ఒడిదుడుకుల ప్రయాణం..! | US-China trade talks, IIP numbers, earnings among 7 factors steering | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల ప్రయాణం..!

Published Mon, May 6 2019 5:22 AM | Last Updated on Mon, May 6 2019 5:22 AM

US-China trade talks, IIP numbers, earnings among 7 factors steering - Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్‌ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్‌... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్‌ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్‌ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.  

బ్యాంకింగ్‌ దిగ్గజ ఫలితాల వెల్లడి
ప్రైవేట్‌ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్‌ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్‌ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్‌ ఆ¯Œ  క్వార్టర్‌ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్‌ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి.

ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్‌స (బుధవారం), ఏషియన్‌  పెయింట్స్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, అపోలో టైర్స్‌ (గురువారం).. లార్సెన్‌ అండ్‌ టుబ్రో, వోల్టాస్‌ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్‌ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌ మనీష్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ అంశాల ప్రభావం..
అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్‌ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి.  దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్‌ నికాయ్‌ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది.

వెనక్కు తగ్గిన ఎఫ్‌ఐఐలు
గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.367 కోట్లు, డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్‌ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ విశ్లేషకులు జి.విజయ్‌ కుమార్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement