చివరి విడతలో 64% | More than 64% voting recorded in the last phase of Lok Sabha elections | Sakshi
Sakshi News home page

చివరి విడతలో 64%

Published Mon, May 20 2019 3:49 AM | Last Updated on Mon, May 20 2019 5:19 AM

More than 64% voting recorded in the last phase of Lok Sabha elections - Sakshi

ఓటేసిన ముఖ్యమంత్రులు: యోగి ఆదిత్యనాథ్‌, నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీ, అమరీందర్‌ సింగ్‌

న్యూఢిల్లీ/సిమ్లా/వారణాసి: సార్వత్రిక ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ఆదివారం హింసాత్మకంగా ముగిసింది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 64.26 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. పోలింగ్‌ సందర్భంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఎన్నికల అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏడో విడత ఎన్నికల్లో బెంగాల్‌ మరోసారి అగ్రస్థానంలో నిలవగా, బిహార్‌ అట్టడుగున నిలిచిందని ఈసీ పేర్కొంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈసారి 58.05 శాతం పోలింగ్‌ నమోదైంది. యూపీలోని 13 లోక్‌సభ స్థానాలతో పాటు పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9), బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3), చండీగఢ్‌(1) స్థానాలకు చివరి విడత ఎన్నికలు జరిగాయి. ఈ ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.


తృణమూల్‌–బీజేపీ శ్రేణుల ఘర్షణ
పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ఎన్నుకునేందుకు 1.49 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల సందర్భంగా కోల్‌కతాతో పాటు ఇతర నగరాల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ), బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఉత్తర కోల్‌కతాలోని గిరీశ్‌ పార్క్‌ పోలింగ్‌ కేంద్రం సమీపంలో గుర్తుతెలియని దుండగులు పెట్రోల్‌ బాంబును విసిరారని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా ఆరోపించారు. తనను పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లకుండా భద్రతాబలగాలు అడ్డుకున్నాయని టీఎంసీ దక్షిణ కోల్‌కతా అభ్యర్థి మలా రాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లను కేంద్ర బలగాలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెళుతుండగా తన కారును టీఎంసీ కార్యకర్తలు బుడ్జ్‌–బుడ్జ్‌ ప్రాంతం వద్ద ధ్వంసం చేశారని డైమండ్‌ హార్బర్‌ బీజేపీ అభ్యర్థి నిలంజన్‌ రాయ్‌ తెలిపారు.

పంజాబ్‌లో కాల్పుల కలకలం..
సార్వత్రిక ఎన్నికల వేళ పంజాబ్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గురుదాస్‌పూర్, భటిండా లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ–అకాలీదళ్‌ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల సందర్భంగా భటిండాలోని తల్వండిసబో పట్టణంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు తమపై కాల్పులు జరిపారని బీజేపీ శ్రేణులు ఆరోపించాయి. పంజాబ్‌లోని పటియాలాలో అత్యధికంగా 64.18 శాతం పోలింగ్‌ నమోదుకాగా, అమృత్‌సర్‌లో 56.35 శాతం అత్యల్ప పోలింగ్‌ నమోదైంది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో 64 శాతం పోలింగ్‌ నమోదైనట్లు పంజాబ్‌ ఎన్నికల ప్రధానాధికారి ఎస్‌.కరుణ రాజు తెలిపారు. లూథియానా, సమనా, మోగా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించగా, అధికారులు రిజర్వు ఈవీఎంలను వాడారని వెల్లడించారు.

దళితులు ఓటేయకుండా అడ్డంకి..
ఏడో విడత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యల్ప పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఈసారి 58.05 శాతం పోలింగ్‌ నమోదుకాగా, గోరఖ్‌పూర్‌లో 57.38 శాతం, సేవాపురిలో 61.60 శాతం, వారణాసి నార్త్‌ లో 55.75 శాతం పోలింగ్‌ నమోదైంది. యూపీలో మహరాజ్‌గంజ్‌ నియోజకవర్గం 62.40 శాతం పోలింగ్‌తో అగ్రస్థానంలో నిలవగా, బల్లియా 52.50 శాతం పోలింగ్‌తో చిట్టచివరి స్థానంలో నిలిచింది. యూపీ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్‌ పాండే నియోజకవర్గమైన చందౌలీలో బీజేపీ, సమాజ్‌వాదీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు చందౌలీలోని తారాజీవన్‌పూర్‌ గ్రామంలో దళితులు ఓటేయకుండానే వారి చేతివేలికి సిరాచుక్క వేస్తున్నారని ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులపై కేసు నమోదుచేశారు.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల బహిష్కరణ..
మధ్యప్రదేశ్‌లో 8 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించలేదని ఆరోపిస్తూ దేవాస్‌ ప్రాంతంలోని ఓ గ్రామం, మందసౌర్‌లోని ఐదు గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. చివరికి సమస్యల పరిష్కారానికి అధికారుల నుంచి స్పష్టమైన హామీ రావడంతో దేవాస్‌లో  గ్రామస్తులు ఓటేశారు. పట్నాలో ఆదివారం ఓటేసిన అనంతరం మాజీ మంత్రి తేజ్‌ప్రతాప్‌ వెళుతున్న కారు కొందరు జర్నలిస్టుల కాళ్లపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సదరు వాహనంపై దాడిచేసి విండ్‌స్క్రీన్‌ను విరగ్గొట్టగా, తేజ్‌ప్రతాప్‌ ప్రైవేటు భద్రతాసిబ్బంది వారిని చితక్కొట్టారు.గత ఆరు విడతల్లో సగటున 66.88 శాతం పోలింగ్‌ నమోదుకాగా, ఏడో విడతలో 64.26 శాతం పోలింగ్‌ నమోదయింది. ఈసీ శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా భారీగా బలగాలను మోహరించింది.

102 ఏళ్ల నేగీ 17వ సారి
స్వతంత్ర భారత తొలిఓటర్‌ శ్యామ్‌శరణ్‌ నేగీ (102) హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు. 1951 నుంచి ఓటు వేస్తున్న నేగీ ఆదివారం 31వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకూ లోక్‌సభ ఎన్నికల్లో 17 సార్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 14 సార్లు నేగీ ఓటువేశారు.

 అవిభక్త కవలలు తొలిసారిగా వేర్వేరుగా
బిహార్‌లోని పట్నాకు చెందిన అవిభక్త కవలలు సబాహ్‌–ఫరాహ్‌(25) తొలిసారి వేర్వేరుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకూ వీరిద్దరినీ ఒకరిగానే పరిగణించి ఓటర్‌ కార్డును జారీచేసేవారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వీరికోసం రెండు ఓటర్‌ ఐడీలను జారీచేశారు. ఓటేసిన అనంతరం సబాహ్‌–ఫరాహ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా పెద్దఎత్తున తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. వీరిద్దరూ ఓటేసేందుకు వీలుగా ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

 909 పోస్టుల తొలగింపు
లోక్‌సభ ఎన్నికలవేళ సామాజిక మాధ్యమాల నుంచి 909 పోస్టులను ఈసీ ఆదేశాలతో తొలగించారు. వీటిలో ఫేస్‌బుక్‌ నుంచి 650 పోస్టులను తొలగించగా, ట్విట్టర్‌లో 220, షేర్‌చాట్‌లో 31, యూట్యూబ్‌ నుంచి ఐదు, వాట్సాప్‌ నుంచి 3 పోస్టులను తొలగించామని ఈసీ సమాచార డీజీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా 647 వార్తలను పెయిడ్‌ న్యూస్‌గా గుర్తించామన్నారు.




ఓటేసిన ప్రముఖులు:

జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ (లోక్‌పాల్‌ చైర్‌పర్సన్‌), వృద్ధ ఓటరు శ్యామ్‌ శరణ్‌ నేగీ (హిమాచల్‌ ప్రదేశ్‌), శత్రుఘ్న సిన్హా (పట్నా సాహిబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి), మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ దంపతులు (కోల్‌కతా), 115 ఏళ్ల వృద్ధురాలు మైనా దేవి (ఉత్తరప్రదేశ్‌).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement