ఆర్థిక, ఎన్నికల ఫలితాలు.. కీలకం
టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు
* కొనసాగుతున్న విదేశీ విక్రయాలు
* నిఫ్టీ ఒకింత హెచ్చుతగ్గులు: మోతిలాల్ ఓస్వాల్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈ వారం స్టాక్ మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ఐటీసీ, లుపిన్ వంటి బ్లూ చిప్ కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలు, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వెలువడే ఏప్రిల్ నెల టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి, ముడి చమురు ధరల కదలికలు కూడా కీలకమేనని మార్కెట్ నిపుణుల అభిప్రాయం. వర్షపాతానికి సంబంధించి రుతుపవనాల కదలిక కూడా సెంటిమెంట్‌ను నిర్దేశిస్తుందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు.
అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిల ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతుంది. ఫలితాలు కూడా అదే రోజు వెలువడుతాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(18 వ తేదీ-బుధ), లుపిన్(19న-గురువారం), ఐటీసీ(20న-శుక్రవారం), తదితర కీలక కంపెనీల గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతాయి. వీటితో పాటు కార్పొరేషన్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్, జస్డ్ డయల్, భారత ఫోర్జ్ తదితర కంపెనీల ఫలితాలు కూడా ఈ వారమే వస్తాయి.
ఈ వారంలో నిఫ్టీ కదలికలు ఒకింత ఒడిదుడుకులమయంగానే ఉంటాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ (మిడ్‌క్యాప్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు వర్షపాత సూచనలు, అంతర్జాతీయ అంశాలు ఈ వారం మార్కెట్ పోకడను నిర్దేశిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ దీపేన్ షా చెప్పారు. కాగా గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 261 పాయింట్లు లాభపడి 25,490 పాయింట్ల వద్ద ముగిసింది.
గత శనివారం వెలువడిన చైనా పారిశ్రామికోత్పత్తి, స్థిరాస్థి పెట్టుబడుల గణాంకాల ప్రభావం ఒకింత ఉండవచ్చు. ఈ ఏడాది మార్చిలో 6.8 శాతంగా ఉన్న చైనా పారిశ్రామికోత్పత్తి గత నెలలో 6 శాతానికి తగ్గింది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో 10.7 శాతంగా ఉన్న ఫిక్స్‌డ్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ గత నెలలో 10.5 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు నిపుణుల అంచనాలను అందుకోలేకపోయాయి.
ఇక ఈ వారం అంతర్జాతీయ అంశాల విషయానికొస్తే,మంగళవారం నాడు జపాన్, అమెరికా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, అదే రోజు మార్చి నెల యూరోజోన్ వాణిజ్య గణాంకాలు వెలువ డుతాయి. యూరోజోన్ రిటైల్ ద్రవ్యోల్బణ, అమెరికా ముడి చమురు నిల్వల, జపాన్ జీడీపీ గణాంకాలు బుధవారం వస్తాయి. గురు వారం నాడు అమెరికా ఉద్యోగ గణాంకాలు, శుక్రవారం అమెరికా ప్రస్తుత ఇళ్ల విక్రయ గణాంకాలు వస్తాయి.
విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు..
ఈ నెల మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర విక్రయాలు రూ.178 కోట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ పట్ల ఆందోళనలు, భారత-మారిషస్ పన్ను ఒప్పందానికి సవరణలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో గత రెండు నెలలుగా జోరుగా కొనుగోళ్లు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్ల దూకుడుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీ మార్కెట్లలో రూ.29,558 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.
పీ-నోట్ల ద్వారా ఆర్జించిన లాభాలపై మూలధన లాభాల పన్ను విధించే నిర్ణయం వల్ల సమీప భవిష్యత్తులో విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చే స్వల్పకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రభావితం అవుతాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం,, ఈ నెల 13 వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా రూ.178 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఇదే కాలానికి డెట్ మార్కెట్లో రూ.595 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.12,733 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.345 కోట్లు ఉపసంహరించుకున్నారు. వెరశి భారత్‌లో వారి నికర పెట్టుబడులు రూ.12,388 కోట్లుగా ఉన్నాయి.