యూపీలోని ముజఫర్‌పూర్‌లో బందోబస్తు విధులకు వెళ్తున్న మహిళా పోలీసులు
న్యూఢిల్లీ: లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తదితర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో సోమవారమే పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజకవర్గాలకు ఐదో దశలో ఎన్నిక జరగనుండగా, మొత్తం 674 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 51 నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా దాదాపు 9 కోట్ల మంది ఓటర్లున్నారు.
గత ఎన్నికల్లో ఈ 51 నియోజకవర్గాల్లోని 40 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు దక్కగా, మిగిలిన స్థానాలు తృణమూల్ కాంగ్రెస్ వంటి ఇతర పార్టీల వశమయ్యాయి. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌లో 14, రాజస్తాన్‌లో 12, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ల్లో చెరో 7, బిహార్‌లో 5, జార్ఖండ్‌లో 4 స్థానాలకు పోలింగ్ జరగనుంది. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ నియోజకవర్గంతోపాటు అనంత్‌నాగ్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. మొత్తం 96 వేల పోలింగ్ స్టేషన్లను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఐదో దశ పోలింగ్ ముగిస్తే మొత్తంగా దేశంలో 424 స్థానాలకు పోలింగ్ అయిపోయినట్లే. మిగిలిన 118 స్థానాలకు ఆరో (మే 12), ఏడో (మే 19) దశల్లో పోలింగ్ జరుగుతుంది.
బరిలోని ప్రముఖులు వీరే..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో రాహుల్ గాంధీతో స్మృతీ ఇరానీ పోటీపడుతున్నారు. సోనియా గాంధీ రాయ్‌బరేలీలో, రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి, మరో కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ జైపూర్ (గ్రామీణం) నుంచి పోటీలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్‌ల మధ్య చతుర్ముఖ పోరు నడుస్తోంది. జార్ఖండ్‌లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment