మార్కెట్‌ స్థిరీకరణకు అవకాశం | Stock Market Experts Views and Advice | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ స్థిరీకరణకు అవకాశం

Published Mon, Jul 8 2024 6:07 AM | Last Updated on Mon, Jul 8 2024 8:08 AM

Stock Market Experts Views and Advice

భారీ నష్టాలు ఉండకపోవచ్చు 

ప్రపంచ పరిణామాలు కీలకం 

బడ్జెట్, రుతుపవన వార్తలపైనా దృష్టి 

గురువారం నుంచి క్యూ1 ఆర్థిక ఫలితాలు వెల్లడి 

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా 

ముంబై: స్టాక్‌ సూచీలు ఈ వారంలో స్థిరీకరణకు గురికావొచ్చని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పట్టికే భారీ కొనుగోళ్లు జరిగినందున, ఇన్వెస్టర్లు కొంతమేర లాభాలు స్వీకరించే వీలుందంటున్నారు. ‘పతనమైన షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని, అందువల్ల నష్టాలు సైతం అధికంగా ఉండకపోవచ్చంటున్నారు. సాంకేతికంగా ‘‘నిఫ్టీ ఎగువ స్థాయిలో 24,400–24,500 శ్రేణిని చేధించాల్సి ఉంటుంది. దిగువ 24,170 స్థాయి వద్ద తక్షణ మద్దతు ఉంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణులు నాగరాజ్‌ శెట్టి తెలిపారు.

ఈ వారం ప్రభావిత అంశాలు
→ అంతర్జాతీయంగా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అమెరికా సెనెట్, ప్రజా ప్రతినిధుల సభల్లో కీలక ప్రసంగం(మంగళ, బుధవారం), యూఎస్, చైనా జూన్‌ ద్రవ్యోల్బణ డేటా,  బ్రిటన్‌ మే జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. 
→ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ జూన్‌ 11న (గురువారం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు(2024–2025) తొలి తైమాసికపు ఫలితాలు వెల్లడించి దేశీయ ఆర్థిక ఫలితాల సీజన్‌ను షురూ చేయనుంది. శుక్రవారం హెచ్‌సీఎల్‌ టెక్‌(జూలై 12), అవెన్యూ సూపర్‌ మార్ట్‌శనివారం), ఐఆర్‌ఈడీఏ(జూలై 13న) కంపెనీలు సైతం ఇదే వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన షేర్లలో కదిలికలు, స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చు. 
→ వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ జూన్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణ, మే పారిశ్రామికోత్పత్తి, తయారీ రంగ వృద్ధి గణాంకాలు వెలువడనున్నాయి. అదే రోజున ఆర్‌బీఐ ఫారెక్స్‌ నిల్వలు, బ్యాంకుల రుణ, డిపాజిట్ల వృద్ధి డేటాను ప్రకటించనుంది. 
→ వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, సమగ్ర బడ్జెట్‌(జూలై 23న)పై అంచనాలు, రుతు పవనాల కదలికల వార్తలు, రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. 
→ గత వారంలో పబ్లిక్‌ ఇష్యూలు పూర్తి చేసుకున్న ఎంక్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ బన్సాల్‌ ఫార్మా షేర్లు బుధవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement