ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఫలితాలు కీలకం
ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపై కన్ను
ఈ వారం స్టాక్ మార్కెట్‌పై నిపుణుల అంచనా
ముంబై: ద్రవ్యోల్బణ డేటా, క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ప్రపంచ పరిణామాలు, ఎన్నికల సరళిపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు తీరుతెన్నులపైనా దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు.
‘‘సార్వత్రిక ఎన్నికల అనిశ్చితి దృష్ట్యా దేశీయ ఈక్విటీ మార్కెట్ ప్రస్తుత ట్రెండ్ స్వల్పకాలికానికి పరిమితమైంది. కావున సూచీలు స్థిరీకరణ కొంతకాలం కొనసాగొచ్చు. నిఫ్టీ సాంకేతికంగా 22,300 స్థాయిని చేధించి, కొంతకాలం ఈ స్థాయిని నిలుపుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుంది. ప్రస్తుతానికి 21,900 వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.
స్థూల ఆర్థిక గణాంకాలు
అమెరికా కన్జూమర్ ద్రవ్యోల్బణ అంచనాలు (సోమవారం), జపాన్ మెషనరీ టూల్ ఆర్డర్ల డేటా, భారత రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు (మంగళవారం), యూరోజోన్ మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాలు (బుధవారం), విడుదల కానున్నాయి. జపాన్ క్యూ1 జీడీపీ, మార్చి పారిశ్రామికోత్పత్తి డేటా, ఈసీబీ ఆర్థిక స్థిరత్వ సమీక్ష, అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఎగుమతి, దిగుమతుల డేటా(గురువారం) వెల్లడి కానున్నాయి. చైనా ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, యూరోజోన్ ఏప్రిల్ ద్రవ్యోల్బణ శుక్రవారం వెల్లడి కానున్నాయి. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి
క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రభావం
దేశీయ కార్పొరేట్ ఫలితాల సీజన్ ఆరో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు వెల్లడైన క్యూ4 ఫలితాలు అంచనాలకు తగ్గట్టు ఉన్నాయి. ఇక ఈ వారంలో దాదాపు 200 కి పైగా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలు ప్రకటించనున్నాయి. జొమాటో, ఐనాక్స్ ఇండెక్స్, వరుణ్ బేవరేజెస్, భారతీ ఎయిర్‌టెల్, పీవీఆర్ ఐనాక్స్, రాడికో ఖైతాన్, ఎడెలీ్వజ్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, ఆంధ్రా సిమెంట్, పీఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్, టిటాఘర్ వికాస్ నిగమ్ కంపెనీలు ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.
పది రోజుల్లో రూ.17వేల కోట్లు వెనక్కి
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల తొలి 10 రోజుల్లో రూ.17వేల కోట్ల దేశీయ ఈక్విటీలను విక్రయించారు. ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి నెలకొనడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇచ్చారు. గత ఏప్రిల్‌లో మొత్తం ఉపసంహరణ రూ.8,700 కోట్ల పోలిస్తే ఇది ఎక్కువ. ‘‘ఎన్నికల ఫలితాలతోపాటు గత ఆర్థిక సంవత్సరం కార్పొరేట్ సంస్థల మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తారు’’ అని ట్రేడ్జిని సీఓఓ త్రివేష్ డీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment