‘ఐదో విడత’లోనూ హింస | Fifth phase polling is violent on lok sabha elections | Sakshi
Sakshi News home page

‘ఐదో విడత’లోనూ హింస

Published Tue, May 7 2019 3:00 AM | Last Updated on Tue, May 7 2019 10:05 AM

Fifth phase polling is violent on lok sabha elections - Sakshi

లక్నోలో ఓటు వేసిన అనంతరం వేలికి ఉన్న సిరాను చూపుతున్న రాజ్‌నాథ్, మాయావతి

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్‌ సోమవారం హింసాత్మకంగా ముగిసింది. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో పోలింగ్‌ కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరగా, పశ్చిమబెంగాల్‌లో అధికారణ తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 63.5 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 8.75 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని వెల్లడించింది. ఐదో విడత పోలింగ్‌లో పశ్చిమబెంగాల్‌ అగ్రస్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, బిహార్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. ఈ జాబితాలో జమ్మూకశ్మీర్‌ చిట్టచివరి స్థానంలో నిలిచినట్లు ఈసీ చెప్పింది.

తృణమూల్‌ నేతపై బలగాల దాడి..
ఐదో విడత పోలింగ్‌ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో సోమవారం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బర్రాక్‌పోర్‌ సీటు నుంచి పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి అర్జున్‌ సింగ్‌ పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు యత్నించగా, కేంద్ర బలగాలను ఆయన్ను అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అర్జున్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రజలను స్వేచ్ఛగా ఓటేయనివ్వడం లేదని ఆరోపించారు. యథేచ్ఛగా జరుగుతున్న రిగ్గింగ్‌ను పోలీసులు అడ్డుకోవడం లేదని విమర్శించారు.

బర్రాక్‌పోర్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు బన్‌గావ్‌ నియోజకవర్గంలో టీఎంసీ, బీజేపీ మద్దతుదారులు ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు బాంబులు విసురుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బలిటికురి లోక్‌సభ స్థానంలో టీఎంసీ అభ్యర్థి, భారత ఫుట్‌బాల్‌ మాజీ క్రీడాకారుడు ప్రసూన్‌ బందోపాధ్యాయ పోలింగ్‌ స్టేషన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో సాయుధ సిబ్బంది ఆయనపై చేయిచేసుకున్నారు. ప్రజల ఓట్లను బలవంతంగా వేస్తున్నాడని ఫిర్యాదు రావడంతో ఓ ప్రిసైడింగ్‌ అధికారిని ఈసీ విధులనుంచి తప్పించింది.

పోలింగ్‌ కేంద్రం పేల్చివేత..
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ సీటుకు ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామాలోని రహ్మూ పోలింగ్‌ కేంద్రంపై గ్రనేడ్‌ విసిరారు. అలాగే త్రాల్‌లోని మరో పోలింగ్‌ కేంద్రాన్ని పేల్చివేశారు. అయితే ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనీ, ఎవ్వరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ ఎన్నికల్లో లడఖ్‌ నియోజకవర్గంలో 71.10 శాతం పోలింగ్‌ నమోదుకాగా, ఎన్నికలను బహిష్కరించాలని ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించిన నేపథ్యంలో అనంతనాగ్‌లోని పుల్వామా, షోపియాన్‌ ప్రాంతాల్లో పోలింగ్‌ 3 శాతాన్ని దాటలేదు.
దీంతో అనంతనాగ్‌లో మూడుదశల్లో కలిపి పోలింగ్‌ 8.76 శాతానికే పరిమితమయింది. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ గ్రామం షరీఫాబాద్‌లో ఎవ్వరూ ఓటేయలేదు. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ బలగాలను బలికొన్న ఆత్మాహుతి బాంబర్‌ ఆదిల్‌దార్‌ గ్రామమైన గుండీబాగ్‌లో 350 మంది ప్రజలుండగా కేవలం 15 మందే ఓటేశారు. ఉగ్రవాదులు జకీర్‌ ముసా గ్రామమైన నూరాబాద్, రియాజ్‌ నైకూ స్వగ్రామం బైగ్‌పొరా, ‘పుల్వామా’ సూత్రధారి ముదస్సీర్‌ ఖాన్‌ ఊరు షేక్‌పొరాలో సున్నా పోలింగ్‌ నమోదైంది. మరోవైపు ప్రాణభయంతో కశ్మీర్‌ను విడిచిపెట్టి పారిపోయిన పలువురు కశ్మీరీ పండిట్లు సోమవారం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

రాహుల్‌ బూత్‌ క్యాప్చరింగ్‌..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ బూత్‌ క్యాప్చరింగ్‌కు పాల్పడేలా పార్టీ శ్రేణులను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించారు. ఇందుకు సాక్ష్యంగా అమేథీకి చెందిన ఓ వృద్ధురాలు ‘నేను కమలం(బీజేపీ) గుర్తుకు ఓటేయబోతే, బలవంతంగా హస్తం(కాంగ్రెస్‌) గుర్తుకు వేయించారు’ అని చెబుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల ప్రధానాధికారి.. ‘ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపాం. ఆ వృద్ధురాలు చేసిన ఆరోపణలు నిరాధారమని తేలింది’ అని స్పష్టం చేశారు. రాహుల్‌ యూపీలోని అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమేథీలో 53 శాతం పోలింగ్‌ నమోదుకాగా, రాయ్‌బరేలీలో 53.68 శాతం పోలింగ్‌ నమోదయిందని ఈసీ తెలిపింది. అలాగే లక్నోలో 53% పోలింగ్‌ నమోదయిందని పేర్కొంది.

బిహార్‌లో ఈవీఎం ధ్వంసం
బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో పోలింగ్‌ సందర్భంగా కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. బిహార్‌లోని సరన్‌ నియోజకవర్గంలో ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సరన్‌లోని ఆరు పోలింగ్‌ కేంద్రాల్లో, మధుబనీలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమయింది. సీతామర్హి, ముజఫర్‌పూర్‌ నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఐదో విడత ఎన్నికలు ముగియడంతో మొత్తం 542 లోక్‌సభ స్థానాలకు గానూ 424 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన ఐదు విడతల్లో ఇదే అత్యల్ప పోలింగ్‌ కావడం గమనార్హం. తొలి విడతలో 69.50 శాతం పోలింగ్‌ నమోదు కాగా, రెండో విడతలో 69.44 శాతం, మూడో విడతలో 68.40 శాతం, నాలుగో విడతలో 65.51 శాతం పోలింగ్‌ నమోదైంది.

బిహార్‌ హాజీపూర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement