కేదర్‌నాథ్ వద్ద హిమాలయ పర్వత సానువుల్లో ధ్యానం చేస్తున్న ప్రధాని మోదీ, బద్రీనాథ్ ఆలయం నుంచి బయటకు వస్తున్న మోదీ
బద్రీనాథ్/కేదార్‌నాథ్/న్యూఢిల్లీ: తన ఉత్తరాఖండ్ పర్యటనకు అనుమతి ఇచ్చిన ఎన్నికల సంఘానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఉదయం బద్రీనాథ్ వెళ్లేముందు ఆయన కేదార్‌నాథ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘నిశ్శబ్ద సమయం’లో మోదీ చేపట్టిన పర్యటనపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని పర్యటనకు మీడియా పెద్దయెత్తున ప్రచారం కల్పించడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇది పూర్తిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అంటూ విపక్షాలు ధ్వజమెత్తాయి.
కాగా కేదార్‌నాథ్‌లో ధ్యానం సందర్భంగా తానేమీ కోరుకోలేదని, అది తన నైజం కాదని మోదీ చెప్పారు. డిమాండ్ చేయడం కాకుండా ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడని ఆయన అన్నారు. దేవుడు భారతదేశాన్నే కాకుండా యావత్ మానవాళి సంతోషంగా ఉండేలా దీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నానన్నారు. పలుమార్లు ఈ ఆలయాన్ని సందర్శించడం తన అదృష్టమని, 2013లో వరుస వరదలతో కుదేలైన కేదార్‌నాథ్‌లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
బద్రీనాథ్‌లో 20 నిమిషాలు పూజ
శనివారం కేదార్‌నాథ్ సందర్శించిన మోదీ సుమారు 20 గంటల పాటు అక్కడ గడిపిన తర్వాత ఆదివారం వైమానిక దళం హెలికాప్టర్‌లో బద్రీనాథ్ చేరుకున్నారు. ఆలయానికి సమీపంలోని ఐఏఎఫ్ హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయన తర్వాత రోడ్డు మార్గంలో గుడికి చేరుకున్నారు. ఆలయం లోపల గర్భగుడిలో పూజలు జరిపారు. ప్రధాని సుమారు 20 నిమిషాలు పూజలో పాల్గొన్నారని బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చీఫ్ మోహన్ ప్రసాద్ తప్లియాల్ వెల్లడించారు. ఆలయ పూజారులు ఆయనకు భోజ చెట్టు ఆకులపై రూపొందించిన గ్రీటింగ్ కార్డును అందజేసినట్లు తెలిపారు. కాగా కొద్దిసేపు ఆలయం ఆవరణలో కలియతిరిగిన మోదీ భక్తులకు, స్థానికులకు షేక్‌హ్యాండ్ ఇచ్చారని, ఆలయం వద్ద వేచి చూస్తున్న యాత్రికులను ప్రధాని కలిసారని వివరించారు. కాగా అతిథి గృహంలో ప్రధానితో భేటీ అయిన ఆలయ కమిటీ సభ్యులు ఆలయం ఆవరణాన్ని విస్తరించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ ఓ వినతిపత్రం అందజేశారు.
మీడియా కవరేజీపై టీఎంసీ ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోదీ కేదార్‌నాథ్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడటం అనైతికమని తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఆయన సందర్శనకు మీడియా కవరేజీ ఇవ్వడం ఎన్నికల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఒబ్రీన్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానిపై ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రధాని పర్యటనకు మీడియా కవరేజీ ఇవ్వడం కోడ్ ఉల్లంఘనేనని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment