.. వార్షికంగా మొత్తం ఆదాయం 15 శాతం ఎగసి రూ. 22,957 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది క్యూ4లో రూ. 575 కోట్లు వన్‌టైమ్ బోనస్, రూ. 1,222 కోట్లమేర వాయిదాపడిన పన్ను చెల్లింపులు ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రస్తావించింది. వీటిని పరిగణిస్తే ప్రస్తుత సమీక్షా కాలంలో నికర లాభం 24 శాతం పుంజుకున్నట్లు తెలియజేసింది. ఇతర హైలైట్స్ ► స్థిర కరెన్సీ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) ఆదాయంలో 12–14 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ► వాటాదారులకు షేరుకి రూ. 18 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ► గతేడాది 40,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. సిబ్బంది సంఖ్య 2,08,877కు చేరింది. ► క్యూ4లో నికరంగా 11,100 మందికి ఉపాధిని కల్పించింది. ► మార్చికల్లా ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 21.9 శాతంగా నమోదు. ► క్యూ4లో 226 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను కుదుర్చుకుంది. ► పూర్తి ఏడాదికి నికర లాభం 11,145 కోట్ల నుంచి రూ. 13,499 కోట్లకు ఎగసింది. ► 2021–22లో మొత్తం ఆదాయం రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85,651 కోట్లకు పెరిగింది. ప్రోత్సాహకరంగా.. మార్కెట్ వాతావరణం అత్యంత ప్రోత్సాహకరంగా ఉంది. వివిధ విభాగాలు, సర్వీసులకు పటిష్ట డిమాండ్ కనిపిస్తోంది. వెరసి సర్వీసుల బిజినెస్‌లో మరోసారి అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయంలో 17.5% వృద్ధిని అందుకున్నాం. – సి.విజయ్ కుమార్, సీఈవో, ఎండీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్. ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్ టెక్ షేరు 1.2% బలపడి రూ. 1,102 వద్ద ముగిసింది. -
లాభాల్లో టాటా ఎలక్సీ జోరు..ఇన్వెస్టర్లకు భారీ నజరానా..!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ టెక్నాలజీ సర్వీసుల కంపెనీ టాటా ఎలక్సీ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 39 శాతం జంప్‌చేసి రూ. 160 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 115 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 31 శాతంపైగా ఎగసి రూ. 682 కోట్లకు చేరింది. గతేడాదికిగాను వాటాదారులకు షేరుకి రూ. 42.5 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 49 శాతం పురోగమించి రూ. 550 కోట్లయ్యింది. 2020–21లో కేవలం రూ. 368 కోట్ల లాభం ఆర్జించింది. ఇక మొత్తం ఆదాయం 35 శాతం వృద్ధితో రూ. 2,471 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది రూ. 1,826 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. ఫలితాల నేపథ్యంలో టాటా ఎలక్సీ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2 శాతం బలపడి రూ. 7,830 వద్ద ముగిసింది. -
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం ఓకే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 340 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 329 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్‌చేసి రూ. 892 కోట్లకు చేరింది. క్లయింట్ బేస్ 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. క్యూ4లో ఆల్‌రౌండ్ పనితీరు చూపినందుకు సంతోషిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎండీ, సీఈవో విజయ్ చందోక్ పేర్కొన్నారు. అన్ని బిజినెస్ విభాగాల్లోనూ వృద్ధి సాధించామని, ఇది మా సామర్థ్యాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం జంప్‌చేసి రూ. 3,438 కోట్లయ్యింది. -
అంచనాలకు మించి..! దుమ్మురేపిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్...! ఏకంగా...
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరానికి గాను నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. అంచనాలకు మించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆదరగొట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర లాభాలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 22.8 శాతం మేర నికర లాభాలను రికార్డు చేసింది.ఈ సంవత్సరం జనవరి-ఫిబ్రవరి-మార్చ్ మధ్యకాలానికి 10,055.2 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే నికర లాభాలు మెరుగుపడ్డాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ 8,186.5 కోట్లను నమోదు చేసింది. ఈ ఏడాదిలో నాలుగో త్రైమాసికంలో రూ. 10,055.2 కోట్ల లాభాలనుపొందింది. గత ఆర్థిక సంవత్సరం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నికర ఆదాయం 36,961.3 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. 18.8 శాతం అధికంగా లాభాలను పొందింది.. చివరి త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపించింది. ఇక చివరి త్రైమాసికంలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 563 బ్రాంచీలతో..7,167 మందికి ఉద్యోగావకాశాలను అందించింది. -
దుమ్మురేపిన టీసీఎస్...! తొలిసారి రికార్డు స్థాయిలో..!
ముంబై: సాఫ్ట్వేర్ సేవల టాప్ ర్యాంకు దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మరోసారి ఆర్థిక ఫలితాలలో యస్ అనిపించింది. గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో తొలిసారి ఆదాయం రూ. 50,000 కోట్ల మైలురాయిని దాటింది. వెరసి క్యూ4(జనవరి–మార్చి)లో ఆదాయం 15.8 శాతం జంప్‌చేసి రూ. 50,591 కోట్లకు చేరింది. ఇక నికర లాభం 7.4 శాతం వార్షిక వృద్ధితో రూ. 9,926 కోట్లను తాకింది. అయితే మార్జిన్లు 1.8 శాతం నీరసించి 25.3 శాతానికి పరిమితమైనట్లు కంపెనీ వెల్లడించింది. లేదంటే ఒక త్రైమాసికంలో నికర లాభం రూ. 10,000 కోట్ల మార్క్‌ను అందుకునేదని తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. 25 బిలియన్ డాలర్లు మార్చితో ముగిసిన గతేడాదిలో టీసీఎస్ తొలిసారి 25.7 బిలియన్ డాలర్ల(రూ. 1,91,754 కోట్లు) టర్నోవర్ సాధించింది. ఇది 16.8 శాతం అధికంకాగా.. నికర లాభం 14.8 శాతం ఎగసి రూ. 38,327 కోట్లకు చేరింది. ఆర్డర్‌బుక్ విలువ కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయికి చేరినట్లు టీసీఎస్ వెల్లడించింది. 46 దేశాలలో కార్యకలాపాలు విస్తరించిన కంపెనీ ఉద్యోగుల సంఖ్య 5,92,000కు అధిగమించినట్లు తెలియజేసింది. అయితే ఉద్యోగ వలస(అట్రిషన్ రేటు) అత్యధికంగా 17.4 శాతానికి చేరినట్లు తెలియజేసింది. సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలోనే అత్యధికంగా 25.3 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. నికరలాభ మార్జిన్లు 19.6 శాతంగా నమోదైనట్లు తెలియజేసింది. నాలుగో బైబ్యాక్ సవాళ్లను అధిగమిస్తూ మరోసారి పరిశ్రమలోనే చెప్పుకోదగ్గ నిర్వహణ లాభాలు ఆర్జించినట్లు కంపెనీ సీఎఫ్‌వో సమీర్ శేక్సారియా పేర్కొన్నారు. గత ఐదేళ్లలో నాలుగోసారి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు తెలియజేశారు. క్యూ4లో రిటైల్, సీపీజీ విభాగం 22.1 శాతం, తయారీ 19 శాతం, కమ్యూనికేషన్స్, మీడియా 18.7 శాతం, టెక్నాలజీ సర్వీసులు 18 శాతం, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ 16.4 శాతం, బీఎఫ్ఎస్ఐ 12.9 శాతం చొప్పున వృద్ధి సాధించినట్లు వివరించారు. ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా 18.7 శాతం, ఇంగ్లండ్ 13 శాతం, కాంటినెంటల్ యూరోప్ 10 శాతం, లాటిన్ అమెరికా 20.6 శాతం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా 7.3 శాతం, భారత్ 7 శాతం, ఆసియా పసిఫిక్ 5.5 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేశారు. ఇతర హైలైట్స్ ► క్యూ4లో జత కలసిన 10 కోట్ల డాలర్లకుపైగా విలువైన 10 కొత్త క్లయింట్లు. ► 5 కోట్ల డాలర్లకుపైగా విలువైన 19 కస్టమర్లు కంపెనీ చెంతకు. ► 2 కోట్ల డాలర్ల క్లయింట్లు 40, కోటి డాలర్ల కస్టమర్లు 52 చేరిక. ► క్యూ4లో నికరంగా 35,209 మందికి ఉపాధి. ► ఏడాదిలో నికరంగా 1,03,546 మందికి ఉద్యోగాలు. ప్రైవేట్ రంగంలో రికార్డ్. ► మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,92,195కాగా.. 35.6 శాతం మంది మహిళలే. ► కంపెనీ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 39,181 కోట్లుకాగా.. రూ. 31,424 కోట్లను షేర్ల బైబ్యాక్, డివిడెండ్ల ద్వారా వాటాదారులకు చెల్లించింది. ► ఈ ఏడాది(2022–23)లో 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పిస్తామన్న సీవోవో ఎన్జీ సుబ్రమణ్యం. గతేడాది సైతం ఇదే స్థాయిలో లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ లక్ష మందికిపైగా ఉద్యోగాలిచ్చినట్లు తెలియజేశారు. రికార్డ్ ఆర్డర్లు క్యూ4లో అత్యధికంగా 3.533 బిలియన్ డాలర్ల ఇంక్రిమెంటల్ రెవెన్యూ అదనంగా జత కలసింది. 11.3 బిలియన్ డాలర్లతో ఆల్‌టైమ్ గరిష్టానికి ఆర్డర్‌బుక్ చేరింది. పూర్తి ఏడాదికి 34.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను కలిగి ఉన్నాం. కస్టమర్ల వృద్ధికి, ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సహకరించడం ద్వారా 15 శాతం వృద్ధితో గతేడాదిని పటిష్టంగా ముగించాం. కంపెనీ చరిత్రలోనే రికార్డు ఆర్డర్ బుక్‌ను సాధించడంతో భవిష్యత్‌లోనూ పురోగతి బాటలో కొనసాగనున్నాం. కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు వెచ్చిస్తున్నాం. – రాజేష్ గోపీనాథన్, సీఈవో, ఎండీ, టీసీఎస్. కంపెనీ మార్కెట్లు ముగిశాక ఫలితాలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం బలపడి రూ. 3,699 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 3,712–3,656 మధ్య ఊగిసలాడింది. చదవండి: వారానికి నాలుగు రోజుల పని...! చేసేందుకు సిద్దమంటోన్న ఉద్యోగులు..! కంపెనీల నిర్ణయం ఇలా..! -
ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్ కొరత వేధిస్తున్నా..ఎలన్ మస్క్ మాత్రం టెస్లాకార్ల అమ్మకాల జోరును పెంచుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ 4వ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. క్యూ4 (అక్టోబర్,నవంబర్,డిసెంబర్)లో వరల్డ్ వైడ్‌గా 308,600 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో టెస్లా వన్ ట్రిలియన్ మార్కెట్ వ్యాల్యూ కంపెనీల జాబితాలో చేరింది ఊహించిన దానికంటే ఎక్కువే 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్‌బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్‌లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. చెప్పిందే చేస్తున్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ మల్టీ ఇయర్ పిరియడ్ (రెండు లేదా మూడు సంవత్సరాలు)మొత్తం కాలంలో కార్ల డెలివరీ 50 శాతం వార్షిక పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ వైడ్‌గా సెమీకండక్టర్ తిరోగమనం మధ్య వరుసగా ఏడవ త్రైమాసికంలో టెస్లాకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఎలన్ మస్క్ ప్రతి త్రైమాసికంలో టెస్లా కార్ల డెలివరీలను పెంచుతూనే ఉన్నప్పటికీ, 2021లో సప్లయ్ చైన్ అంశాన్ని ఓ పీడకలగా అభివర్ణించారు. ఇక ఇతర ప్రయోజనాల కోసం చిప్‌లను ఉపయోగించేలా సాఫ్ట్వేర్లను తయారు చేయడంలో టెస్లా ఇంజినీర్లు ప్రయత్నాలు చేయడంతో ఇతర వాహన తయారీదారుల కంటే టెస్లా కంపెనీ మెరుగైన ఫలితాల్ని రాబడుతోంది. టెస్లాకు తిరుగులేదని టెస్లా కార్లలో ఆటో పైలెట్ ఫీచర్‌పై వివాదాలు, రియర్ వ్యూ కెమెరా, ట్రంక్‌లో సాంకేతిక లోపాలు, టెస్లా కారు రిపేర్‌కి లక్షల ఖర్చు అవుతుందని ఆ కారు ఆనవాళ్లు లేకుండా 30 కేజీల డైనమెట్తో బ్లాస్ట్ చేశారని వార్తలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పతాక స్థాయిలో టెస్లా వైఫల్యం గురించి కథనాల్ని ప్రచురించినా ఆ కార్ల హవా తగ్గడం లేదు సరికాదా రోజు రోజుకీ ఆ కార్ల అమ్మకాలు పెరగడంతో ఎలక్ట్రిక్ కార్లలో టెస్లాకు తిరుగులేదని ఎలన్ మస్క్ మరోసారి నిరూపించినట్లైంది. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
ఎన్టీపీసీ లాభం హైజంప్..!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం ఎన్టీపీసీ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసింది. రూ. 4,649 కోట్లకుపైగా ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,630 కోట్లు మాత్రమే సాధించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 31,330 కోట్ల నుంచి రూ. 31,687 కోట్లకు నామమాత్రంగా పుంజుకుంది. వాటాదారులకు షేరుకి రూ. 3.15 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ఫిబ్రవరిలో రూ. 3 మధ్యంతర డివిడెండును చెల్లించిన సంగతి తెలిసిందే. క్యూ4లో స్థూల విద్యుదుత్పత్తి 68.27 బిలియన్ యూనిట్ల నుంచి 77.63 బి.యూకి పెరిగింది. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 11,192 కోట్ల నుంచి రూ. 14,969 కోట్లకు జంప్‌చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,12,373 కోట్ల నుంచి రూ. 1,15,547 కోట్లకు ఎగసింది. రుణాల ద్వారా నిధుల సమీకరణ పరిమితిని బోర్డు రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.25 లక్షల కోట్లకు పెంచింది. గతేడాది విద్యుదుత్పత్తి 259.61 బిలియన్ యూనిట్ల నుంచి 270.9 బీయూకి పెరిగింది. మొత్తం గ్రూప్ కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 314.07 బీయూని సాధించినట్లు కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది. 2019–20లో ఇది 290.19 బీయూ మాత్రమేనని తెలియజేసింది. కాగా.. క్యూ4లో బొగ్గు ఉత్పత్తి 2.6 మిలియన్ టన్నుల నుంచి 3.7 ఎంటీకి పుంజుకుంది. పూర్తి ఏడాదికి మాత్రం 9.63 ఎంటీ నుంచి 9.46 ఎంటీకి తగ్గింది. క్యూ4లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) 69.52 శాతం నుంచి 77.12 శాతానికి మెరుగుపడింది. పూర్తి ఏడాదికి 68 శాతం నుంచి 66 శాతానికి నీరసించింది. సగటు విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ. 3.9 నుంచి రూ. 3.77కు తగ్గింది. చదవండి: 5జీ నెట్వర్క్: ఎయిర్టెల్ కీలక నిర్ణయం..! -
డివిడెండ్ ప్రకటించిన ఎంఆర్ఎఫ్
న్యూఢిల్లీ: టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ గతేడాది(2020–21) నాలుగో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 51 శాతం పడిపోయింది. రూ. 332 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 679 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,685 కోట్ల నుంచి రూ. 4,816 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 94 చొప్పున తుది డివిడెండును ప్రకటించింది. ప్రత్యేక డివిడెండ్సహా దీంతో కలిపి గతేడాది మొత్తం రూ. 150 డివిడెండ్ చెల్లించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఎంఆర్ఎఫ్ రూ. 1,277 కోట్ల నికర లాభం సాధించింది. 2019–20లో రూ. 1,423 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 16,239 కోట్ల నుంచి స్వల్ప వెనకడుగుతో రూ. 16,163 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఎంఆర్ఎఫ్ షేరు ఎన్ఎస్ఈలో 3% పతనమై రూ. 82,310 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ గతేడాది(2020–21) చివరి త్రైమాసికంలో నష్టాలు తగ్గించుకుంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో రూ. 7,585 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది (2019–20) ఇదే కాలంలో రూ. 9,864 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 63,057 కోట్ల నుంచి రూ. 89,319 కోట్లకు ఎగసింది. ఇదే కాలంలో యూకే అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) 95.2 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు నష్టం(రూ. 9,600 కోట్లు) ప్రకటించింది. ఇందుకు 1.5 బిలియన్ పౌండ్ల(రూ. 14,994 కోట్లు) అనూహ్య చార్జీలు కారణమయ్యాయి. వీటిలో పెట్టుబడులపై నగదేతర రైటాఫ్‌లు, పునర్వ్యవస్థీకరణ చార్జీలు కలసి ఉన్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. తద్వారా జేఎల్ఆర్కు సంబంధించి కొత్త గ్లోబల్ వ్యూహాలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఆధునిక లగ్జరీ డిజైన్లు, డెలివరీ తదితరాల రీఇమేజిన్కు తెరతీసినట్లు తెలియజేసింది. దీంతో 2025–26కల్లా రెండంకెల ఇబిట్ మార్జిన్లు సాధించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. స్టాండెలోన్ ఇలా క్యూ4లో జేఎల్ఆర్ ఆదాయం 20 శాతంపైగా ఎగసి 6.5 బిలియన్ పౌండ్లను తాకింది. రిటైల్ అమ్మకాలు 12 శాతం పుంజుకుని 1,23,483 యూనిట్లకు చేరాయి. ఇక స్టాండెలోన్ ప్రాతిపదికన టాటా మోటార్స్ క్యూ4లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. దాదాపు రూ. 1,646 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ4లో రూ. 4,871 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 10,002 కోట్ల నుంచి రూ. 20,306 కోట్లకు జంప్‌చేసింది. ఎగుమతులుసహా మొత్తం వాహన విక్రయాలు 90 శాతం దూసుకెళ్లి 1,95,859 యూనిట్లకు చేరాయి. పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి జేఎల్ఆర్ మొత్తం ఆదాయం 19.7 బిలియన్ పౌండ్లను తాకింది. వాహన అమ్మకాలు దాదాపు 14 శాతం క్షీణించి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇక గతేడాదిలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 13,395 కోట్ల నికర నష్టం ప్రకటించింది. 2019–20లో రూ. 11,975 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 2,64,041 కోట్ల నుంచి రూ. 2,52,438 కోట్లకు వెనకడుగు వేసింది. క్యూ1 వీక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో పటిష్ట డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల సమస్యకానున్నాయి. కోవిడ్–19 సెకండ్‌వేవ్ లాక్డౌన్, కమోడిటీల పెరుగుదలతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత ఆటో పరిశ్రమను దెబ్బతీసే వీలున్నట్లు టాటా మోటార్స్ పేర్కొంది. అయితే 2021–22 రెండో త్రైమాసికం నుంచీ పటిష్ట రికవరీ కనిపించగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. రానున్న ఐదేళ్లలో జేఎల్ఆర్ బిజినెస్‌పై 2.53 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలియజేశారు. దేశీయంగా రూ. 3,000–3,500 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. టాటా మోటార్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.4% జంప్‌చేసి రూ. 332 వద్ద ముగిసింది.ఇంట్రాడేలో రూ. 337 వరకూ బలపడింది. సవాళ్లు ఎదురైనప్పటికీ నిలదొక్కుకున్నాం.. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ గతేడాది కంపెనీ నిలదొక్కుకోవడంతోపాటు పటిష్ట రికవరీని సాధించింది. మహమ్మారి నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. బ్రిటిష్ ఐకానిక్ బ్రాండ్లతో కూడిన భవిష్యత్ లగ్జరీ డిజైన్ల ద్వారా అమలు చేస్తున్న రీఇమేజిన్ వ్యూహాలు ఇందుకు దోహదపడుతున్నాయి. – థియరీ బోలోర్, జేఎల్ఆర్ సీఈవో సరఫరాల సమస్యను అధిగమిస్తున్నాం.. కోవిడ్–19 కారణంగా గతేడాది ఆటో పరిశ్రమ భారీగా ప్రభావితమైంది. అయినప్పటికీ వాహనాలకు నిలకడైన వృద్ధి కనిపించింది. లాక్డౌన్లు తొలగిపోవడం, డిమాండ్ పుంజుకోవడం, ఆర్థిక రికవరీ వంటి అంశాలు ఇందుకు సహకరించాయి. సరఫరా సమస్యలను అధిగమిస్తూ సామర్థ్యాన్ని పెంచుకున్నాం. ఇదే సమయంలో ఉద్యోగులు, సహచర సిబ్బంది ఆరోగ్యం, రక్షణ తదితరాలకు ప్రాధాన్యమిచ్చాం. – గాంటర్ బుషక్, టాటా మోటార్స్ సీఈవో -
ఎన్బీసీసీ- ఎస్‌హెచ్ కేల్కర్- పిపావవ్ అప్
మార్కెట్లు స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. అయితే విభిన్న వార్తల నేపథ్యంలో ఎస్‌హెచ్ కేల్కర్, గుజరాత్ పిపావవ్ పోర్ట్, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ మూడు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. గుజరాత్ పిపావవ్ పోర్ట్ విదేశీ సంస్థ జేపీ మోర్గాన్ ఫండ్స్ కంపెనీలో వాటా కొనుగోలు చేసిన వార్తలతో పోర్ట్ హ్యాండ్లింగ్, మెరైన్ సర్వీసుల కంపెనీ గుజరాత్ పిపావవ్ పోర్ట్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 8 శాతం జంప్ చేసి రూ. 85 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 90 వరకూ ఎగసింది. బ్లాక్ డీల్ ద్వారా గుజరాత్ పిపావవ్ పోర్ట్‌లో 0.63 శాతం వాటాను జేపీ మోర్గాన్ ఫండ్స్ కొనుగోలు చేసింది. 30.34 లక్షల షేర్ల కొనుగోలుకి రూ. 23.6 కోట్లను వెచ్చించింది. ఎస్‌హెచ్ కేల్కర్ వివిధ పరిమళ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఎస్‌హెచ్ కేల్కర్ తాజాగా జూన్ చివరికల్లా రుణ భారాన్ని రూ. 255 కోట్లకు పరిమితం చేసుకున్నట్లు తెలియజేసింది. అంతకుముందు 2020 మార్చికల్లా రుణ భారం రూ. 299 కోట్లకు తగ్గించుకున్నట్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎస్‌హెచ్ కేల్కర్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 7శాతం జంప్‌చేసి రూ. 71 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 73 వరకూ ఎగసింది. ఎన్బీసీసీ ఇండియా గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎన్బీసీసీ ఇండియా షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎన్బీసీసీ షేరు దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 27 వద్ద ట్రేడవుతోంది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4(జనవరి-మార్చి)లో ఎన్బీసీసీ ఇండియా నికర లాభం 68 శాతం క్షీణించింది. రూ. 48.5 కోట్లకు పరిమితమైంది. నికర అమ్మకాలు సైతం 33 శాతం తక్కువగా రూ. 1570 కోట్లకు చేరాయి. -
ఐవోఎల్ దూకుడు- బీవోఐ జారుడు
గత మూడు నెలలుగా ర్యాలీ బాటలో సాగుతున్న హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఐవోఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్..గత 8 రోజులుగా మరింత జోరందుకుంది. ప్రమోటర్ గ్రూప్ సంస్థకు షేర్ల కేటాయించిన తదుపరి ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో గత 8 సెషన్లలో 32 శాతం ఎగసింది. ఈ బాటలో ఆటుపోట్ల మార్కెట్లోనూ ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో తాజాగా సరికొత్త గరిష్టాన్ని తాకింది. తొలుత ఎన్ఎస్ఈలో ఐవోఎల్ కెమికల్స్ షేరు దాదాపు 10 శాతం దూసుకెళ్లి రూ. 474కు చేరువైంది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 8 శాతం వృద్ధితో రూ. 468 వద్ద ట్రేడవుతోంది. గత 3 రోజుల్లోనే ఈ కౌంటర్ 20 శాతం లాభపడటం గమనార్హం. ఈ నెల 17న ప్రమోటర్ సంస్థ ఎన్సీవీఐ ఎంటర్‌ప్రైజెస్‌కు షేరుకి రూ. 205 ధరలో 7.18 లక్షల షేర్లను కంపెనీ కేటాయించింది. వీటికి మూడేళ్ల లాకిన్ అమలుకానుంది. యాంటీడయాబెటిస్, కొలెస్ట్రాల్, యాంటీకన్వల్సెంట్స్ తదితర తయారీ ఐవోఎల్ కెమ్ గత నెలలో వాణిజ్య శాఖ నుంచి త్రీస్టార్ ఎక్స్పోర్ట్ హౌస్‌ను పొందింది. ఈ షేరు గత మూడు నెలల్లో 180 శాతం దూసుకెళ్లడం విశేషం! బ్యాంక్ ఆఫ్ ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో పీఎస్‌యూ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 3571 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 252 కోట్ల నికర లాభం ఆర్జించింది. తాజా క్వార్టర్లో అధిక ప్రొవిజన్లు, పన్నుల రైట్‌బ్యాక్ లాభాలను దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 6 శాతం క్షీణించి రూ. 3793 కోట్లకు పరిమితంకాగా.. నికర వడ్డీ మార్జిన్లు 2.9 శాతంగా నమోదయ్యాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రెట్టింపై రూ. 8142 కోట్లను తాకాయి. ఆరు ఎన్పీఏ ఖాతాలకుగాను అదనంగా రూ. 3941 కోట్లను కేటాయించినట్లు బ్యాంక్ తెలియజేసింది. ఈ నేపథ్యంలో బీవోఐ షేరు ఎన్ఎస్ఈలో 8.3 శాతం పతనమై రూ. 50.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 48 వరకూ బలహీనపడింది. -
జేఎంసీ- పేజ్.. భారీ లాభాల ఫేజ్‌లో..
వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్ మార్కెట్లు తొలుత హుషారుగా ప్రారంభమైనప్పటికీ తదుపరి వెనకడుగు వేస్తున్నాయి. డెరివేటివ్ సిరీస్ ముగియనున్న నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 86 పాయింట్లు నీరసించి 35,345కు చేరగా.. 26 పాయింట్లు తక్కువగా నిఫ్టీ 10,448 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ విభిన్న వార్తల కారణంగా జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్, మౌలిక సదుపాయాల సంస్థ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలత్ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. జేఎంసీ ప్రాజెక్ట్స్ ఇండియా దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి రూ. 938 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు నిర్మాణ రంగ కంపెనీ జేఎంసీ ప్రాజెక్ట్స్ తాజాగా వెల్లడించింది. వీటిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ. 841 కోట్ల విలువైన నీటి పారుదల ప్రాజెక్టులను సంపాదించగా.. బిల్డింగ్ నిర్మాణం కోసం దక్షిణాది నుంచి రూ. 97 కోట్ల విలువైన కాంట్రాక్టును పొందినట్లు పేర్కొంది. దీంతో ఈ కౌంటర్ తొలుత ఎన్ఎస్ఈలో 20 శాతం దూసుకెళ్లి రూ. 60 ను అధిగమించింది. ప్రస్తుతం 14 శాతం జంప్‌చేసి రూ. 58 వద్ద ట్రేడవుతోంది. గత 5 రోజుల సగటు 29,000 షేర్లతో పోలిస్తే తొలి రెండు గంటల్లోనే లక్ష షేర్లు ఈ కౌంటర్లో చేతులు మారాయి. గత మూడు నెలల్లో ఈ షేరు 65 శాతం ర్యాలీ చేయడం విశేషం! పేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గతేడాది(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ జాకీ బ్రాండ్ ఇన్నర్‌వేర్ తయారీ పేజ్ ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 9 శాతం దూసుకెళ్లి రూ. 20,929 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 21,194 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నికర లాభం 59 శాతం క్షీణించి రూ. 31 కోట్లకు పరిమితంకాగా.. ఆదాయం 11 శాతం వెనకడుగుతో రూ. 541 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు సైతం 9 శాతం పడిపోయి 10.7 శాతానికి చేరాయి. అయితే పూర్తిఏడాదికి కార్యకలాపాల ద్వారా 125 శాతం అధికంగా రూ. 517 కోట్ల క్యాష్‌ఫ్లోను సాధించింది. దీంతో 2020 మార్చికల్లా రుణరహిత కంపెనీగా ఆవిర్భవించడంతోపాటు... రూ. 117 కోట్ల నగదు నిల్వలను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
స్కిప్పర్ హైజంప్- మోర్పెన్ వీక్
వరుసగా మూడో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-520) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు విద్యుత్ రంగ టవర్ల తయారీ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. అయితే మరోపక్క గతేడాది క్యూ4(జనవరి-మార్చి) ఫలితాలు వెల్లడించిన హెల్త్‌కేర్ కంపెనీ మోర్పెన్ ల్యాబొరేటరీస్ కౌంటర్ ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వివరాలు చూద్దాం.. స్కిప్పర్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో విద్యుత్ టవర్లు, పీవీసీ పైపుల తయారీ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. నికర లాభం 58 శాతంపైగా జంప్‌చేసి రూ. 28 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 439 కోట్లకు చేరాయి. పూర్తిఏడాదికి(2019-20)నికర లాభం 32 శాతం ఎగసి రూ. 41 కోట్లను తాకింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్కిప్పర్ షేరు ఎన్ఎస్ఈలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనుగోలుదారులు అధికమై రూ. 47 వద్ద ఫ్రీజయ్యింది. మోర్పెన్ ల్యాబ్ ఫార్మా రంగ కంపెనీ మోర్పెన్ ల్యాబ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 5 శాతం పుంజుకుని రూ. 11 కోట్లను అధిగమించింది. అమ్మకాలు మాత్రం 5.5 శాతం క్షీణించి రూ. 207 కోట్లకు చేరాయి. పన్నుకు ముందు లాభం 6 శాతం బలపడి రూ. 11.4 కోట్లను తాకింది. అయితే నిర్వహణ లాభం 9 శాతం నీరసించి రూ. 21 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో మోర్పెన్ ల్యాబ్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం ఎగసి రూ. 31.4ను తాకింది. తదుపరి అమ్మేవాళ్లు అధికమై 4 శాతం పతనమైంది. ప్రస్తుతం రూ. 29 దిగువన ట్రేడవుతోంది. -
గ్లోబస్ స్పిరిట్స్ అప్- ష్నీడర్ ఎలక్ట్రిక్ డౌన్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఆల్కహాల్ బెవరేజెస్ కంపెనీ గ్లోబస్ స్పిరిట్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. అయితే మరోవైపు ఇదే కాలంలో నిరుత్సాహకర పనితీరు ప్రదర్శించడంతో విద్యుత్ రంగ ఆధునిక ప్రొడక్టుల కంపెనీ ష్నీడర్ ఎలక్ట్రిక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గ్లోబస్ స్పిరిట్స్ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. ష్నీడర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. గ్లోబస్ స్పిరిట్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గ్లోబస్ స్పిరిట్స్ నికర లాభం 285 శాతం దూసుకెళ్లి రూ. 19 కోట్లను అధిగమించింది. పన్నుకు ముందు లాభం సైతం 326 శాతం ఎగసి రూ. 22 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు మాత్రం యథాతథంగా రూ. 272 కోట్లుగా నమోదయ్యాయి. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్లోబస్ స్పిరిట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కొనేవాళ్లు అధికంకావడంతో రూ. 11 లాభపడి రూ. 119 వద్ద ఫ్రీజయ్యింది. ష్నీడర్ ఎలక్ట్రిక్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ష్నీడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా రూ. 27 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. పన్నుకు ముందు నష్టం రూ. 26 కోట్లుగా నమోదైంది. నికర అమ్మకాలు సైతం 20 శాతం నీరసించి రూ. 230 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ష్నీడర్ ఎలక్ట్రిక్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7.5 శాతం పతనమైంది. రూ. 83 దిగువన కదులుతోంది. తొలుత రూ. 80.5 వరకూ క్షీణించింది. -
కోవిద్ -19 సంక్షోభంలోనూ రాణించిన టాప్-10 కంపెనీలు ఇవే.!
కోవిద్-19 ఎఫెక్ట్ కారణంగా బీఎస్ఈ -500 కంపెనీల నికర లాభాలు, త్రైమాసిక ఆదాయాల క్షీణించుకుపోయాయి. అయితే బీఎస్ఈ -500 కంపెనీల్లో ఓ 10కంపెనీలు మాత్రం సంక్షోభాన్ని సమర్థవంతగా ఎదుర్కోని అమ్మకాల్లో 20-30శాతం వృద్ధిని, 4 రెట్ల వరకు నికరలాభాన్ని ఆర్జించగలిగాయి. రానున్న రోజుల్లోనూ ఈ టాప్ -10 కంపెనీల ఆదాయాలు పెరుగుదల, మార్కెట్ వాటా లాభాల తమ సహచర కంపెనీల కంటే మెరుగ్గా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక త్రైమాసికంలో రూ.500 కోట్ల మించి అమ్మకాలు జరిపిన కంపెనీలకు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీల గురించి తెలుసుకుందాం... 1. ట్రెంట్ లిమిటెడ్: రిటైల్ రంగంలో సేవలు అందిస్తుంది. ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ నికరలాభం 4రెట్లు పెరిగింది. ఈ క్యూ4లో కంపెనీ రూ.32.65 కోట్ల నికరలాభాన్ని సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్లో కంపెనీ నికర లాభం రూ. 8.13 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ అమ్మకాలు 20శాతం వృద్ధిని సాధించింది ‘‘ట్రెంట్ లిమిటెడ్‌కు కూడా తన సహచర కంపెనీలతో పాటు ట్రెంట్ లిమిటెడ్‌కు కూడా కోవిద్-19 సంక్షోభం తాకింది. ట్రెంట్‌కు ఉండే భారీ మూలధనం కారణంగా సంక్షోభం సమర్థవంతంగా ఎదుర్కోనే సత్తా తన సహచర కంపెనీలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్ వాటాను దక్కించుకునే అవకాశ ఉంది.’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో నికర నగదు కలిగి ఉండటం ట్రెంట్‌కు కలిసొచ్చే అంశమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. 2. యూపిఎల్: సస్య సంరక్షణ ఔషధాల తయారీలో అగ్రగామిగా వెలుగొందుతుంది. ఈ క్యూ4లో కంపెనీ నికర లాభం 2.61రెట్లు పెరిగింది. ఈ మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.761 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందు ఇదే ఏడాది కంపెనీ నికరలాభం కేవలం రూ.291కోట్లుగా ఉంది. అలాగే అమ్మకాలు గతేడాది క్యూ4లో రూ.8,525 కోట్లు నమోదయ్యాయి. ఈ క్యూ4 కాలానికి రూ.11,141 కోట్లకు చేరుకున్నాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నిర్మల్ బంగ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ యూపీఎల్ షేరుకు టార్గెట్ ధరను రూ.643గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ధరను షేరు ప్రస్తుత ధరకు 70శాతం అప్‌సైడ్‌లో ఉంది. మరో బ్రోకరేజ్ ఎంకే షేరు టార్గెట్ ధరను రూ.500గా నిర్ణయించింది. మార్కెట్లో వాటాను పెంచుకోవడం, మార్జిన్లను పెంచుకోవడం, అడ్జెటెడ్ నికర రుణ/ఎబిట్డాను ఆర్థిక సంవత్సరం 2022 నాటికి రెండు రెట్లు తగ్గింపు లక్ష్యంగా పెట్టుకోవడం లాంటి సానుకూలాంశంలో షేరు ఐదేళ్ల కనిష్ట వాల్యూయేషన్ల నుంచి తిరగి రీ-రేటింగ్ పొందుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. 3. లారస్ ల్యాబ్స్: హైదరాబాద్ ఆధారిత ఔషధ తయారీ కంపెనీ ఈ క్యూ4లో 100శాతం నికర లాభాన్ని ఆర్జించింది. గత మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.43.17 కోట్ల నికర లాభాన్ని సాధించగా, ఈ మార్చిలో 110.15 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అమ్మకాలు సైతం వార్షిక ప్రాతిపదికన 32శాతం వృద్ధి చెంది రూ.839 కోట్లకు చేరుకున్నాయి. ఫార్ములేషన్‌లో బలమైన ఆర్డర్ విజిబిలితో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే దూకుడును కొనసాగించాలని కంపెనీ ఆశిస్తోంది. కోవిద్-19 నివారణలో వినియోగించే హెడ్రాక్సిక్లోరిఫిన్ సరఫరాతో మరింత లాభపడే అవకాశం ఉంది.దీని ఫలితాలు జూన్ క్వార్టర్లో ప్రతిబింబిస్తాయని బీఓబీ క్యాపిటల్ మార్కెట్ తెలిపింది. షేరు టార్గెట్ ధరను రూ.510 నుంచి రూ.630కు పెంచినట్లు బ్రోకరేజ్ సంస్థ చెప్పుకొచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ సైతం షేరు టార్గెట్ ధరను రూ.520 నుంచి రూ.615కు పెంచింది. 4. అలెంబిక్ ఫార్మా: మార్చి త్రైమాసికంలో నికర లాభం 30 శాతం పెరిగింది. అమ్మకాలు 45శాతం వృద్ధిని సాధించాయి. ఫార్మా రంగంలో నెలకొన్న సానుకూల పరిస్థితి అలెంబిక్ కలిసొస్తుందని యస్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో షేరు సెక్టోరియల్ సగటుకు ప్రీమియంలో ట్రేడయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తుంది. 5. అజంతా ఫార్మా: వార్షిక ప్రాతిపదిన ఈ క్యూ4లో నికర లాభం 32 శాతం వృద్ధిని సాధించింది. అమ్మకాలు 45శాతం పెరిగాయి. మొత్తం ఆదాయంలో కంపెనీ 30శాతం భారత్ నుంచే పొందుతుంది. డెర్మటాలజీ విభాగంలో మందగమనం కంపెనీకి స్వల్పకాలిక సవాలుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ భావిస్తోంది. అయితే ఆరోగ్యకరమైన మార్జిన్లు, రిటర్న్ ప్రొఫైల్, అప్పులు తక్కవగా ఉన్న బ్యాలెన్స్ షీట్ తదితర అంశాలు అజంతాకు కలిసొచ్చే సానుకూలాంశాలు. వరుణ్ బెవరీజెస్: ఈ నాలుగో త్రైమాసికంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 53శాతం వృద్ధిని సాధించి రూ.60 కోట్లను ఆర్జించింది. అమ్మకాలు 23శాతం పెరిగి రూ.1,699.24 కోట్లను ఆర్జించింది. వరుణ్ బెవరీజెస్ సరఫరా చేసే ఉత్పత్తులు తక్కువ ధరలను కలిగి ఉండటంతో కలిగి ఉండటంతో ఇదే రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆదాయాల వృద్ధి వేగంగా పుంజుకునే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ చెప్పుకొచ్చింది. చిన్న కంపెనీలను విలీనంతో మార్కెట్ వాటా మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. వీటితో పాటు అవెన్యూ సూపర్‌మార్ట్స్, హెక్సావేర్ టెక్నాలజీస్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, టీవీ18 బ్రాడ్కాస్ట్ కంపెనీలు సైతం మార్చి క్వార్టర్లో బలమైన ఫలితాలను ప్రకటించాయి. బలమైన వృద్ధి ఉన్నప్పటికీ.., రాధాకృష్ణ ధమానీ ఆధ్వర్యంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ షేరుపై విశ్లేషకులు 20శాతం డౌన్‌సైడ్ ట్రెండ్‌ను సూచిస్తున్నారు. -
22శాతం క్షీణించిన హెచ్డీఎఫ్సీ నికరలాభం
హౌసింగ్ డెవెలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ) సోమవారం గత ఆర్థిక సంవత్సరపు మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక మార్చి 31తో ముగిసిన క్వార్టర్లో నికరలాభం 22 శాతం క్షీణించి రూ.2,233 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.2,862 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో డివిడెండ్ ఆదాయం కేవలం రూ.2 కోట్ల కావడంతో లాభం పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.537 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల అమ్మకంపై లాభం రూ.2 కోట్లు కాగా, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ.321 కోట్లుగా ఉంది. కంపెనీ బోర్డు ఆర్థిక సంవత్సరం 2020కు సంబంధించి ఒక్కో షేరుకు రూ .21 డివిడెండ్ ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక నికర వడ్డీ ఆదాయం 17శాతం పెరిగి రూ.3,780 కోట్లగా నమోదైంది. అంతకు ఇదే నాలుగో క్వార్టర్లో ఎన్ఐఐ రూ.3,238 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.4శాతం నుంచి 3.3శాతానికి దిగివచ్చింది. రికవరీ అంశంపై కంపెనీ స్పందిస్తూ మార్చి చివరి భాగంలో దెబ్బతిన్నాయని, దీని ఫలితంగా వ్యక్తిగత నిరర్ధక రుణాలు పెరిగాయని తెలిపింది. -
క్విక్ హీల్- బజాజ్ ఫైనాన్స్‌కు Q4 షాక్
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ సర్వీసులు అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే విధంగా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో నిరాశామయ పనితీరు ప్రదర్శించడంతో ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. దీంతో ఈ రెండు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. క్విక్ హీల్ టెక్నాలజీస్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐటీ, డేటా సెక్యూరిటీ సొల్యూషన్స్ అందించే క్విక్ హీల్ టెక్నాలజీస్ నికర లాభం 71 శాతం పడిపోయి రూ. 8 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర అమ్మకాలు సైతం 25 శాతం క్షీణించి రూ. 64 కోట్లను తాకాయి. పన్నుకు ముందు లాభం 75 శాతం క్షీణించి రూ. 10.2 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో క్విక్ హీల్ టెక్ షేరు 10.5 శాతం కుప్పకూలింది. రూ.104 వద్ద ట్రేడవుతోంది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బజాజ్ ఫైనాన్స్ రూ. 948 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4తో పోలిస్తే ఇది 19 శాతం క్షీణతకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 36 శాతం పెరిగి రూ. 7231 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 5 శాతం పతనమై రూ.1896 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 1865 వరకూ దిగజారింది. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం! బజాజ్ గ్రూప్‌లోని ఈ ఎన్బీఎఫ్సీ కంపెనీలో ప్రమోటర్లకు 56.2 శాతం వాటా ఉంది. -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 2,550 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం(2018–19) మార్చి క్వార్టర్లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21% వృద్ధితో రూ.15,990 కోట్లకు పెరిగిందని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్, సీఈఓ సి. విజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 14–16 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదన్న అంచనాలున్నాయని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల డాలర్ల(రూ.70,258 కోట్లు) ఆదాయం సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. డిమాండ్ జోరుగానే.... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2018–19లో నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.10,120 కోట్లకు, ఆదాయం 19% వృద్ధితో రూ.60,427 కోట్లకు పెరిగాయని విజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్థిర కరెన్సీ ప్రాతిపదికగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో 12% ఆదాయ వృద్ధిని సాధించామని, అంచనాలను అందుకున్నామని వివరించారు. డాలర్ల పరంగా చూస్తే, నికర లాభం 6% వృద్ధితో 36.4 కోట్ల డాలర్లకు, ఆదాయం 12% వృద్ధి తో 220 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమకే కాకుండా, ఐటీ పరిశ్రమకు కూడా ఉత్తమ సంవత్సరం కానున్నదని పేర్కొన్నారు. టెక్నాలజీ సర్వీసులు, ఉత్పత్తులకు డిమాండ్ జోరుగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఇక గత క్యూ4లో స్థూలంగా 14,249 మందికి ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఈ ఏడాది మార్చినాటికి 1,37,965కు పెరిగిందని విజయకుమార్ వివరించారు. ఏడాది కాలంలో ఆట్రీషన్ రేటు (ఉద్యోగుల వలస) 17.7%గా ఉందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ ఫ్లాట్‌గా రూ.1,132 వద్ద ముగిసింది. -
ఒడిదుడుకుల ప్రయాణం..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజ ఫలితాల వెల్లడి ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్ ఆ¯Œ క్వార్టర్ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్స (బుధవారం), ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ (గురువారం).. లార్సెన్ అండ్ టుబ్రో, వోల్టాస్ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ మనీష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి. దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్ నికాయ్ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది. వెనక్కు తగ్గిన ఎఫ్ఐఐలు గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.367 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు జి.విజయ్ కుమార్ అన్నారు. -
రిలయన్స్ ‘రికార్డ్’ లాభం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో రూ.10,362 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్)ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు సాధించడంతో రిలయన్స్ నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది. కంపెనీకి కీలకమైన చమురు శుద్ధి, పెట్రో కెమికల్ విభాగాలు బలహీనంగా ఉన్నప్పటికీ, రిటైల్, టెలికం విభాగాల జోరు కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు రికార్డ్ స్థాయి లాభం వచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. భారత్‌లోనే ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఇప్పటివరకూ ఈ స్థాయి లాభాలను ప్రకటించలేదు. రిటైల్ వ్యాపారం 52 శాతం, డిజిటల్ సర్వీసుల వ్యాపారం 62 శాతం చొప్పున వృద్ధి చెందాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. పెట్రో కెమికల్ విభాగం అమ్మకాలు అధికంగా ఉండటం కూడా కలసివచ్చిందని పేర్కొంది. ఆదాయం జోరుగా పెరగడానికి ఇవే ముఖ్య కారణాలని వివరించింది. 10 శాతం పెరిగిన లాభం.... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) నాలుగో త్రైమాసిక కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికరలాభం రూ.9,438 కోట్లుగా ఉంది. దీంతో పోలిస్తే తాజా నాలుగో క్వార్టర్లో (2018–19) నికర లాభం 10 శాతం పెరిగి రూ.10,362 కోట్లు చేరింది. షేర్ పరంగా చూస్తే, ఒక్కో షేరు వారీ నికర లాభం రూ.15.9 నుంచి రూ.17.5కు ఎగసింది. స్టాండ్ఎలోన్ ప్రాతిపదికన చూస్తే మాత్రం నికర లాభం తగ్గింది. స్థూల రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ మార్జిన్ తగ్గడంతో నికర లాభం 2 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు పరిమితమైంది. ఇక ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,54,110 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. క్యూ4 మొత్తం ఆదాయం సీక్వెన్షియల్‌గా చూస్తే, 10 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఆదాయం రూ.1,70,709 కోట్లుగా ఉంది. వడ్డీ వ్యయాలు రూ.2,566 కోట్ల నుంచి రూ.4,894 కోట్లకు పెరిగాయి. రిటైల్ వ్యాపారం ఎబిటా 77 శాతం ఎగసి రూ.1,923 కోట్లకు చేరగా, టెలికం విభాగం లాభం 65 శాతం పెరిగింది. క్వార్టర్లీ ఎబిటా 13 శాతం వృద్ధితో రూ.20,832 కోట్లకు పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 15 శాతం సాధించామని తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, కంపెనీ ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.6.22 లక్షల కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.39,588 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ.2.87 లక్షల కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,33,027 కోట్లకు పెరిగాయి. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను రూ.6.50 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. పెట్రో కెమికల్స్ విభాగం.. తగ్గిన జీఆర్ఎమ్! గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో పెట్రో కెమికల్స్ విభాగం ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.42,414 కోట్లకు పెరిగింది. రియలైజేషన్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఇక ఎబిట్ 24 శాతం వృద్ధితో రూ.7,975 కోట్లుగా నమోదైంది. ఎబిట్ మార్జిన్ 19 శాతంగా నమోదైంది. అయితే స్థూల రిఫైనింగ్ మార్జిన్ (జీఆర్ఎమ్) తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 11 డాలర్లుగా ఉన్న జీఆర్ఎమ్(ఒక్కో బ్యారెల్‌కు) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 8.2 డాలర్లకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో జీఆర్ఎమ్ 8.8 డాలర్లుగా ఉంది. రిఫైనింగ్, మార్కెటింగ్ సెగ్మెంట్ ఆదాయం 6 శాతం తగ్గి రూ.87,844 కోట్లకు చేరింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రో కెమికల్స్ వ్యాపారంలో సౌదీ ఆరామ్కో కంపెనీ 25 శాతం వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తలు, ఫలితాలు సానుకూలంగా ఉండగలవన్న అంచనాల కారణంగా ఈ షేర్ పెరిగింది. బీఎస్ఈలో 2.7 శాతం లాభంతో రూ.1,383 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసినప్పటికీ, సెన్సెక్స్‌లో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఈ ఏడాదిలో ఈ షేర్ ఇప్పటివరకూ 20 శాతం లాభపడింది. రిలయన్స్ జియో...జిగేల్! టెలికం విభాగం రిలయన్స్ జియో నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 65 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.510 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.840 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,128 కోట్ల నుంచి 56 శాతం వృద్ధితో రూ.11,106 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.723 కోట్లుగా ఉన్న నికర లాభం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 309 శాతం వృద్ధితో రూ.2,964 కోట్లకు పెరిగింది. దాదాపు నాలుగు రెట్లు వృద్ధి నమోదైంది. ఆదాయం 93 శాతం వృద్ధితో రూ.38,838 కోట్లకు పెరిగింది. రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 30 కోట్లను దాటింది. తక్కువ సమయంలోనే ఈ స్థాయి వినియోగదారులను సాధించిన కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఇదే. కంపెనీ ఏఆర్పీయూ (ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు రాబడి) రూ.126.2గా ఉంది. ఏఆర్పీయూ గత క్యూ3లో రూ.130గా ఉంది. రిటైల్ వ్యాపారం... లక్ష కోట్ల మైలురాయి ! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రిటైల్ వ్యాపారం ఆదాయం 52% పెరిగి రూ.36,663 కోట్లకు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఆదాయం రూ.24,183 కోట్లుగా ఉంది. ఎబిటా 77 శాతం వృద్ధితో రూ.1,923 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం ఆదాయం 89 శాతం వృద్ధితో రూ.1,30,566 కోట్లకు పెరిగింది. ఎబిటా 145 శాతం వృద్ధితో రూ.6,201 కోట్లకు పెరిగింది. ఆదాయం, లాభాల వృద్ధి పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం రికార్డ్‌లు సృష్టించింది. అంతర్జాతీయ టాప్ 100 కంపెనీల జాబితాలో చోటు సాధించిన ఏకైక భారత కంపెనీ ఇదే. ‘గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాం. రిలయన్స్ భవిష్యత్తు కోసం చెప్పుకోదగిన ప్రయత్నాలు చేశాం. రిలయన్స్ రిటైల్ ఆదాయం రూ. లక్ష కోట్లను దాటేసింది. రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లకు పెరిగింది. పెట్రో కెమికల్స్ విభాగం ఎన్నడూ లేనంత లాభాన్ని సాధించింది’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
ఫలితాలపై పెరిగిన ఆశలు!!
కంపెనీలు వెలువరించే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే ఆశావహ అంచనాలతో శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. స్టాక్ సూచీలు లాభాల్లో ముగియడం ఇది వరుసగా రెండో రోజు. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన స్థాయిలపైన ముగిశాయి. రోజంతా 264 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 160 పాయింట్ల లాభంతో 38,767 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 11,643 పాయింట్ల వద్దకు చేరింది. బ్యాంక్, ఆర్థిక రంగ, ఎఫ్ఎమ్సీజీ, విద్యుత్తు, కొన్ని వాహన షేర్లు లాభపడగా, టెలికం, క్యాపిటల్ గూడ్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. ఇక వారం పరంగా చూస్తే, ప్రధాన స్టాక్ సూచీలు నిరాశపరిచాయి. సెన్సెక్స్ 95 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. 264 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... రూపాయి బలహీనపడినప్పటికీ, ఫలితాలపై ఆశావహ అంచనాలతో మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్బీఐ నిర్దేశిత స్థాయి కంటే తక్కువగానే ఉంటాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ లాభాల్లోనే ట్రేడింగ్‌ను ఆరంభించింది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో లాభాలు పుంజుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. ట్రే డింగ్ చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ ఒక దశలో 52 పా యింట్లు పతనం కాగా, మరో దశలో 212 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 264 పాయింట్ల రేంజ్లో కదలాడింది. స్టాక్‌మార్కెట్‌పై స్వల్ప కాలంలో ఎన్నికలు, కంపెనీల క్యూ4 ఫలితాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. ► ఐటీసీ షేర్ 3.14 శాతం లాభంతో రూ.306 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► స్పైస్‌జెట్ షేర్ 9 శాతం లాభంతో రూ.110 వద్ద ముగిసింది. ఈ కంపెనీ కొత్తగా 16 బోయింగ్ 737–800 విమానాలను ఆర్డరిచ్చిందన్న వార్తలు దీనికి ప్రధాన కారణం. గత రెండు రోజుల్లో ఈ షేర్ 17 శాతం లాభపడింది. ► క్యూ4 ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్, టీసీఎస్‌లు మిశ్రమంగా ముగిశాయి. ఇన్ఫోసిస్ షేర్ 0.6 శాతం లాభంతో రూ. 748 వద్ద, టీసీఎస్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిశాయి. ► అంతర్జాతీయంగా వృద్ధిపై ఆందోళనతో ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. చైనా ఎగుమతుల గణాంకాలు ఒకింత మెరుగ్గా ఉండటంతో సానుకూల ప్రభావం కనిపించింది. షాంగై సూచీ మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ఆరంభమై, అదేరీతిన ముగిశాయి. మే 31 నుంచి ఎన్ఐఐటీ ఓపెన్ ఆఫర్! జూన్ 14న ముగింపు ఎన్ఐఐటీ టెక్నాలజీస్ ఓపెన్ ఆఫర్ వచ్చే నెల 31నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ కంపెనీలో 30 శాతం వాటాను బారింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా కంపెనీ రూ.2,627 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు కారణంగా బారింగ్ కంపెనీ ఓపెన్ ఆఫర్లో మరో 26 శాతం వాటాను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 26 శాతం ఓపెన్ ఆఫర్‌ను కూడా కలిపితే బారింగ్ సంస్థ మొత్తం రూ.4,890 కోట్ల ఎన్ఐఐటీ టెక్నాలజీస్ కోసం వెచ్చించనుంది. ఈ ఓపెన్ ఆఫర్ మే 31న ప్రారంభమై, జూన్ 14న ముగుస్తుంది. ఈ ఓపెన్ ఆఫర్లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 1.62 కోట్ల షేర్లను బారింగ్ సంస్థ కొనుగోలు చేస్తుంది. -
ఐటీ బోణీ బాగుంది!
ముంబై: ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19 జనవరి–మార్చి) నాలుగో త్రైమాసిక కాలంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం వృద్ధితో రూ.8,126 కోట్లకు పెరిగినట్లు అయిందని టీసీఎస్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో రూ.6,904 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ ఎమ్డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్ గోపీనాధన్ పేర్కొన్నారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.32,075 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19 శాతం వృద్ధితో రూ.38,010 కోట్లకు పెరిగిందని వివరించారు. ఆదాయం పరంగా నాలుగేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధి అని పేర్కొన్నారు. ‘‘డాలర్ల పరంగా చూస్తే, ఆదాయం 2,000 కోట్ల డాలర్ల మార్క్‌ను దాటింది. వార్షికంగా 13 శాతం, సీక్వెన్షియల్‌గా 2 శాతం వృద్ధి సాధించాం. రానున్న క్వార్టర్లలో ఇదే జోరు కొనసాగుతుందనే నమ్మకం మాకుంది. ఒక్కో షేర్‌కు రూ.18 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నాం. దీన్ని వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన నాలుగు రోజులకు చెల్లిస్తాం’’ అని వివరించారు. రూపాయి బలపడినప్పటికీ, కంపెనీ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని కొంత మేరకు అధిగమించగలిగామన్నారు. ఎబిట్ మార్జిన్ 25.1 శాతం.. ఎబిట్ మార్జిన్ 15 బేసిస్ పాయింట్లు తగ్గి 25.1 శాతానికి చేరిందని రాజేశ్ తెలియజేశారు. ఎబిట్ మార్జిన్ రూ.9,537 కోట్లుగా నమోదైందని తెలిపారు. నికర లాభం, ఆదాయం పరంగా మార్కెట్ విశ్లేషకుల అంచనాలను టీసీఎస్ ఫలితాలు అధిగమించాయి. అయితే ఎబిట్, మార్జిన్ల పరంగా అంచనాలను ఈ ఫలితాలు అందుకోలేకపోయాయి. అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధి...! బ్యాంకింగ్, ఆర్థిక సేలు, బీమా విభాగం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.13,650 కోట్లకు పెరిగిందని రాజేశ్ చెప్పారు. కంపెనీ డిజిటల్ విభాగం ఆదాయం 46 శాతం ఎగసిందని. మొత్తం ఆదాయంలో డిజిటల్ విభాగం ఆదాయం వాటా 31 శాతంగా ఉందని పేర్కొన్నారు. రిటైల్, సీపీజీ, తయారీ రంగ విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించామని తెలిపారు. గత మూడు క్వార్టర్ల పరంగా చూస్తే, ఆర్డర్ బుక్ అధికంగా ఉందని రాజేశ్ తెలిపారు. వివిధ క్లయింట్లతో డీల్స్ కుదుర్చుకునే ప్రక్రియ జోరుగా సాగుతోందని తెలిపారు. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరంలో శుభారంభమే ఉండగలదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే... ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం 22 శాతం వృద్ధితో రూ.31,472 కోట్లకు, ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.1,46,463 కోట్లకు పెరిగాయని రాజేశ్ గోపీనాధన్ వెల్లడించారు. నిర్వహణ మార్జిన్ 25.6 శాతంగా ఉందని పేర్కొన్నారు. నికరంగా 29,287 ఉద్యోగాలిచ్చామని, మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24,285కు చేరిందని వివరించారు. దీంట్లో మహిళా ఉద్యోగుల శాతం 36 శాతంగా ఉందని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితితో బీఎస్ఈలో టీసీఎస్ షేర్ 0.2 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ఇన్ఫీ లాభం రూ.4,078 కోట్లు ఆదాయం 19.1 శాతం వృద్ధి; రూ.21,539 కోట్లు షేరుకు రూ.10.5 తుది డివిడెండ్... 2019–20 ఆదాయ వృద్ధి అంచనా 7.5–9.5 శాతం బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్... మెరుగైన ఫలితాలతో బోణీ కొట్టింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (2018–19, క్యూ4) కంపెనీ రూ.4,078 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.3,690 కోట్లతో పోలిస్తే 10.5 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 19.1 శాతం వృద్ధి చెంది రూ.18,083 కోట్ల నుంచి రూ.21,539 కోట్లకు ఎగబాకింది. మార్కెట్ విశ్లేషకులు క్యూ4లో కంపెనీ రూ.3,910 కోట్ల లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ జోరు...: గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫీ లాభం రూ.3,610 కోట్లుగా నమోదైంది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ4లో లాభం 12.88% వృద్ధి చెందింది. ఆదాయం 0.6% పెరిగింది. పూర్తి ఏడాదికి చూస్తే..: 2018–19 పూర్తి ఏడాదిలో ఇన్ఫోసిస్ రూ.15,410 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017–18లో నికర లాభం రూ.16,029 కోట్లతో పోలిస్తే 3.9% తగ్గింది. మొత్తం ఆదాయం 17.2% వృద్ధితో రూ.70,522 కోట్ల నుంచి రూ.82,675 కోట్లకు పెరిగింది. గైడెన్స్ ఇలా...: ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన) 7.5–9.5 శాతం మేర వృద్ధి చెందొచ్చని కంపెనీ అంచనా(గైడెన్స్) వేసింది. కాగా, విశ్లేషకులు అంచనా వేసిన 8–10 శాతం కంటే కంపెనీ పేర్కొన్న గైడెన్స్ తక్కువగా ఉండటం గమనార్హం. ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ... ► 2018–19 చివరి క్వార్టర్(జనవరి–మార్చి)లో కంపెనీ డిజిటల్ ఆదాయాలు 41.1 శాతం వృద్ధితో 1,035 మిలియన్ డాలర్లకు ఎగబాకాయి. కంపెనీ మొత్తం ఆదాయాల్లో ఈ విభాగం వాటా 33.8 శాతం కావడం గమనార్హం. ► మార్చి చివరినాటికి కంపెనీ యాక్టివ్ క్లయింట్ల సంఖ్య 1,279కి చేరింది. డిసెంబర్ చివరికి ఈ సంఖ్య 1,251. క్యూ4లో మొత్తం కొత్త కాంట్రాక్టుల విలువ(టీసీవీ) 1.57 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నిరంజన్ రాయ్‌ను ఈ ఏడాది మార్చి 1 నుంచి నియమించినట్లు కంపెనీ ప్రకటించింది. ► జనవరి–మార్చి క్వార్టర్లో ఇన్ఫీలో నికరంగా 2,622 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మార్చి చివరినాటికి మొత్తం సిబ్బంది సంఖ్య 2.28 లక్షలకు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) 20.4 శాతంగా నమోదైంది. ► క్యూ4లో ఇన్ఫీ ఒక్కో షేరుకు రూ.10.5 చొప్పన తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం ఇచ్చిన రూ.7 మధ్యంతర డివిడెండ్‌తో కలిపితే 2018–19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ మొత్తం డివిడెండ్ రూ.17.5కు చేరుతుంది. గురువారం ఇన్ఫీ షేరు ధర స్వల్పంగా పెరిగి రూ.747.85 వద్ద ముగిసింది. కంపెనీ ఫలితాలు మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత వెలువడ్డాయి. ‘పటిష్టమైన ఫలితాలతో గతేడాది మంచి పురోగతిని సాధించాం. ఆదాయ వృద్ధి, డిజిటల్ వ్యాపారాలతో సహ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు నమోదైంది. భారీ కాంట్రాక్టులను దక్కించుకోవడం, క్లయింట్లతో మంచి సంబంధాలు కూడా దీనికి దోహదం చేసింది. ప్రణాళికాబద్దంగా మేం చేస్తున్న పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. – సలీల్ పరేఖ్, ఇన్ఫీ సీఈఓ -
ఆర్థిక, ఎన్నికల ఫలితాలు.. కీలకం
టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు * కొనసాగుతున్న విదేశీ విక్రయాలు * నిఫ్టీ ఒకింత హెచ్చుతగ్గులు: మోతిలాల్ ఓస్వాల్ న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఐటీసీ, లుపిన్ వంటి బ్లూ చిప్ కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలువడే ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి, ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. వర్షపాతానికి సంబంధించి రుతుపవనాల కదలిక కూడా సెంటిమెంట్‌ను నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుంది. ఫలితాలు కూడా అదే రోజు వెలువడుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(18 వ తేదీ-బుధ), లుపిన్(19న-గురువారం), ఐటీసీ(20న-శుక్రవారం), తదితర కీలక కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతాయి. వీటితో పాటు కార్పొరేషన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, జస్డ్ డయల్, భారత ఫోర్జ్ తదితర కంపెనీల ఫలితాలు కూడా ఈ వారమే వస్తాయి. ఈ వారంలో నిఫ్టీ కదలికలు ఒకింత ఒడిదుడుకులమయంగానే ఉంటాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు వర్షపాత సూచనలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్ పోకడను నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. కాగా గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 25,490 పాయింట్ల వద్ద ముగిసింది. గత శనివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి, స్థిరాస్థి పెట్టుబడుల గణాంకాల ప్రభావం ఒకింత ఉండవచ్చు. ఈ ఏడాది మార్చిలో 6.8 శాతంగా ఉన్న చైనా పారిశ్రామికోత్పత్తి గత నెలలో 6 శాతానికి తగ్గింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 10.7 శాతంగా ఉన్న ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ గత నెలలో 10.5 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు నిపుణుల అంచనాలను అందుకోలేకపోయాయి. ఇక ఈ వారం అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే,మంగళవారం నాడు జపాన్, అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అదే రోజు మార్చి నెల యూరోజోన్ వాణిజ్య గణాంకాలు వెలువ డుతాయి. యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ, అమెరికా ముడి చమురు నిల్వల, జపాన్ జీడీపీ గణాంకాలు బుధవారం వస్తాయి. గురు వారం నాడు అమెరికా ఉద్యోగ గణాంకాలు, శుక్రవారం అమెరికా ప్రస్తుత ఇళ్ల విక్రయ గణాంకాలు వస్తాయి. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు.. ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర విక్రయాలు రూ.178 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళనలు, భారత-మారిషస్ పన్ను ఒప్పందానికి సవరణలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో గత రెండు నెలలుగా జోరుగా కొనుగోళ్లు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్ల దూకుడుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్లలో రూ.29,558 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. పీ-నోట్ల ద్వారా ఆర్జించిన లాభాలపై మూలధన లాభాల పన్ను విధించే నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే స్వల్పకాలిక ఇన్వెస్ట్మెంట్స్ ప్రభావితం అవుతాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం,, ఈ నెల 13 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా రూ.178 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలానికి డెట్ మార్కెట్లో రూ.595 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.12,733 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.345 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి భారత్‌లో వారి నికర పెట్టుబడులు రూ.12,388 కోట్లుగా ఉన్నాయి.